చార్లెస్ శోభరాజ్ - మధుకర్ ఝెండే: ‘బికినీ కిల్లర్’ను రెండు సార్లు పట్టుకున్న ఏకైక పోలీస్ ఆఫీసర్

చార్లెస్ శోభరాజ్, మధుకర్ ఝెండే
    • రచయిత, మానసి దేశ్‌పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘బికినీ కిల్లర్’ చార్లెస్ శోభరాజ్‌ను అరెస్ట్ చేయడంలో మహారాష్ట్ర పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఝెండే కీలకపాత్రపోషించారు. ఆయన జీవితం ఆధారంగా ‘ద సర్పెంట్’ అనే సిరీస్ నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.

సీరియల్ కిల్లర్ శోభరాజ్ డిసెంబర్ 2022న నేపాల్‌లోని కాఠ్మాండూ జైలు నుంచి విడుదలయ్యారు.

అప్పుడు ఆయన వయసు 78 సంవత్సరాలు. చార్లెస్ శోభరాజ్ 'బికినీ కిల్లర్'గానూ పేరుపడ్డారు.

ఈ అంతర్జాతీయ నేరగాడిని రెండుసార్లు కటకటాల వెనక్కి నెట్టిన మహారాష్ట్ర పోలీస్ అధికారితో బీబీసీ మాట్లాడింది. ఆయన చార్లెస్ శోభరాజ్‌ను పట్టుకున్న విధానం ఆసక్తిగా ఉంటుంది. ఆ పోలీసు అధికారి పేరు మధుకర్ ఝెండే.

ప్రస్తుతం 85 ఏళ్ల వయసున్న మధకర్ ఝెండే ముంబయి అసిస్టెంట్ కమిషనర్‌ ఆఫ్ పోలీస్‌గా 1996లో రిటైర్ అయ్యారు.

చార్లెస్ శోభరాజ్‌ను పట్టుకున్న ఘనత ఆయన ఉద్యోగజీవితంలో పదేపదే ప్రస్తావనకు వచ్చేది.

చార్లెస్ శోభరాజ్‌ను ఝెండే 1971లో మొదటిసారి ముంబయిలో అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఝెండే ముంబయిలో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా ఉన్నారు.

చార్లెస్ శోభరాజ్ 'సీరియల్ కిల్లర్' అనే విషయం 1971వరకు కూడా తెలియదని ఝెండే చెప్పారు.

ఆ సమయంలో శోభరాజ్ అఫ్గానిస్తాన్, ఇరాన్‌ వంటి దేశాల నుంచి ఖరీదైన కార్లను దొంగిలించి మంబయిలో అమ్మేవారని ఆయన చెప్పారు.

కానీ దిల్లీలో చేసిన ఓ నేరం కారణంగా శోభరాజ్ పోలీసుల దృష్టిలో పడ్డారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి
మధుకర్ ఝెండే
ఫొటో క్యాప్షన్, మధుకర్ ఝెండే

భారీ దోపిడీకి పథకం

చార్లెస్ శోభరాజ్‌ను పట్టుకోవడానికి భారత దర్యాప్తు సంస్థలు ఎలా ప్రయత్నించాయో ఝెండే వివరించారు.

"దిల్లీలో అశోక అనే ఫైవ్ స్టార్ హోటల్ ఉండేది. 1971లో చార్లెస్ శోభరాజ్ అక్కడి క్యాబరే డ్యాన్సర్ తో స్నేహం చేశాడు ఆమెను పెళ్లి చేసుకుంటానన్నాడు. ఆమెకు నగలు కొంటానని చెప్పాడు''

''ఇందుకోసం హోటల్లో ఉన్న ఓ బంగారు నగల దుకాణం నుంచి ఓ వ్యక్తిని నగలతో పిలిచాడు. కాఫీలో ఏదో కలిపి అతనిని అపస్మారక స్థితిలోకి వెళ్లేలా చేసి నగలు, ఆ మహిళతో పరారయ్యాడు''

''నగలు తీసుకువెళ్లిన ఉద్యోగి ఇంకా ఎందుకు తిరిగి రాలేదంటూ దుకాణ యజమాని హోటల్ గదికి వెళ్లి చూడగా, నగలు కనిపించకపోగా, ఉద్యోగి అపస్మారక స్థితిలో పడి ఉండటంతో దుకాణ యజమాని పోలీసులకు సమాచారం అందించారు'' అని ఝెండే చెప్పారు.

