విశాఖపట్నం: ఈఐపీఎల్‌లో మంటలెందుకు ఆరడం లేదు?

ఫొటో సోర్స్, ENC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖపట్నంలోని ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ (ఈఐపీఎల్)లో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు. ఆదివారం (07.09.25) మధ్యాహ్నం ఈఐపీఎల్ పెట్రోలియం నిల్వలున్న ట్యాంకర్ పై పిడుగుపాటుతో భారీగా మంటలు చేలరేగాయి.
ఆ సమయంలో విశాఖలో భారీ వర్షం కురుస్తూ ఉంది. ఒకవైపు వర్షం, మరోవైపు ఫైర్ ఇంజన్లతో మంటలార్పే ప్రయత్నం చేసినా కూడా పూర్తిగా మంటలు అదుపులోకి రాలేదు.
మంగళవారం మధ్యాహ్నానికి కూడా మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు.
అదుపులోకి వచ్చినట్టే వచ్చి... ఆకస్మాత్తుగా మళ్లీ మంటలు చెలరేగుతున్నాయి. ఇండియన్ నేవీ కూడా మంటలను ఆర్పేందుకు రంగంలోకి దిగింది.
పదుల సంఖ్యలో ఫైర్ ఇంజన్లు, నేవీ హెలికాప్టర్లు, ఈఐపీఎల్ సేఫ్టీ విభాగం ఇలా ఎందరు ప్రయత్నిస్తున్నా మంటలు ఎందుకు అదుపులోకి రావడం లేదు? పిడుగుపాటుకు గురైన ట్యాంక్‌లో ఏముంది? ఈ మంటలను వెంటనే నియంత్రించేందుకు అవకాశం లేదా?


ప్రమాద సమయంలో ఏం జరిగిందంటే..
ఆదివారం విశాఖలో భారీ వర్షం కురుస్తుండగా...మధ్యాహ్నం మూడు గంటల సమయంలో సింధియా ప్రాంతంలో ఉన్న ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిడెట్ పరిశ్రమలో పెట్రోలియం నిల్వలున్న ఒక ట్యాంకర్‌పై పిడుగు పడింది.
ట్యాంకర్ పైకప్పు ఊడి పోవడంతో మంటలు ఎగసిపడ్డాయి. ఎరుపు, నారింజ రంగులో మంటలు కొన్ని కిలోమీటర్ల దూరం వరకు కనిపిస్తూ ఉండటంతో...మల్కాపురం, పాతగాజువాక, సింధియా ప్రాంతంలోని ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
ట్యాంకర్ నుంచి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేయడానికి పదుల సంఖ్యలో వచ్చిన ఫైర్ ఇంజన్లు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ముందుగా ఫైర్ ఇంజన్లు, సోమవారం నేవీ హెలికాప్టర్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంగళవారం నాటికి కూడా సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.
పిడుగుపాటుకు గురైన స్టోరేజి ట్యాంకరులో మిథనాల్ ఉంది. ఆ సమయంలో 7,500 కిలోలీటర్ల మిథనాల్ ట్యాంకర్‌లో ఉంది.
‘‘ప్రమాద సమయంలోనే 5 వేల లీటర్ల వరకు మిథనాల్ కాలిపోగా, పైపులలో ఉన్న కొంత మిథనాల్‌ని మరో ట్యాంకర్‌లోకి తరలించారు. ఇంకా రెండు వేల లీటర్ల మిథనాల్ మండుతూనే ఉంది" అని ఫైర్ సిబ్బంది ఒకరు బీబీసీతో చెప్పారు.

రంగంలోకి దిగిన నేవీ...
ఈ పరిస్థితిలో ఇండియన్ నేవీకి చెందిన సీ కింగ్ హెలికాప్టర్‌ను రంగంలోకి దింపినట్టు తూర్పు నౌకాదళం ఒక ప్రకటనలో పేర్కొంది.
"ఐఎన్‌ఎస్ డేగా నుంచి పలుసార్లు హెలికాప్టర్లను పంపించి, అండర్ స్లాంగ్ ఫైర్ బకెట్ల ద్వారా భారీ మొత్తంలో నీరు, ఫోమ్‌ను మంటలపై జారవిడిచాం. దాంతో ఉష్ణోగ్రత తగ్గి, మంటలు అదుపులోకి వచ్చాయి. మిథనాల్ ట్యాంకరు నుంచి పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చే వరకు ఫైర్ ఫైటింగ్ కొనసాగిస్తాం" అని సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
హెలికాప్టర్‌కు ఒక పెద్ద నీటి బకెట్‌ను వేలాడదీసి...ఆ నీటిని వెదజల్లుతూ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తారు. దీనినే అండర్ స్లాంగ్ ఫైర్ బకెట్ అంటారు. ఇది ఆయిల్ ట్యాంకులు, కెమికల్ ట్యాంకులు, రిమోట్ ఏరియాల్లో మంటలు వచ్చినప్పుడు వినియోగిస్తారు.
మరోవైపు మంటలను పూర్తిగా అదుపు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

