అవయవాలు మార్చుకుంటూ 150 ఏళ్లదాకా బతకొచ్చా, పుతిన్, జిన్‌పింగ్‌లు చర్చించిన ఈ అంశంపై నిపుణులు ఏమంటున్నారు?

పుతిన్, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, AFP via Getty Images

అవయవ మార్పిడి ద్వారా ఎవరికైనా అమరత్వం సాధ్యమేనా? ఈ ఆసక్తికర చర్చ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య జరిగింది.

బీజింగ్‌లో మిలిటరీ కవాతు సందర్భంగా వీరిద్దరూ కలుసుకున్న వేళ చర్చకు వచ్చిన అనూహ్యమైన అంశమిది.

పుతిన్ మాట్లాడిన విషయాలను ఆయన అనువాదకుడు మాండరిన్ భాషలో జిన్‌పింగ్‌కు వివరించారు.

''మానవ అవయవాల మార్పిడి పదేపదే జరుగుతోంది. దీనివల్ల వయసు మీద పడుతున్నా యవ్వనవంతులు అవుతున్నారు. బహుశా వృద్ధాప్యాన్ని దూరంగా ఉంచొచ్చు''

''ఈ శతాబ్దంలో మనిషి 150 ఏళ్లవరకు జీవించడం కూడా సాధ్యం కావచ్చని అంచనా వేస్తున్నారు'' అని కూడా ఆయన చెప్పారు.

ఈ సందర్భంగా కనిపించిన ఇరువురు నేతల చిరునవ్వు, వారేదో సరదాగా ఈ విషయం మాట్లాడుకుంటున్నట్టు అనిపించినా, ఇందులో ఎంతో కొంత నిజముందా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఆయుర్దాయం

అవయవమార్పిడితో జీవదానం

ప్రపంచవ్యాప్తంగా అవయవ మార్పిడి ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడారు. ఎన్‌హెచ్‌ఎస్ బ్లడ్ అండ్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రకారం, గత 30 సంవత్సరాలలో ఒక్క యూకేలోనే లక్షమందికిపైగా ప్రాణాలను రక్షించారు.

వైద్య రంగంలో నిరంతరం జరుగుతున్న మార్పులు, పురోగతి కారణంగా, మార్పిడి చేసిన అవయవాలు ఇప్పుడు ఎక్కువ కాలం పనిచేయగలుగుతున్నాయి.

కొంతమంది రోగులకు మార్పిడి చేసిన మూత్రపిండాలు 50 సంవత్సరాలకు పైగా పనిచేశాయి. ఒక అవయవం ఎంతకాలం సక్రమంగా పనిచేస్తుందనేది దాత, రోగి ఆరోగ్యం, అలాగే అవయవాన్ని ఎంత బాగా చూసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంటుంది.

ఉదాహరణకు, ఒక రోగి బతికి ఉన్న దాత నుంచి కొత్త మూత్రపిండాన్ని తీసుకుంటే, అది 20 నుండి 25 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. అదే మృతదేహం నుంచి తీసుకున్న మూత్రపిండాల సగటు ఆయుర్దాయం 15 నుంచి 20 సంవత్సరాలు.

మార్పిడి చేసిన వివిధ అవయవాల వయస్సు కూడా మారుతూ ఉంటుంది. జర్నల్ ఆఫ్ మెడికల్ ఎకనామిక్స్ లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం కాలేయం 20 సంవత్సరాలు, గుండె 15 సంవత్సరాలు, ఊపిరితిత్తులు సుమారు 10 సంవత్సరాలు పనిచేస్తాయి.

పుతిన్, జిన్‌పింగ్‌లు బహుశా బహుళావయవాల మార్పిడి గురించి మాట్లాడుకున్నారు.

కానీ ప్రతి శస్త్రచికిత్స ప్రమాదంతోనే వస్తుంది. ప్రతిసారీ ఆపరేషన్ టేబుల్‌పైకి వెళ్లడమంటే జూదం ఆడినట్లే. కొత్త అవయవాన్ని స్వీకరించిన తరువాత, రోగి తన జీవితాంతం మందులు (ఇమ్యునోసప్రెసెంట్స్) తీసుకోవలసి ఉంటుంది. తద్వారా శరీరం కొత్త అవయవాన్ని(ఫారిన్ బాడీ) అంగీకరిస్తుంది.

