అప్పుడు శ్రీలంక, బంగ్లాదేశ్.. ఇప్పుడు నేపాల్.. భారత్ ఏం చేయనుంది?

భారత్, నేపాల్ సంబంధాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్, నేపాల్ మధ్య చారిత్రాత్మకంగా బలమైన సంబంధాలు ఉన్నాయి.
    • రచయిత, అంబరాసన్ ఎతిరాజన్
    • హోదా, గ్లోబల్ ఎఫైర్స్ రిపోర్టర్

భారత్‌కు పొరుగున ఇటీవల సంవత్సరాల్లో హింసాత్మక తిరుగుబాటు పరిస్థితులు నెలకొని ప్రభుత్వాలు కూలిపోయిన దేశాలలో నేపాల్ మూడవది.

సోషల్ మీడియాపై నిషేధంతో పెల్లుబుకిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో పోలీసులతో జరిగిన ఘర్షణల్లో 20 మందికి పైగా మరణించారు. దీంతో ఆ దేశ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు.

పార్లమెంట్‌ భవనానికి, పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు ఆందోళనకారులు నిప్పంటించడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించింది.

కాఠ్‌మాండూలో కనిపించిన దృశ్యాలు చాలా మందికి గత ఏడాది బంగ్లాదేశ్‌లో, 2022లో శ్రీలంకలో జరిగిన కల్లోల పరిస్థితులను గుర్తుకుతెచ్చాయి.

భారత్‌కు బంగ్లాదేశ్, శ్రీలంక పొరుగు దేశాలు అయినప్పటికీ, కాఠ్‌మాండూతో దిల్లీకున్న సంబంధం చాలా ప్రత్యేకమైంది.

ఎందుకంటే, చారిత్రాత్మకంగా ప్రజల మధ్య సంబంధాలతో పాటు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా రెండు దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్నాయి.

భారత్‌లోని ఐదు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్, సిక్కిం, బిహార్, పశ్చిమ బెంగాల్‌తో 1,750 కిలోమీటర్లకు పైగా పొడవైన అతిపెద్ద సరిహద్దును నేపాల్‌ పంచుకుంటోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సరిహద్దుల వెంబడి జరుగుతున్న పరిణామాలను దిల్లీ నిశితంగా గమనిస్తోంది, భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ అసాధారణ పరిణామాలపై వెంటనే స్పందించారు.

''నేపాల్‌లో జరుగుతోన్న హింస హృదయవిదారకరం. చాలామంది యువత వారి ప్రాణాలను కోల్పోవడం దిగ్భ్రాంతిని కలిగించింది'' అని మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మోదీ పోస్టు చేశారు.

నేపాల్‌లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు అత్యంత ముఖ్యమని నొక్కిచెబుతూ, నేపాల్‌లోని సోదర సోదరీమణులందరూ శాంతియుతంగా ఉండాలని కోరారు.

నేపాల్‌లో పరిస్థితిపై చర్చించేందుకు మోదీ మంగళవారమే కేబినెట్ మంత్రులతో అత్యవసర భద్రతా సమావేశం నిర్వహించారు.

2022లో శ్రీలంకలో నెలకొన్న సంక్షోభంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే తప్పనిసరి పరిస్థితుల్లో దేశం విడిచి పారిపోయినట్లే, నేపాల్‌లో జరిగిన పరిణామాలు భారత్‌ను నిర్ఘాంత పరిచాయని నిపుణులు అంటున్నారు.

దిల్లీ పర్యటనకు రావడానికి వారం ముందే ఓలీ తన ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

నేపాల్‌, భారత్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

నేపాల్ వ్యూహాత్మక స్థానం కారణంగా ఆ దేశంలో ఎలాంటి అస్థిరత పరిస్థితులు నెలకొన్నా భారత్‌కు ఆందోళన కలిగిస్తుంది.

''చైనాకు చెందిన వెస్ట్రన్ థియేటర్ కమాండ్ నేపాల్‌ వెంబడే ఉంది. ఇండియా-గంగా మైదానాలకు వచ్చే మార్గం నేపాల్ వెంబడి నేరుగా ఉంటుంది'' అని నేపాల్‌ వ్యవహారాల నిపుణులు మేజర్ జనరల్ (రిటైర్డ్) అశోక్ మెహతా బీబీసీతో చెప్పారు.

ఈ ఆందోళనలు భారత్‌లోని నేపాల్ ప్రవాసులపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. భారత్‌లో 35 లక్షల మంది నేపాలీలు పనిచేస్తుంటారని, నివసిస్తుంటారని అంచనా. అయితే, ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

నేపాల్ ఎక్కువగా హిందువులున్న దేశం. సరిహద్దు వెంబడి ఉండే ప్రజల మధ్య సన్నిహిత కుటుంబ సంబంధాలు కూడా ఉన్నాయి.

వీసా, పాస్‌పోర్టు లేకుండా రెండు దేశాల మధ్యన ప్రజలు ప్రయాణించవచ్చు. 1950 ఒడంబడిక కింద ఎలాంటి ఆంక్షలు లేకుండానే నేపాలీలు భారత్‌లో పనిచేసుకోవచ్చు.

దీనికి అదనంగా, దశాబ్దాల నాటి ప్రత్యేక ఒప్పందం కింద నేపాల్‌కు చెందిన 32 వేల మంది గూర్ఖా సైనికులు భారత ఆర్మీలో పనిచేస్తున్నారు.

