కిమ్ జోంగ్ ఉన్ చిన్న కూతురు స్పెషాలిటీ ఏంటి, తండ్రి పక్కన తరచూ ఎందుకు కనిపిస్తున్నారు?

కిమ్ జోంగ్ ఉన్, కిమ్ జూ ఏ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కొరియన్ పీపుల్స్ ఆర్మీ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా 2023 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో తండ్రి కిమ్ జోంగ్ ఉన్‌తో కలిసి పాల్గొన్న కిమ్ జూ ఏ
    • రచయిత, లూయిస్ బారుచో
    • హోదా, బీబీసీ వరల్డ్ సర్వీస్

ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా కిమ్ జూ ఏ అనే అమ్మాయిని పరిగణిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు?

కిమ్ జోంగ్ ఉన్ చిన్న కూతురే కిమ్ జూ ఏ. కిమ్ జోంగ్ ఉన్ వారసురాలిగా కిమ్ జూ మారే అవకాశం ఉందని దక్షిణ కొరియా నిఘా సంస్థ నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌ఐఎస్) భావిస్తోంది. కిమ్ జూ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కిమ్ జోంగ్ ఉన్ తన కుటుంబాన్ని చాలా గోప్యంగా ఉంచుతారు. అందుకే ఆయన కుటుంబం గురించి చాలా తక్కువ సమాచారం అందుబాటులో ఉంది. పెళ్లి జరిగిన కొంత కాలం వరకు తన భార్య రీ సోల్ జు గురించి కూడా ఆయన గోప్యత పాటించారు. ఆమె 2012లో మొదటిసారిగా ఒక బహిరంగ కార్యక్రమంలో కనిపించారు.

దక్షిణ కొరియా మీడియా ప్రకారం, 2009లో వీరి వివాహం జరిగింది. 2010లో వారికి ఒక బిడ్డ జన్మించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు జన్మించిన కిమ్ జూ ఏ తల్లి కూడా రీ సోల్ జు అని భావిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మిసైల్ లాంచర్లు తయారయ్యే ఫ్యాక్టరీలో 2024 జనవరిలో తండ్రి కిమ్ జోంగ్ ఉన్‌తో కిమ్ జూ ఏ

ఫొటో సోర్స్, EPA-EFE/REX/Shutterstock

ఫొటో క్యాప్షన్, మిసైల్ లాంచర్లు తయారయ్యే ఫ్యాక్టరీలో తండ్రి కిమ్ జోంగ్ ఉన్‌తో కిమ్ జూ ఏ

కిమ్ జూ ఏ ఎవరు?

సోల్‌లోని కూక్మిన్ యూనివర్సిటీలో ఉత్తర కొరియా రాజకీయాలపై పరిశోధన చేస్తున్న ఫాయ్‌డర్ ట్రెటిస్కీ ఈ అంశంపై బీబీసీతో మాట్లాడారు.

''ఉత్తర కొరియా మీడియా కూడా కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె అని మాత్రమే పేర్కొంటుంది. ఆమె వయస్సు, పేరు గురించి ప్రస్తావించదు. అంతకు మించి ఏమీ తెలియదు. బహుశా ఆమె వయస్సు 10 ఏళ్లు ఉండొచ్చు'' అని ఆయన అంచనా వేశారు.

కిమ్ జూ పేరు ఏ విద్యా సంస్థలోనూ నమోదు కాలేదని, ఆమె ఇంట్లోనే ఉంటూ చదువుకుంటున్నారని గతేడాది దక్షిణ కొరియా నాయకులకు ఎన్‌ఐఎస్ పర్సనల్‌గా తెలియజేసింది. ఆమెకు గుర్రపు స్వారీ, ఈత, స్కీయింగ్ అంటే ఇష్టం. ఈ ఎన్‌ఐఎస్ బ్రీఫింగ్‌లో పాల్గొన్న ఒక వ్యక్తి విలేఖరులతో మాట్లాడుతూ, గుర్రపు స్వారీలో తన కుమార్తె నైపుణ్యంతో కిమ్ జోంగ్ ఉన్ సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.

కిమ్ జూ ఏకు ఒక అన్న, ఒక తమ్ముడు లేదా చెల్లి కూడా ఉన్నారని ఎన్‌ఐఎస్ పేర్కొంది. వీరు ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు.

