భారత్-పాకిస్తాన్ మధ్య చిక్కుకున్న అక్క చెల్లెళ్లు, వీళ్లు ఏ దేశానికీ చెందనివారు ఎలా అయ్యారు?

భారత్-పాకిస్తాన్, కేరళ అక్కాచెల్లెళ్లు, పౌరసత్వం, పాకిస్తాన్ హై కమిషన్

ఫొటో సోర్స్, Rasheeda Bano

ఫొటో క్యాప్షన్, 2017లో అక్కాచెల్లెళ్లు తమ పా‌స్‌పోర్టులను పాకిస్తాన్ హైకమిషన్‌కు సమర్పించారు.
    • రచయిత, నెయాజ్ ఫరూఖీ
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

పాకిస్తాన్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు భారత పౌరులుగా మారాలని అనుకున్నారు. అయితే వారి దగ్గర తాము పాకిస్తాన్ పౌరులమని నిరూపించే పత్రాలు లేకపోవడంతో ఏ దేశానికీ చెందనివారిగా మిగిలారు.

2008 నుంచి కేరళలో నివసిస్తున్న ఈ అక్కచెల్లెళ్లు 2017లో తమ పాస్‌పోర్ట్‌లను భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషన్‌కు అప్పగించినట్లు ఇటీవల కోర్టుకు తెలిపారు.

పాకిస్తాన్‌లో పౌరసత్వం వదులుకోవాలనుకునే వారికి 21 ఏళ్లు ఉండాలి.

అయితే వారి వయసు అప్పటికి 21 ఏళ్లకంటే తక్కువ.

అందుకే పాకిస్తాన్ హైకమిషన్ తమకు పౌరసత్వాన్ని వదులుకున్నట్లు ధృవీకరణ పత్రాలను జారీ చేయలేదని వారు తెలిపారు.

21 ఏళ్లు నిండిన తర్వాత వారు మళ్లీ పాక్ హైకమిషన్‌ను సంప్రదించారు.

అయితే పౌరసత్వాన్ని ఎందుకు వదులుకుంటున్నారో వివరణ ఇవ్వకపోవడంతో హై కమిషన్ వారికి సర్టిఫికెట్ ఇవ్వలేదని ఆ అక్కాచెల్లెళ్ల తల్లి రషీదా బానో చెప్పారు.

వీరిద్దరూ మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడలేదు. వీరి తల్లికి, అన్నకి భారత పౌరసత్వం వచ్చింది. కానీ వీరు మాత్రం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు.

ఈ పరిస్థితి తన కూతుళ్ల జీవితాలను తీవ్రంగా ప్రభావితం చేసిందని వారు పాస్‌పోర్ట్‌లకు దరఖాస్తు చేసుకోలేకపోతున్నారని రషీదా బానో చెప్పారు.

ఈ విషయంపై భారతదేశంలోని పాకిస్తాన్ హైకమిషన్‌ను బీబీసీ సంప్రదించింది. కానీ వారి నుంచి ఎలాంటి స్పందన లేదు.

అంతకు ముందే ఉద్రిక్తంగా ఉన్న భారత్ పాక్ సంబంధాలు, పహల్గాం దాడి తర్వాత మరింత క్షీణించాయి.

ఈ రెండు దేశాల మధ్య పౌరుల వలసలు అసాధారణం ఏమీ కాదు. దేశ విభజన తర్వాత అనేక కుటుంబాలు వారి బంధువులు రెండు దేశాల్లో ఉన్నారు.

కొన్నేళ్లుగా పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి వచ్చి, భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్న వారి పత్రాలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

డిసెంబర్ 2021 నాటికి 7 వేల కంటే ఎక్కువమంది పాకిస్తానీ జాతీయుల పౌరసత్వ దరఖాస్తులు తమవద్ద పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రకటించింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్-పాకిస్తాన్, కేరళ అక్కాచెల్లెళ్లు, పౌరసత్వం, పాకిస్తాన్ హై కమిషన్

ఫొటో సోర్స్, Rasheeda Bano

ఫొటో క్యాప్షన్, పాస్‌పోర్టులు సమర్పించిన తర్వాత పాక్ హైకమిషన్ అక్కాచెల్లెళ్లకు ఈ రసీదు ఇచ్చింది.

