పల్నాడు జిల్లాలో రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు?

- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల గ్రామానికి చెందిన రైతు నాసం ఆదినారాయణ 60 ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిర్చి, శెనగ పంటలు సాగు చేశారు. అప్పులు తీసుకుని పెట్టుబడులు పెట్టి వరుసగా ఐదేళ్లు సాగు చేసినా పత్తి, మిర్చి పంటల్లో విపరీతంగా నష్టపోయారు.
‘రెండేళ్లుగా పత్తి సరిగ్గా పండలేదు. నల్లి దెబ్బకు మిరపతోటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడి డబ్బులు కూడా రాలేదు. కౌలు రైతులకు బ్యాంకులు రుణాలిచ్చే పరిస్థితి లేకపోవడంతో వడ్డీ వ్యాపారుల వద్ద తీసుకున్న రుణాలు తడిసి మోపెడయ్యాయి. ఓ వైపు వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు, మరో వైపు పంట నష్టాలతో తీవ్ర మనస్తాపం చెందిన ఆదినారాయణ రెండు నెలల కిందట ఆత్మహత్య చేసుకున్నారు’ అని ఆయన భార్య వెంకటరమణ బీబీసీకి తెలిపారు.
చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలం తూబాడు గ్రామానికి చెందిన శిరిబోయిన గోపాలరావు కౌలు రైతు. ఆయన ఈ ఏడాది పది ఎకరాల్లో పొగాకు, ఐదు ఎకరాల్లో మిర్చి, ఐదు ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఆయన ఇద్దరు కుమారులూ వ్యవసాయంలోనే చేదోడు వాదోడుగా ఉన్నారు.
‘మూడేళ్లుగా పంటలకు సరిగ్గా గిట్టుబాటు ధర లేక నష్టపోయారు. ఈ ఏడాది పొగాకు పంట అమ్ముడుపోక, మిర్చికి కనీస ధరలు రాక ఆర్థికంగా కుదేలయ్యారు. తీవ్ర మనోవేదనతో రెండు నెలల క్రితం బలవన్మరణానికి పాల్పడ్డారు’ అని గోపాలరావు భార్య భవానీ బీబీసీతో చెప్పారు.
పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన కౌలు రైతు బండి కొండయ్య మూడెకరాల్లో పత్తి, ఒక ఎకరంలో పొగాకు, రెండు ఎకరాల్లో వరి సాగు చేశారు.
‘బ్యాంకులు అప్పులు ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారుల నుంచి రుణాలు తీసుకుని పంటలు సాగు చేయగా, ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయారు. అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డారు’ అని ఆయన భార్య కోటేశ్వరమ్మ బీబీసీకి తెలిపారు.
ఇలా పంట నష్టాలు, అప్పుల బాధతో ఈ ఐదు నెలల వ్యవధిలో ఒక్క పల్నాడు జిల్లాలోనే అధికారిక లెక్కల ప్రకారం ఎనిమిది మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

2024–25 ఆర్ధిక సంవత్సరంలో పల్నాడు జిల్లాలో 21 మంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ ఆర్థిక సంవత్సరంలోని గత ఐదు నెలల్లో ఇప్పటివరకు ఎనిమిదిమంది.. మొత్తంగా గత ఏడాదిన్నరలో 29 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని పల్నాడు జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గారావు బీబీసీతో చెప్పారు.
ఈ సంఖ్యను త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.
పల్నాడులో ఆత్మహత్య చేసుకున్న రైతుల సంఖ్య ఈ లెక్కల కన్నా ఇంకా ఎక్కువే ఉంటుందని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కె. అనూరాధ బీబీసీతో అన్నారు.
గత పదేళ్ల కాలంలో పంటలు సరిగ్గా పండకపోవడం, గిట్టుబాటు ధరలు రాకపోవడంతో పాటు అప్పుల బాధతో పల్నాడులో సుమారు 400 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడినట్లు తమ పరిశీలనలో తేలిందని అనూరాధ చెప్పారు.
