డిజిటల్ అరెస్ట్: చనిపోయాక కూడా ఆమె ఫోన్‌కు మెసేజ్‌లు, ఆ తర్వాత కుటుంబ సభ్యులకు తెలిసిన నిజం ఏంటంటే...

డిజిటల్ అరెస్ట్, సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Pawan Kumar

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిజిటల్ అరెస్టు పేరుతో హైదరాబాద్‌కు చెందిన 76 ఏళ్ల రిటైర్డ్ మెడికల్ ఆఫీసర్‌ను మోసం చేశారంటూ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇందులో విషాదమేంటంటే, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసానికి గురైన బాధితురాలు 'కార్డియాక్ అరెస్టు'తో చనిపోయారు.

దీనిపై దర్యాప్తు జరుగుతోందని హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ విభాగం డీసీపీ దార కవిత బీబీసీతో చెప్పారు.

''1669/2025 నంబరుతో కేసు నమోదు చేశాం. విచారణ జరుగుతోంది'' అని ఆమె చెప్పారు.

బాధితురాలి పేరు, కుటుంబ సభ్యుల వివరాలు వెల్లడించలేమని డీసీపీ తెలిపారు. సైబర్ నేరాల కేసుల్లో బాధితుల పేర్లను రహస్యంగా ఉంచుతామని, వివరాలు వెల్లడించలేమని కవిత చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షెల్ అకౌంట్‌‌లోకి డబ్బు...

నగరంలోని యూసుఫ్‌గూడలో సెప్టెంబర్ మొదటివారంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మలక్‌పేట ఆసుపత్రిలో బాధితురాలు వైద్యాధికారిగా పనిచేశారు.

సెప్టెంబర్ 5- 8 మధ్య ఆమెను డిజిటల్ అరెస్టు చేసి బెదిరింపులు, వేధింపులకు పాల్పడినట్లుగా గుర్తించామని డీసీపీ కవిత బీబీసీతో చెప్పారు.

సైబర్ నేరగాళ్లు ఆమెకు మొదట సెప్టెంబర్ 5న ఫోన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ఆ మరుసటి రోజు అంటే, సెప్టెంబరు 6న ఆమె బ్యాంకు అకౌంట్ నుంచి మహారాష్ట్రలోని ఒక బ్యాంకు ఖాతాకు రూ. 6,60,543 బదిలీ అయ్యాయని, ఇది షెల్ అకౌంట్ అని పోలీసులు చెబుతున్నారు.

సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడిన వెంటనే డబ్బులను మొదటగా షెల్ అకౌంట్లో వేయించుకుంటారని, ఆ తర్వాత వివిధ బ్యాంకు ఖాతాలకు బదలాయించి, క్రిప్టో కరెన్సీలోకి మార్చి డబ్బు దోచుకుంటారని అంటున్నారు.

డిజిటల్ అరెస్ట్

ఫొటో సోర్స్, Getty Images

అంత్యక్రియల తర్వాత కూడా ఫోన్‌కు మెసేజ్‌లు

సెప్టెంబర్ 8న ఆమె కార్డియాక్ అరెస్టుకు గురయ్యారని, ఆసుపత్రికి తరలించేలోపే చనిపోయారని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు.

మరుసటి రోజు ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.

ఆమె చనిపోయిన తర్వాత కూడా ఫోన్‌కు మెసేజ్‌లు రావడాన్ని గమనించి, ఆమె సైబర్ మోసానికి గురైనట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబసభ్యులు.

సైబర్ నేరగాళ్ల వేధింపులు, బెదిరింపులు భరించలేకే ఆమె చనిపోయినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

''ఆమె చనిపోయన తర్వాత కూడా సైబర్ నేరగాళ్లు ఆమె ఫోన్‌కు కొన్ని మెసేజ్‌లు పంపించినట్లుగా గుర్తించాం. మొదట వచ్చిన ఫోన్ నంబరు నుంచి కాకుండా వేరొక ఫోన్ నంబరు నుంచి కూడా ఫోన్ కాల్స్ వచ్చినట్లు'' పోలీసులు చెబుతున్నారు.

ఈ ఫోన్ నంబరును ఆమె 'జయశంకర్ సార్' పేరుతో సేవ్ చేసుకున్నారని, వాట్సాప్‌లో నకిలీ కోర్టు నోటీసు కూడా పంపించడంతోపాటు చాలాసార్లు వీడియో కాల్స్ వచ్చాయని ఈ ఘటనపై 'టైమ్స్ ఆఫ్ ఇండియా' రిపోర్ట్ చేసింది.

ప్రస్తుత దశలో అన్ని వివరాలూ వెల్లడించలేమని, పూర్తి వివరాలు విచారణ తర్వాత వెల్లడిస్తామని డీసీపీ కవిత వివరించారు.

హైదరాబాద్, పోలీస్, సైబర్ నేరాలు
ఫొటో క్యాప్షన్, కవిత, డీసీపీ, హైదరాబాద్ సైబర్ క్రైమ్స్

డిజిటల్ అరెస్ట్ అంటే ఏమిటి?

సైబర్ నేరాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, నేరాలు కూడా అదే స్థాయిలో రూపం మార్చుకుంటున్నాయి.

డిజిటల్ అరెస్ట్ గురించి 2024 అక్టోబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా మాట్లాడారు.

పోలీస్ స్టేషన్ లేదా ఏదైనా దర్యాప్తు సంస్థ కార్యాలయం వంటి సెటప్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏర్పాటు చేసుకుని, అవి వీడియోలో కనిపించేలా మోసగాళ్లు చూసుకుంటారు. నిజమైన యూనిఫామ్స్ లాంటివి ధరిస్తారు. నకిలీ ఐడీ కార్డు చూపిస్తారు.

సీబీఐ, ఐటీ, కస్టమ్స్, నార్కోటిక్స్ బ్యూరో, ఆర్బీఐ ఇలా వివిధ ప్రభుత్వ సంస్థలు లేదా విభాగాల పేర్లతో బెదిరింపులకు పాల్పడతారు.

మీరు పంపిన పార్శిల్‌లో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ ఫోన్ ద్వారా చట్టవ్యతిరేక పనులు చేస్తున్నారని బాధితులను మోసగాళ్లు బెదిరిస్తుంటారు. ఈ మోసాల్లో భాగంగా డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ అరెస్ట్ వారెంట్‌లను కూడా తయారు చేస్తుంటారు.

ఆ తర్వాత బాధితుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు బదలాయించుకుని మోసం చేస్తుంటారు.

ఎలా ఫిర్యాదు చేయాలంటే..

సైబర్ నేరాల గురించి సమాచారం తెలిసినా, సైబర్ నేరాల బారిన పడినా.. బాధితులు 1930 నంబరుకు వెంటనే ఫిర్యాదు చేయవచ్చని డీసీపీ దార కవిత చెప్పారు.

ఇది కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో నడిచే నేషనల్ సైబర్ క్రైమ్స్ సెల్ హెల్ప్ లైన్ నంబర్.

అలాగే బాధితులు https://cybercrime.gov.in పోర్టల్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని ఆమె చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)