రెండు రోజులైనా మంటలెందుకు ఆరిపోలేదంటే...
ట్యాంకర్‌లో కాలుతున్న పెట్రో పదార్థం మిథనాల్. ఇది ఒక వోలటైల్. అంటే తక్కువ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. మిథనాల్ ఒక ఆర్గానిక్ పదార్థం.
"అధిక దహనశీలత (High Flammability) ఉంటుంది. ఎందుకంటే మిథనాల్‌లో కార్బన్, హైడ్రోజన్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆక్సిజన్‌తో వేగంగా కలిసిపోయి భారీగా మంటలు చెలరేగుతాయి. ఇది తక్కువ ఉష్ణోగ్రత (64.7°C ) వద్దే ఆవిరై వెంటనే మండుతుంది. పైగా చుట్టూ ఉన్న గాలితో కలిసిపోయి ఎక్స్‌ప్లోజివ్ మిక్సర్‌లా మారుతుంది.
మిథనాల్ పూర్తిగా నీటిలో కలిసిపోతుంది. కాబట్టి దాని మంటలపై నీరు పోస్తే అది మంటలను అదుపు చేయకపోగా...మరింత రాజుకునేలా చేస్తుంది. అందుకే మంటలను అదుపు చేసేందుకు నీరు వాడితే ఫలితం తక్కువ. ఫోం, డ్రై కెమికల్ పౌడర్స్, కార్బన్ డయాక్సైడ్ వాడితేనే మంట అదుపులోకివస్తుంది'' అని ఆంధ్రా యూనిర్సిటీ మాజీ వీసీ, రసాయన శాస్త్ర విభాగం ప్రొఫెసర్ జి. నాగేశ్వరరావు బీబీసీతో చెప్పారు.
‘‘మిథనాల్ ఆర్గానిక్, హై ఫ్లేమబుల్ పదార్థం కావడం వల్ల మంటలు వేగంగా వ్యాపిస్తాయి. నీటితో ఆర్పలేం. అందుకే ఫైర్ ఫైటింగ్ టీంలకు మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకుని రావడం కష్టంగా ఉంటుంది. ఆ ట్యాంకర్‌లో ఉన్న ఇంధనం పూర్తిగా మండిపోవడం, లేదా క్రమంగా అంటే కొంచెం, కొంచెంగా మంటలను అదుపు చేస్తూ...(సమయం ఎక్కువ పట్టినా) పూర్తిగా కంట్రోల్ చేయడమే మార్గం. మిథనాల్ వంటి వోలటైల్ పదార్థాలకు ఒకసారి మంట అంటుకుంటే కంట్రోల్‌లోకి తీసుకుని రావాలంటే కనీసం 48 గంటల సమయం అవసరమవుతుంది" అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు వివరించారు.

ఫొటో సోర్స్, ENC
'ఈస్ట్ ఇండియా పెట్రోలియం'లో ఏం జరుగుతుందంటే..
ప్రమాదం జరిగిన ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ పరిసరాల్లో దాదాపు 50 వరకు స్టోరేజీ ట్యాంకులున్నాయి. ఇతర దేశాల నుంచి వివిధ రకాల ముడి చమురు, అనుబంధ ఉత్పత్తులను కొన్ని కంపెనీలు విశాఖ పోర్టుకు దిగుమతి చేసుకుని ఇక్కడ నుంచి బయటకు తరలిస్తుంటాయి. విశాఖ పోర్టు నుంచి ఒకేసారి వేల కిలో లీటర్ల రవాణా సాధ్యం కాదు కాబట్టి పోర్టు ఏరియాలోనే ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీలో నిల్వ చేస్తుంటారు.
ఈఐపీఎల్‌కి సమీపంలోనే హెచ్‌పీసీఎల్, దానికి అనుబంధ ఎల్‌పీజీ ప్రాజెక్టు, హెచ్‌పీసీఎల్ అడిషనల్ ట్యాంకు ప్రాజెక్టు, బీపీసీఎల్ వంటి భారీ పరిశ్రమలు ఉన్నాయి. ఈ ట్యాంకు మంటలు వాటికి అంటుకున్నా, లేక ఒకవేళ ఇదే పిడుగు అక్కడ పడినా ఊహకు అందని విస్పోటనం జరిగేదని రసాయన రంగ నిపుణులు అంటున్నారు.
ట్యాంకుపై పిడుగు పడే సమయంలో ఆ పరిసరాల్లో సుమారు 80మంది దాకా కార్మికులు పనిచేస్తున్నారు. కానీ ఎవరికి ఏమీ కాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పినట్టయింది. పిడుగు పడిన సమయంలో ఆ ప్రాంతంలో భారీ వర్షం కురువడం కూడా మంటలు వ్యాపించకపోవడానికి కారణమని సింధియా ప్రాంతానికి చెందిన అప్పలరాజు అన్నారు.

