అల్ప్రాజోలం-ఆరో నంబర్ గది: ఈ హైదరాబాద్ స్కూల్‌లో ఏం జరుగుతోంది, పోలీసులకు ఎలా తెలిసింది?

మేథ పాఠశాల
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి ప్రధాన రహదారి పక్కన ఉందా పాఠశాల. రోజూ పిల్లలు చదువుకునేందుకు వస్తున్నారు.. వెళుతున్నారు. టీచర్లు చదువు చెప్పేందుకు వస్తుంటారు.. వెళుతుంటారు.

కానీ వారికి తెలియంది ఏంటంటే...పాఠశాలలో మరొక చట్టవిరుద్దమైన వ్యవహారం కూడా నడుస్తోంది.

అనుమతులు లేకుండా ‘అల్ప్రాజోలం’ అనే మత్తు పదార్థం అక్కడ తయారు చేస్తున్నారు.

తరగతి గదిని ల్యాబ్‌గా మార్చుకున్న మేథ స్కూల్ డైరక్టర్ మల్లెల జయప్రకాశ్ గౌడ్..ఈ అక్రమానికి పాల్పడుతున్నట్లుగా తెలంగాణ ఈగల్ టీం పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.

అయితే, దీనిపై పాఠశాల యాజమాన్యం ఇంకా స్పందించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
అల్ప్రాజోలం
ఫొటో క్యాప్షన్, జయప్రకాశ్ గౌడ్

ఎవరీ జయప్రకాశ్?

జయప్రకాశ్ గౌడ్‌ది మహబూబ్ నగర్. హైదరాబాద్‌లో ఉంటూ బోయిన్‌పల్లిలో మేథ హైస్కూల్ నడుపుతున్నారు. దీనికి ఆయనే డైరెక్టర్.

ఈ పాఠశాల సుమారు తొమ్మిదేళ్ల నుంచి కొనసాగుతుండగా.. రెండేళ్ల కిందటే మరో యాజమాన్యం నుంచి జయప్రకాశ్ గౌడ్ తీసుకుని నడిపిస్తున్నట్లు విద్యాశాఖ చెబుతోంది.

ప్రస్తుతం పాఠశాలలో 63 మంది విద్యార్థులు నమోదై ఉన్నారు.

పాఠశాల బోర్డులపై పదో తరగతి వరకు అని చూపిస్తున్నప్పటికీ, నర్సరీ నుంచి ఏడో తరగతి వరకే విద్యార్థులు చదువుకుంటున్నారని విద్యాశాఖ తనిఖీల్లో తేలింది.

ఈ స్కూలుకు ఈ విద్యా సంవత్సరం వరకే అనుమతి ఉందని మేడ్చల్ విద్యాశాఖాధికారి ఐ.విజయకుమారి బీబీసీతో చెప్పారు.

అల్ప్రాజోలం తయారీ

అల్ప్రాజోలం తయారీ గురించి ఎలా తెలిసింది?

ఇటీవల కూకట్‌పల్లి, బాలానగర్‌లలో కల్లు తాగిన తర్వాత కొందరు చనిపోయిన ఘటనకు.. కల్లులో అల్ప్రాజోలం కలపడమే కారణమని పోలీసులు గుర్తించారు.

కల్తీ కల్లు ఘటన తర్వాత అల్ప్రాజోలం తయారీ సరఫరాపై తెలంగాణ ఈగల్ (ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) విభాగం విచారణ చేపట్టింది.

నగరానికి అల్ప్రాజోలం సరఫరాలో గురువా రెడ్డి అనే వ్యక్తి హస్తం ఉందని ఈగల్ అధికారుల విచారణలో తేలింది. ఈ ఘటన తర్వాత గురువా రెడ్డి పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

గురువా రెడ్డి నుంచి తీసుకున్న ఫార్ములాతో జయప్రకాశ్ కూడా అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు విచారణలో తేలిందని ఈగల్ ఎస్పీ సీతారాం మీడియాకు చెప్పారు.

''శేఖర్ అనే మరో వ్యక్తి ద్వారా జయప్రకాశ్‌కు గురువా రెడ్డి పరిచయమయ్యారు. ఆయన నుంచి అల్ప్రాజోలం తయారీ ఫార్ములా తెలుసుకున్నారు'' అని వివరించారు.

