నేపాల్ 'జెన్ జడ్' నిరసనల్లో పాల్గొన్న కొందరు యువకులు ఇప్పుడెందుకు చింతిస్తున్నారు: బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

నేపాల్ యువత
ఫొటో క్యాప్షన్, బయటి శక్తులు తమ ఆందోళనను హైజాక్ చేశాయని ‘జెన్‌జడ్’ ఆందోళనలో పాల్గొన్న కొంతమంది యువకులు భావిస్తున్నారు.
    • రచయిత, రజనీష్ కుమార్
    • హోదా, బీబీసీ కరస్పాండెంట్, కాఠ్‌మాండూ

నేపాల్ రాజధాని కాఠ్‌మాండూలోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగిన వెంటనే నా కళ్లకు కనిపించిన మొదటి దృశ్యం వర్షం.

విమానాశ్రయాన్ని రక్షించే అదనపు బాధ్యత అప్పగించినట్టుగా మేఘాలు చాలా తక్కువ ఎత్తులో దగ్గరగా కనిపించాయి.

'జెన్ జడ్' ఆందోళనలో నష్టపోని ప్రభుత్వ సంస్థ బహుశా ఈ విమానాశ్రయం ఒకటే కావచ్చు.

విమానాశ్రయం నుంచి బయటకు అడుగుపెట్టగానే అక్కడి వాతావరణం తుఫాను అనంతర ప్రశాంతతలా అనిపించింది.

ఎటు చూసినా నిర్మానుష్యమైన రోడ్లు, మూతపడిన దుకాణాలు, యువ సైనికుల పహారా కనిపించాయి. మధ్యలో సాయుధ సైనిక వాహనాలు రాకపోకలు పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నట్టు సంకేతాలు ఇస్తున్నాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

నగరమంతటా నిరవధిక కర్ఫ్యూ కొనసాగుతోంది. రెండు రోజుల ఆందోళనల తరువాత నేపాల్ ప్రభుత్వం లొంగిపోయింది. నేతలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది.

మంగళవారం రాత్రి 10 గంటల నుంచి నేపాల్ మొత్తం సైన్యం ఆధీనంలో ఉంది.

మేం విమానాశ్రయం నుంచి బయలుదేరిన వాహనాన్ని అనేక చోట్ల సైనిక సిబ్బంది ఆపారు. మేం జర్నలిస్టులమని చెప్పగానే మమ్మల్ని వెళ్లనిచ్చారు.

నా పక్కన కూర్చున్న నేపాల్ స్నేహితుడు 'సైనిక పాలనలో ఉన్న నేపాల్‌కు స్వాగతం' అన్నాడు.

'జెన్ జడ్' ఆందోళనలు మీడియాను కూడా లక్ష్యంగా చేసుకున్నాయి. నేపాల్‌లోని ప్రముఖ వార్తాపత్రిక కాంతిపూర్ కార్యాలయాన్ని తగులబెట్టారు.

'జెన్ జెడ్' నిరసనల వేళ నేపాల్ మాజీ హోం మంత్రి రబీ లామిచానేను ఆయన మద్దతుదారులు జైలు నుంచి తప్పించారు. ఆయనతోపాటు కాఠ్‌మాండూలోని నక్కు జైలులో మిగిలిన ఖైదీలు కూడా పారిపోయారు.

నేపాల్‌లోని చాలా జైళ్ల నుంచి ఖైదీలు తప్పించుకున్నారు.

కాఠ్‌మాండూలోని బనేశ్వర్ ప్రాంతంలోని నేపాల్ పార్లమెంట్ నుంచి ఇప్పటికీ కాలుతున్న వాసన వస్తోంది.

నేపాల్‌లో అంతరించిపోయిన 239 ఏళ్ల రాచరిక వ్యవస్థకు గత 17ఏళ్ల నుంచి చిహ్నంగా ఉన్న ఈ పార్లమెంట్ ఇప్పుడు పొగజిమ్ముతోంది.

నేపాల్ ప్రజలు 2008లో రాచరికాన్ని రద్దు చేసినప్పుడు కూడా రాయల్ ప్యాలెస్ నారాయణహితికి నిప్పు పెట్టలేదు.

నారాయణహితిని మ్యూజియంగా మార్చారు. దాని ప్రాంగణంలో ఓ రిపబ్లిక్ మెమోరియల్ నిర్మించారు.

కానీ అదే నేపాలీలు 17 ఏళ్ల పార్లమెంటును తగులబెట్టారు. పార్లమెంటు గోడలపై దేవనాగరి లిపిలో కేపీ ఓలి, ప్రచండలను దూషిస్తూ రాసిన రాతలు కనిపించాయి. నేనీ గోడలపై రాతలను చూస్తున్నప్పుడు అక్కడి వ్యక్తి ఒకరు ''రాజుపైన కూడా ఇంతటి వ్యతిరేకత లేదు'' అన్నారు.