2024 జనవరిలో ఒక కోళ్ల ఫారాన్ని తండ్రితో కలిసి సందర్శించిన కిమ్ జూ ఏ

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, 2024 జనవరిలో ఒక కోళ్ల ఫారాన్ని తండ్రితో కలిసి సందర్శించిన కిమ్ జూ ఏ

తొలిసారి బహిరంగంగా కనిపించిన కిమ్ జూ ఏ

కిమ్ జూ ఏ తొలిసారిగా 2022లో తన తండ్రితో కలిసి ఒక క్షిపణి ప్రయోగ సమయంలో బహిరంగంగా కనిపించారు. ఆ తర్వాత కొన్ని సైనిక, పౌర కార్యక్రమాల్లో తన తండ్రితో కలిసి కనిపించారు.

ప్యాంగ్యాంగ్‌లో మే 1 (2023)న, కొత్త సంవత్సరం సందర్భంగా స్టేడియంలో జరిగిన ఒక కార్యక్రమంలో తన తండ్రి బుగ్గపై ముద్దు పెడుతూ ఆమె కనిపించారు. ఆ తర్వాత కూడా అప్పుడప్పుడు తండ్రితో కలిసి ఆమె కనిపించారు.

కిమ్ జూ ఏ అనే పేరున్న ఇతరులందరూ తమ పేర్లను మార్చుకోవాలని ఉత్తర కొరియా ప్రభుత్వం ఆదేశించిందని 2023 ఫిబ్రవరిలో రేడియో ఫ్రీ ఆసియా సంస్థ రిపోర్ట్ చేసింది.

ఉత్తర కొరియాలో కిమ్ జూ ఏను ఇప్పుడు ప్రియమైన కూతురికి బదులుగా గౌరవనీయ కుమార్తెగా పేర్కొంటున్నట్లు పరిశీలకులు గమనించారు. ఉత్తర కొరియాలో అత్యంత గౌరవనీయులైన వ్యక్తులకు మాత్రమే 'గౌరవనీయ' అనే విశేషణాన్ని జోడిస్తారు.

ఉత్తర కొరియాకు కిమ్ జోంగ్ ఉన్ తదుపరి నాయకుడు అవుతారని నిర్ణయించినప్పుడు, ఆయనను కూడా 'గౌరవనీయమైన కామ్రేడ్' అని సంబోధించడం ప్రారంభించారు.

2023 మే నెలలో ఉత్తర కొరియా సైనిక ఉపగ్రహ కార్యక్రమం గురించి చర్చలో తండ్రిలో కలిసి పాల్గొన్న కిమ్ జూ ఏ

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, ఉత్తర కొరియా సైనిక ఉపగ్రహ కార్యక్రమం గురించి చర్చలో తండ్రిలో కలిసి పాల్గొన్న కిమ్ జూ ఏ

తర్వాత పాలించేది ఎవరు?

ఉత్తర కొరియా నుంచి బయటి ప్రపంచానికి చాలా తక్కువ సమాచారం అందుతుంది. కాబట్టి కిమ్ జూ ఏ తన తండ్రితో కలిసి ఇంత తరచుగా ఎందుకు బయట కనిపిస్తున్నారనే విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఇంత చిన్న వయస్సులోనే తన కుమార్తెను ప్రజల ముందుకు తీసుకురావడం కిమ్ జోంగ్ ఉన్ వ్యూహంలో భాగం కావొచ్చని కొందరు విశ్లేషకుల అభిప్రాయం. అధికారం చేపట్టడానికి ముందే తన కుమార్తె ప్రజలకు గుర్తుండిపోయేలా చేసే వ్యూహంగా భావిస్తున్నారు.

కిమ్ జోంగ్ ఉన్ ఒక సంరక్షకుడనే సంకేతాన్ని పితృస్వామ్య సమాజానికి తెలియజేయడానికి దీన్నొక మార్గంగా ఆయన ఎంచుకోవచ్చని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

1948లో ఉత్తర కొరియా ఏర్పడినప్పటి నుంచి కిమ్ కుటుంబంలోని పురుషులే ఆ దేశాన్ని పాలించారు. కిమ్ జూ ఏ ఒకవేళ తదుపరి పాలకురాలిగా మారితే, దేశానికి నాయకత్వం వహించిన తొలి మహిళగా నిలుస్తారు.

కిమ్ జోంగ్ ఉన్ రాజకీయ వారసురాలిగా ఆయన సోదరి కిమ్ యో జోంగ్‌ను కూడా పరిగణిస్తున్నారు. ప్రభుత్వ మీడియాలో ఆమె పేరు మొదటిసారిగా 2014 మార్చిలో ప్రస్తావనకు వచ్చింది. ఆమె కొరియాలోని అధికార వర్కర్స్ పార్టీలో సీనియర్ అధికారిగా ఉన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)