బడిలోనే అల్ప్రాజోలం తయారీ

ల్యాబ్ పేరుతో గదిలో అల్ప్రాజోలం తయారీ

ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకే పాఠశాలలో అల్ప్రాజోలం తయారీ యూనిట్ ఏర్పాటు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు దాడులు చేసినప్పుడు పాఠశాలలోని ఆరో నంబరు గదిలో అల్ప్రాజోలం తయారీ యూనిట్‌ను గుర్తించారు.

సెల్లార్‌ను మెటీరియల్ నిల్వ చేసేందుకు వినియోగిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.

ఆ గది కెమిస్ట్రీ ల్యాబ్ అని పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులకు జయప్రకాశ్ చెబుతుండేవారని, ఆ గదిలోకి ఎవరినీ రానిచ్చేవారు కాదని చెబుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ ప్రాంతాల్లోని కల్లు డిపోలకు అల్ప్రాజోలం సరఫరా చేస్తున్నట్లు గుర్తించామని ఈగల్ టీం అధికారులు చెప్పారు.

ఆల్ప్రాజోలం తయారీ

అల్ప్రాజోలం సరఫరా చేసేందుకు వెళ్తున్న క్రమంలో జయప్రకాశ్‌ను అరెస్టు చేసినట్లు ఎస్పీ పి.సీతారాం చెప్పారు.

''మేథ పాఠశాల నుంచి 3.5 కిలోల అల్ప్రాజోలం, 4.3 కిలోల తయారీలో ఉన్న అల్ప్రాజోలం, రూ.21లక్షల నగదు, అల్ప్రాజోలం తయారీకి అవసరమైన ముడి సరకు, ఎనిమిది రియాక్టర్లు, డ్రైయ్యర్లు, కొన్ని బకెట్లు, వెయింగ్ మిషన్, డబ్బాలు, స్టవ్ వంటి వస్తువులు స్వాధీనం చేసుకున్నాం'' అని వివరించారు.

తొమ్మిది నెలలుగా ఇక్కడ అల్ప్రాజోలం తయారు చేస్తున్నట్లు గుర్తించామని చెప్పారు సీతారాం.

జయప్రకాశ్‌తోపాటు ఆయనకు సహాయకులుగా వ్యవహరిస్తున్న పి.ఉదయ్ సాయి, జి.మురళీసాయిని అరెస్టు చేసినట్లు ఈగల్ టీం పోలీసులు ప్రకటించారు.

జయప్రకాశ్ సహా అభియోగాలు ఎదుర్కొంటున్న వారితో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా.. వారు అందుబాటులోకి రాలేదు. వారి న్యాయవాదులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. వారి నుంచి సమాధానం రాగానే ఇక్కడ అప్‌డేట్ చేస్తాం.

అల్ప్రాజోలం తయారీ

పాఠశాల సీజ్

మేడ్చల్ జిల్లా విద్యా శాఖాధికారులు పాఠశాలను సీజ్ చేశారు. విద్యా శాఖ సరైన తనిఖీలు చేయకపోవడం వల్లే అల్ప్రాజోలం తయారీని గుర్తించలేకపోయారన్న విమర్శలున్నాయి.

అయితే, తాము తనిఖీలు చేస్తున్నామని, ఇందులో తమ నిర్లక్ష్యం లేదని బీబీసీతో చెప్పారు మేడ్చల్ జిల్లా విద్యాశాఖాధికారి ఐ.విజయకుమారి.

''విద్యా శాఖ తరఫున తనిఖీలు జరుగుతున్నాయి. సెలవుల్లో, శని, ఆదివారాల్లో అల్ప్రాజోలం తయారు చేస్తున్నారు. అందుకే ఈ విషయం బయటపడలేదు'' అని వివరించారు.

ఇక్కడ చదువుతున్న పిల్లలను సమీపంలోని ఇతర పాఠశాలల్లో సర్దుబాటు చేస్తున్నామని విజయకుమారి బీబీసీతో చెప్పారు.

అల్ప్రాజోలం తయారీ

అసలేంటీ అల్ప్రాజోలం..?