నేపాల్ పార్లమెంట్
ఫొటో క్యాప్షన్, నేపాల్ పార్లమెంట్‌కు కూడా నిప్ఫు పెట్టారు

భారత మీడియాపై ఆగ్రహం

దాదాపు 48 ఏళ్ల దీపక్ ఆచార్య తన కొడుకుతో దగ్ధమైన పార్లమెంట్ బయట నిలబడి ఉన్నారు . మేం కొంతమంది మహిళలతో మేం మాట్లాడటానికి ప్రయత్నిస్తున్నాం. కానీ వారు హిందీ వినగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పుడు దీపక్ ''దయచేసి ఆపేయండి. భారత మీడియా కూడా మోదీ ప్రచారంలో భాగం'' అన్నారు.

దీపక్ ఆ మాట ఎంత బిగ్గరగా అన్నారంటే, చుట్టుపక్కల వాళ్ళు కూడా మా వైపు చూడటం మొదలుపెట్టారు. దీపక్ కోపాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అతనితో చాలా సేపు మాట్లాడాను.

''భారత మీడియా మా ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తోంది. ప్రధానిగా ఎవరుండాలో నేపాలీ ప్రజలే నిర్ణయించుకుంటారు. కానీ సుశీలా కర్కి ప్రధాని అవుతారని భారత మీడియా చెబుతోంది. నేపాల్‌లో కూడా మోదీ పాలనే ఉన్నట్టుగా భారతీయ మీడియా వ్యవహరిస్తోంది''

''భారత ప్రభుత్వం కానీ, అక్కడి మీడియాగానీ నేపాల్‌ను సార్వభౌమ స్వతంత్ర దేశంగా చూడరు ఇక్కడ భారత మీడియా రిపోర్టర్లందరి నేపథ్యాన్ని పరిశీలిస్తే, వారందరూ ఆర్‌ఎస్‌ఎస్ లేదంటే బీజేపీతో సాంగత్యం ఉన్నవారే''

ఇది కేవలం దీపక్ ఆచార్య గురించే కాదు. నేపాల్‌లో భారత మీడియాపై కోపం చాలా సాధారణం.

విదేశీ కుట్రల గురించి కూడా ఇక్కడి ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు. వీటిల్లో అమెరికా పేరు కూడా వినిపిస్తుంటుంది.

కాఠ్‌మాండూలో కర్ఫ్యూ
ఫొటో క్యాప్షన్, కాఠ్‌మాండూలో కర్ఫ్యూ విధించారు. తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుపై ఏకాభిప్రాయం ఇంకా కుదరలేదు.

‘తప్పు చేశామని బాధగా ఉంది’

మేం పార్లమెంట్ బయట నిలబడి ఉండగా, ఇద్దరు యువకులు స్కూటర్‌పై వచ్చి అక్కడ నిలబడి ఉన్న సైనికులకు వాటర్ బాటిళ్లు, బిస్కెట్లు పంచడం ప్రారంభించారు. ఒకరు తనను తాను కిషన్ రౌనియార్ అని, మరొకరు సోమన్ తమంగ్ అని పరిచయం చేసుకున్నారు.

సైనికులకు నీళ్ళు, బిస్కెట్లు ఎందుకు ఇస్తున్నారని అడిగినప్పుడు, "వారు దేశానికి సేవ చేస్తున్నారు. మా దగ్గర ఎక్కువ డబ్బు లేదు. కానీ మేం ఈ పని చేయాలని నిర్ణయించుకున్నాం. మేంఒక సెలూన్ నడుపుతున్నాం'' అని కిషన్ చెప్పారు.

ఇప్పుడు చాలామంది 'జెన్ జడ్' ఆందోళనాకారులు భవనాలను తగులబెట్టడం తప్పని పశ్చాత్తాప పడుతున్నారు.

కిషన్ రౌనియార్ ఒక మాదేశీ హిందువు. తమంగ్ ఒక పహాడి బౌద్ధుడు . ఇద్దరూ నిరసనలలో పాల్గొన్నారు. చాలా విధ్వంసం జరిగిందని కిషన్ ఇప్పుడు చింతిస్తున్నారు.

"ప్రతి ప్రభుత్వ భవనాన్ని తగలబెట్టారు. మేం ఇప్పుడు బాధగా ఉన్నాం. తదుపరి ఏర్పడే ప్రభుత్వం అవినీతి రహితంగా ఉంటుందో లేదో కూడా మాకు కచ్చితంగా తెలియదు" అని కిషన్ అన్నారు.

కాఠ్‌మాండూ

'జెన్ జడ్' నిరసనలో పాల్గొన్న చాలా మంది భవనాలను ధ్వంసం చేయడం సరికాదని ఇప్పుడు భావిస్తున్నారు.

సోమవారం నాడు 19 మంది యువకుల హత్య తర్వాత ఏర్పడిన ప్రభుత్వ వ్యతిరేకత, మంగళవారం నాటి సంఘటన తర్వాత కాస్త బలహీనపడుతున్నట్లు కనిపిస్తోంది. అయితే, నేపాల్ నాయకులందరూ ఇప్పటికీ గృహ నిర్బంధంలోనే ఉన్నారు.