ఫొటో సోర్స్, ENC
మంటలు అదుపులోకి రాకపోవడానికి కారణం ఇదేనా...
వోలటైల్ అంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్దనే సులభంగా ఆవిరైపోయే లేదా బాయిల్ అయ్యే లక్షణం కలిగిన రసాయన పదార్థం. వోలటైల్ పదార్థమైన పెట్రోల్ బాయిలింగ్ పాయింట్ రేంజ్ 40°C నుంచి 200°C వరకు ఉంటుంది. అలాగే ఆల్కహాల్ 78°C, అసిటోన్ 56°C, ఎల్పీజీ -42°C నుంచి -5°C, ఈథర్ 34.6°C ఇలా అన్నీ కూడా నీటి బాయిలింగ్ పాయింట్ (100°C) కంటే తక్కువగానే ఉంటాయి.
మిథనాల్ బాయిలింగ్ పాయింట్ 64.7 °C. అంటే...ఇతర రసాయన పదార్థాలతో పోల్చితే చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్దనే ఆవిరైపోతుంది. అందుకే దీన్ని వోలటైల్ లిక్విడ్ అంటారు.
"మిథనాల్ వంటి వోలటైల్స్ ఉన్న పరిశ్రమల్లో ప్రమాదాలు జరిగితే మంటలు ఆర్పేందుకు కార్బన్ డై యాక్సైడ్ అవసరమవుతుంది. ముందు...ఆ వోలటైల్ మరింత పైకి వెళ్లి గాలిలో కలిసిపోకుండా చేయాలి. దాని కోసం సోడియం కార్బనైట్, బై కార్బనైట్‌లను మిథనాల్ మంటలపై వెదజల్లితే...అక్కడ రసాయన చర్య జరిగి కార్బన్ డయాక్సైడ్ (CO₂) వాయువును విడుదల చేస్తాయి. ఆ CO₂ గాలి కంటే బరువుగా ఉంటుంది. దాంతో కార్బన్ డయాక్సైడ్ గాలిలో కలిసిపోకుండా...మంట చుట్టూ ఒక పొరలా అంటే గొడుగులా కప్పేస్తుంది. దీంతో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి...మంటలు క్రమంగా కంట్రోల్ అయిపోతాయి" అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు తెలిపారు.

మిథనాల్ వల్ల ప్రయోజనాలు కూడా...
మిథనాల్ పరిశ్రమల్లో అగ్ని ప్రమాదం జరిగితే...వాటిని కంట్రోల్ చేయడం చాలా కష్టమని నిపుణులంటున్నారు. అదే సమయంలో మిథనాల్ వల్ల ఉపయోగాలు కూడా చాలా ఎక్కువని, అందుకే మిథనాల్‌ను మల్టీ-యూజ్ ఇండస్ట్రీయల్ కెమికల్ అంటారని ప్రొఫెసర్ నాగేశ్వరరావు చెప్పారు. దీనిని ఏయే పరిశ్రమల్లో వినియోగిస్తారో ఆయన వివరించారు.
- వాహన ఇంధనంగా...పెట్రోల్‌కి కలిపి వాడతారు.
- బయోడీజిల్ ప్రొడక్షన్‌లో మిథనాల్ తప్పనిసరి.
- రాకెట్ ఇంధనంగానూ ఉపయోగిస్తారు.
- మిథనాల్ ఒక ఫీడ్ స్టాక్ అంటే, ఎన్నో రసాయనాల (ఫార్మాల్డిహైడ్, ఎసిటిక్ యాసిడ్, ఎంటీబీఈ) తయారీలో ఉపయోగపడుతుంది.
- పెయింట్స్, వార్నిష్, ఇంక్స్, గమ్‌ల తయారీలో వాడతారు.
కొన్ని మెడిసిన్స్, ప్లాస్టిక్, సింథటిక్ ఫైబర్స్, రబ్బర్ తయారీలో కూడా వాడతారు.
అలాగే మనం రోజూ వాడే వస్తువుల్లో (ప్లాస్టిక్స్, పెయింట్స్, వాహన ఇంధనం) మిథనాల్ ఉంటుంది. కానీ నేరుగా టచ్ చేసినా, ఇంజెక్ట్ చేసినా చాలా ప్రమాదం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














