ఏఐతో నకిలీ ఆధార్, పాన్ కార్డుల స్కామ్: మీ ఐడెంటిటీ కార్డ్ దుర్వినియోగం కాకుండా ఎలా కాపాడుకోవాలి?

నకిలీ ఐడెంటిటీ కార్డులు

ఫొటో సోర్స్, Maharashtra Cyber/Getty Images

    • రచయిత, ప్రియాంక జగ్తాప్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతికత మన జీవితాలను ఎంత సులభతరం చేసిందో, అంత సవాలుగా కూడా మారుస్తోంది.

ఎందుకంటే, ఈ డిజిటల్ యుగంలో సైబర్ క్రైమ్‌ కేసులు, వాటి సరికొత్త రూపాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి.

దీని వల్ల చాలా మంది ప్రజలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. అంతేకాక, సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వారి వల్ల వ్యక్తిగత, దేశ భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇటీవల చాట్‌జీపీటీ, ఇతర ఏఐ విధానాలతో తేలికగా నకిలీ డాక్యుమెంట్లను.. ముఖ్యంగా ఆధార్, పాన్ కార్డులను సృష్టిస్తున్న కేసులు వెలుగులోకి వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏఐ టూల్స్‌తో సృష్టించే ఆధార్, పాన్ కార్డులు అచ్చం అసలైనవిగానే కనిపిస్తున్నాయి.

ఏఐతో ప్రస్తుతం వివిధ రకాల ఫోటోలను, వీడియోలను తేలికగా క్రియేట్ చేస్తున్నారు.

సైబర్ నేరగాళ్లు ప్రజల వర్చువల్ ఐడెంటిటీలను దొంగిలించి, వాటిని దుర్వినియోగం చేస్తున్నారు.

భద్రతా కోణంలో ఇదొక కొత్త రకం ప్రమాదం.

వాస్తవానికి, ఆధార్ కార్డు, పాన్ కార్డు అనేవి భారతీయ పౌరులకు అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ డాక్యుమెంట్లు.

దొంగిలించిన ప్రజల ఐడెంటిటీతో సైబర్ నేరగాళ్లు ఆర్థిక మోసాలకు పాల్పడటమే కాకుండా.. నేర ముఠాలు, టెర్రరిస్ట్ సంస్థలు, శత్రు దేశాలు కూడా దేశ భద్రతను ప్రమాదంలో నెట్టేలా ఇలాంటి సాంకేతికతలను వాడే ప్రమాదం ఉంది.

ఏఐ టూల్స్‌తో నకిలీ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

ఆధార్ కార్డును కేంద్ర ప్రభుత్వపు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) జారీ చేస్తుంది.

పాన్ కార్డును ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అందిస్తుంది. కానీ, ఏఐను వాడుతూ చాలా నకిలీ డాక్యుమెంట్లు సృష్టిస్తుండటంతో.. నకిలీవి ఏవో, నిజమైన ఏవో గుర్తించడం కష్టమవుతోంది.

దీనివల్ల ఎవరైనా తేలికగా ఈ మోసాల బారినపడే ప్రమాదం ఉంది.

అందుకే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ హెచ్చరిస్తోంది.

ఆధార్ కార్డు లేదా పాన్‌ కార్డు నకిలీదా లేదా నిజమైనదా అని ఎలా గుర్తించాలి? ఈ మోసాల బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే విషయాలపై సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ కొన్ని సూచనలు కూడా చేసింది.

అలాగే, నకిలీ గుర్తింపు కార్డులు, వాటి ప్రమాదాలు, పర్యవసనాలతో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్, న్యాయపరమైన చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించడం ఎంత ముఖ్యమో సైబర్ క్రైమ్ డిపార్ట్‌మెంట్ తెలిపింది.

సైబర్ క్రైమ్

ఫొటో సోర్స్, Getty Images

మీ ఐడెంటిటీ దొంగతనానికి గురైతే వచ్చే ప్రమాదాలేంటి?

నకిలీ ఐడీలను సృష్టించేందుకు నేరస్తులు ఏఐ, డీప్‌ఫేక్‌, టెంప్లేట్ ఎడిటింగ్, ఫేక్ క్యూఆర్ కోడ్‌లను వాడుతున్నారు.

ఈ నకిలీ ఐడీలపై ఉండే పేర్లు, అక్షరాలు, డిజైన్లు అచ్చం నిజమైన ఐడీలపై ఉన్నట్లే ఉంటాయి.

ఈ నకిలీ డాక్యుమెంట్లను బ్యాంకు అకౌంట్లు తెరిచేందుకు, రుణాలు పొందేందుకు, మనీ లాండరింగ్ వంటి ఆర్థిక నేరాలకు వాడుతుండొచ్చు.

దొంగతనం చేసిన మీ ఐడెంటిటీని సైబర్ క్రైమ్‌కు చెందిన వివిధ నేరాలకు పాల్పడేందుకు, ప్రభుత్వ ప్రయోజనాలను అక్రమంగా పొందేందుకు వాడుతుండొచ్చు.

ఏఐ టూల్స్‌, డీప్‌ఫేక్‌లతో ఆధార్ లేదా పాన్ కార్డు ఫోటోలను మార్చవచ్చు. నేరస్తులు మీ కార్డు నెంబర్‌ను వారి ప్రయోజనాలకు వాడుకునే అవకాశం ఉంటుంది.