రైతు స్వరాజ్య వేదిక(ఆర్‌ఎస్‌వి)తో కలిసి తాము పల్నాడులో క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి వ్యవసాయ పరిస్థితులు పరిశీలించామని, కొన్నాళ్లుగా ఆ ప్రాంత రైతులు సంక్షోభంలో ఉన్నారని అనూరాధ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ జిల్లాలో చనిపోయిన రైతుల్లో ఎక్కువగా కౌలు రైతులే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య బీబీసీతో చెప్పారు.

పల్నాడు రైతులు సంక్షోభంలో ఎలా కూరుకుపోయారంటే..
పల్నాడు జిల్లాలో ప్రధానంగా వరితో పాటు మిర్చి, పత్తి, పొగాకు పంటలు ఎక్కువగా సాగు చేస్తుంటారు.
అయితే మిర్చి, పత్తి ధరల్లో కొన్నేళ్లుగా హెచ్చుతగ్గులు.. నల్ల బర్లీ పొగాకు పంట ధర ఒక్కసారిగా పడిపోవడం.. ఈ ఏడాది మార్కెట్‌లో అసలు కొనేవాళ్లు లేకపోవడం వంటి పరిణామాలతో పల్నాడు రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు.
కొన్నేళ్లుగా కౌలు రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి.
నాలుగైదేళ్ల కిందట వరకు రూ. 15 వేల వరకు ఉన్న కౌలు ధర ఇప్పుడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో రూ. 25 వేలకు చేరింది.
ఇక పల్నాడు జిల్లాలోని చాలా గ్రామాల్లో.. ప్రధానంగా వెల్దుర్తి మండలంలో వెయ్యి అడుగులు దాటితేకానీ బోర్లలో నీళ్లు పడవు. ఆ బోర్ల కోసం కొంతమంది రైతులు లక్షల రూపాయలు ఖర్చు చేసి అప్పుల పాలవుతుంటారు.
‘నష్టపోయిన రైతులకు పంటల బీమా సరిగా రాకపోవడం, కౌలు రైతులకైతే పరిహారం చెల్లింపు లేకపోవడం తదితర పరిణామాల నేపథ్యంలో పల్నాడు రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు’ అని రైతు సంఘం నేత యర్రా రాధాకృష్ణ బీబీసీతో చెప్పారు.

సగానికి పడిపోయిన మిర్చి ధర
ఐదారేళ్లుగా మిర్చి ధరలు ఆశాజనకంగా ఉండడం, పెట్టిన పెట్టుబడి ఖర్చులు రావడంతో రైతులు ఈ ఏడాది పెద్ద సంఖ్యలో మిర్చి పంటను సాగు చేశారు.
అయితే అనూహ్యంగా ఈ ఏడాది మొదట్లోనే మిర్చి ధరలు తగ్గిపోయాయి.
విదేశాలకు ఎగుమతులపై ఆంక్షల ప్రభావంతో పాటు గతేడాది పంట నిల్వ ఉండిపోవడంతో ఈ ఏడాది ధరలు పడిపోయాయి.
గతేడాది క్వింటాలు రూ. 25 వేలు వరకు పలికిన మిర్చి ధర ఈ ఏడాది రూ. 11 వేలు కూడా లేదు.
ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ఆశ్రయించడంతో కేంద్రం మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీంని ప్రకటించింది.
ఈ పథకం కింద క్వింటా మిర్చికి కేంద్రం రూ. 11,781 ధర ప్రకటించింది.
ఈ ధర ఏ మాత్రం సరిపోదని, మార్కెట్‌కి తీసుకువెళ్తే ఐదారు వేలు కూడా రాక తీవ్ర నష్టాలపాలయ్యామని ఈపూరు మండలం కొచ్చెర్ల గ్రామానికి చెందిన రైతు ఏడుకొండలు బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పత్తి: దిగుబడి, ధర రెండూ తగ్గిపోయి...
పల్నాడులో పత్తి సాగు చేసే రైతులు కూడా కొన్నాళ్లుగా నష్టాల పాలవుతున్నారు. పత్తి సాగుకు ఎకరానికి రూ. 45 వేల నుంచి రూ. 50 వేల వరకు పెట్టుబడి అవుతుంది.