ఈ మందులవల్ల రక్తపోటు ఎక్కువ కావడం, ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువవడంలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి.

కొన్నిసార్లు రోగి శరీరం మార్పిడి చేసిన అవయవాన్ని తిరస్కరించడం ప్రారంభిస్తుంది. అంటే, శరీరం రోగనిరోధక వ్యవస్థ అవయవాన్ని ఫారిన్ బాడీగా పరిగణించి దానిపై దాడి చేయడం ప్రారంభిస్తాయి.

పంది అవయవాలతో

ఇప్పుడు శరీరం తిరస్కరించని అవయవాలను సృష్టించే పనిలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. ఇందుకోసం జన్యుమార్పిడి చేసిన పందులను దాతలుగా వినియోగిస్తున్నారు.

మానవ శరీరానికి సరిపోయే ట్రాన్స్‌ప్లాంటెడ్ అవయవాన్ని తయారుచేసేందుకు సీఆర్ఐఎస్‌పీఆర్ అని పిలిచే జన్యు ఎడిటింగ్ సాధనంతో పందిలోని కొన్ని జన్యువులను తొలగించి, మానవ జన్యువులను జోడించారు.

ఇందుకోసం ప్రత్యేకమైన పందులను పెంచుతున్నారు. వాటి అవయవాల సైజు మనుషులకు సరిపోవడమే దీనికి కారణమని నిపుణులు చెబుతున్నారు.

ఈ రంగం ఇంకా ప్రయోగాత్మక దశలోనే ఉన్నా, గుండె, కిడ్నీ ఆపరేషన్లు జరిగిపోయాయి. ఈ ఆపరేషన్ల కోసం అంగీకరించిన ఇద్దరు వ్యక్తులు ట్రాన్స్‌ప్లాంటేషన్ మెడిసిన్ రంగంలో మార్గదర్శకులుగా నిలిచిపోతారు. వారిద్దరూ మరణించినప్పటికీ ఒక జాతికి చెందిన కణాలు, కణజాలాలు, అవయవాలను మరో జాతిలోకి ప్రవేశపెట్టడానికి ఉపయోగపడే అడ్వాన్స్ జెనోట్రాన్స్‌ప్లాంటేషన్‌కు సహాయకారులుగా నిలిచారు.

మరోపక్క మానవ కణాలనుంచే కొత్త అవయవాలను సృష్టించే పద్ధతి కూడా పెరుగుతోంది. శరీరంలోని ఏ కణంలోనైనా, కణజాలంలోనైనా పెరిగే సామర్థ్యం స్టెమ్‌ సెల్స్‌కు ఉంది.

డిసెంబర్ 2020 లో యూకే పరిశోధకులు (యుసిఎల్ ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్) మానవ రోగ నిరోధక వ్యవస్థలో ముఖ్యభాగమైన థైమస్‌ను సృష్టించడంలో విజయం సాధించారు. మూలకణాలు, బయో ఇంజినీరింగ్ స్కాఫోల్డ్ సాయంతో దీన్ని రూపొందించారు. దీనిని ఎలుకలకు అమర్చినప్పుడు, ఇది బాగా పనిచేస్తున్నట్టు కనిపించింది.

రోగి కణజాలం నుంచి మూలకణాలను ఉపయోగించి మానవ పేగులోని ఒక భాగాన్ని పెంచినట్లు లండన్‌లోని గ్రేట్ ఆర్మండ్ స్ట్రీట్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు తెలిపారు.

ఈ సాంకేతికత ఏదో ఒక రోజు పిల్లల పేగులలో సమస్యలను పరిష్కరించడానికి బాటలు పరుస్తుంది. కానీ ఈ పరిశోధన వ్యాధుల చికిత్స కోసమే కానీ, ప్రజల ఆయుర్దాయాన్ని 150 సంవత్సరాలకు పెంచడానికి కాదు.

