నేపాల్ కల్లోలం వెనక బాహ్య శక్తుల ప్రమేయం ఉందా? సైన్యం పాత్రపైనా ప్రశ్నలు

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నేపాల్‌లో ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడి 17 సంవత్సరాలైంది, ఇప్పటికి 12 ప్రభుత్వాలు మారాయి.
ప్రజాస్వామ్యానికి 17 ఏళ్లు పెద్ద సమయం కాదు.
అంతకుముందు, నేపాల్ ప్రజలు 239 ఏళ్ల పాటు రాచరిక వ్యవస్థ కింద ఉన్నారు. దీంతో, అక్కడి ప్రజాస్వామ్యాన్ని తరచుగా రాచరిక వ్యవస్థతో పోలుస్తారు.
గత రెండు రోజుల్లో చోటుచేసుకున్న ఘటనలు నేపాల్‌లో ప్రజాస్వామ్య భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

కేవలం రెండు రోజుల నిరసనలతో కె.పి. ఓలి ప్రధాని పదవికి రాజీనామా చేయడమే కాకుండా, ప్రధాని నుంచి ఇతర మంత్రుల వరకు ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోవలసి వచ్చింది. ఇక, విదేశాంగ మంత్రి అర్జు దేవుబాపై దాడి జరిగింది.
వీటికి ముందు, నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియాపై బ్యాన్ విధించింది. ఈ నిషేధం నేపాల్‌లోని సామాన్య ప్రజలలో ప్రభుత్వంపై చాలాకాలంగా ఉన్న ఆగ్రహజ్వాలను రగిల్చింది. సోమవారం నేపాల్ యువత వీధుల్లోకి వచ్చినప్పుడు, దానిని 'జెన్ జడ్' (Gen Z) ఉద్యమం'గా అభివర్ణించారు.
మొదటిరోజు డజనుకు పైగా యువ నిరసనకారులు మరణించారు. రెండో రోజు యువత నుంచి తీవ్ర ప్రతిచర్యను ఊహించారు కానీ, హింస ఇంత తీవ్రంగా ఉంటుందని ఎవరూ అనుకోలేదు. నిరసనకారులు పార్లమెంటు, సింగ్ దర్బార్, రాష్ట్రపతి భవన్, సుప్రీంకోర్టు, ప్రధాన మంత్రి నివాసానికి కూడా నిప్పుపెట్టారు. ఇదంతా సైన్యం వీధుల్లో ఉండగానే జరిగింది.

ఫొటో సోర్స్, Reuters
నేపాల్ ఎటు వెళుతోంది?
"గత రెండు రోజుల్లో నేపాల్ ఎదుర్కొన్న నష్టాన్ని భర్తీ చేయడానికి సంవత్సరాలు పడుతుంది. ఏమీ మిగల్లేదు. నేపాల్ ఏదైనా సంస్థను నిర్మించాలన్నా ఏళ్లు పడుతుంది" అని నేపాల్‌లోని సర్లాహి ఎంపీ అమ్రేష్ సింగ్ బీబీసీతో చెప్పారు.
"నేపాల్‌లో పార్లమెంట్, సింగ్ దర్బార్, రాష్ట్రపతి భవన్ భద్రతకు సైన్యం బాధ్యత వహిస్తుంది. కానీ, అక్కడ కూడా నిరసనకారులు నిప్పంటించారు. సైన్యం భద్రత ఇస్తుందని ఆశిస్తున్నాం. సోమవారం యువకులను చంపిన విధానం క్రూరమైనది. సైన్యం అప్రమత్తంగా ఉండాల్సింది" అని ఆయన అన్నారు.
నేపాల్ ఇప్పుడు ఏ దిశలో పయనిస్తోంది? అనే ప్రశ్నకు అమ్రేష్ సింగ్ బదులిస్తూ "ఏమీ చెప్పలేం. నేను మాధేశి ఎంపీని. నేపాల్‌లో మాధేశీలు ఎలాగూ అణచివేతకు గురయ్యారు. అంత సులభంగా ఏమీ చెప్పలేం. మాధేశీలు ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొని ఉంటే, ప్రభుత్వం ఎంత కఠినంగా ప్రవర్తించేదో మీరు ఊహించలేరు" అని అన్నారు.