మధుకర్ ఝెండే ఇంకొన్ని విషయాలు కూడా వివరించారు.

''పోలీసులు అక్కడ ఒక పాస్‌పోర్టును కనుగొన్నారు, దానిపై 'చార్లెస్ శోభరాజ్' అని పేరు రాసి ఉంది. అప్పటి నుంచి అతను పోలీసులకు వాంటెడ్‌గా మారాడు. ఈ ఘటనకు సంబంధించిన వార్త పత్రికల్లో ప్రచురితమవడంతో చార్లెస్ శోభరాజ్ పేరు పతాక శీర్షికల్లోకి ఎక్కింది''

ఓ విదేశీయుడు ముంబయిలో భారీ దోపిడీకి పథకం వేసినట్టు 1971లో మధుకర్ ఝెండేకు ఇన్ఫార్మర్ల నుంచి సమాచారం అందింది. అతనితోపాటు ఇంకా ఓ నలుగురైదుగురు విదేశీయులు ఉన్నారని, వారి వద్ద రివాల్వర్లు, రైఫిల్స్ లాంటి ఆయుధాలు ఉన్నాయనే విషయమూ తెలిసింది.

ఈ సమాచారం అందుకున్న తర్వాత తన సహచరులతో కలిసి తాజ్ హోటల్ చుట్టూ నిఘా వేసినట్టు మధుకర్ ఝెండే చెప్పారు.

మధుకర్ ఝెండే

అలా శోభరాజ్ తొలిసారి పోలీసులకు చిక్కాడు

ఈ సంఘటన 1971 సంవత్సరం నాటిది. అయినా ఆ విషయాలన్నీ తనకు స్పష్టంగా గుర్తున్నాయని మధుకర్ ఝెండే చెప్పారు.

''మా అధికారుల్లో ఇద్దరమో, నలుగురుమో టాక్సీలో కూర్చున్నాం. 1971 నవంబర్ 11న శోభరాజ్ సూటు, బూటు ధరించి మా టాక్సీని దాటుకుని వెళ్లాడు. అతను వెళ్ళిన వెంటనే, మేం వెతుకుతున్న నేరస్థుడు ఆయనే అని మాకు నమ్మకం కలిగింది. మేం వెళ్లి ఆయన్ను పట్టుకున్నాం. అతని వద్ద రివాల్వర్ ఉంది. మేం ఆయన్ను అదుపులోకి తీసుకున్నాం, కానీ ఆయన ఏమీ చెప్పడానికి సిద్ధంగా లేడు.''

''మేం పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లి ప్రశ్నించాం. కానీ ఆయన ఏమీ చెప్పలేదు. ఆయన్ను తనిఖీ చేస్తే 4-5 రశీదులు లభించాయి. తన సహచరులందరినీ సమీపంలోని హోటళ్లలో ఉంచాడు. ఆ తర్వాత ఆ హోటళ్లకు వెళ్లి దాడులు చేశాం. అక్కడి నుంచి అందరినీ అరెస్టు చేశాం. వారి నుంచి తుపాకులు, స్మోక్ బాంబులు, హ్యాండ్ గ్రనేడ్లు ఇళా చాలా వస్తువులు లభించాయి.''

ఈ క్రమంలో చార్లెస్ శోభరాజ్ తొలిసారి మధుకర్ ఝెండే చేతికి చిక్కాడు.తరువాత దిల్లీలో నగల దొంగతనం కేసులో ఆయన్ను దిల్లీ పోలీసులకు అప్పగించారు.

దిల్లీ పోలీసులు శోభరాజ్‌ను అరెస్టు చేసిన కొద్దికాలానికి భారత్-పాక్ యుద్ధం మొదలైందని ఝెండే చెప్పారు. యుద్ధ సమయంలో బ్లాక్ అవుట్లు ఉండేవి . ఈ సమయంలో శోభరాజ్ కడుపునొప్పి సాకు చెప్పి ఆస్పత్రిలో చేరాడు. ఆ తర్వాత బ్లాక్అవుట్‌ను సద్వినియోగం చేసుకుని ఆసుపత్రి నుంచి పరారయ్యాడు.

మధుకర్ ఝెండే

రూటు మార్చిన శోభరాజ్

దీని తరువాత చార్లెస్ శోభరాజ్ కొత్త పద్ధతులలో నేరాలకు పాల్పడటం మొదలుపెట్టాడు.

చార్లెస్‌శోభరాజ్ 1972 నుంచి 1976 మధ్య 12 మందిని హత్య చేసినట్లు అనుమానించారు.

