ఆంధ్రప్రదేశ్: 'నా భర్తను నాతో ఉండమని చెప్పండి చాలు', గుంజకు కట్టేసి కొట్టినా భర్తపై ఫిర్యాదు చేసేందుకు ఇష్టపడని భార్య

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
(ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు.)
భార్యను ఇంట్లో రెండు గుంజలకి కట్టేసి ఓ భర్త చిత్రహింసలు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దెబ్బలు తట్టుకోలేక ఆమె కేకలు పెడుతున్నట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది.
ఏడు సెకన్లు మాత్రమే ఉన్న ఆ దృశ్యాల వెనుక చాలా కోణాలున్నాయని బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడులో వెలుగుచూసిన ఆ ఘటన నేపథ్యం గురించి పొదిలి సీఐ వెంకటేశ్వర్లు, ఐసీడీఎస్ అంగన్‌వాడీ టీచర్ సరళకుమారి, గ్రామ సచివాలయ పోలీస్ కానిస్టేబుల్ శశిరేఖ బీబీసీకి వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

వాళ్లేం చెప్పారంటే...
''ప్రస్తుతం భార్యను వదిలేసి ఇంకో మహిళతో ఉంటున్న సదరు భర్తే ఈ వీడియో తీయించారు. హైదరాబాద్‌కి చెందిన ఆమెను గతంలో అతను ప్రేమించే పెళ్లి చేసుకున్నారు.
భార్యను ఇలా కొడుతున్న వీడియోను ఇప్పుడు తాను కలిసి ఉంటోన్న మహిళకు చూపించి ఆమెను ఆనందపెట్టాలని ఈ వీడియో తీయించారు.
వీడియో తీసింది.. స్వయంగా తన సోదరుడి కుమారుడే.
అలా కొడుతుంటే సహకరించింది స్వయంగా భర్త సోదరుడి కుటుంబసభ్యులే. ఎందుకంటే, తమకు ఉన్న చిన్నపాటి ఉమ్మడి ఆస్తి(ఇల్లు) లో ఆమెకు ఎక్కడ వాటా ఇవ్వాల్సి వస్తుందేమోనన్న కోపంతో అలా చేశారు.
ఇక చావు దెబ్బలు తిన్న ఆ భార్య పరిస్థితి మరీ హృదయ విదారకం. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ భర్తతో తనకు నలుగురు పిల్లలు కలిగారు. వారి పొట్ట నింపడానికి తిప్పలు పడుతున్నారు. ఎప్పటికైనా భర్త ఇంటిలో భాగం వస్తే, తన పిల్లలకైనా ఉపయోగ పడుతుందని ఆమె అన్ని దెబ్బల్ని తట్టుకున్నారు.
చివరికి అన్ని చావు దెబ్బలు తిన్నా పోలీస్ కంప్లయింట్ ఇచ్చేందుకు కూడా ఆమె ఇష్టపడలేదు.''