సాయంత్రం మూడు కావస్తోంది, కర్ఫ్యూను కొద్దిగా సడలించారు. ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వస్తున్నారు. మేం కాఠ్‌మాండూలోని బాబర్‌మహల్ ప్రాంతంలో రహదారుల భవనం ముందు నిలబడి ఉన్నాం.

ఇది చాలా గొప్ప భవనం, కానీ ఇప్పుడు దాని కిటికీల నుంచి వస్తున్న పొగ ఊపిరి సలపనివ్వడం లేదు.

నేపాల్ జిల్లా కార్యాలయం
ఫొటో క్యాప్షన్, నేపాల్‌లోని జిల్లా కార్యాలయం

నేపాల్ భవితవ్యం ఏమిటి?

ముగ్గురు 'జన్ జెడ్' నిరసనకారులు నిరంజన్ కున్వర్, విష్ణు శర్మ సుభాష్ శర్మ విచారంగా కూర్చున్నారు. ముగ్గురూ గ్రాడ్యుయేషన్ విద్యార్థులే. ఆందోళనలలో నిరంజన్ కున్వర్ కూడా గాయపడ్డాడు.

"ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టింది మేం కాదు. అది ఇతరుల పని. చాలా విధ్వంసం జరిగింది. నిజం చెప్పాలంటే, ఇప్పుడు మేం చింతిస్తున్నాం. ఈ భవనాలను నిర్మించడానికి నేపాల్‌కు చాలా సమయం పట్టింది. అందుకే మేం చాలా బాధపడుతున్నాం" అన్నారు నిరంజన్.

''ఇతరులు ఎవరు'' అని మేం అడిగినప్పుడు వారు రబి లామ్చానే, ఆర్‌పీపీ మద్దతుదారులని నీరజ్, విష్ణు చెప్పారు.

రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పీపీ) రాచరిక అనుకూల పార్టీ గా ముద్రపడింది.

నేపాల్‌ను హిందూదేశంగా మార్చాలని ఈ పార్టీ డిమాండ్ చేస్తుంటుంది.

''మీకు రాచరిక నేపాల్ కావాలా, ప్రజాస్వామ్య నేపాల్ కావాలా?'' ''లౌకిక నేపాల్, హిందూ దేశం కావాలా'' అని నిరంజన్, విష్ణులను అడిగితే

ఇద్దరూ ''రాచరికం, హిందూదేశం'' అని చెప్పారు. అయితే, అక్కడే ఉన్న సుభాష్ శర్మ ప్రజాస్వామ్య నేపాల్‌కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు.

ఈ 'జెన్ జడ్' నిరసనలో యువతకు మంచి చెడులమార్గనిర్దేశం చేయగల సర్వామోద నాయకుడంటూ ఎవరూ లేకపోవడంతో ప్రతి ఒక్కరూ తమకు నచ్చింది చేశారు.

నేపాల్ యువత
ఫొటో క్యాప్షన్, విష్ణు శర్మ డిగ్రీ చదివారు. ‘జన్‌జడ్’ ఆందోళనలలో పాల్గొన్నారు.

గందరగోళంలో యువత

మీరు యువతతో మాట్లాడితే, వారు పూర్తిగా గందరగోళంగా ఉన్నట్లు కనిపిస్తుంది.

నేపాల్‌లో తదుపరి ప్రభుత్వం ఎలా ఏర్పుడుతుందనే విషయం ఇప్పటికీ అస్పష్టంగానే ఉంది. నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి పేరు తెరపైకి వస్తోంది కానీ, యువతలో దీనిపై ఏకాభిప్రాయం లేదు.

గురువారం 'జన్ జడ్' లోని ఓ వర్గం సుశీలా కర్కి పేరుకు వ్యతిరేకంగా ఆర్మీ ప్రధాన కార్యాలయం బయట నిరసన వ్యక్తం చేసింది.

'జెన్ జడ్' ప్రజలు కాఠ్‌మాండూ మేయర్ బాలెన్ షాను ముందుకు రావాలని అడుగుతున్నారు. కానీ వారి డిమాండ్ ఏమిటంటే ముందుగా పార్లమెంటును రద్దు చేయాలి. కానీ పార్లమెంటును ఎందుకు రద్దు చేయాలి,ఎలా చేయాలనే సమాధానం రాజ్యాంగంలో లేదు.

రాచరిక పాలనలో 239 ఏళ్లు జీవించిన నేపాల్ ప్రజలు గత 17 ఏళ్లుగా ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తున్నారు. కానీ దానిని ఎలా ముందుకు తీసుకెళ్తారనే ప్రశ్నకు పూర్తి సమాధానం లేదు. నేపాల్ ఒక భూపరివేష్టిత దేశం. కానీ ఇప్పుడు దాని ప్రజాస్వామ్యాన్ని నలుమూలల నుంచి సంక్షోభం చుట్టుమట్టింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)