టెక్ బిలియనీర్

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

వయసు తగ్గించుకోవడం సాధ్యమేనా?

టెక్ ఆంట్రప్రెన్యూర్ బ్రియాన్ జాన్సన్ తన వయసు తగ్గించుకోవడానికి (రివర్స్ ఏజింగ్) ఏటా మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నారు.

ఇప్పటి వరకు ఆయన ఎలాంటి అవయవ మార్పిడి చేయించుకోలేదు. కాకపోతే తన 17 ఏళ్ల కొడుకు ప్లాస్మాను శరీరంలోకి ఎక్కించుకున్నారు.

తరువాత ఈ ప్రక్రియను నిలిపివేశారు. ఎందుకంటే దీనివల్ల ఎలాంటి ప్రయోజనం కనిపించ లేదు. మరోపక్క యు.ఎస్. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వంటి ఏజెన్సీలు మరింత కఠినంగా మారాయి.

ప్లాస్మా రీప్లేస్‌మెంట్ వంటి అవయవ మార్పిడికి మించి అనేక ప్రయోగాలు జరుగుతున్నాయని, అయితే అవన్నీ ఇంకా ప్రయోగ దశలోనే ఉన్నాయని లండన్ కింగ్స్ కాలేజ్ కు చెందిన డాక్టర్ జూలియన్ మాట్జ్ చెప్పారు.

‘‘ఈ పద్ధతులు నిజంగా మనుషుల గరిష్ఠ ఆయుర్దాయాన్ని పెంచుతాయా లేదా అన్నది ఇప్పటికీ అనిశ్చితిలో ఉంది. కానీ ఇది శాస్త్రవేత్తలకు చాలా ఆసక్తి కలిగిస్తున్న విషయం"

ఫ్రాన్స్ కు చెందిన జీన్ కాల్ మెంట్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జీన్ కాల్ మెంట్

వందేళ్లు దాటి బతకడం కుదురుతుందా?

ఎడిన్‌బ్రాలోని రోస్లిన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ది యూనివర్సిటీలో ప్రొఫెసర్ నీల్ మాబాట్ ఇమ్యూనోపాథాలజీ నిపుణులు. మనుషులు 125 సంవత్సరాల వరకు జీవించే అవకాశం ఉందని ఆయన నమ్ముతున్నారు.

1875 నుంచి 1997 వరకు అంటే 122 ఏళ్లు జీవించిన ఫ్రాన్స్ కు చెందిన జీన్ కాల్‌మెంట్ ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడని ఆయన బీబీసీతో అన్నారు.

దెబ్బతిన్న అవయవాలను అవయవ మార్పిడి ద్వారా భర్తీ చేయగలిగినప్పటికీ, వయసు పెరిగే కొద్దీ మన శరీరం బలహీనపడుతుందని, శారీరక ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం తగ్గుతుందని ఆయన అన్నారు.

"ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యం తగ్గుతుంది, శరీరం పెళుసుగా మారుతుంది. గాయాల నుంచి కోలుకునే సామర్థ్యం తగ్గుతుంది. అవయవ మార్పిడి విషయంలో శస్త్రచికిత్స ఒత్తిడి, రోగనిరోధక మందుల ప్రభావం వృద్ధ రోగులకు చాలా తీవ్రంగా ఉంటుంది. ఆయుర్దాయాన్ని పెంచుకోవడంపై కాకుండా ఆరోగ్యంగా జీవించడంపై దృష్టి పెట్టాలి'' అంటారు ఆయన.

"జీవితం సుదీర్ఘంగా ఉన్నప్పటికీ, వృద్ధాప్య వ్యాధులతో పోరాడుతున్నప్పుడు పదేపదే ఆసుపత్రికి వెళ్ళవలసి రావడం, పదేపదే అవయవ మార్పిడి చేయించుకోవాల్సి రావడం సరైన ఆలోచన కాదు'' అంటారు ప్రొఫెసర్ మాబోట్.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)