బాలెన్ షా ఎవరు? నేపాల్ నాయకత్వం చేపట్టాలని యువత ఎందుకు కోరుతోంది?

ఫొటో సోర్స్, FACEBOOK/Balen Shah
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేపాల్‌లో యువత ఆగ్రహంతో ఊగిపోతున్నారు. వీధుల నుంచి పార్లమెంటు వరకు ప్రతిచోటా వారి కోపం కనిపిస్తోంది. చివరకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా అది స్పష్టంగా కనిపిస్తోంది.
'నెపోకిడ్' అనే హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నేపాల్ నాయకులకు సంబంధించిన పిల్లల ధనిక, విలాసవంతమైన జీవనశైలికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను నేపాలీ యువకులు అందులో పోస్ట్ చేస్తున్నారు.
ఆ నాయకుల పిల్లలు ధరిస్తున్న ఖరీదైన బ్రాండ్ దుస్తులు, వాచీలు, వారి విలాసవంతమైన కార్లు, విదేశీ పర్యటనలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
ఒకవైపు నేపాల్‌లో సామాన్యులు మనుగడ కోసం పోరాడుతుంటే, మరోవైపు నేపాల్ నాయకుల పిల్లలు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారనేది అక్కడి యువత చెప్తున్న మాట.

'మా పన్నులు – మీ సంపద' అని నినాదాలు చేస్తూ సోమవారం (సెప్టెంబర్ 8) నేపాల్‌లో వేలాది మంది యువత (జెన్ జీ) వీధుల్లోకి వచ్చారు. తర్వాత పార్లమెంటునూ ముట్టడించారు.
నేపాల్ నాయకుల పిల్లలకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? ఇదీ నేపాల్ యువత ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న.
ప్రజాధనం భారీఎత్తున దుర్వినియోగమవుతోందని, అధికారంలో ఉన్నవారు సిగ్గులేనివారుగా, అవినీతిపరులుగా మారుతున్నారని నేపాల్‌లోని సామాన్య ప్రజానీకం ఆరోపిస్తున్నారు.