కౌలు రైతు అయితే మరో రూ. 20 వేల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టాల్సివస్తుంది.
ప్రకృతి సహా అన్నీ అనుకూలిస్తే ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. కానీ, కొన్నేళ్లుగా ఆరేడు క్వింటాళ్ల దిగుబడి కూడా రావడం లేదని రైతులు చెబుతున్నారు.
గులాబీ రంగు కాయతొలిచే పురుగు బెడద తీవ్రంగా ఉందని, పురుగు మందుల వాడకానికి ఎక్కువగా ఖర్చు చేసినా ఫలితం లేక దిగుబడి తగ్గిపోయిందని పల్నాడు జిల్లా కారంపూడి మండలం పెదకొదమగుండ్ల గ్రామానికి చెందిన రైతు సీహెచ్ వీరబ్రహ్మాచారి బీబీసీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.
తాను ఈ ఏడాది ఐదెకరాల్లో పత్తి సాగు చేయగా, పంటకు కనీస గిట్టుబాటు ధర కూడా రాలేదని ఆయన చెప్పారు.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా( సీసీఐ) నాణ్యత ప్రమాణాల ప్రకారం ఉన్నప్పటికీ సీసీఐ నిర్ణయించిన ధర క్వింటాల్ పత్తికి 7,500 రూపాయలు కూడా తమకు బయ్యర్లు ఇవ్వలేదనీ, ఆరు వేలకే తాను అమ్ముకోవాల్సి వచ్చిందని ఆయన ఆరోపించారు.
కనీసం రూ. 10 వేలు ధర ఉంటే కానీ గిట్టుబాటు కాని పరిస్థితుల్లో సీసీఐ ప్రకటించిన ఏడున్నరవేలు రాకుంటే మా పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవాలని బ్రహ్మాచారి ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు సీసీఐ ఈ ఏడాది పల్నాడు జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో పంటను వంద కిలోమీటర్ల దూరంలోని గుంటూరు కేంద్రానికి తీసుకువెళ్లలేక ఇక్కడి దళారులకే అమ్ముకోవాల్సి వచ్చిందని పత్తి రైతు హరీశ్ బీబీసీతో అన్నారు.
దీనిపై మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉపేంద్ర బీబీసీతో మాట్లాడుతూ.. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో దాచేపల్లిలో కొనుగోలు కేంద్రాలు తెరిచామని, అయితే పత్తి మాత్రం సీసీఐనే కొనుగోలు చేస్తుందని చెప్పారు.

ఫొటో సోర్స్, ugc
సగానికి సగం తగ్గిపోయిన పొగాకు ధర
ఇక ఈ ఏడాది పొగాకు రైతులు మునుపెన్నడూ లేనంతగా తీవ్రస్థాయిలో నష్టపోయారు.
గతేడాది నల్లబర్లీ (హెడ్‌డీ బర్లీ) పొగాకు పంటకు ఆశాజనకంగా ధరలు రావడంతో ఈసారి రైతులు ఎక్కువ ఎకరాల్లో పొగాకు సాగు చేశారు.
కానీ, ఈ ఏడాది ధర తగ్గిపోయింది.
గతేడాది క్వింటాల్‌కు రూ. 14 వేల నుంచి రూ. 15 వేల ధర ఉండగా ఈ ఏడాది రూ. 7 వేలకు కూడా కొనే వాళ్లు కనిపించలేదని నాదెండ్లకు చెందిన పొగాకు రైతు సాంబయ్య బీబీసీతో అన్నారు.

తొలిసారి మార్క్‌ఫెడ్ రంగంలోకి వచ్చినా..
పొగాకు ధరలు విపరీతంగా తగ్గిపోవడంతో రైతుల ఆందోళన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తొలిసారి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేయిస్తోంది.
అయితే మార్క్‌ఫెడ్ ఒక్కో రైతు నుంచి 20 క్వింటాళ్లు మాత్రమే కొనుగోళ్లు చేస్తామని నిబంధన విధించింది.
