పోతుల సుజాత లొంగుబాటు, మోడెం బాలకృష్ణ మృతితో మావోయిస్ట్ పార్టీ మరింత కష్టాల్లో పడిందా?

ఫొటో సోర్స్, ALOK PUTUL/BBC
- రచయిత, అలోక్ పుతుల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సీపీఐ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ ఎన్‌కౌంటర్‌లో చనిపోయారు. కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగిపోయారు. రెండు రోజుల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలు మావోయిస్టు పార్టీ అత్యంత కష్టమైన దశను ఎదుర్కొంటోందన్న భావన కల్పిస్తున్నాయి.
మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీలో ఒకప్పుడు 42 మంది సభ్యులుండేవారు. ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం ఇప్పుడు 13 మంది మాత్రమే మిగిలి ఉన్నారు.
''కేంద్ర కమిటీ సభ్యురాలు సుజాత లొంగుబాటు తర్వాత ఛత్తీస్‌గఢ్‌లో యాక్టివ్‌గా ఉన్న సెంట్రల్ కమిటీ సభ్యుల్లో కొందరే మిగిలి ఉన్నారు.
మొత్తంగా మావోయిస్టు పార్టీ ముగింపు దిశగా సాగుతోంది'' అని ఛత్తీస్‌గఢ్ హోం మంత్రి విజయ్ శర్మ అన్నారు.
దేశం నుంచి మావోయిస్ట్‌లను పూర్తిగా నిర్మూలించడానికి 2026 మార్చి 31ని కేంద్ర ప్రభుత్వం డెడ్‌లైన్‌గా పెట్టుకుంది. అందుకే గత 20 నెలలుగా భద్రతాబలగాలు మావోయిస్టులకు వ్యతిరేకంగా తీవ్ర చర్యలు తీసుకుంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత గత 25 ఏళ్లలో మావోయిస్టులకు వ్యతిరేకంగా భద్రతా బలగాలు చేపట్టిన అతిపెద్ద ఆపరేషన్ ఇది. ఈ ఆపరేషన్‌లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు చనిపోయారు. అరెస్ట్ అయ్యారు. అనేకమంది మావోయిస్టులు లొంగిపోయారు.
కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ ఎన్‌కౌంటర్ గురించి చర్చ జరుగుతుండగానే మరో కేంద్రకమిటీ సభ్యురాలు సుజాత తెలంగాణలో లొంగిపోయారన్న వార్త శనివారం వచ్చింది.


ఫొటో సోర్స్, CG KHABAR
42 మంది సభ్యుల సెంట్రల్ కమిటీలో ఇప్పుడు మిగిలింది 13మందే
2004లో పీపుల్స్‌వార్ గ్రూప్, ఎంసీసీ కలిసి సీపీఐ(మావోయిస్ట్)గా ఏర్పడినప్పుడు సంస్థ కేంద్ర కమిటీలో 42మంది సభ్యులుండేవారు.
ప్రభుత్వ డాక్యుమెంట్ల ప్రకారం ఇప్పుడు కేంద్రకమిటీలో 13మంది మాత్రమే మిగిలి ఉన్నారు.
ఈ ఒక్క సంవత్సరంలోనే కేంద్ర కమిటీ సభ్యులు ఆరుగురు పోలీస్ కాల్పుల్లో చనిపోయారు.
రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి జనవరిలో, పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న మేలో, పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు మేలో, సుధాకర్, గాజర్ల రవి అలియాస్ ఉదయ్ జూన్‌లో పోలీస్ కాల్పుల్లో మరణించారు.
మోడెం బాలకృష్ణ మృతితో ఈ ఏడాది చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరింది. సెంట్రల్ కమిటీలో ఇప్పుడు మిగిలిఉన్న 13మందిలో 8 మంది ఆంధ్రప్రదేశ్-తెలంగాణకు చెందినవారు. వారిలో ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, పసునూరి నరహరి అలియాస్ విశ్వనాథ్, కడారి సత్యనారాయణరెడ్డి అలియాస్ కోసా, మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పాక హనుమంతు అలియాస్ గణేశ్, కట్టా రామచంద్ర అలియాస్ రాజుదాదా ఉన్నారు.
కేంద్ర కమిటీలో ఝార్ఖండ్‌కు చెందిన మిసిర్ బెస్రా అలియాస్ సునీల్, అనల్ దా అలియాస్ పథిరామ్ మాంఝి, సహదేవ్ అలియాస్ అనుజ్ శామిల్ ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన మజ్జీదేవ్ అలియాస్ రామ్‌ధీర్, మాడ్వీ హిడ్మా ఉన్నారు.
''బస్తర్‌లో మావోయిస్టు పార్టీ చివరి దశలో ఉంది. సుజాత లొంగుబాటు దీనికి ఉదాహరణ. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఝార్ఖండ్‌లో పేరుకే సంస్థ ఉంది. మోడెం బాలకృష్ణ మృతితో ఒడిశాలో కూడా ఇదే పరిస్థితి'' అని ఓ పోలీసు అధికారి బీబీసీతో చెప్పారు.