అడ్డుకున్న 21 ఏళ్ల నిబంధన

తన కుమార్తెల పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు పాకిస్తాన్ హైకమిషన్ ధృవీకరణ పత్రం ఇవ్వలేదని, పాస్‌పోర్టులు తిరిగి ఇవ్వాలని అడిగినా ఇవ్వడం లేదని బానో చెప్పారు.

అయితే, ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు తమ పాస్‌పోర్టులు సమర్పించారని, వారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని పాకిస్తాన్ హై కమిషన్ 2018లో వారికి ఇచ్చిన పొసెషన్ సర్టిఫికెట్ వారి వద్దనే ఉంది.

కానీ, భారత అధికారులు ఈ సర్టిఫికెట్‌ను ధృవీకరణ పత్రంగా అనుమతించేందుకు నిరాకరించడంతో సిస్టర్స్ ఇద్దరు కోర్టును ఆశ్రయించారు.

వాళ్లిద్దరూ ఆ పత్రాన్ని సమర్పించలేరని చెబుతూ కేరళ హైకోర్టు సింగిల్ జడ్జ్ బెంచ్ వారికి అనుకూలంగా గతేడాది తీర్పు చెప్పింది.

"ఇది వారిని అసాధ్యమైన దానిని సాధించాలని అడిగినట్లు అవుతుంది" అని వ్యాఖ్యానించిన కోర్టు, వాళ్లకు భారత పౌరసత్వం ఇవ్వాలని భారత ప్రభుత్వాన్ని ఆదేశించింది.

దీనిపై కేంద్ర హోంశాఖ ఈ ఏడాది ఆగస్టు 23న కేరళ హైకోర్టులో ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీలు చేసింది. సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పును ద్విసభ్య బెంచ్ కొట్టేసింది.

"ఒక వ్యక్తిని భారత పౌరుడని గుర్తించాలంటే, అది భారత ప్రభుత్వం మాత్రమే గుర్తించాలి. మరో దేశ ప్రభుత్వం నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండకూడదు" అని ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది.

"ఈ కేసులో పాకిస్తాన్ ఇచ్చే ధృవీకరణపత్రం చట్టపరంగా జరగాల్సిన ప్రక్రియలో భాగం" అని కోర్టు వెల్లడించింది.

కేరళ హైకోర్టు ఆదేశాలపై ఈ సిస్టర్స్ ఇద్దరు సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఉంది.

పాకిస్తాన్ నిబంధనల ప్రకారం 21 ఏళ్లు నిండని వారు తమ పౌరసత్వాన్ని వదులుకోలేరు. అయితే పౌరసత్వాన్ని వదిలేస్తూ తండ్రి దరఖాస్తు చేస్తే అందులో పిల్లల పేర్లు కూడా చేర్చవచ్చు.

ఈ అక్క చెల్లెళ్ల తండ్రి మహమ్మద్ మారూఫ్ కేరళలో జన్మించారు.

9 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు చనిపోవడంతో అమ్మమ్మ ఆయన్ని దత్తత తీసుకుంది. 1977లో ఆమె పాకిస్తాన్‌కు వలస వెళ్ళినప్పుడు మారూఫ్‌ను తనతో పాటు తీసుకెళ్లింది.

"నా తల్లిదండ్రులు కూడా భారతీయులే. అయితే వాళ్లు 1971లో పాకిస్తాన్ సందర్శనకు వెళ్లినప్పుడు రెండు దేశాల మధ్య యుద్ధం జరిగింది. దీంతో వాళ్లు పాకిస్తాన్‌లోనే చిక్కుకుపోయారు" అని రషీదా బానో చెప్పారు.