వారిలో కొందరు అధిక మోతాదులో మత్తు మందు ప్రయోగించిన కారణంగా.. మరికొందరు నీళ్లలో ముంచడం వల్ల, మరికొందరు కత్తిపోట్ల కారనంగా, ఇంకొందరు మంటల్లో కాలి చనిపోయారు.

చార్లెస్ శోభరాజ్ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి నేరాలకు పాల్పడ్డాడని, అతనిపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిందని ఝెండే చెప్పారు.

శోభరాజ్ 1976లో మళ్లీ దిల్లీకి వచ్చారు. ఆ సమయంలో ఆయనతోపాటు ముగ్గురు మహిళలు ఉన్నారు.

తనను గైడ్‌గా తీసుకోమని కొంతమంది ఫ్రెంచ్ విద్యార్థులను శోభరాజ్ ఒప్పించారు. తరువాత వారికి శోభరాజ్ మత్తు మందులు ఇచ్చారని మధుకర్ తెలిపారు.

"కొంతమంది విద్యార్థులు అదృష్టవశాత్తూ పోలీసులను సంప్రదించగలిగారు. దీంతో శోభరాజ్‌ను దిల్లీలో అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు 12 ఏళ్ల జైలు శిక్ష విధించింది'' అని మధుకర్ వివరించారు.

శోభరాజ్‌ను దిల్లీలోని తిహార్ జైలుకు తరలించారు. పదేళ్ల జైలు శిక్ష పూర్తయిన తర్వాత అక్కడి నుంచి పారిపోవాలని ఆయన ప్లాన్ చేశారు.

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

జైలు నుంచి తప్పించుకుని, జైలు బయట ఫోటో దిగి..

తిహార్ జైలు నుంచి 1986 మార్చి 16న శోభరాజ్ తప్పించుకున్నాడు. తాను తప్పించుకోవడానికి వేసిన ప్లాన్‌లో భాగంగా ఆయన జైలులో పార్టీ ఏర్పాటు చేశాడు.

ఈ పార్టీకి ఖైదీలనే కాకుండా గార్డులనూ ఆహ్వానించారు. పార్టీకి వచ్చినవారికి ఇచ్చిన బిస్కెట్లు, ద్రాక్షల్లో నిద్రమాత్రలు కలిపారు. వీటిని తిన్న కొద్ది సేపటికే వారంతా అపస్మారక స్థితికి చేరుకున్నారు. శోభరాజ్‌, ఆయనతో పాటు జైలు నుంచి తప్పించుకున్న మరో నలుగురు తప్ప మిగతా అంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు.

శోభరాజ్ తన ప్లాన్‌పై ఎంత నమ్మకంగా ఉన్నాడంటే జైలు నుంచి బయటకు వచ్చాక గేటు దగ్గర నిలబడి తన ఫోటో కూడా దిగారు.

ఈ ఘటన తర్వాత చార్లెస్ శోభరాజ్ కోసం మరోసారి గాలింపు మొదలైంది.

ఆయన్ను పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. ఆ సమయంలో వారికి ఓ క్లూ దొరికింది. రైల్వే పోలీసులు అజయ్ సింగ్ తోమర్ అనే వ్యక్తిని మార్చి 29న అరెస్టు చేశారు. అతను శోభరాజ్ ఆచూకీ గురించి పోలీసులకు సమాచారం అందించాడు.

తోమర్ అరెస్టు తర్వాత పోలీస్ కమిషనర్ వెంటనే తనకు ఫోన్ చేశారని మధుకర్ ఝెండే చెప్పారు. ఆ సమయంలో ఝెండే పోలీసు ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు.

1971లో మధుకర్ ఝెండే తొలిసారి శోభరాజ్‌ను అరెస్ట్ చేశారు. అలాగే 1976లో శోభరాజ్ అరెస్టయిన తర్వాత కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు కూడా వెళ్లారు.

ఆ సమయంలో శోభరాజ్, ఆయన ముఖాముఖి ఎదురుపడ్డారు.

శోభరాజ్ ఆహార్యం, అతను నేరాలు చేసే శైలి మధుకర్‌ ఝెండేకు బాగా తెలుసు తోమర్ నుంచి అందిన సమాచారం మేరకు మధుకర్ ఝెండే నేతృత్వంలో ముంబయి పోలీసులు గోవాలో శోభరాజ్‌ను పట్టుకునేందుకు ప్రణాళిక రూపొందించారు.

