రివ్యూ: కన్నప్ప సినిమా ఎలా ఉంది, విష్ణు అంచనాలను అందుకున్నాడా?

కన్నప్ప సినిమా

ఫొటో సోర్స్, facebook/Vishnumanchu

    • రచయిత, జీఆర్ మహర్షి
    • హోదా, బీబీసీ కోసం

భారీ అంచ‌నాల‌తో క‌న్న‌ప్ప విడుద‌లైంది. మంచు విష్ణు కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో తీసిన సినిమా. దానికి తోడు ప్ర‌భాస్‌, మోహ‌న్‌లాల్‌, అక్ష‌యకుమార్ కూడా ఉండ‌టంతో అంచనాలు పెరిగాయి. ఇంతకీ సినిమా ఎలా ఉంది? మంచు విష్ణు హిట్ కొట్టాడా?

క‌న్న‌ప్ప క‌థ తెలుగు వాళ్ల‌కి తెలిసిందే. ఇత‌ర భాష‌ల వాళ్ల‌కు కొత్త‌గా అనిపించ‌వ‌చ్చు. కాళ‌హ‌స్తీశ్వ‌ర మ‌హ‌త్మ్యం త‌రువాత 24 ఏళ్ల‌కు కృష్ణంరాజు (1976) భ‌క్త క‌న్న‌ప్ప తీశారు.

గిరిజ‌నుడైన (చెంచు) క‌న్న‌ప్ప నాస్తికుడు. బ‌లికోరే అమ్మ‌వారు దేవ‌త ఎలా అవుతుంద‌నే వ్య‌క్తి. రాయి దేవుడు కాద‌ని వాదించే త‌త్వం. ఈ కన్నప్ప శివ‌భ‌క్తుడిగా ఎలా మారాడు, క‌ళ్ల‌నే శివ‌య్య కోసం త్యాగం చేసే మ‌హాభ‌క్తి ఎలా ఆవ‌హించింది? సింపుల్ ఇదే కథ. దీనికి సున్నిత‌మైన ప్రేమ క‌థ‌, ద్వంద్వ యుద్ధం, దొంగ పీఠాధిప‌తి మోసం క‌లిపి బాపు 'భ‌క్త క‌న్న‌ప్ప' తీశారు.

ఇదే క‌థ‌ని ఇంకొంచెం పెంచి ఐదు తెగ‌లుగా మార్చి కన్నప్ప తీశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కన్నప్ప సినిమా రివ్యూ, ప్రభాస్, విష్ణు

ఫొటో సోర్స్, facebook/Vishnumanchu

ఫొటో క్యాప్షన్, కన్నప్ప సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.

కథేంటి?

కన్నప్ప పాత్రలో విష్ణు న‌టించారు. వాయులింగాన్ని కాపాడుకుంటూ వ‌స్తున్న తెగ‌ని మ‌హ‌దేవ‌శాస్త్రి (మోహ‌న్‌బాబు) శాసిస్తుంటారు. ఈ లింగాన్ని త‌స్క‌రించ‌డానికి శక్తిమంత‌మైన సైన్యంతో కాల ముఖుడు అనే విల‌న్ ప్ర‌య‌త్నిస్తే అక్కడి ఐదు తెగ‌లు ఏక‌మై ఎదుర్కొంటాయి.

ఇందులో తిన్న‌డిని (విష్ణు) నాయ‌కుడిగా ఎన్నుకుంటారు. అయితే అత‌ను మారెమ్మ (అమ్మ‌వారు)కు వ్య‌తిరేకి కావ‌డంతో తండ్రే తిన్న‌డిని బ‌హిష్క‌రిస్తాడు.

హీరోయిన్ నెమ‌లి (ప్రీతి ముకుంద‌న్‌) కూడా తిన్న‌డితో పాటు వెళ్లిపోతుంది.

ఇక్క‌డి వ‌ర‌కూ ప్రేమ‌, యుద్ధమైతే, మిగ‌తా క‌థంతా శివ‌య్య లీల‌లు, భ‌క్తి భావం. చివ‌రి 40 నిమిషాలు కీల‌కం, అంద‌రూ ఎదురు చూసే ప్ర‌భాస్ వ‌స్తాడు కాబ‌ట్టి.

కన్నప్ప సినిమా, రివ్యూ

ఫొటో సోర్స్, facebook/24 Frames Factory

టెక్నికల్‌గా ఎలా ఉంది?

ఫ‌స్టాఫ్ కొంచెం నిదానంగా వుంటుంది.