దీంతో ఎక్కువ ఎకరాల్లో పంట వేసి 20 క్వింటాళ్ల కంటే ఎక్కువ దిగుబడి వచ్చిన రైతులం నష్టపోతున్నామని కారంపూడికి చెందిన పొగాకు రైతు పల్లెగుంట ఆంజనేయులు బీబీసీతో అన్నారు.
20 క్వింటాళ్లే కొంటే మిగిలిన పంట ఏం చేసుకోవాలని కారంపూడికే చెందిన కౌలు రైతు శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
6 గ్రేడ్ పొగాకుకు కేజీ 120 రూపాయలు, ఎం గ్రేడ్‌కి 90రూపాయలు ఎక్స్ గ్రేడ్‌కి 60రూపాయలు ఇస్తున్నామని పల్నాడు మార్క్‌ఫెడ్ డీఎం నరసింహారెడ్డి బీబీసీకి తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా లక్ష టన్నుల పంట రాగా గుంటూరు, పల్నాడు జిల్లాల్లోనే పాతిక వేల టన్నుల పంట వచ్చిందని ఆయన చెప్పారు.
జూన్ నుంచి కొనుగోళ్లు ప్రారంభించామని.. ఇప్పటివరకు పల్నాడు జిల్లాలో రైతులకు రూ. 16 కోట్లు జమచేశామని నరసింహారెడ్డి చెప్పారు.

పొగాకు సాగుపై నిషేధం: జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు
మునుపెన్నడూ లేనివిధంగా పొగాకు ధరలు తగ్గిపోయి.. సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వం పల్నాడు జిల్లాలో ఖరీఫ్, రబీ సీజన్‌లో పొగాకు సాగుపై నిషేధం విధించినట్లు పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బీబీసీకి తెలిపారు.
ఒక్క నలబర్లీ పొగాకే కాదని, అన్ని రకాల పొగాకు పంటలపై నిషేధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలోనే పొగాకు సాగును నిరుత్సాహపరచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఈ మేరకు ఆగస్టు 22న జీవో ఆర్‌టీ నంబర్ 740 విడుదలైందని తెలిపారు.
పల్నాడు జిలాల్లో సంక్షోభం నుంచి రైతులు బయటపడేలా కొనుగోళ్లు చేపట్టామని కలెక్టర్ అరుణ్‌బాబు చెప్పారు. అయితే దీనిపై గుంటూరులోని పొగాకు బోర్డు కార్యదర్శి వేణుగోపాల్ స్పందన కోరగా, ఆయన మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
ధరల్లో హెచ్చుతగ్గులుంటే నల్లబర్లీ పొగాకుపై నిషేధం సబబే కానీ అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధరలున్న వర్జీనియా పొగాకు సాగు చేయడంపైనా నిషేధం విధించడంపై తాము ఏం మాట్లాడతామని బోర్డుకు చెందిన ఓ అధికారి బీబీసీ వద్ద వ్యాఖ్యానించారు.
కాగా, పల్నాడు జిల్లాలో నల్లబర్లీ పొగాకు రైతుల సమస్య కూడా సమసిపోతోందని, మిగిలిన పంటల సాగు రైతులకు ఎక్కడా ఇబ్బంది లేదని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు బీబీసీ వద్ద స్పష్టం చేశారు.
ఖరీఫ్ సీజన్‌లో ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు మళ్లేలా శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టామని చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
చనిపోయిన రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం
కాగా, పల్నాడు జిల్లాలో ఆత్మహత్యకు పాల్పడ్డ రైతులకు పరిహారం చెల్లింపులో జాప్యం జరుగుతోందని మృతుల బంధువులు ఆరోపిస్తున్నారు.
పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం రేమిడిచెర్ల గ్రామానికి చెందిన ఎం.వెంకటేశ్వర్లు ఆరు ఎకరాల సొంత భూమితో పాటు మరో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని మిర్చి, పత్తి పంటలు సాగు చేశారు.
‘సరిగ్గా దిగుబడులు రాక, వచ్చిన పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక అప్పుల పాలయ్యారు. దాంతో మనోవేదనతో గతేడాది ఆగస్టులో ఆత్మహత్యకు పాల్పడ్డారు’ అని ఆయన కుమారుడు నాగరాజు చెప్పారు.
