భారత్‌లో ఇతర దేశాలు, ప్రాంతాల జెండాలు ఎగరవేయవచ్చా? చట్టం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, బళ్ళ సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇటీవల మిలాద్ ఉన్ నబీ సందర్భంగా కాకినాడలో కొందరు ముస్లిం యువకులు పాలస్తీనా జెండా ఊపుతూ ప్రదర్శన చేయడం చర్చకు దారితీసింది.
పాలస్తీనా, ఇజ్రాయెల్ యుద్ధం మతంతో కూడా ముడిపడి ఉన్న అంశం కావడంతో, ఆ రెండింటినీ వ్యతిరేకించేవారు, సమర్థించేవారు వివిధ సందర్భాల్లో ఆయా జెండాలను ఎగరేయడం లేదా అవమానపరచడం వంటి ఘటనలు భారత్‌లో పెరిగాయి.
గతంలో కూడా ఆర్థిక, విదేశీ అంశాల ఆధారంగా అమెరికా వంటి దేశాల జెండాలను అవమానపరిచిన ఘటనలూ భారత్‌లోనూ ఉన్నాయి.
అయితే, పాలస్తీనా జెండా ఎగరేసిన వారిపై కేసు పెట్టాలని కూడా కొందరు డిమాండ్ చేస్తున్నారు. అక్కడక్కడా కొందరు ఇజ్రాయెల్ జెండాలను కూడా ప్రదర్శించడం కనిపిస్తోంది.
మరోవైపు ముస్లిం మతపరమైన జెండాలకు, పాకిస్తాన్ జెండాకు ఉన్న పోలిక కూడా వివాదాలకు కారణమవుతోంది. సోషల్ మీడియాలో కూడా కొందరు ఈ పాలస్తీనా, ఇజ్రాయెల్ జెండాలను విరివిగా వాడతారు.
అసలు భారత్‌లో ఇతర దేశాల జెండాలకు సంబంధించిన నిబంధనలు ఏంటి? విదేశీ జెండాలను ప్రదర్శించడం, వాటిని ఎగరేయడం నేరమా?

భారతీయులు ఇతర దేశాల జెండాలు ఎగరేయవచ్చా?
ఇప్పటివరకూ భారత్‌లో ఉన్న ఏ చట్టమూ భారతీయులు ఫలానా దేశపు జెండాను ప్రదర్శించడం లేదా ఎగరేయడంపై నిషేధం విధించలేదు. వ్యక్తులు కానీ సంస్థలు కానీ అలా ఎగరేస్తే శిక్షలు ఉన్నాయని ఏ చట్టంలోనూ లేదు.
అలాగే విదేశీ జెండాల ప్రదర్శన లేదా ఎగరేయడానికి ముందస్తు అనుమతి కూడా అవసరం లేదు.
కానీ, ఆ చర్య వల్ల స్థానిక శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతుందనుకుంటే దానిపై స్థానిక యంత్రాంగం చట్టపరంగా వ్యవహరించే అవకాశం ఉంది.
ఒకవేళ ఆ విదేశీ జెండాను భారత జెండాతో కలిపి ఎగురవేయాలనుకున్నా, ప్రదర్శించాలనుకున్నా కొన్ని నిబంధనలు వర్తిస్తాయి.
- భారత జెండా కచ్చితంగా కుడి వైపు ఉండాలి.
- భారత జెండా విదేశీ జెండాతో సమాన ఎత్తులో లేదా అంతకంటే ఎక్కువ ఎత్తులో ఉండాలి తప్ప తక్కువ ఎత్తులో ఉండకూడదు.
- మార్చ్ చేసేటప్పుడు భారత జెండా మిగిలిన వాటి కంటే ముందు ఉండాలి.
- ఐక్యరాజ్య సమితి జెండాకు మాత్రమే ఈ విషయంలో మినహాయింపు ఉంది. ఐరాస జెండాను భారత జెండాకు కుడి వైపున ఉంచవచ్చు.
- ఈ నిబంధనల విషయంలో భారత మిత్రదేశం, శత్రుదేశం అనే తేడా లేదు.

ఫొటో సోర్స్, Getty Images
విదేశీ జెండాలు ఎప్పుడు ఎగురుతాయి?
నిజానికి దీనికి ఎలాంటి నిబంధనా లేదు. అయితే భారత్‌కు విదేశీ అతిథులు వచ్చినప్పుడు, వారికి స్వాగతం పలుకుతూ మర్యాద పూర్వకంగా ఆయా దేశాల జెండాలు ఊరంతా కడుతుంటారు.
సాధారణంగా ఇది దిల్లీలో ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ ప్రభుత్వమే ఆ ఏర్పాటు చేస్తుంది.
విదేశీ రాయబారుల వాహనాలపై, వారి ఆఫీసు ప్రాంగణాల్లో జెండా ఎగరేసే అనుమతులు అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఉన్నాయి. అయితే భారత జెండాతో కలిపి ఆయా దేశాల జెండాలను ప్రదర్శిస్తున్నప్పుడు పైన చెప్పిన నిబంధనలు అమల్లోకి వస్తాయి.