ఫొటో సోర్స్, DEEP KUMAR UPADHYAY
సైన్యం ఎందుకు కాపాడలేకపోయింది?
నేపాల్ సైన్యం మంగళవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
"దేశం కోసం నిరసనలను ఆపి, చర్చల ద్వారా శాంతియుత పరిష్కారానికి ముందుకు రావాలని ఆందోళనకారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ క్లిష్ట పరిస్థితులను మనం సాధారణ స్థితికి తీసుకురావాలి. ప్రైవేట్, ప్రభుత్వ ఆస్తులతో పాటు మన చారిత్రక, జాతీయ వారసత్వాన్ని కాపాడాలి. సామాన్య ప్రజలు, రాయబార కార్యాలయాలకు భద్రత అవసరం" అని తెలిపింది.
దీప్‌కుమార్ ఉపాధ్యాయ్ భారత్‌లో నేపాల్ రాయబారిగా పనిచేశారు. ఆయన ప్రస్తుతం నేపాల్‌లోని కపిల్వాస్తులో నివసిస్తున్నారు. మంగళవారం, కపిల్వాస్తులోని ఆయన ఇంటికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు.
"నేను క్రియాశీల రాజకీయాల్లో కూడా లేను. నా ఆరోగ్యం బాలేదు. జనం ఇంట్లోకి చొరబడి, అంతా దోచుకొని, ఆపై తగలబెట్టారు. దాడి గురించి సమాచారం అందింది, అందుకే ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయాం" అని దీప్‌కుమార్ ఉపాధ్యాయ్ బీబీసీతో అన్నారు.
పార్లమెంట్, రాష్ట్రపతి భవన్, ప్రధాన మంత్రి నివాసం, సింగ్ దర్బార్‌లకు భద్రత కల్పించేది సైన్యం, మరి వాటికి నిప్పు ఎలా పెట్టారని ప్రజలు సైన్యాన్ని నిలదీయవచ్చని దీప్‌కుమార్ ఉపాధ్యాయ్ అన్నారు.
"ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిందా? లేదంటే ఎక్కువమంది చనిపోతారనే భయంతో చర్యలు తీసుకోలేదా? అనేది నాకు తెలియదు. కోపంగా ఉన్న గుంపు ఆవేశం చల్లబడేంత వరకు ఏదైనా చేసుకునేందుకు సైన్యం అనుమతించిందని అనుకుంటున్నా" అని అన్నారు.
రాబోయే రోజుల్లో శాంతిభద్రతలకు సంబంధించిన సవాల్ ఎదురవుతుందని దీప్ కుమార్ ఉపాధ్యాయ్ అభిప్రాయపడ్డారు.
"ప్రజలు బ్యాంకులను దోచుకోవడం ప్రారంభించారు. కానీ, రాత్రి 10 గంటల తర్వాత పూర్తిగా సైన్యం నియంత్రణలోకి వచ్చింది. పరిస్థితులు అదుపులోకి వచ్చాయి. అయితే, ప్రజల మనసులో ఉన్న ప్రశ్న ఏమిటంటే, సైన్యం దీన్ని ముందుగానే చేసి ఉండొచ్చు కదా? ఖైదీలందరూ జైలు నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు శాంతిభద్రతల సవాల్ మరింత పెరిగింది" అని అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
బాహ్య శక్తుల ప్రమేయం ఉందా?
లోక్‌రాజ్ బరాల్ కూడా భారత్‌లో నేపాల్ రాయబారిగా పనిచేశారు. ప్రభుత్వ భవనాలు తగలబెట్టడంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
"సుప్రీంకోర్టు వెనుకే సైన్యం ప్రధాన కార్యాలయం ఉంది. అయినా కూడా, అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా తగలబెట్టారు. ఇదంతా ఎలా జరిగిందని ప్రజలు కచ్చితంగా ప్రశ్నిస్తారు" అని బరాల్ బీబీసీతో అన్నారు.
"ఇదెలా జరిగిందని ఆశ్చర్యపోయాం. ఏం చేశారని పోలీసులను కచ్చితంగా అడుగుతాం. రెండో రోజు నిరసనల్లో పాల్గొన్నది కేవలం 'జెన్ జడ్' (Gen Z) లు మాత్రమే కాదు. జనంపై ద్వేషం ఉన్నవారు కూడా వారితో చేరారు" అని అన్నారు.
"సైన్యం ఉద్దేశపూర్వకంగానే దీన్ని అనుమతించిందా? అనేది నాకు తెలియదు. కానీ, ప్రజల్లో చాలా ప్రశ్నలున్నాయి. ఇందులో బాహ్య శక్తులు కూడా పాల్గొన్నాయని చాలామంది అంటున్నారు. కానీ, ఇలా చెప్పాలంటే మన దగ్గర ఆధారాలు ఉండాలి. సామాన్య ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. నేపాల్ నాయకులు ఓలి, ప్రచండ, దేవుబాలు అధికార పీఠాన్ని పంచుకుంటున్నారని ప్రజలు భావిస్తున్నారు" అని లోక్‌రాజ్ బరాల్ అన్నారు.
ఇప్పటి ప్రభుత్వంపై కోపం ఉంటే, పార్లమెంట్‌ను ఎందుకు తగలబెట్టారు? రాబోయే కొత్త వ్యవస్థకు పార్లమెంట్ అవసరం లేదా? అని నేపాల్‌లోని మరో వర్గం అడుగుతోంది.
దేశంలో సైన్యం పాత్రపై అతిపెద్ద ప్రశ్న ఉందని నేపాల్ థింక్ ట్యాంక్ మార్టిన్ చౌతారిలో సీనియర్ పరిశోధకుడు రమేశ్ పరాజులి అన్నారు.
"సైన్యం అనుకుంటే, పరిస్థితులను నియంత్రించగలిగేది. కానీ, అలా జరగలేదు. కొద్దిరోజుల తర్వాత అన్ని విషయాలు బయటపడతాయని అనుకుంటున్నా. పార్లమెంటుకు నిప్పు పెట్టడం ఏంటి? కాంతిపూర్ వార్తాపత్రిక కార్యాలయాన్ని ఎందుకు తగలబెట్టారు? రవి లామిచానేకు కాంతిపూర్ లక్ష్యంగా ఉందని అందరికీ తెలుసు. దేశంలో జరిగినది నేపాలీలు మాత్రమే చేయలేదు, బాహ్య శక్తులు కూడా పాలుపంచుకున్నాయి" అని రమేశ్ పరాజులి ఆరోపించారు.
ఈ హింసాత్మక ఉద్యమం తర్వాత నేపాల్‌లోని కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనంగా మారుతాయా? ఓలి, ప్రచండ ప్రభావం తగ్గుతుందా? అనే ప్రశ్నలకు రమేశ్ పరాజులి స్పందిస్తూ "నేనలా అనుకోను. వారు ప్రస్తుతం బలహీనంగా కనిపించవచ్చు కానీ, వారు అంతం కారు. నేపాల్‌లో రాచరికాన్ని అంతం చేయడంలో వారు కీలకపాత్ర పోషించారు" అని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














