కిష్కింధపురి: రేడియో స్టేషన్‌కి, దెయ్యానికీ లింకేంటి.. బెల్లంకొండ, అనుపమ భయపెట్టారా?

ఫొటో సోర్స్, x/sarigamacinemas
- రచయిత, జీఆర్ మహర్షి
- హోదా, బీబీసీ కోసం
హారర్ సినిమాలు రెండు రకాలు. దెయ్యం భయపెట్టేవి, దెయ్యం పేరుతో భయపెట్టేవి. దెయ్యాలు కూడా రెండు రకాలు. నవ్విస్తూ భయపెట్టేవి, హింసతో భయపెట్టేవి.
మరి.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమా పరమేశ్వరన్ కాంబినేషన్‌లో వచ్చిన హారర్ మూవీ కిష్కింధపురి భయపెట్టిందో లేదో చూద్దాం.
కథ ఏంటంటే...
రాఘవ (బెల్లంకొండ శ్రీనివాస్) మైథిలి(అనుపమా పరమేశ్వరన్) లివింగ్ టు గెదర్. ఘోస్ట్‌వాక్ ట్రిప్స్ అరేంజ్ చేస్తుంటారు. దెయ్యాలున్నాయని నమ్మే పాడుబడిన ఇంట్లోకి (హాంటెడ్ హౌస్) ఒక బృందాన్ని తీసుకెళ్లి థ్రిల్‌కి గురి చేయడం. తీసుకెళ్లే ఇంట్లో ఆల్రెడీ వీళ్లే హారర్ ఎఫెక్ట్ ప్లాన్ చేసి ఉంటారు.
అయితే, కొత్తగా సువర్ణమాయ రేడియో స్టేషన్‌కి బృందాన్ని తీసుకెళ్లాల్సి వస్తుంది. అక్కడ నిజంగా దెయ్యం ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది మిగతా కథ.


ఫొటో సోర్స్, instagram.com/shinescreenscinema
ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు
చంద్రముఖి, అరుంధతి, మమ్మీ, రాజుగారి గది ...ఇలా ఏ సినిమా తీసుకున్నా ఒకటే ఫార్ములా. దెయ్యం ఉన్న ఇంట్లోకి కొందరు వెళ్లడం, అది వీళ్లని వెంటాటడం, చివరికి దైవిక లేదా మాంత్రిక శక్తితో దెయ్యాన్ని కట్టడి చేయడం. ఆ దెయ్యానికి ఒక ప్లాష్‌బ్యాక్ ఉంటుంది. అది సెకెండాఫ్‌లో రివీల్ అవుతుంది. ఈ రకం సినిమాలన్నింటికీ ఫార్ములా , టెంప్లేట్ ఒకటే.
అయితే, థియేటర్‌లో కెమెరా, బీజీఎం , సౌండ్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్ సాయంతో ప్రేక్షకుణ్ని ఎంత గ్రిప్పింగ్‌గా కుర్చీలో నుంచి ఉలిక్కిపడేలా చేశారనే దానిపైనే సక్సెస్ అధారపడి ఉంటుంది.
దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి తెలివైన వాడే. అయితే, సెకెండాఫ్‌లో అది శ్రుతి మించింది. ఫస్టాఫ్‌లో అనేక ట్విస్ట్‌లతో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. సెకెండాఫ్‌లో అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ కథని విప్పాలి.
దెయ్యం సినిమాల్లో లాజిక్‌లు ఎలాగూ అడగరు. అయితే, కన్విన్సింగ్‌గా ఉండాలి. చివరి వరకు సస్పెన్స్ కంటిన్యూ కావాలి. అది జరగకుండా ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ పోతే చివరికి ఏదీ రిజిస్టర్ కాదు.
ప్రేక్షకులను ఆశ్చర్యపరచడం మంచి టెక్నిక్కే కానీ, ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి ఆశ్చర్యపరిస్తే , ఆఖరికి ఆశ్చర్యపోవడం మానేస్తారు. సినిమాకి జరిగిన నష్టం ఇదే.