అల్ప్రాజోలం ఒక ఔషధం.

బెంజోడయాజెపైన్ తరగతికి చెందిన మాలిక్యూల్. మత్తు కోసం తయారు చేసే ఔషధాల్లో దీన్ని వినియోగిస్తుంటారు.

నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలకు అవసరాన్ని బట్టి, రోగి స్థితిని బట్టి అల్ప్రాజోలం కలిపిన మందులు డాక్టర్లు సూచిస్తుంటారు.

ఈ తరహా మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్కిప్షన్ (చీటీ) లేకుండా విక్రయించేందుకు వీలుండదని అపోలో ఆస్పత్రుల విజిటింగ్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సుజీత్ కుమార్ చెప్పారు.

''ఎక్కువ రోజులు అల్ప్రాజోలం వాడితే దానికి బానిసలుగా మారిపోతుంటారు. ఈ మధ్యకాలంలో రోగులకు దీన్ని ఇవ్వడాన్ని వైద్యులు పూర్తిగా తగ్గించేస్తున్నారు'' అని బీబీసీతో ఆయన చెప్పారు.

అపోలో ఆస్పత్రుల విజిటింగ్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సుజీత్ కుమార్

ఫొటో సోర్స్, facebook/drbsujeethkumar

ఫొటో క్యాప్షన్, అపోలో ఆస్పత్రుల విజిటింగ్ కన్సల్టెంట్ సర్జన్ డాక్టర్ బి.సుజీత్ కుమార్

''అల్ప్రాజోలం అనేది మనిషిని బానిసగా మార్చుతుంది. అలా వాడుతూ పోతే కొన్నాళ్లకు మోతాదు సరిపోదు. పెంచుకుంటూ పోవాల్సి వస్తుంది. అది మనిషి ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది'' అని డాక్టర్ సుజీత్ వివరించారు.

కల్లు వంటి వాటిల్లో దీన్ని కలిపి కల్తీ చేయడం కారణంగా ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారని చెప్పారాయన.

''కొన్ని సందర్భాల్లో అల్ప్రాజోలం కలిపినవి తాగిన తర్వాత ఏం జరిగిందనేది పూర్తిగా మరిచిపోతుంటారు. దీన్నే బ్లాక్ అవుట్ అని కూడా అంటాం'' అని సుజీత్ వివరించారు.

అల్ప్రాజోలంపై నిషేధం ఉందా..?

భారత్‌లో ఔషధాల్లో వాడేందుకు అల్ప్రాజోలం తయారీకి అవసరమైన అనుమతులు (లైసెన్సులు) తీసుకుని తయారు చేస్తే నిబంధనలకు విరుద్ధం కాదు.

లైసెన్సు లేకుండా తయారు చేయడం, లైసెన్సు ఉన్నప్పటికీ తయారు చేసి ఇతర అవసరాలకు వినియోగించడం లేదా సరఫరా చేయడం చట్ట విరుద్ధమని తెలంగాణ ఎక్సైజ్ శాఖకు చెందిన అధికారి ఒకరు బీబీసీతో చెప్పారు.

''ఫార్మాకోపియా ప్రకారం లైసెన్సు తీసుకుని అల్ప్రాజోలం తయారు చేసి డ్రగ్స్ తయారీకి వినియోగించవచ్చు'' అని వివరించారాయన.

అల్ప్రాజోలం తయారీకి ఉపయోగించే కెమికల్ ఫార్ములాను తెలుసుకుని తయారు చేసి కల్లు కాంపౌండ్లకు విక్రయిస్తుండటమే ఇప్పుడు సమస్యగా మారింది.

ఈ తరహా తయారీ కేంద్రాలు ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమోననే విషయంపైనా విచారణ చేస్తున్నామని ఈగల్ టీం అధికారులు ప్రకటించారు.

''అల్ప్రాజోలం వంటి మత్తుపదార్థాలు నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసే కేంద్రాలను గుర్తించి దాడులు చేస్తాం. ప్రజలు కూడా తమకు తెలిసిన వివరాలను పోలీసులకు ఇవ్వవచ్చు'' అని ఎస్పీ సీతారాం చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)