‘తాత్కాలికంగా ఆయుధాలు వదిలేస్తాం-శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నాం’... మావోయిస్టు కేంద్ర కమిటీ పత్రికా ప్రకటన

మావోయిస్టులు

ఫొటో సోర్స్, AFP

కేంద్ర ప్రభుత్వంతో శాంతి చర్చలకు సిద్ధమని, ఇందుకోసం తాత్కాలికంగా ఆయుధాలను పక్కనబెడతామని పేర్కొంటూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ తరఫున అభయ్ పేరుతో మీడియాకు ఒక లేఖ విడుదలైంది.

మావోయిస్టు పార్టీ వైఖరిని మార్చుకుందని, మారిన వైఖరిని ఈ పత్రికా ప్రకటన ద్వారా భారత ప్రధాన మంత్రి, హోం మంత్రి, మావోయిస్టు ఉద్యమంతో ప్రభావితమైన రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రులు, పాలక, ప్రతిపక్ష పార్టీలన్నింటిలో శాంతి చర్చలకు అనుకూలంగా ఉన్న నాయకులు, శాంతి చర్చల కమిటీ సభ్యులు, జర్నలిస్టుల ముందుంచుతున్నామని మావోయిస్టు పార్టీ ఈ ప్రకటనలో తెలిపింది.

ఈ లేఖపై ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్‌శర్మ‌ స్పందించినట్లు ‘ద హిందూ’ పత్రిక రిపోర్ట్ చేసింది.

లేఖలో కొన్ని కొత్త విషయాలున్నాయని, కేంద్ర కమిటీకి చెందిన అభయ్ ఫోటోతో సహా విడుదలైన ఈ లేఖలోని అంశాలను, దాని ప్రామాణికతను పరిశీలిస్తున్నామని ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ, కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు ‘ద టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక రాసింది.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఇంకా ఆ లేఖలో ఏముందంటే...

''మార్చి 2025 చివరి వారం నుంచి మావోయిస్టు పార్టీ ప్రభుత్వంతో శాంతి చర్చలు జరపడానికి తీవ్రంగా నిజాయితీగా ప్రయత్నాలు చేస్తోంది. మా పార్టీ కేంద్ర కమిటీ ప్రతినిధి కామ్రేడ్ అభయ్ పేరుతో మే 10న, మా పార్టీ గౌరవనీయ ప్రధాన కార్యదర్శి ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. మా పార్టీ ఆయుధాలను అప్పగించడాన్ని ఆ ప్రకటనలో ప్రస్తావించారు. ఈ కీలకమైన అంశంపై పార్టీ అత్యున్నత నాయకత్వంతో సంప్రదించడానికి ఒక నెల సమయం కావాలని ప్రభుత్వానికి కాల్పుల విరమణను ప్రతిపాదించారు. దురదృష్టవశాత్తూ, కేంద్ర ప్రభుత్వం ఈ విషయంపై సానుకూల వైఖరిని వ్యక్తం చేయలేదు. బదులుగా, జనవరి 2024 నుంచి కొనసాగుతున్న ముట్టడి, నిర్మూలన, సైనిక దాడులను తీవ్రతరం చేసింది.

వేలాది మంది సాయుధ పోలీసు దళాలను మోహరించి జరిపిన దాడుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ బసవరాజు, మరో 28 మంది కేంద్ర కమిటీ సిబ్బంది, వారి భద్రతా సిబ్బంది, మే 21న మాడ్‌లోని గుండెకోట్ సమీపంలో జరిగిన భీకర దాడిని ధైర్యంగా ప్రతిఘటిస్తూ అమరులయ్యారు.

మావోయిస్టు పార్టీ గౌరవనీయ ప్రధాన కార్యదర్శి చొరవతో ప్రారంభించిన శాంతి చర్చలను మరింత ముందుకు తీసుకెళ్లడానికి, మారిన ప్రపంచ, జాతీయ పరిస్థితుల దృష్ట్యా, ప్రధానమంత్రి, హోంమంత్రి, సీనియర్ పోలీసు అధికారులు ఆయుధాలు విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని పదేపదే చేసిన అభ్యర్థనల దృష్ట్యా, ఆయుధాలు విడిచిపెట్టి సాయుధ పోరాటాన్ని తాత్కాలికంగా విరమించాలని నిర్ణయించుకున్నామని స్పష్టం చేస్తున్నాం. భవిష్యత్తులో, సంఘర్షణలో పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలతో సాధ్యమైనంతవరకు ప్రజా సమస్యలపై భుజం భుజం కలిపి పోరాడతాం.