కొన్ని నెలలు గడిచినా వాళ్లు తిరిగి రాలేకపోయారు.

దీంతో పాకిస్తాన్ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని రషీదా చెప్పారు.

వారికి పాకిస్తాన్ పౌరసత్వం వచ్చిన కొన్నేళ్ల తర్వాత తాను జన్మించినట్లు తెలిపారు.

భారత్-పాకిస్తాన్, కేరళ అక్కాచెల్లెళ్లు, పౌరసత్వం, పాకిస్తాన్ హై కమిషన్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్ పాకిస్తాన్ మధ్య చాలా కాలంగా ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ వలసలు సర్వ సాధారణ అంశంగా మారాయి.

అయోమయంలో భవిష్యత్తు..

రషీదా బానో, మారూఫ్ దంపతులకు నలుగురు పిల్లలు. వారు తమ పూర్వీకుల్ని కలుసుకునేందుకు 2008లో దీర్ఘకాలిక వీసాపై భారత్‌కు వచ్చారు.

అయితే మారూఫ్ భారత్‌లో ఉండలేక వెంటనే పాకిస్తాన్ వెళ్లారు.

రషీదా బానో, 21 ఏళ్లు దాటిన ఆమె కుమారుడు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడం వారికి ఇండియన్ సిటిజన్‌షిప్ లభించింది.

పాకిస్తాన్ పౌరసత్వం వదులుకునేందుకు పత్రాలు సమర్పించినప్పుడు తమకు అవమానాలు ఎదురైనట్లు ఆమె చెప్పారు.

ఎలాగోలా తమకు భారత పౌరసత్వం దక్కిందని, అయితే తన కుమార్తెలకు అవకాశం లేకుండాపోయిందని ఆమె వాపోయారు.

తన పిల్లలకు మొబైల్ సిమ్ తీసుకోవడం, స్కూల్లో చేర్చడంలాంటి చిన్న చిన్న పనులు కూడా కష్టంగా మారాయని రషీదా ఆవేదన వ్యక్తం చేశారు.

ఇద్దరు అక్కచెల్లెళ్లకు ఆధార్ కార్డు ఇచ్చేందుకు అధికారులు అంగీకరించారు. అయితే ఇది గుర్తింపు పత్రంగా మాత్రమే పని చేస్తుంది. పౌరసత్వ రుజువుగా ఆధార్ కార్డును గుర్తించడం లేదు.

దీంతో వారికి కనీస సౌకర్యాలు కూడా లభించవు.

పాస్‌పోర్ట్‌లు లేకపోవడం వల్ల తన కూతుళ్ల జీవితాలు ప్రభావితమయ్యాయని రషీదా బానో చెప్పారు.

ఆ ఇద్దరు సిస్టర్స్‌లో ఒకరు తన భర్త వద్దకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఆమె భర్త గల్ఫ్‌లో చేస్తున్న ఉద్యోగం వదిలేసి భారత్ వచ్చారు.

మరో కూతురి బిడ్డకు అనారోగ్యంగా ఉందని, విదేశాల్లో వైద్యం చేయించాల్సి ఉన్నా, పౌరసత్వం లేకపోవడంతో ఆమె భారత్ వదిలి వెళ్లే పరిస్థితి లేదు.

"ఇద్దరు అక్కచెల్లెళ్లు మైనర్లు కావడంతో 2017లో వారికి ధృవీకరణ పత్రం లభించలేదు. వాళ్లిప్పుడు మేజర్లు అయినా వారి పాస్‌పోర్టులు భారత్‌లోని పాక్ హైకమిషనర్‌కు సమర్పించడంతో పాకిస్తాన్ కూడా వెళ్లలేరు. వాళ్లకు సర్టిఫికెట్ ఎలా వస్తుంది?" అని లాయర్ ఎం.శశీంద్రన్ ప్రశ్నించారు.

‘‘తమ భవిష్యత్తు ఏంటో తెలియని పరిస్థితుల మధ్య చిక్కుకుపోయారు" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)