ఇది మీ వ్యక్తిగత, దేశ భద్రతను తీవ్ర ముప్పులో పడేస్తుంది.

ఏఐ టూల్స్‌ను, క్యూఆర్ కోడ్, సెగ్నో వంటి పైథాన్ లైబ్రరీలను ఉపయోగించి అచ్చం నిజమైన వాటిలాగా కనిపించే ఫేక్‌ క్యూఆర్ కోడ్‌లను క్రియేట్ చేయొచ్చు.

దీనివల్ల సమాచారాన్ని తారుమారు చేయడం, నకిలీ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) వెబ్‌సైట్లను క్రియేట్ చేయడం సాధ్యమవుతుంది. దీంతో, మోసానికి పాల్పడే ముందు నేరస్తులు వెరిఫికేషన్ ప్రక్రియ నుంచి తేలికగా తప్పించుకునే వీలుంటుంది.

ఈ ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి?

ఆధార్, పాన్ కార్డు వివరాలను ధ్రువీకరించుకునేందుకు ఎల్లప్పుడూ అధికారిక యూఐడీఏఐ, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) వెబ్‌సైట్లనే వాడాలి.

ఫోటోను లేదా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా లేదా డిజిటల్‌ సంతకం చేయడం ద్వారా ఆధార్, పాన్ కార్డు వివరాలను వెరిఫై చేయొద్దు.

ఎవరైనా మీ ఆధార్ లేదా పాన్ కార్డు ఫోటోను పంపితే, వెంటనే నమ్మొద్దు. అది నకిలీ కూడా కావొచ్చు.

మీకేమైనా అనుమానాలు ఉంటే, అధికారిక ప్రభుత్వ వెబ్‌సైట్‌లోకి వెళ్లి, ఐడెంటిటీ కార్డుపై ఉన్న సమాచారాన్ని తనిఖీ చేసుకోవాలి.

మీ ముఖ్యమైన డాక్యుమెంట్లను తేలికగా ఎవరికీ ఇవ్వొద్దు. వాటి ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్టు చేయొద్దు. అలా చేస్తే దుర్వినియోగమయ్యే అవకాశం ఉంటుంది. నకిలీ ఐడీ కార్డుల విషయంలో జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం.

ఆర్టిఫిషియల్ ఇమేజీలను, నకిలీ కార్డులపై ఉండే తప్పుడు ఫాంట్ లెటర్స్‌ను గుర్తించేందుకు ప్రత్యేక ఏఐ టూల్స్‌ వాడాలి.

ఏఐతో నకిలీ ఐడీ కార్డులను గుర్తించేలా బ్యాంకు ఉద్యోగులకు, పోలీసులకు శిక్షణ ఇవ్వాలి.

సైబర్ డిపార్ట్‌మెంట్

ఫొటో సోర్స్, Maharashtra Cyber/Getty Images

నకిలీ ఐడీ కార్డును ఎలా గుర్తించాలి?

ఏఐతో జనరేట్ చేసిన ఆధార్, పాన్ కార్డులు అచ్చం అసలైనవిగానే ఉంటున్నాయి. వాటిని నిశితంగా పరిశీలిస్తేనే అసలు కార్డుకు, నకిలీ కార్డుకు మధ్య తేడాను గుర్తించవచ్చు.

తొలుత మీ ఆధార్ కార్డు, పాన్ కార్డుపై ఉన్న ఫోటోలను చెక్ చేయాలి. రియల్ ఫోటోకు, ఏఐతో జనరేట్ చేసిన ఫోటోకు మధ్య కాస్త తేడా ఉంటుంది.

దీన్ని గుర్తించేందుకు ఫోటోను నిశితంగా చూడాలి. ఈ తేడాను అంత తేలికగా గుర్తించలేరు. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డుపై ఉండే ఫోటో పూర్తిగా తేడాగా ఉండే అవకాశం కూడా ఉంది.

ఆధార్, పాన్ కార్డులపై కేంద్ర ప్రభుత్వ లోగో ఉంటుంది. దాన్ని చెక్ చేసుకోవాలి. ఏఐతో తయారు చేసే కార్డుపై లోగో భిన్నంగా ఉంటుంది. అసలు లోగోకు కాస్త భిన్నంగా నకిలీ లోగో ఉండొచ్చు.

లోగో డిజైన్, రంగు, లోగోపై ఉండే అక్షరాలు, అక్షరాల రంగులో కూడా కొన్ని మార్పులు ఉంటాయి.

ఆధార్, పాన్ కార్డులపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాన్ని స్కాన్ చేసిన కూడా వాటిపై ఉన్న సమాచారాన్ని చెక్ చేసుకోవచ్చు.

ఆధార్ కార్డు, పాన్ కార్డుపై ఉన్న హిందీ, ఇంగ్లీష్ అక్షరాల ఫాంట్‌లో తేడా ఉండొచ్చు. ఏఐతో తయారు చేసే కార్డుపై ఉండే అక్షరాలు కూడా కాస్త భిన్నంగా ఉంటాయి.

ఆధార్, పాన్ కార్డుపై ఉండే కామాలు, సెమీకాలన్లు, లైన్లు సరైన ప్రదేశంలో, సరైన కలర్, సైజులో ఉన్నాయో లేదో చూసుకోవాలి.

ఎందుకంటే, నకిలీ కార్డుపై వీటిని తప్పుగా వాడే అవకాశం ఉంది.

(ఆధారం: మహారాష్ట్ర సైబర్ డిపార్ట్‌మెంట్)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)