తెగ‌ల యుద్ధం, ప్రేమ క‌థ‌లో బ‌ల‌మైన స‌న్నివేశాలు లేవు. కాక‌పోతే గ్రాఫిక్స్‌, న్యూజిలాండ్‌లో తీయ‌డం వ‌ల్ల సినిమాలో ఫ్రెష్‌నెస్ క‌నిపిస్తూ వుంటుంది.

నిడివి 3 గంట‌ల‌కి పైగా ఉండ‌టం ఇబ్బంది.

కన్నప్ప

ఫొటో సోర్స్, facebook/Vishnumanchu

ఫైట్ సీన్స్‌లో ఫొటోగ్ర‌ఫీ, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. శివ‌య్య భ‌క్తికి సంబంధించిన డైలాగ్‌లు చ‌మ‌క్కుమ‌నిపించాయి.

బ్ర‌హ్మానందం, స‌ప్త‌గిరి ఉన్నా కామెడీ ఏమీలేదు. బ‌హుశా పిలక వివాదంతో క‌ట్ చేసిన‌ట్టున్నారు.

తెగ నాయ‌కుడిగా శ‌ర‌త్‌కుమార్ బాగా న‌టించాడు. కానీ, డైలాగులు త‌మిళ యాస‌లోనే చెబుతాడు.

కన్నప్ప సినిమా, రివ్యూ

ఫొటో సోర్స్, facebook/24 Frames Factory

విష్ణు ఎలా నటించాడు?

శివుడిగా అక్ష‌య‌కుమార్‌, పార్వ‌తీగా కాజ‌ల్ మెప్పించారు. తెరపై మోహ‌న్‌లాల్ కాసేపు, మోహ‌న్‌బాబు కొంచెం ఎక్కువ సేపు క‌నిపిస్తారు.

క‌న్న‌ప్పలో అంద‌రూ అనుకున్న‌ది విష్ణు ఈ పాత్ర‌ని మోయ‌లేడ‌ని, ఎమోష‌న్ ప‌లికించ‌లేడ‌ని, సినిమాకి సాయంగా వ‌చ్చిన ప్ర‌భాస్ కూడా ర‌క్షించ‌లేడ‌ని. అయితే ఎమోష‌న్స్ సీన్స్‌లో విష్ణు బాగా న‌టించాడు, క‌న్నీళ్లు పెట్టించాడు. ప్ర‌భాస్ గెస్ట్‌లా కాకుండా సినిమాకి ఆయువు ప‌ట్టులా నిలిచాడు. ప్ర‌భాస్ ఎంట్రీ త‌ర్వాతే ప్రేక్ష‌కుల మూడ్ మారిపోతుంది. క్లైమాక్స్ , ప్రీ క్లైమాక్స్ సినిమాని నిల‌బెట్టాయి.

కన్నప్ప రివ్యూ, కాజల్

ఫొటో సోర్స్, facebook/24 Frames Factory

సొసైటీలో భ‌క్తి పెరిగిన‌ప్ప‌టికీ, భ‌క్తి సినిమాలు తీసి ప్రేక్షకులను థియేట‌ర్ల‌కి ర‌ప్పించ‌డం క‌ష్టం. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ విప‌రీతంగా పెంచుకోవ‌డ‌మే దీనికి మార్గం. కార‌ణం ఏమంటే రాజ‌మౌళి బాహుబ‌లి తీసిన త‌ర్వాత వ్య‌యం, తెలుగు స్టామినా పెరిగిపోయాయి. ఆ రేంజ్‌లో వుంటే త‌ప్ప సంతృప్తి పడటంలేదు.

క‌న్న‌ప్ప‌లో గ్రాఫిక్స్ అక్క‌డ‌క్క‌డ తేలిపోయినా, ఖ‌ర్చు తెర‌మీద క‌నిపించింది. విష్ణు ఓ మంచి సినిమాను అందివ్వాలనే ప్రయత్నం అయితే చేశాడు. కానీ, ఈ జ‌న‌రేష‌న్ ప్రేక్ష‌కుల‌కి ఏ మేర‌కు నచ్చుతుందో చూడాలి.

కన్నప్ప రివ్యూ

ఫొటో సోర్స్, facebook/24 Frames Factory

చివరగా..

ప్ల‌స్ పాయింట్స్:

1.చివ‌రి 40 నిమిషాలు

2.ప్ర‌భాస్ ఎంట్రీ

3.విష్ణు న‌ట‌న‌

4.కెమెరా, బీజీఎం

మైన‌స్ పాయింట్స్:

1.నిడివి

2.డ్యూయెట్స్‌

3. ఫ‌స్టాఫ్‌

ఫైన‌ల్‌గా క‌న్న‌ప్ప మీద ప్రేక్ష‌కులు మూడో క‌న్ను తెర‌వ‌కుండా శివ‌య్య , ప్ర‌భాస్ కాపాడారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)