ఆంక్షలు విధింపులో కలసి రావాలని ఈయూను కోరిన అమెరికా

భారత్, అమెరికా వాణిజ్యం, ఈయూ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్

రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై తదుపరి చర్యలు తీసుకోవాలని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇచ్చిన పిలుపు చర్చనీయమైంది.

రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై ఈయూ అదనపు ఆంక్షలు విధిస్తే, రష్యా ఆర్థిక వ్యవస్థ పతనం అవుతుందని బెసెంట్ అభిప్రాయపడ్డారు.

రష్యాపై మరింత ఒత్తిడి పెంచే విషయంపై యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్‌తో అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలకమైన చర్చలు జరిపారని అమెరికన్ వార్తాసంస్థ ఎన్‌బీసీతో చెప్పారు బెసెంట్.

యూరోపియన్ కమిషన్ అనేది యూరోపియన్ యూనియన్‌కు చెందిన ప్రధానమైన ఎగ్జిక్యూటివ్ విభాగం.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై అమెరికా ఇప్పటికే అదనంగా 25 శాతం సుంకాన్ని విధించింది. దీంతో, భారతదేశంపై మొత్తం 50 శాతం సుంకం అమల్లో ఉంది. బెసెంట్ ప్రకటనను బట్టి, అమెరికా మరోసారి భారత్‌పై ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

రష్యాపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా సిద్ధంగా ఉందని, అయితే యూరప్ దేశాలు కూడా అందుకు కలిసి రావాలని బెసెంట్ అంటున్నారు. యుక్రెయిన్ సైన్యం ఎంతకాలం ప్రతిఘటిస్తుంది, రష్యా ఆర్థిక వ్యవస్థ ఎంతకాలం మనుగడ సాగిస్తుందనే దాని మధ్యే పోటీ ఉందని ఆయన అన్నారు.

"అమెరికా, ఈయూ కలిసి వస్తే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై ఆంక్షలు కఠినతరం చేయవచ్చు. అదనపు సుంకాలు కూడా విధించవచ్చు. ఇది రష్యన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా పతనం చేస్తుంది. అధ్యక్షుడు పుతిన్ అమెరికాతో చర్చలకు రావాల్సి వస్తుంది" అని బెసెంట్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యుక్రెయిన్, ఈయూ, రష్యా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఈయూ సభ్య దేశాలు రష్యా నుంచి ఇంధన దిగుమతిని ఆపలేదు.

భారత సమస్యలు పెరుగుతాయా?

రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించే విషయంపై చర్చించడానికి వాషింగ్టన్‌కు యూరోపియన్ యూనియన్ ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతున్నట్లు యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా గతవారం ప్రకటించారు. ఆంక్షలపై అమెరికా, ఇతర భాగస్వాములతో ఈయూ చర్చలు జరుపుతోందని కోస్టా చెప్పారు.

కాగా, ట్రంప్ ప్రభుత్వంలోని పలువురు అధికారులు నిరంతరం భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. వీరిలో అమెరికా ఆర్థిక మంత్రి, వాణిజ్య మంత్రి, ట్రంప్ వాణిజ్య సలహాదారు చేరారు.

అమెరికా సుంకాలు అన్యాయమైనవని భారత్ అంటోంది. దేశ ప్రయోజనాల కోసమే కొనుగోలు చేస్తున్నట్లు వాదిస్తోంది. రష్యా నుంచి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ (ఎల్ఎన్‌జీ) కొనుగోలు చేయడంలో ఈయూ ఇప్పటికీ నంబర్ వన్ స్థానంలో ఉందని భారత్ అంటోంది.

మరోవైపు, భారత్ కంటే రష్యా నుంచి చైనా ఎక్కువ చమురు కొనుగోలు చేస్తోంది, అయినా భారతదేశంపై విధించినంతగా ట్రంప్ చైనాపై సుంకాలు విధించలేదు.

కాగా, బెసెంట్ ప్రకటనను రాజకీయ నిపుణులు, అమెరికా విదేశాంగ, ఆర్థిక మంత్రులకు సలహాదారుగా పనిచేసిన ఇవాన్ ఎ. ఫీగెన్‌బామ్ విమర్శించారు.

"రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో ఇండియాకు వ్యతిరేకంగా చేతులు కలపాలని అమెరికా ఆర్థిక మంత్రి ఈయూకి విజ్ఞప్తి చేశారు. అయితే, యూరోపియన్ యూనియన్‌లోని రెండు సభ్య దేశాలు రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో దీనిని ఆపలేమని అనుకుంటున్నాను" అని ఇవాన్ ఎక్స్‌లో తెలిపారు.

"ఈయూ, యూఎస్ కూటమి చైనాపైనా ఆంక్షలు విధిస్తుందా?. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ ప్రకారం.. యుక్రెయిన్‌పై దాడి జరిగిన మూడో సంవత్సరంలో రష్యా నుంచి ఈయూ దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాల మొత్తం విలువ 2024లో యుక్రెయిన్‌కు ఈయూ పంపిన ఆర్థిక సహాయం కంటే 18.7 బిలియన్ డాలర్లు(సుమారు రూ.1.6 లక్షల కోట్లు) ఎక్కువ" అని చెప్పారు.

ఎస్‌సిఓ సదస్సు, రష్యా అధ్యక్షుడు పుతిన్‌, ప్రధాని మోదీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఎస్‌సీఓ సదస్సులో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కూడా ప్రధాని మోదీ కలిశారు.

ట్రంప్‌ను భారత్ విశ్వసిస్తుందా?

