నేపాల్‌లో పరిస్థితులు భారత్‌కు ఆందోళనకరమా?

ఫొటో సోర్స్, EPA/Shutterstock
- రచయిత, చందన్ కుమార్ జజ్‌వాడే
- హోదా, బీబీసీ ప్రతినిధి
సోషల్ మీడియాపై నిషేధం తర్వాత నేపాల్‌లో జరుగుతున్న హింసాత్మక సంఘటనలు, పరిణామాలపై భారత్ ఆచితూచి స్పందిస్తోంది.
నేపాల్‌లో పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేంతవరకు భారతీయులెవరూ అక్కడకు వెళ్లొద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది.
నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై నిషేధం విధించిన తర్వాత, యువత సోమవారం రాజధాని కాఠ్‌మాండూలో నిరసనలు ప్రారంభించారు. నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో 20 మందికి పైగా మృతిచెందారు.
తర్వాత, మంగళవారం నాటి సంఘటనల్లో మరో ఇద్దరు చనిపోయారు.


ఫొటో సోర్స్, Getty Images
భారత్‌తో నేపాల్‌కు ప్రత్యేక సంబంధాలు...
నేపాల్ భూపరివేష్టిత దేశం (ల్యాండ్ లాక్డ్ కంట్రీ). అక్కడికి వస్తువుల సరఫరాలో భారతదేశ పాత్ర చాలా కీలకం. అనేక వస్తువుల సరఫరా కోసం భారత్‌పై నేపాల్ ఆధారపడుతోంది.
అంతేకాదు భారత్, చైనాల మధ్య నేపాల్ వ్యూహాత్మక స్థానంలో ఉంది.
లిపులేఖ్ ద్వారా వాణిజ్యాన్ని కొనసాగించాలని భారత్, చైనాలు నిర్ణయించిన నేపథ్యంలో, లిపులేఖ్ తన దేశంలో భాగమని, తమ అధికారిక మ్యాపుల్లో కూడా ఉందని నేపాల్ పేర్కొంది.
కేపీ శర్మ పరిపాలనా కాలంలో భారత్‌తో నేపాల్‌కు మంచి సంబంధాలే కొనసాగాయి. రెండు దేశాల మధ్య చిరకాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో, నేపాల్‌లో రాజకీయ అస్థిరత భారత్‌కు ఎంతమేర ఆందోళనకరం కావొచ్చు?