ఫొటో సోర్స్, ALOK PUTUL
ఒడిశా ఇన్‌చార్జ్‌గా ఉన్న మోడెం బాలకృష్ణ
కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణను ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌లో చంపేయడం పెద్ద విజయంగా పోలీసులు భావిస్తున్నారు.
మోడెం బాలకృష్ణ మరణంతో ఒడిశాలోని కంధమాల్-కలహండి-బౌద్ధ్-నయాగఢ్ మావోయిస్టుల కమిటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని భావిస్తున్నారు.
వరంగల్ జిల్లాలోని మడికొండకు చెందిన మోడెం బాలకృష్ణకు దాదాపు 60ఏళ్ల వయసుంటుంది. ఆయనకు బాలన్న, మనోజ్, భాస్కర్, రామచంద్ర సహా అనేక మారుపేర్లున్నాయి.
1983లో బాలకృష్ణ మావోయిస్టు పార్టీలో చేరారు. 1987లో మహబూబ్‌నగర్‌లో అరెస్టయ్యారు.
టీడీపీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావును 1990లో పీపుల్స్‌వార్ గ్రూప్ కిడ్నాప్ చేశారు. మండవను విడిచిపెట్టాలంటే జైల్లో ఉన్న తమ కామ్రేడ్‌లను విడుదల చేయాలని షరతు విధించారు.
మండవ వెంకటేశ్వరరావు కోసం జైలు నుంచి విడిచిపెట్టిన నక్సలైట్లలో బాలకృష్ణ ఒకరు.
బాలకృష్ణ నాలుగుదశాబ్దాలకుపైగా మావోయిస్టు పార్టీలో చురుగ్గా ఉన్నారు.
మావోయిస్టు పార్టీ సెంట్రల్ రీజనల్ బ్యూరోలో ముఖ్యమైన సభ్యులు. దీంతో పాటు ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్, అలాగే కంధమాల్- కలహండి- బౌద్ధ్- నయాగఢ్ కేకేబీఎన్ డివిజన్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చాలా కాలం పాటు బాలకృష్ణ నాయకత్వంలో కేకేబీఎన్ డివిజన్ యాక్టివ్‌గా ఉంది.
బాలకృష్ణ తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టు కొన్నేళ్లుగా వార్తలొస్తున్నాయి. భద్రతాబలగాలు ఆయన్ను లక్ష్యంగా చేసుకున్నాయి.
ఈ జనవరిలో భద్రతాబలగాలు బాలకృష్ణ లక్ష్యంగా అనేక కీలక సెర్చ్ ఆపరేషన్‌లు ప్రారంభించారు. ఇప్పుడు పోలీసులు అనుకున్నది సాధించారు.
బాలకృష్ణను చంపడం మావోయిస్టు పార్టీకి పెద్ద ఎదురుదెబ్బని భద్రతా నిపుణులు భావిస్తున్నారు. ఒడిశా-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కేకేబీఎన్ డివిజన్ మావోయిస్టులకు బాగా పట్టున్న ప్రాంతంగా భావిస్తారు. ఇప్పుడు ఆ ప్రాంతానికి నాయకత్వం లేకుండా పోయింది.
సుజాత లొంగుబాటుతో పార్టీలోని మహిళా నేతల్లో చీలిక వచ్చిందని భావిస్తున్నారు.
పోతుల పద్మావతి అలియాస్ సుజాత తెలంగాణ పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో శనివారం(సెప్టెంబరు 13)లొంగిపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
మహిళా మావోయిస్టుల్లో గుర్తింపు పొందిన నాయకురాలు
62ఏళ్ల పోతుల పద్మావతి అలియస్ సుజాత దాదాపు 43ఏళ్లగా అజ్ఞాత జీవితం గడుపుతున్నారు.
ఆమె కేంద్ర కమిటీ సభ్యురాలు. మావోయిస్ట్ జనతా సర్కార్ హెడ్.
ప్రస్తుత తెలంగాణలోని జోగులాంబ గద్వాల్ జిల్లాలోని పెంచికలపాడు గ్రామంలో సుజాత పుట్టారు. ఆమె తండ్రి రైతు, పోస్ట్ మాస్టర్. తల్లి గృహిణి.
ఆమె బాల్యం సాధారణంగానే గడిచినప్పటికీ కాలేజీ రోజుల్లో వామపక్ష సిద్ధాంతంతో ప్రభావితమయ్యారు. 1982లో అజ్ఞాతంలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
1988-89లో ఎటపాలి దళం డిప్యూటీ కమాండర్ అయ్యారు. 1996లో దేవురి దళం కమాండర్‌గా పనిచేశారు. 1997 నుంచి 1999 వరకు దక్షిణ బస్తర్ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు.
2001లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో చేరారు. 2007లో జనతా సర్కర్ హెడ్ అయ్యారు. ఇది మావోయిస్టులు నిర్వహించే సమాంతర ప్రభుత్వం.
మావోయిస్టు ఉద్యమంలో కీలక నేత అయిన మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్ కిషన్‌జీని 1984లో ఆమె కలిశారు. వారిద్దరూ పెళ్లిచేసుకున్నారు.
పశ్చిమబెంగాల్‌లోని జంగల్‌మహల్‌లో 2011లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కిషన్‌జీ చనిపోయారు.
భర్త మరణం, అజ్ఞాత జీవితం, కూతురు గురించి ఆందోళన ప్రభావం సుజాతపై పడింది. వ్యాధులు, వయసు మీదపడడంతో ఆమెను ఒంటరితనం ఆవరించింది.
లొంగిపోవడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ పార్టీకి ఈ వేసవిలో ఆమె లేఖ రాశారు. శనివారం పోలీసుల ముందు లొంగిపోయారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














