రాచరికం, ప్రజాస్వామ్యం, తిరుగుబాటు-ఇదీ నేపాల్ చరిత్ర..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, టీమ్ బీబీసీ
18వ శతాబ్ది చివర, 19వ శతాబ్ది ప్రారంభంలో గూర్ఖా ఐడెంటిటీ ఉద్యమం ఎంతగా ప్రభావం చూపిందంటే, అది అన్ని ఇతర ఐడెంటిటీ ఉద్యమాలను, ప్రాంతాలను ఏకం చేసి హిమాలయాల ఒడిలో నేపాలీ దేశానికి పునాది వేసింది.
భారత్, చైనావంటి భారీ, శక్తివంతమైన దేశాల పొరుగున ఉన్న ఈ దేశంలో ఎవరెస్ట్ సహా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో 8 శిఖరాలు ఉన్నాయి. నేపాల్‌లో దీనిని 'సాగరమాత' అని పిలుస్తారు.
భారత్, నేపాల్ మధ్య 1751 కిలోమీటర్ల పొడవైన సరిహద్దు ఉంది. ఈ దేశం భారత్‌లోని సిక్కిం, పశ్చిమ బెంగాల్, బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను ఆనుకుని ఉంటుంది.
ప్రపంచంలోని అత్యంత పేద దేశాలలో ఒకటైన నేపాల్ ఆర్థిక వ్యవస్థ, ఇతర దేశాల నుంచి అందే ఆర్ధిక సాయం, పర్యటక రంగాలపై ప్రధానంగా ఆధారపడి ఉంటుంది.
అయితే, ఇప్పుడు మనం దాని భౌగోళిక, ఆర్ధిక వ్యవస్థ గురించి కాకుండా, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, Getty Images
నేపాల్ స్వాతంత్ర్యాన్ని బ్రిటన్ ఎలా అంగీకరించింది?
క్రీస్తు పూర్వం వెయ్యి సంవత్సరాల కిందట, నేపాల్ చిన్న చిన్న రాజ్యాలుగా, వంశాల సమాఖ్యలుగా విభజితమై ఉండేది. మధ్యయుగాల నుంచీ వస్తున్న శతాబ్దాల వైరాన్ని అంతం చేసిన ఘనత గూర్ఖా కింగ్ పృథ్వీ నారాయణ్ షాకు దక్కుతుంది.
కింగ్ పృథ్వీ నారాయణ్ షా 1765లో నేపాల్ ఐక్యత కోసం ఉద్యమాన్ని ప్రారంభించి 1768 నాటికి అందులో విజయం సాధించారు. ఆధునిక నేపాల్ అప్పుడే ఆవిర్భవించింది.
ఆ తర్వాత షా రాజవంశానికి చెందిన ఐదో రాజు రాజేంద్ర బిక్రమ్ షా పాలనలో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, నేపాల్ సరిహద్దుల్లోని కొన్ని ప్రాంతాలను ఆక్రమించింది. దానితో 1815లో యుద్ధం మొదలైంది. ఇది సుగౌలి అగ్రిమెంట్‌తో ముగిసింది.
నేపాల్ రాజకుటుంబంలో వర్గ విభేదాలు పెరగడంతో అస్థిరత ఏర్పడింది. 1846లో కింగ్ సురేంద్ర బిక్రమ్ షా పాలనలో జంగ్ బహదూర్ రాణా శక్తివంతమైన సైనిక కమాండర్‌గా అవతరించారు.
ఆయన ప్రభావాన్ని తగ్గించడానికి అప్పటి రాణి ప్రయత్నించారు. దీంతో భీకర యుద్ధం జరిగింది. వందలమంది రాణి మద్దతుదారులు హత్యకు గురయ్యారు. దీని తర్వాత జంగ్ బహదూర్ రాణా మరింత శక్తివంతుడయ్యారు.
ఈ ఘటనల తర్వాత రాజకుటుంబం ఆయన శక్తి ముందు తలొగ్గింది. ఆ తర్వాత ప్రధానమంత్రి పదవి వంశపారంపర్యంగా మారింది.
రాణా కుటుంబం బ్రిటిష్ వారికి మద్దతిచ్చేది. 1857 నాటి భారత విప్లవంలో తిరుగుబాటుదారులకు, వ్యతిరేకంగా బ్రిటిష్ వారికి అనుకూలంగా వ్యవహరించింది రాణా కుటుంబం.
ఈ సహకారం వల్ల 1923లో బ్రిటన్-నేపాల్‌ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం నేపాల్‌కు స్వాతంత్ర్యాన్ని ఇచ్చింది బ్రిటన్.

ఫొటో సోర్స్, Getty Images
ప్యాలెస్‌లో సామూహిక హత్య
1940లలో నేపాల్‌లో ప్రజాస్వామ్య అనుకూల ఉద్యమం ప్రారంభమైంది. రాజకీయ పార్టీలు రాణా కుటుంబ నియంతృత్వాన్ని విమర్శించడం ప్రారంభించాయి.
ఇంతలోనే చైనా టిబెట్‌ను ఆక్రమించింది. అదే క్రమంలో నేపాల్‌ను కూడా ఆక్రమిస్తుందని భారత్ ఆందోళన చెందింది. భారతదేశం సహాయంతో అప్పటి రాజు త్రిభువన్ బీర్ బిక్రమ్ షా కొత్త పాలకుడిగా అవతరించారు. నేపాలీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.
కానీ రాజు, ప్రభుత్వం మధ్య అధికారం కోసం పోరాటం కొనసాగింది. 1959లో ప్రజాస్వామ్యాన్ని రద్దు చేసి పంచాయతీ వ్యవస్థను అమలు చేశారు రాజు మహేంద్ర బీర్ బిక్రమ్ షా.