ఫొటో సోర్స్, FACEBOOK/Balen Shah
నేపాల్‌లో నాయకత్వ పగ్గాలు ఎవరికి?
నేపాల్‌లో యువత ఉద్యమం కొత్త నాయకత్వం ఆవిర్భావానికి దారితీస్తుందా, ఇప్పుడున్న పాత పార్టీలు బలహీనపడతాయా? అనే చర్చ మొదలైంది.
''యుక్రెయిన్‌లో జెలియెన్‌స్కీ ఎదుగుదలను పరిశీలిస్తే, అలాంటి ఉద్యమాల నుంచి ప్రజాదరణ గల నాయకులు ఉద్భవిస్తారు. కానీ అందులో సమస్య ఏమిటంటే, ఒక సంస్థ కానీ, భావజాలం కానీ లేకపోవడం'' అని నేపాల్‌కు చెందిన విశ్లేషకుడు సీకే లాల్ చెప్పారు.
కాఠ్‌మాండూ మేయర్ బాలెన్ షా తన పదవికి రాజీనామా చేసి, నాయకత్వం వహించాలని సోషల్ మీడియాలో నేపాల్ ప్రజలు కోరుతున్నారు.
నేపాల్‌లో ప్రత్యామ్నాయ రాజకీయాల అంశం చర్చకు వచ్చినప్పుడల్లా, 32 ఏళ్ల బాలెన్ షా పేరు తరచుగా ప్రస్తావనకు వస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైంది, ప్రజలకు బాలెన్ షాపై అంత నమ్మకం ఎందుకు?
బాలెన్ షా నేపథ్యం ఏమిటి?
బాలెన్ షా 1990లో కాఠ్‌మాండూలోని గైర్ గావ్‌లో జన్మించారు. బాలెన్ తండ్రి రామ్ నారాయణ్ షా ఆయుర్వేద వైద్యుడు, తల్లి ధ్రువదేవి.
బాలెన్ చిన్నప్పటి నుంచి సంగీత ప్రియుడని, ఆయనకు టోపీలంటే ఇష్టమని నేపాల్ వార్తాపత్రిక 'మై రిపబ్లిక్' రాసింది. ఆయన స్ట్రక్చరల్ ఇంజనీర్, ర్యాపర్, మ్యూజిక్ ప్రొడ్యూసర్, నటుడు, గీత రచయిత, కవిగా ప్రసిద్ధి చెందారు.
బాలెన్ షా కాఠ్‌మాండూలోని వైట్ హౌస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సివిల్ ఇంజనీరింగ్ చదివారు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పట్టా పొందారు.
కాలేజీ రోజుల్లో బాలెన్ విద్యార్థి రాజకీయాల్లో చురుకుగా ఉండేవారు. 2022లో నేపాల్ స్థానిక ఎన్నికలతో ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
మే 2022లో బాలెన్ షా నేపాల్ రాజధాని కాఠ్‌మాండూ మేయర్‌గా ఎన్నికవడం, అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆయన నేపాలీ కాంగ్రెస్‌కు చెందిన శ్రీజన సింగ్‌ను ఓడించారు. షాకు 61,767 ఓట్లు, శ్రీజన సింగ్‌కు 38,341 ఓట్లు వచ్చాయి. ఓలి పార్టీ అభ్యర్థి కేశవ్ సత్పిత్ మూడవ స్థానంలో నిలిచారు.
బాలెన్ షా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచారు. నేపాల్‌లో బలంగా ఉన్న పార్టీలను ఓడించి తనను తాను నిరూపించుకున్నారు.
''బాలెన్ షాను ఒక ఆకర్షణీయమైన వ్యక్తిత్వం గల వ్యక్తిగా ప్రజలు చూస్తారు. ఆయనొక గాయకుడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు'' అని సీకే లాల్ ప్రస్తావించారు.
బాలెన్ షా ఇంటర్నెట్ నుంచి ఎక్కువ ప్రజాదరణ పొందారని నేపాల్‌లోని సర్లాహి ఎంపీ అమ్రేష్ సింగ్ అభిప్రాయపడ్డారు.
"బాలెన్ మేయర్‌గా ఉన్న కాలంలో చేసిన పని నాకు పెద్దగా కనిపించలేదు. కానీ, బాలెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడన్నది నిజం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఓలి ఇదంతా ఊహించలేదా?
అవినీతికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని నేపాల్ ప్రజలు చెబుతున్నారు. అయితే, అవినీతికి వ్యతిరేకంగా గళమెత్తుతున్నవారిని అణచివేసేందుకు ప్రభుత్వం సోషల్ మీడియాను నిషేధించింది.
నేపాలీ కాంగ్రెస్ మద్దతుతో కేపీ శర్మ ఓలి నేతృత్వంలోని నేపాల్ కమ్యూనిస్టు పార్టీ (యూనిఫైడ్ మార్క్సిస్ట్-లెనినిస్ట్) అధికారంలో ఉంది.
సోమవారం (సెప్టెంబర్ 8న) మంత్రివర్గం సమావేశమైంది. హోంమంత్రి రమేష్ లేఖక్ రాజీనామా చేశారు.
అయితే, నేపాల్‌లో ఫేస్‌బుక్, యూట్యూబ్, ఎక్స్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్‌లను నిషేధించాలని ప్రధానమంత్రి ఓలి ఎందుకు నిర్ణయించుకున్నారు?
ఇలాంటి నిర్ణయంపై ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతుందని ఓలి ప్రభుత్వం ఊహించలేదా?
అదే సమయంలో, 19 మంది పౌరులు మరణించడానికి పరిస్థితులు దారితీసేవరకు ప్రభుత్వం నిరసనలను ఎందుకు ఆపలేకపోయింది? అనే చర్చ జరుగుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