ఫొటో సోర్స్, Getty Images
ప్రేమించి పెళ్లి చేసుకుని...
సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం, ''తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు ఎస్టీ కాలనీకి చెందిన గురునాథ్ బాలాజీ హైదరాబాద్‌లో పనులు చేస్తున్న సమయంలో పరిచయమైన బీసీ వర్గానికి చెందిన భాగ్యమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.
వీరిద్దరికీ నలుగురు పిల్లలు (ఇద్దరు మగ, ఇద్దరు ఆడ పిల్లలు) ఉన్నారు. నాలుగేళ్లుగా అతను చీరాలకు చెందిన మరో మహిళతో సన్నిహితంగా ఉంటూ భాగ్యమ్మకి దూరమయ్యాడు.
అయితే, తన తల్లిదండ్రులు చనిపోవడం, తనకి ఎవరూ లేకపోవడంతో భాగ్యమ్మ తన నలుగురు పిల్లలను తీసుకుని బాలాజీ సొంతూరు కలుజువ్వలపాడు వచ్చేసి ఇక్కడే అతని ఇంట్లోనే ఉంటున్నారు. మొదట్లో పశువుల కాపరిగా పనిచేసిన ఆమె ఇటీవల స్థానికంగా ఉన్న బేకరీలో పనిచేస్తున్నారు.
మధ్య మధ్యలో భాగ్యమ్మ వద్దకు వచ్చే బాలాజీ.. డబ్బులిమ్మని వేధిస్తుంటాడు. ఆ క్రమంలోనే ఈనెల 13వ తేదీన డబ్బులిమ్మని అడిగితే ఆమె లేవని చెప్పింది. అంతే, ఆ రాత్రి ఆమెను ఊరి చివర ఉన్న ఓ ఇంటికి తీసుకువెళ్లి ఇంట్లో ఉన్న గుంజలకి కట్టేసి చిత్రహింసలు పెట్టారు.''
రాత్రంతా కొడుతూనే...
రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు అలా కొట్టారని భాగ్యమ్మ ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
డబ్బుల కోసమే తరచూ తన భర్త వేధిస్తున్నాడని చెప్పుకొచ్చారు.
''రాత్రంతా కొడుతూనే ఉన్నారు. నా దగ్గర ఉన్న డబ్బులిస్తాను. ఇంటికి వెళ్లి తీసుకొస్తాను వదిలేయండి అంటే అప్పుడు వదిలారు. గ్రామ సర్పంచ్ శిఖోమణి ఇంటికి వెళ్లి వాళ్లకు ఈ విషయం చెప్పాను'' అని మీడియాతో భాగ్యమ్మ చెప్పారు.
అప్పటికే నీరసించి ఉన్న ఆమెకి టిఫిన్ పెట్టి, పోలీసులకు సమాచారం అందించానని సర్పంచ్ శిఖోమణి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, SILVIA TURRA / EYEEM
ఆ వీడియో ఎలా బయటపడిందంటే..
బాలాజీ తన సోదరుడి కుమారుడితోనే వీడియో తీయించారని, ఆ వీడియోను ప్రస్తుతం తాను కలిసి ఉంటోన్న మహిళకు చూపిస్తానని ఆయన అన్నట్లు స్థానికులు వెల్లడించారని అంగన్‌వాడీ టీచర్ సరళకుమారి బీబీసీతో అన్నారు.
ఈ వేధింపులు తట్టుకోలేక భాగ్యమ్మ వెళ్లిపోతే ఆ ఇల్లు మొత్తం తమకే వస్తుందని సోదరుడి కుటుంబసభ్యులు కూడా సహకరించారని సరళకుమారి చెప్పారు.
ఆ వీడియో తీసిన యువకుడు ఊళ్లో మరొక యువకుడికి ఈ వీడియో షేర్ చేయడంతో ఇదంతా వెలుగులోకి వచ్చిందని ఆమె తెలిపారు.
ఫిర్యాదు వద్దంటే వద్దని..
ఈ విషయం తెలిసిన వెంటనే భాగ్యమ్మ వద్దకి వెళ్లి కంప్లయింట్ ఇవ్వమని అడిగితే ఆమె నిరాకరించారని గ్రామ సచివాలయ పోలీస్ కానిస్టేబుల్ శశిరేఖ బీబీసీతో చెప్పారు.
''ఏదో మీరు నా భర్తతో గట్టిగా మాట్లాడి నాతో ఉండమని చెప్పండి చాలు. కంప్లయింట్లు అవీ వద్దు'' అని భాగ్యమ్మ చెప్పినట్లు శశిరేఖ తెలిపారు.
ఆ తర్వాత పొదిలి పోలీసులు వచ్చి ఆమెతో మాట్లాడి అవగాహన కల్పించిన తర్వాతే ఫిర్యాదు ఇచ్చినట్లు పొదిలి సీఐ వెంకటేశ్వర్లు చెప్పారు.
నిందితుడు బాలాజీ పరారీలో ఉన్నాడని, అతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు పెట్టామని సీఐ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