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఓవైపు ప్రధాని మోదీని స్నేహితుడు అని పిలుస్తూనే మరోవైపు భారత్‌ను లక్ష్యంగా చేసుకుంటున్నారు.

ఆగస్టు 31న, షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి ప్రధాని మోదీ చైనా వెళ్లారు. అక్కడ ఆయన చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లను కలిశారు.

ఈ సమావేశమైన దాదాపు వారం రోజులకు, మోదీ, పుతిన్, జిన్‌పింగ్‌ల ఫోటోను ట్రూత్ సోషల్‌లో డోనల్డ్ ట్రంప్ పోస్ట్ చేస్తూ ''భారత్, రష్యాలను చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోంది. వారి భాగస్వామ్యం దీర్ఘకాలం సుసంపన్నంగా ఉండాలని ఆశిస్తున్నాను" అని తెలిపారు.

ఇదే సమయంలో, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ రష్యన్ ప్రభుత్వ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో "మూడు ప్రధాన శక్తులు - చైనా, రష్యా, భారత్ కలిసి కనిపించాయి. ముగ్గురూ గొప్ప నాగరికతలకు ప్రతినిధులు. మూడు దేశాలు తమ ఉమ్మడి ప్రయోజనాలను అర్థం చేసుకుంటాయి" అని అన్నారు.

"దీనర్థం మూడు దేశాలు ప్రతి అంశంపై ఏకగ్రీవంగా ఉన్నాయని కాదు. కానీ, చైనా, భారత్, రష్యాల భాగస్వామ్యం పరస్పర ప్రయోజనాలపై ఆధారపడి ఉంటుంది" అని చెప్పారు సెర్గీ.

తాజాగా డోనల్డ్ ట్రంప్ భారత్ పట్ల ఉదారంగా మాట్లాడినప్పటికీ, మోదీ ప్రభుత్వం దానిని అంత సులభంగా నమ్మకపోవచ్చు.

అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవార్డ్ లుట్నిక్ శుక్రవారం నాడు బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ "ఒకటి లేదా రెండు నెలల్లో భారత్ చర్చలకు వచ్చి క్షమాపణ చెబుతుంది. ట్రంప్‌తో రాజీకి ప్రయత్నిస్తుంది. అనంతరం, మోదీతో ఎలా ఉండాలో ట్రంప్ నిర్ణయిస్తారు" అని అన్నారు.

రెండు దేశాల మధ్య ప్రత్యేక సంబంధం ఉన్నందున అమెరికా-భారత సంబంధాల గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ట్రంప్ శుక్రవారం అన్నారు. నరేంద్ర మోదీ గొప్ప ప్రధానమంత్రి అని, ఎల్లప్పుడూ తన స్నేహితుడిగా ఉంటారని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆగస్ట్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అలాస్కాలో సమావేశమయ్యారు.

'ట్రంప్ పుస్తకంలోనే రాశారు'

డోనల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలను అభినందిస్తున్నట్లు, ఆయనతో పూర్తిగా ఏకీభవిస్తున్నట్లూ తెలిపారు.

అయితే, డోనల్డ్ ట్రంప్, మోదీ తాజా స్పందనలు రెండు దేశాల మధ్య సంబంధాలను పునరుద్ధరించగలవా?.

భారత ప్రభుత్వ అధికారి ఒకరు దీనిపై బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడుతూ "ట్రంప్ వ్యాఖ్యలను భారత్ సానుకూలంగా తీసుకుంటోంది. అయితే, గతంలో ఉన్న స్థితికి తిరిగి వెళ్లదు. ట్రంప్‌కు మోదీ జాగ్రత్తగా బదులిచ్చారు. ఆయనను స్నేహితుడిగా సంబోధించలేదు. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి చేరుకుంటాయనే సూచనను ట్రంప్ వ్యాఖ్యలు ఇవ్వలేదు" అని అన్నారు.

థింక్ ట్యాంక్ యూరేసియా గ్రూప్‌లో ఇండియా ప్రాక్టీస్ హెడ్ పర్మీత్ పాల్ చౌదరి బ్లూమ్‌బర్గ్‌తో మాట్లాడుతూ, "రెండు దేశాల మధ్య సంబంధాలలో నాటకీయ మెరుగుదల ఉంటుందని అనుకోవడం లేదు. ఈ వ్యూహాలను ట్రంప్ తన 'ది ఆర్ట్ ఆఫ్ ది డీల్' పుస్తకంలో బాగా వివరించారు. అమెరికా అధ్యక్షుడు తన ప్రత్యర్థులను తనతో ఒప్పందానికి అంగీకరించేలా చేయడానికి అన్ని పద్ధతులను అవలంబిస్తారు" అని తెలిపారు.

మరోవైపు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలును కొనసాగిస్తుందని భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ‘న్యూస్ 18’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంచేశారు. దేశానికి అనుకూలంగా ఉన్న ఏ ఇంధన ఒప్పందం అయినా జరుగుతుందని ఆమె ప్రకటించారు.

కాగా, యూరోపియన్ యూనియన్ ఇప్పటికే ఒక భారతీయ కంపెనీని నిషేధించింది. గుజరాత్‌కు చెందిన నయారా ఎనర్జీ లిమిటెడ్ యాజమాన్యంలోని వదినార్ రిఫైనరీపై జులైలో ఈయూ నిషేధం విధించింది.

బ్లూమ్‌బర్గ్ తన కథనంలో "రష్యన్ ఇంధన సంస్థ రోస్‌నెఫ్ట్ భారత నయారా ఎనర్జీ లిమిటెడ్‌లో తన వాటాను విక్రయించాలని చూస్తోంది. కానీ, ఈయూ నిషేధంతో ఇది అస్పష్టంగా మారింది" అని తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)