ఏడాది దాటినా ఇప్పటి వరకు నష్టపరిహారం కాదు కదా తన తల్లికి కనీసం వితంతు ఫించన్ కూడా రాలేదని నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆత్మహత్యకు పాల్పడ్డారని కేసు నమోదు కావడంతో అప్పులిచ్చిన వాళ్లు మాత్రం ఒత్తిడి చేయడం లేదని ఆయన చెప్పారు.
కాగా, పరిహారం చెల్లింపు ప్రక్రియ కొనసాగుతోందని, ఎక్కడైనా సాంకేతిక సమస్యలు వస్తే తప్పించి చెల్లింపులో ఆలస్యం లేదని పల్నాడు జిల్లా వ్యవసాయశాఖ అధికారి జగ్గారావు బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కౌలు రైతుకి మరీ కష్టం..
‘పల్నాడు జిల్లా వ్యవసాయరంగంలో తీవ్రంగా నష్టపోతోంది కౌలు రైతులే.. సాగు చేసే కౌలు రైతులైనా, వారి పేరిట భూములు లేకపోవడంతో పంట నష్టపరిహారం భూయజమానులకే వెళ్తోంది. అదేవిధంగా భూమి తమ పేరుతో లేకపోవడంతో బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదు. దీంతో తప్పని పరిస్థితుల్లో కౌలు రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి ఎక్కువ వడ్డీ రేట్లకు అప్పులు తేవాల్సివస్తోంది. హామీ లేని రుణాలు ఇవ్వాలని నిబంధన ఉన్నప్పటికీ ఉన్నప్పటికీ బ్యాంకులు బేఖాతరు చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలి’ అని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమలయ్య డిమాండ్ చేశారు.
అలానే రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులివ్వాలని కోరారు.

ఫొటో సోర్స్, Getty Images
జీవో నంబర్ 43ని అమలు చేయాలి: మానవ హక్కుల వేదిక
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను ఆదుకోవడం కోసం తెచ్చిన జీవో నంబర్ 43ని ప్రభుత్వం పక్కాగా అమలు చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అనూరాధ కోరారు.
ఆత్మహత్యకు పాల్పడ్డ రైతు కుటుంబాల్లో చాలా తక్కువ మందికి మాత్రమే రూ. 7 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిందని ఆమె తెలిపారు.
ప్రభుత్వం వేగంగా స్పందించి బాధిత కుటుంబాలన్నింటికీ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
అలానే బాధిత కుటుంబాలకు ఉన్న అప్పులను వన్ టైం సెటిల్‌మెంట్ చేసేందుకు కొంత మొత్తాన్ని కేటాయించాలన్నారు.
రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్న పల్నాడు జిల్లాలో సమగ్ర అధ్యయనం చేసి సమస్యలు ఉన్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఒక హెల్ప్ లైన్ ను ఏర్పాటు చేయాలని అనూరాధ డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, ugc
వ్యవసాయశాఖ అధికారులు బాధ్యత తీసుకోవాలి: యలమంచిలి శివాజీ
వ్యవసాయశాఖ అధికారులు బాధ్యత తీసుకుని క్షేత్రస్థాయిలోకి వెళ్లి రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తే ఆత్మహత్యలను అరికట్టొచ్చని రాజ్యసభ మాజీ సభ్యుడు, రైతు సంఘం నేత డాక్టర్ యలమంచిలి శివాజీ బీబీసీతో అన్నారు.
''వ్యవసాయశాఖ అధికారులు ఆఫీసుల్లో కూర్చొంటే ఉపయోగం లేదు. క్షేత్రస్థాయికి రావాలి. పొగాకు పంట నిషేధం నిర్ణయం తీసుకుంటే ముందుగా రైతులను సంసిద్ధులను చేయాలి. వారిని ప్రత్యామ్నాయ పంటలకు మళ్లేలా చూడాలి'' అని బీబీసీతో అన్నారు.
ఆత్మహత్యల ఆలోచనల నివారణకు హెల్ప్‌లైన్‌లు
- ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
- సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
- నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