ఈ అంశంపై కేంద్ర హోం మంత్రితో, ఆయన నియమించిన వారితో లేదా ప్రతినిధి బృందంతో చర్చలు జరపడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే మారిన అభిప్రాయాలను పార్టీకి తెలియజేయాలి. ఇది మా బాధ్యత. తరువాత, దీనితో ఏకీభవించే వారితో, దీనిని వ్యతిరేకించే వారితో సహా పార్టీ లోపల ఒక ప్రతినిధి బృందాన్ని ఏర్పాటు చేసి శాంతి చర్చలలో పాల్గొంటాం'' అని అభయ్ పేరుతో విడుదలైన ఈ ప్రకటనలో మావోయిస్టులు పేర్కొన్నారు.

మావోయిస్టు పార్టీ
ఫొటో క్యాప్షన్, తాత్కాలికంగా ఆయుధాలు విడిచిపెడతామని మావోయిస్టులు ప్రకటించారు.

ప్రభుత్వానికి మావోయిస్టులు ఇంకా ఏం విజ్ఞప్తి చేశారంటే...

‘‘ప్రస్తుతం, మేము సంప్రదించిన పరిమిత కేడర్, కొంతమంది నాయకత్వ సహచరులు మారిన విధానాన్ని పూర్తిగా అంగీకరిస్తున్నారు. అందువల్ల, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పనిచేస్తున్న మా సహోద్యోగులతో జైలు శిక్ష అనుభవిస్తున్న వారితో సంప్రదించడానికి మాకు ఒక నెల సమయం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాం. ఈ అంశంపై ప్రభుత్వంతో వీడియో కాల్స్ ద్వారా అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. వెంటనే ఒక నెల పాటు అధికారిక కాల్పుల విరమణ ప్రకటించాలని కోరుతున్నాం. సెర్చ్ ఆపరేషన్ నిలిపివేసి, రక్తంతో తడిసిన అడవులను శాంతియుత అడవులుగా మార్చడం ద్వారా శాంతి ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడం మీ అనుకూల వైఖరిపై ఆధారపడి ఉంటుంది.

మారిన పరిస్థితుల్లో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఈ-మెయిల్, ఫేస్‌బుక్ ఐడీల్లో మీ అభిప్రాయాలను పంచుకోండి'' అని లేఖలో మావోయిస్టులు తెలిపారు.

మావోయిస్టు పార్టీ

ఫొటో సోర్స్, Nambala Ramprasad

ఫొటో క్యాప్షన్, సీనియర్ నేత నంబాల కేశవరావు సహా పలువురు సీనియర్ నాయకులు ఇటీవలి ఎన్‌‌కౌంగటర్లలో చనిపోయారు.

ప్రభుత్వ స్పందన ఏంటి?

మావోయిస్టుల పత్రికా ప్రకటనపై ఛత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ స్పందించారు. లేఖలోని అంశాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. లేఖలో కొన్ని కొత్త విషయాలున్నాయని విజయ్ శర్మ విలేఖరులతో చెప్పినట్టు 'ద హిందూ' పత్రిక రాసింది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతం బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ సుందర్ రాజ్ ఈ ప్రకటనపై బీబీసీతో మాట్లాడారు.

''సీపీఐ(మావోయిస్టు)కేంద్ర కమిటీ తరఫున విడుదలైన ప్రకటన మేం చూశాం. ఆయుధాలు విడిచిపెట్టి, శాంతి చర్చల గురించి ప్రస్తావించారు. ఈ లేఖ ప్రామాణికతను పరిశీలిస్తున్నాం. పరిస్థితులన్నీ సరిగ్గా పరిశీలించిన తర్వాతే మావోయిస్టులతో శాంతి చర్చలపై కేంద్ర ప్రభుత్వం సరైన నిర్ణయం తీసకుంటుందని స్పష్టం చేస్తున్నాం'' అని సుందర్ రాజ్ చెప్పారు.

మావోయిస్టు పార్టీ

ఫొటో సోర్స్, UGC

ఇప్పటివరకూ ఏం జరిగింది?

మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ఒకప్పుడు 42 మంది సభ్యులుండేవారు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం ఇప్పుడు 13 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దేశం నుంచి మావోయిస్ట్‌లను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది.

మావోయిస్టులు లేఖలో చెప్పినట్టు జనవరి 2024 నుంచి మావోయిస్టులపై కేంద్రం తీవ్రస్థాయిలో దాడులు చేస్తోంది. అయితే ఈ ఏడాది ప్రారంభం నుచి మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అగ్రనేతలు వరుస ఎన్‌కౌంటర్లలో చనిపోయారు.

ఈయేడాది మేలో ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్‌లో, దేశంలో మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు 26 మంది మావోయిస్టులు చనిపోయారు.

ఆ తర్వాత కూడా అనేకమంది కీలక నేతలు ఎన్‌కౌంటర్లలో హతులయ్యారు.

అంతకుముందు నుంచీ మావోయిస్టులు వరుసగా శాంతి చర్చల ప్రతిపాదనలు చేస్తూ వచ్చారు. కానీ కేంద్రం దీనిపై స్పందించలేదు.