1972లో రాజు బీరేంద్ర బిక్రమ్ షా రాజ్యం పగ్గాలు చేపట్టారు. దాదాపు 17 సంవత్సరాల తరువాత, 1989లో మరోసారి ప్రజాస్వామ్యం కావాలంటూ ఒక ఉద్యమం ప్రారంభమైంది.
రాజ్యాంగ సంస్కరణలను రాజు బీరేంద్ర బీర్ బిక్రమ్ షా అంగీకరించాల్సి వచ్చింది.
మే 1991లో నేపాల్‌లో మొదటిసారిగా బహుళ పార్టీ పార్లమెంట్ ఏర్పడింది. అయితే, 1996 నాటికి దేశంలో మావోయిస్టు ఉద్యమం కూడా మొదలైంది.
జూన్ 1, 2001న, నేపాల్ రాజభవనంలో జరిగిన సామూహిక హత్యలో రాజు, రాణి, యువరాజులు, యువరాణులు హత్యకు గురయ్యారు. ఆ తర్వాత, రాజు సోదరుడు జ్ఞానేంద్ర బీర్ బిక్రమ్ షా తదుపరి రాజుగా పాలన చేపట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
మావోయిస్టుల ఉద్యమాన్ని అణచివేయడానికి ఫిబ్రవరి 2005లో రాజు జ్ఞానేంద్ర అధికారాన్ని సొంతం చేసుకుని, ప్రజా ప్రభుత్వాన్ని రద్దు చేశారు.
2006, 2007 సంవత్సరాలలో నేపాల్‌లో అనేక సంఘటనలు జరిగాయి. నవంబర్ 2006లో, ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి ఒప్పందంపై సంతకం చేసింది. ఇది సుదీర్ఘ హింసాత్మక సంఘర్షణకు ముగింపు పలికింది.
జనవరి 2007లో తాత్కాలిక రాజ్యాంగ నిబంధనల ప్రకారం మావోయిస్టులు ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో ప్రవేశించారు. అదే సంవత్సరం ఏప్రిల్‌లో తాత్కాలిక ప్రభుత్వంలో చేరిన మావోయిస్టులు, ప్రధాన రాజకీయ స్రవంతిలో భాగమయ్యారు.
అదే సంవత్సరం వారు తాత్కాలిక ప్రభుత్వం నుండి వైదొలిగి, రాచరికాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నవంబర్‌లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయి.
డిసెంబర్ 2007లో, తిరిగి ప్రభుత్వంలో చేరిన మావోయిస్టులతో శాంతి ఒప్పందంలో భాగంగా, రాచరికాన్ని రద్దు చేయడాన్ని పార్లమెంటు ఆమోదించింది.
మే 2008లో, నేపాల్ గణతంత్ర రాజ్యంగా మారింది. అదే సంవత్సరం జూలైలో రామ్ బరన్ యాదవ్, నేపాల్ మొదటి అధ్యక్షుడయ్యారు. ఆగస్టులో మావోయిస్టు నాయకుడు పుష్ప కమల్ దహల్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
మూడు పార్టీల చుట్టూ తిరిగే నేపాల్ రాజకీయం
2008 తర్వాత కూడా కొన్ని సంవత్సరాల పాటు నేపాల్‌లో రాజకీయ పరిణామాలు కొనసాగాయి. సెప్టెంబర్ 2015లో పార్లమెంటు చరిత్రాత్మక రాజ్యాంగాన్ని ఆమోదించి నేపాల్‌ను లౌకిక దేశంగా ప్రకటించింది.
అక్టోబర్ 2015లో, కేపీ శర్మ ఓలీ కొత్త రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన మొదటి ప్రధానమంత్రి అయ్యారు.
గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత, నేపాల్ రాజకీయాలు ప్రాథమికంగా మూడు పార్టీల మధ్య తిరుగుతున్నాయి. కానీ, దేశం రాజకీయంగా అస్థిరంగానే ఉంది.
ఇక 2025 సెప్టెంబర్‌లో, నేపాల్ ప్రభుత్వం 26 సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను నిషేధించింది. వీటిలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్రముఖ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి.
దేశంలోని చట్టాలను పాటించడానికి వీలుగా, స్థానిక కార్యాలయాలను తెరవడానికీ, కంప్లయన్స్ ఆఫీసర్లను నియమించడానికీ సోషల్ మీడియా కంపెనీలకు వారం రోజుల సమయం ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది.
చైనా సోషల్ మీడియా కంపెనీ టిక్‌టాక్ ఈ షరతులను సకాలంలో పాటించింది. దీంతో అది నిషేధం సమస్యను ఎదుర్కోలేదు.
సోషల్ మీడియా వెబ్‌సైట్‌లపై నిషేధం తర్వాత యువత నిరసనకు పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రస్తుతం నేపాల్‌లో టిక్‌టాక్ ట్రెండ్ అవుతోంది. నిరసనను నడిపిస్తున్నవారు టిక్‌టాక్‌లో అనేక వీడియోలను షేర్ చేసి ఆందోళనలో పాల్గొనాల్సిందిగా యువతను కోరుతున్నారు.
'నెపో బేబీ' ట్రెండ్ టిక్‌టాక్‌లో కూడా ప్రారంభమైంది. దీనిలో రాజకీయ నాయకుల పిల్లల విలాసవంతమైన జీవితానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పోస్టు అవుతున్నాయి.
రాజకీయ నాయకులు తమ పిల్లలకు ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారు తప్ప దేశం కోసం పని చేయడం లేదన్న వాదనను ఇది తెరపైకి తెచ్చింది.
ఈ వ్యవహారం ముదిరిపోవడంతో పెద్ద ఎత్తున హింస జరిగింది. చాలామంది మరణించారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల తర్వాత నేపాల్ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