ఫొటో సోర్స్, instagram.com/shinescreenscinema
భయపెట్టే సీన్స్ ఎలా ఉన్నాయంటే...
1989లో ఒక రేడియో స్టేషన్‌లో ఆరుగురిని దెయ్యం హత్య చేయడంతో కథ గ్రిప్పింగ్‌గా ప్రారంభమవుతుంది. తర్వాత హీరో ఎలివేషన్ , హీరోయిన్‌తో పాటు 15 నిమిషాలు అనవసరమైన ల్యాగ్. ఈ ఫార్ములా నుంచి ఇంకా బయటపడకపోవడం విచిత్రం.
అక్కడక్కడ ప్రేక్షకుల్ని భయపెడుతూ, థ్రిల్లింగ్‌కి గురి చేస్తూ ఫస్టాఫ్ వేగంగా పరుగెడుతుంది. అప్పుడే ఇంటర్వెల్లా అనిపించిన సినిమా, సెకెండాఫ్‌లో ఇంకా అయిపోలేదా? అనిపిస్తుంది.
వేదవతికి, తనికెళ్ల భరణికి, ఇది చాలదన్నట్టు హీరోకి కూడా ఒక ప్లాష్‌బ్యాక్ పెట్టి ప్రేక్షకుణ్ని పరీక్షిస్తారు.
ఫస్టాఫ్‌లో కాస్త నవ్వించడానికి ప్రయత్నించిన జబర్దస్త్ ఆది సెకెండాఫ్‌లో అసలు కనిపించడు. హీరోతో సమాన ప్రమాదం ఉన్న ఆది బృందం స్క్రీన్ మీద మళ్లీ కనిపించదు.

ఫొటో సోర్స్, instagram.com/shinescreenscinema
రేడియో స్టేషన్‌కి, దెయ్యానికి లింకేంటి?
రేడియో స్టేషన్‌లో దెయ్యం కొత్త పాయింట్. దెయ్యం ఎవరు, రేడియో స్టేషన్‌కి ఉన్న లింకు ఏంటి? అసలు వీళ్లందరినీ చంపాలని ఎందుకు పగ పట్టింది? ఈ కారణాలన్నీ సిల్లీగా అనిపించడంతో క్లైమాక్స్ అంచనావేసేలా మారింది.
సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవాల్సింది ఎడిటింగ్, సౌండ్ డిజైన్. నిడివి రెండు గంటల ఐదు నిమిషాలు మాత్రమే ఉండడం పెద్ద ఊరట. బీజీఎం పర్వాలేదు. పాటలు పెద్ద అడ్డంకి. కెమెరా పనితనం బాగుంది. ముఖ్యంగా రైలు సన్నివేశం.
నిర్మాత సాహు ఖర్చుకి ఎక్కడా వెనకాడలేదు. బెల్లంకొండ శ్రీనివాస్ , అనుపమ పరమేశ్వరన్ జస్ట్ ఓకే. దెయ్యాన్ని ఎదుర్కోవడం, పారిపోవడం సినిమా అంతా ఈ రెండే కాబట్టి నటించడానికి పెద్ద స్కోప్ లేదు.
ఇన్నేళ్ల తర్వాత కూడా ఎక్స్‌ప్రెషన్స్ విషయంలో శ్రీనివాస్ మెరుగ్గా లేకపోవడం ఒక విచిత్రం. హారర్ జానర్ నచ్చేవాళ్లు ఒకసారి ప్రయత్నించొచ్చు.
కొత్త పాయింట్ మెప్పించిందా?
ప్లస్ పాయింట్స్
1.నిడివి
2.సౌండ్ డిజైన్
3.రేడియో స్టేషన్ అనే కొత్త పాయింట్
మైనస్ పాయింట్స్
1.సెకెండాఫ్
2.ఊహకి అందే కథనం
3.పాటలు
టికెట్ ధరలు, పాప్‌కార్న్ దెబ్బకి ప్రేక్షకులు ఆల్రెడీ భయంతో ఉన్నారు. అవి కూడా లెక్క చేయనంత భయం థియేటర్‌లో వుంటే తప్ప, హారర్ సినిమాలు చూడడానికి ఇష్టపడరు.
(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