చార్లెస్ శోభరాజ్

ఫొటో సోర్స్, TEKEE TANWAR/AFP via Getty Images

‘కూపీ లాగితే పారిపోయే పనిలో ఉన్నాడని తెలిసింది’

శోభరాజ్‌ గురించి కూపీ లాగడం మొదలుపెట్టిన మధుకర్ ఝెండేకు శోభరాజ్ భార్య అమెరికాలో ఉందని, నకిలీ పాస్‌పోర్టుతో గోవా నుంచి ఆమెను కలవడానికి వెళుతున్నట్టు ఉప్పందింది.

శోభరాజ్‌కు ఓ మోటారు సైకిల్ ఉండేది. మధుకర్ ఝెండే వద్ద ఆ బండి నంబర్ ఉంది. ఈ రెండు ఆధారాలతో గోవా చేరుకుని ఆరు రోజులపాటు గాలించారు.

"గోవాలో టూరిస్టుల కోసం మోటార్ సైకిల్ స్టాండ్స్ ఉండేవి. మేం అక్కడికి వెళ్లి విచారించేవాళ్లం. మా బ్రదర్ నా బండి తెచ్చేశాడు. మీరేమైనా చూశారా" అని అడుగుతుండేవాళ్లం అని మధుకర్ ఝెండే చెప్పారు.

అక్కడ ఓ 14-15 ఏళ్ల బాలుడు ఉన్నాడు. 'ఆయన మీ బ్రదర్ ఎలా అవుతాడు? ఆయన దగ్గరున్న కొత్త బండి. నెమలీక రంగులో ఉంది. మీరు చూస్తేనేమో భారతీయుల్లా ఉన్నారు. ఆయనేమో విదేశీయుడిలా ఉన్నారు'' అని చెప్పాడు.

బాలుడి సమాధానంతో శోభరాజ్ ఆ ప్రాంతంలోనే ఉన్నాడని నమ్మకం కలిగిందని, దీంతో పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి మరో నలుగురైదుగురు అధికారులను పంపించాలని కోరానని మధుకర్ ఝెండే చెప్పారు.

ఆయన అభ్యర్థన మేరకు మరింత మంది అధికారులు గోవా చేరుకున్నారు. రోజంతా ఆ మోటారుసైకిల్ కోసం తిరిగేవాళ్లమని , సాయంత్రం శోభరాజ్ కోసం ఆ ప్రాంతంలోని హోటళ్లలో వేచి ఉండేవాళ్లమని ఝెండే చెప్పారు.

శోభరాజ్

ఫొటో సోర్స్, Getty Images

రాత్రివేళ ఎండాకాలం టోపీలు ధరించి...

"ఏప్రిల్ 6న రాత్రి 10-11 గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులు ఎండాకాలంలో ధరించే టోపీలు పెట్టుకుని వచ్చారు. రాత్రిపూట వారు ఇలాంటి టోపీలు ఎందుకు ధరించారా అని నేను ఆశ్చర్యపోయాను. వారిని జాగ్రత్తగా గమనిస్తే వారిలో ఒకరు శోభరాజ్ అని గుర్తించా. నేను నిశ్శబ్దంగా లేచి గోడ వెనుక దాక్కున్నాను’’ అని మధుకర్ తెలిపారు.

"ఇద్దరూ వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని ఆర్డర్ చేశారు. ఆ సమయంలో నేనో పథకం వేశాను. నాతోపాటు ఉన్న ఆఫీసర్లను లోపలకు పంపాను. నేను ఒక్కడినే బయట వేచి ఉన్నాను’’

‘‘మేం ఒకరినొకరు సమన్వయం చేసుకున్నాం. కొందరు లోపల... మరికొందరం బయట... మొత్తానికి శోభరాజ్‌ను అరెస్ట్ చేశాం’’

‘‘ఆఫీసర్లందరూ పొజిషన్‌ తీసుకున్నారు. నేను వెనుకనుంచి వెళ్లి శోభరాజ్‌ను గట్టిగా పట్టుకుని ‘‘చార్లెస్’’ అని పిలిచాను. అతను కంగారుపడి, తుపాకీని తీసేందుకు ప్రయత్నించాడు అన్నారు ఝెండే.