మార్చి 28, 2025 తేదీతో మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. మరోసారి ఏప్రిల్ 24న ఇంకో లేఖ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరుతో విడుదలైంది. కానీ కేంద్రం తరఫున దీనిపై ఎవరూ మాట్లాడలేదు.

ఇప్పుడు మరోమారు శాంతి చర్చల కోసం ప్రతిపాదించడమేగాకుండా, తాత్కాలికంగా అయినా సరే ఆయుధాలు వదిలి పెట్టేందుకు సిద్ధమని ప్రకటించింది.

మావోయిస్టు పార్టీ

ఫొటో సోర్స్, DEVENDRA SHUKLA

ఫొటో క్యాప్షన్, చత్తీస్‌గఢ్ అడవుల్లో భద్రతాసిబ్బంది

మావోయిస్టుల మీద ఒత్తిడి పెరిగిందా?

ఈ పత్రికా ప్రకటన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజు మరణించిన నాలుగు నెలల తర్వాత వచ్చింది

ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా దళాల ఆపరేషన్లు తీవ్రతరం కావడంతో బలహీనపడుతున్న మావోయిస్టులు రక్షణాత్మక వ్యూహాలను అవలంబిస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోయారు. కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. ఈ పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ అత్యంత క్లిష్టదశను ఎదుర్కొంటోందని భావిస్తున్నారు.

"కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోయిన తర్వాత, ఛత్తీస్‌గఢ్‌లో చురుగ్గా ఉన్న మావోయిస్టుల కేంద్ర కమిటీలో కొద్దిమంది సభ్యులు మాత్రమే మిగిలి ఉన్నారు'' అని చత్తీస్‌గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ కూడా చెప్పారు.

2025 మే నెలలో, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో 27 మంది మావోయిస్టులను హతమార్చినట్టు భద్రతా దళాలు ప్రకటించాయి. బస్తర్ డివిజన్‌లోని నారాయణపూర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దులో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులు మరణించారని పోలీసులు తెలిపారు.

ఆ సమయంలో, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎక్స్ లో ఓ పోస్ట్ చేశారు. "నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక చారిత్రాత్మక విజయం. ఈరోజు, ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో, భద్రతా దళాలు 27 మంది భయంకరమైన మావోయిస్టులను హతమార్చాయి. వీరిలో సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఉన్నారు" అని అమిత్ షా పోస్టు చేశారు.

మావోయిస్టు పార్టీ
ఫొటో క్యాప్షన్, మావోయిస్టు శిక్షణాశిబిరం(ఫైల్ ఫోటో)

గణాంకాలు ఏం చెబుతున్నాయి?

2020 నుంచి 2023 వరకు నాలుగు సంవత్సరాలలో ఛత్తీస్‌గఢ్‌లో 141 మంది మావోయిస్టులు చనిపోయారని గణాంకాలు చెబుతున్నాయి.

డిసెంబర్ 2023లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, రాష్ట్ర హోం మంత్రి విజయ్ శర్మ మావోయిస్టులతో శాంతి చర్చలకు ప్రతిపాదన చేశారు.

ఆయన తన ప్రసంగాలలో చాలా వరకుశాంతి చర్చల గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మరోవైపు భద్రతా దళాల కార్యక్రమాలు ముమ్మరమయ్యాయి.

"2024లో 287 మంది నక్సలైట్లు చనిపోయారు. వెయ్యి మంది అరెస్టయ్యారు. 837 మంది లొంగిపోయారు" అని డిసెంబర్ 2024లో అమిత్ షా చెప్పారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చత్తీస్‌గఢ్ పోలీసులు సాధించిన విజయాలను ప్రశంసిస్తూ అమిత్ షా ఈ విషయం చెప్పారు.

2025లో కూడా, ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు తీవ్రమయ్యాయి.

ఈ సమయంలో, వివిధ ప్రజా సంస్థలకు చెందిన వారిని పెద్ద సంఖ్యలో అరెస్టు చేశారు.

అమాయక గిరిజనులను హింసిస్తున్నారని రిపోర్టులు వెలువడ్డాయి. ఎన్‌కౌంటర్‌ల గురించి అనేక ప్రశ్నలు వినిపించాయి. కానీ ప్రభుత్వం తన కార్యకలాపాలు కొనసాగించింది.

ప్రభుత్వలెక్కల ప్రకారం, దేశవ్యాప్తంగా మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య ఏప్రిల్ 2018లో 126 నుంచి 90కి తగ్గింది, జూలై 2021లో ఆ జిల్లాల సంఖ్య 70కి తగ్గింది. 2024 ఏప్రిల్ లెక్కల ప్రకారం, మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 38గా ఉంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)