ఫొటో సోర్స్, Getty Images
ఆందోళన చెందాల్సినంత పెద్ద విషయమా?
భారత్-చైనా మధ్య సంబంధాలలో ఒడుదొడుకుల దృష్ట్యా, నేపాల్‌కు భారతదేశం ప్రత్యేక ప్రాముఖ్యం ఇస్తుంది. నేపాల్‌లో పరిణామాలనూ నిరంతరం గమనిస్తూ ఉంటుంది.
నేపాల్‌లో మాధేశి ఉద్యమానికి భారత ప్రజల నుంచి మద్దతు, సానుభూతి లభించిందని చాలామంది నిపుణులు విశ్వసిస్తున్నారు. మాధేశి జనాభాలో ఎక్కువ మంది భారతదేశ సరిహద్దుకు సమీపంలోని నేపాల్ దక్షిణ భాగంలో నివసిస్తారు.
ప్రజాగ్రహానికి అగ్ర నాయకులు తలొగ్గిన భారత్ పొరుగుదేశాల్లో నేపాల్ మూడవది.
అంతకుముందు, బంగ్లాదేశ్‌లో గత సంవత్సరం జరిగిన ఆందోళనతో అప్పటి ప్రధానమంత్రి షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి, భారతదేశానికి వచ్చారు.
మూడేళ్ల క్రితం, శ్రీలంకలో జరిగిన హింసాత్మక ఉద్యమం ఫలితంగా అక్కడి ప్రభుత్వం కూలిపోయింది.
దక్షిణాసియాలోని ఈ దేశాల్లో రాజకీయ అనిశ్చితి భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమా? అన్న ప్రశ్నకు నిపుణులు అవుననే చెబుతున్నారు.
నేపాల్‌లో పరిస్థితులు భారతదేశానికి ఆందోళన కలిగించే విషయమేనని డెన్మార్క్‌లో నేపాల్ మాజీ రాయబారి విజయ్‌కాంత్ కర్ణ చెప్పారు. ఆయన 'సెంటర్ ఫర్ సోషల్ ఇన్‌క్లూజన్ అండ్ ఫెడరలిజం' (సీఈఐఎస్ఎఫ్) అనే థింక్ ట్యాంక్‌ను కాఠ్‌మాండూలో నిర్వహిస్తున్నారు.
''భారతదేశం ప్రజాస్వామ్య అనుకూల దేశం. పొరుగు దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడవాలని కోరుకుంటుంది. కానీ శ్రీలంకలో, తర్వాత బంగ్లాదేశ్‌లో ఏమి జరిగినా అది భారత్ దృక్కోణంలో సరైనది కాదు. బంగ్లాదేశ్ సమస్య భారత్‌పై ప్రత్యేక ప్రభావం చూపించింది'' అని విజయ్‌కాంత్ కర్ణ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంపై నేపాల్ ప్రభావం...
నేపాల్ భౌగోళికంగానే గాకుండా సామాజికంగా, సాంస్కృతికంగా కూడా భారతదేశంతో అనుసంధానమై ఉంది.
రెండు దేశాల ప్రజలు ఒకరి దేశంలో ఒకరు జీవనోపాధి పొందుతున్నారు. అంటే సరిహద్దు దాటి ఆర్థిక కార్యకలాపాలు అనుసంధానమై ఉన్నాయి. అంతేకాదు బంధుత్వాలు ఉన్నాయి.
రెండు దేశాల సరిహద్దులోని గ్రామాలను చూస్తే, ఏ ప్రాంతంలో నేపాల్‌లో అంతర్భాగమో, ఏది భారతదేశంలో భాగమో తెలుసుకోవడం చాలా కష్టం.
అలాంటప్పుడు, నేపాల్ ప్రస్తుత పరిణామాలు భారతదేశాన్ని ప్రభావితం చేస్తాయా? అన్న ప్రశ్నకు విజయ్‌కాంత్ కర్ణ స్పందిస్తూ, ''దీని ప్రభావం భారతదేశంపై నాకు కనిపించడంలేదు. ఈ ఉద్యమంలో భారత్‌పై వ్యతిరేకత ఎక్కడా లేదు. వాస్తవానికి ఇది అవినీతికి వ్యతిరేకంగా నిరసన. సోషల్ మీడియాపై నిషేధం దాన్ని రెచ్చగొట్టింది'' అని చెప్పారు.
భవిష్యత్తులో నేపాల్‌లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా, అది భారతదేశంలో మంచి సంబంధాలను కొనసాగిస్తుందని విజయ్‌కాంత్ అన్నారు. పొరుగుదేశాలు నేపాల్‌కు చాలా ముఖ్యమైనవని అభిప్రాయపడ్డారు.
దక్షిణాసియా భౌగోళిక రాజకీయాలపై నిపుణుడు, సౌత్ ఆసియా యూనివర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ ధనంజయ్ త్రిపాఠి స్పందిస్తూ, ''పొరుగు దేశంలో నెలకొన్న ఈ అశాంతి భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం. భారత్ నేపాల్‌లో భారీగా పెట్టుబడులు పెట్టింది. నేపాల్‌లో నివసిస్తున్న భారతీయులను క్షేమంగా చూసుకోవాలి. కానీ నేపాల్‌లోని పరిస్థితుల ప్రభావం భారత్‌పై కనిపించట్లేదు. అక్కడి యువతలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. అయితే అక్కడి నాయకులను భారతదేశం రక్షిస్తోందనే సందేశం ఎట్టిపరిస్థితుల్లోనూ బయటకు పొక్కకుండా భారతదేశం జాగ్రత్త తీసుకోవాలి'' అని ధనంజయ్ త్రిపాఠి అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లో హింసాత్మక సంఘటనలు...
''ప్రజలకు ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు. రైతులకు ఎరువులు అందట్లేదు. సాగునీరు రావట్లేదు. దేశంలో చట్టబద్ధమైన పరిపాలన లేదు'' అని నేపాల్‌లో పరిస్థితులను విజయ్‌కాంత్ కర్ణ వివరించారు.
''నాయకులు తమ స్వలాభం కోసం చట్టాన్ని మార్చుకుంటారు. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. వారికి విలాసవంతమైన భవనాలు ఉన్నాయి. వారి పిల్లలు విదేశాల్లో నివసిస్తున్నారు. కానీ సామాన్య ప్రజల జీవితాలు మారలేదు. ఈ నిరసన వెనుక ప్రధాన కారణం అదే'' అని అన్నారు.
నేపాల్‌లో రాచరికానికి మద్దతుగా ఈ సంవత్సరం మార్చి నెలలో ప్రదర్శనలు జరిగాయి. అక్కడి ఆర్థిక వ్యవస్థ, పాలనలో వైఫల్యం కారణంగా యువత మెరుగైన జీవితం, ఉపాధి కోసం ఇతర దేశాలకు వలసపోవడం నిరంతరంగా జరుగుతోంది.
ఈ గందరగోళాన్ని ఒక సమస్యగా మార్చడం ద్వారా మరోసారి రాచరికం, హిందూదేశానికి మద్దతుగా రాచరిక మద్దతుదారులు ప్రదర్శనలు చేస్తున్నారు.
నేపాల్‌లో ఈసారి నిరసనలు చాలా తీవ్రంగా, హింసాత్మకంగా జరుగుతున్నాయి. నిరసనలు మొదలైన రెండో రోజే ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి తన పదవికి రాజీనామా చేశారు. శాంతిభద్రతలకు సహకరించాలని నేపాలీ పౌరులకు దేశ అధ్యక్షుడు సహా చాలామంది విజ్ఞప్తి చేస్తున్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