"ఆయన తుపాకీ తీయడానికి ప్రయత్నించాడు కానీ అది లోడ్ అయి లేదు. మా దగ్గర అతన్ని బంధించేందుకు సంకెళ్లు లేవు, దీంతో మేం హోటల్ యజమాని వద్ద తాడు తీసుకున్నాం’’

‘‘శోభరాజ్‌ను పూర్తిగా కట్టిపడేశాం. అతన్ని మా కారు వెనుక సీట్లో కూర్చోబెట్టారు. అతనికి ఒక బాక్స్ ఇచ్చి, ఏదైనా చేయాలనుకుంటే ఆ పెట్టెలో చేయమని చెప్పాం" అన్నారు ఝెండే.

ఆ తర్వాత పోలీస్ కమిషనర్‌కు ఫోన్ చేసి శోభరాజ్‌ను పట్టుకున్నట్లు చెప్పాం. ఆయన చాలా సంతోషించారు. మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి సీనియర్ అధికారులు పన్వేల్ వరకు వచ్చారు అని ఝెండే చెప్పారు.

మధుకర్ గురించి కథనాలుపత్రికలలో వచ్చాయి
ఫొటో క్యాప్షన్, మధుకర్ ఝెండే గురించి పత్రికల్లో వచ్చిన కథనాలు

శోభరాజ్ గురించి ఏం చెప్పారు?

శోభరాజ్‌ను గోవా నుంచి ముంబయికి తీసుకువచ్చిన 12, 14 గంటల ప్రయాణంలో అతను ఎక్కువగా మాట్లాడలేదని మధుకర్ చెప్పారు.

ఝెండే, అతని సహచరుల విజయానికి సంబంధించిన వార్త అన్ని పత్రికలలో ప్రచురితమైంది. దూరదర్శన్‌లో మధుకర్‌ను ఇంటర్వ్యూ చేశారు.

ఈ సంఘటన తర్వాత తనకు ఎంతో పేరు వచ్చిందని ఝెండే నవ్వుతూ చెప్పారు.

‘‘మీ పని మీరు చేశారు. ఇప్పుడు నన్ను పట్టుకోవడం ద్వారా నీకు ఎంతో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అని శోభరాజ్ అన్నాడు’’ అని తెలిపారు.

"శోభరాజ్ చాలా అహంకారి. ఆయన పోలీసులను, కోర్టును గౌరవించరు. తనను తాను చాలా తెలివైనవాడిగా భావిస్తాడు.

"ప్రయాణంలో నేను అతనితో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, 'మీరు మీ పని చేయండి, నేను నా పని చేస్తాను' అన్నాడు. ఆయన చాలా క్రూరమైన వ్యక్తి’ అని శోభరాజ్ మనస్తత్వాన్ని వివరించారు ఝెండే.

రాజీవ్ గాంధీ స్వయంగా కారు ఆపారు

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఇచ్చిన ఇంటర్వ్యూలో మధుకర్ ఝెండే ఓ ప్రత్యేక జ్ఞాపకాన్ని పంచుకున్నారు.

రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు ముంబయి పర్యటనకు వచ్చారు. ఆయన ఝెండేను కలవడానికి కారును ఆపారు. కానీ భద్రతా కారణాల రీత్యా అక్కడ సమావేశం జరగలేదని, , ఆ తర్వాత రాజీవ్ గాంధీ తనకు ఫోన్ చేసి ప్రత్యేకంగా ప్రశంసించారని చెప్పారు.

అంతర్జాతీయ నేరస్తుడిని పట్టుకున్నందుకు మధుకర్ ఝెండే పేరు టైమ్స్ మ్యాగజీన్‌లో ప్రచురితమైందని ఓ ఇంటర్వ్యూలో నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కూడా చెప్పారు.

శోభారాజ్ గోవాలో పట్టుబడిన తరువాత ఆయన శిక్షాకాలం పెరిగింది. 1997లో ఆయన విడుదలయ్యాక ఆయనను ఫ్రాన్స్‌కు అప్పగించారు.

శోభరాజ్ 2003లో నేపాల్‌కు తిరిగి వచ్చారు. ఈసారి ఆయన మీడియాతోనూ మాట్లాడారు. నిజానికి ఆయన కాఠ్మాండూ రావడం ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే ఆయన ‘వాంటెడ్’గా ఉన్న ఏకైక దేశం నేపాల్.

కాఠ్మాండూలోని ఓ క్యాసినోలో నేపాల్ పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. 2004లో ఆయనకు జీవిత ఖైదు విధించారు.

నేపాల్ సుప్రీంకోర్టు డిసెంబర్ 21, 2022 న సీరియల్ కిల్లర్ చార్లెస్ శోభరాజ్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.

ఆయన వయస్సు, ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీబీసీ నేపాలీ తెలిపింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)