కానీ, కేవలం 'ఇతర దేశపు జెండాను ప్రదర్శించడం' నేరం అనేది చట్టంలో లేదు.
విదేశీ జెండాలను అవమానిస్తే చర్యలుంటాయా?
ఇతర దేశాల జెండా ఎగరేయడానికి ఎలాంటి నిబంధనలూ లేనట్టే, దాన్ని అవమానిస్తే చర్యలు తీసుకోవాలని కూడా చట్టంలో ప్రత్యేకంగా లేదు.
కానీ, ఆ ఘటన శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే అప్పుడు స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో 'శత్రు, మిత్ర దేశం' తేడాలున్నాయా?
భారత విదేశాంగ విధానంలో వివిధ దేశాలకు రకరకాల హోదాలు ఉంటాయి.
కానీ, జెండా ఎగురవేసే నిబంధనలో అలాంటివేమీ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
దేశంలో జెండాలపై చట్టాలు లేవా?
ఉన్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్-1971, ది ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా-2002 ప్రకారం భారత్‌లో జెండాలకు సంబంధించిన చట్టాలున్నాయి.
అయితే ఇవి విదేశీ జెండాల గురించి మాట్లాడటం లేదు. కాబట్టి వాటిని సమర్థించే లేదా వ్యతిరేకించే నిబంధనలు లేనట్టే.
ఉదాహరణకు జర్మనీ, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో విదేశీ జెండాలను అవమానించడంపై నిషేధం ఉంది. కానీ, భారత్‌లో అది లేదు.
జెండాల ప్రదర్శన వల్ల ఏం జరిగినా కేసులుండవా?
జెండా ప్రదర్శన లేదా అవమానించడం వల్ల శాంతికి విఘాతం కలిగించడం లేదా విఘాతం కలిగేలా రెచ్చగొట్టడం, వివిధ సమూహాల మధ్య మతం, కులం, ప్రాంతం, భాష వంటి వాటి ఆధారంగా చిచ్చు పెట్టేలా, ఆయా సమూహాల మధ్య గొడవలు జరిగేలా వ్యవహరించడం భారత చట్టాల ప్రకారం నేరం.
ఒక విదేశీ జెండాను అవమానించడం లేదా ప్రదర్శించడం చట్ట ప్రకారం నేరం కాదు. కానీ, దాని వల్ల తలెత్తే పరిణామాల్లో చట్ట వ్యతిరేకమైనవి ఉంటే అప్పుడు చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ జెండాపై నిషేధం ఉందా?
చాలా సందర్భాల్లో భారత్‌లో పాకిస్తాన్ జెండా, ఇస్లామిక్ జెండాల మధ్య గందరగోళం ఉంటుంది. ముస్లింలు తమ మత చిహ్నాలను కలిగిన జెండాలను ఉత్సవాల్లో ప్రదర్శిస్తుంటారు. అది పాకిస్తాన్ జెండాకు దగ్గరి పోలికలతో ఉండటంతో, 'పాకిస్తాన్ జెండా ప్రదర్శించారు' అంటూ వార్తలు ప్రచారంలోకి రావడం తరచూ కనిపిస్తుంది.
వాస్తవానికి ఇస్లాంకి ప్రత్యేకమైన జెండా కానీ, గుర్తు కానీ లేదు. పాకిస్తాన్ జెండాలో ఎడమవైపు తెల్లటి రంగు ఉంటుంది. కుడివైపున ఆకుపచ్చ రంగులో నెలవంక, నక్షత్రం ఉంటాయి.
ముస్లింలు తమ ఉత్సవాల్లో ప్రదర్శించే జెండాల్లో నెలవంక కుడి వైపునకు తిరిగి మధ్యలో ఉంటుంది. హైదరాబాద్‌కు చెందిన ఎంఐఎం పార్టీ జెండా కూడా ఆకుపచ్చ రంగులో ఉంటుంది. అందులో నెలవంకతో పాటు ఏడు నక్షత్రాలు ఉంటాయి.
దీంతో ఆయా ఉత్సవాల్లో ఆకుపచ్చ రంగుపై నెలవంక, నక్షత్రం వేసిన జెండాలు ప్రదర్శించినప్పుడు చాలామంది వాటిని పాకిస్తాన్ జెండాగా భావించే అవకాశం ఉంది.
పాకిస్తాన్ జెండా భారత్‌లో ప్రదర్శించడంపై చట్ట ప్రకారం నిషేధం లేదు కానీ, ''శాంతి భద్రతల కోణంలో పాకిస్తాన్ జెండా ఎగరవేయడం, మనోభావాలు కించపరచడం, సమూహాల మధ్య చిచ్చు పెట్టడం వంటి నేరాల కింద అరెస్ట్ చేయవచ్చు'' అని పోలీసులు తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