'' రెండు దేశాల మధ్య సరిహద్దులు తెరుచుకున్నప్పటి నుంచి ప్రజలు ఒకరికొకరు కలిసి జీవిస్తున్నారు. ఇరువైపులా ఉన్న కుటుంబాలు నిత్యం మాట్లాడుకుంటూ ఉంటాయి'' అని దిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి (జేఎన్‌యూ) చెందిన ప్రొఫెసర్ సంగీత థాప్లియాల్ అన్నారు.

హిమాలయాలకు అవతల ఉన్న పర్వత శ్రేణుల్లో (ట్రాన్స్-హిమాలయన్ మౌంటైన్స్) ముక్తినాథ్ ఆలయంతో పాటు పలు హిందూ ఆధ్యాత్మిక ప్రదేశాలు నేపాల్ పరిధిలో ఉన్నాయి.

ప్రతి ఏటా భారత్ నుంచి వేలాది మంది హిందూ భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.

నేపాలీ గూర్ఖాలు, నేపాల్‌, భారత్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రత్యేక ఒప్పందం కింద నేపాలీ గూర్ఖాలు భారత ఆర్మీలో పనిచేస్తున్నారు.

కాఠ్‌మాండూ ఎక్కువగా భారత్ ఎగుమతులపై ఆధారపడి ఉంది. ముఖ్యంగా చమురు, ఆహారం భారత్ నుంచి ఎగుమతి అవుతోంది.

భారత్-నేపాల్ మధ్యలో వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యం 8.5 బిలియన్ డాలర్లుగా (సుమారు రూ.75,161 కోట్లుగా) ఉంటుందని అంచనాలున్నాయి.

బుధవారం కాఠ్‌మాండూలో పరిస్థితులు తిరిగి ప్రశాంత స్థితికి వచ్చినప్పటికీ, నిరసనకారులు ఆ దేశాన్ని పాలించిన మూడు ప్రధాన రాజకీయ పార్టీలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో భారత్ దౌత్యపరంగా కాస్త క్లిష్టపరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

నేపాల్‌లోని మూడు ప్రధాన రాజకీయ పార్టీలు.. ఓలీ నేతృత్వంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (సీపీఎన్-యూఎంఎల్), షేర్ బహదూర్ దేవుబాకు చెందిన నేపాలీ కాంగ్రెస్, ప్రచండగా పేరున్న పుష్ప కమల్ దహాల్‌ సారథ్యంలోని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్ట్ సెంటర్)తో భారత్ మంచి సంబంధాలను కొనసాగిస్తోంది.

హిమాలయాలు ఉండే ఈ దేశం వ్యూహాత్మక స్థానాన్ని బట్టి, భారత్‌, చైనాలు రెండూ ఈ దేశంలో తమ ప్రభావం చూపేందుకు పోటీపడుతుంటాయి. ఈ పోటీనే నేపాల్ అంతర్గత వ్యవహారాల్లో ఈ రెండు దిగ్గజ దేశాలు జోక్యం చేసుకుంటాయనే ఆరోపణలకు తెరలేపింది.

అయితే, కొత్త ప్రభుత్వం లేదా నాయకత్వం విషయంలో అస్పష్టత ఉండటంతో భారత్ అప్రమత్తంగా ఉంటుందని ప్రొఫెసర్ థాప్లియాల్ అన్నారు. నేపాల్‌లో బంగ్లాదేశ్‌ లాంటి పరిస్థితి రాకూడని వారు కోరుకుంటారని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో ప్రధాని పదవి కోల్పోయిన షేక్‌ హసీనా ప్రభుత్వంతో దిల్లీకి స్నేహపూర్వక సంబంధాలు ఉండేవి. అయితే, షేక్ హసీనాకు ఆశ్రయం ఇవ్వాలని భారత్‌ నిర్ణయం తీసుకోవడంతో ఆ దేశ మధ్యంతర ప్రభుత్వంతో సంబంధాలు క్షీణించాయి.

నేపాల్, భారత్‌ మధ్య కూడా విభేదాలు ఉన్నాయి. ప్రస్తుతం వీటిని అదనపు జాగ్రత్తతో నిర్వహించాల్సి ఉంది.

కాఠ్‌మాండూ తమవని వాదిస్తున్న, చైనా సరిహద్దుకు దగ్గరగా ఉన్న కొన్ని ప్రాంతాలను భారత్ 2019లో తన మ్యాప్‌లో ప్రచురించడంతో నేపాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆ వివాదాస్పద ప్రాంతాలను నేపాల్ తన సొంత మ్యాప్‌లో ప్రచురించిన తర్వాత దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.

ముక్తినాథ్ టెంపుల్, నేపాల్‌, భారత్, చైనా, బంగ్లాదేశ్, శ్రీలంక

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పలు హిందూ పవిత్ర ప్రదేశాలకు నిలయంగా నేపాల్

నేపాల్ తనదని చెబుతున్న సరిహద్దుల్లోని ఒక ప్రాంతం మీదుగా తిరిగి వాణిజ్యాన్ని కొనసాగించేందుకు భారత్, చైనాలు ఇటీవల అంగీకరించాయి.

గత నెలలో చైనాను సందర్శించిన ఓలీ, చైనా నాయకత్వంతో ఈ సమస్యను చర్చించారు. లిపులేఖ్ పాస్‌ను వాణిజ్య మార్గంగా వాడుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఏదైనా విభేదాలు ఉంటే భారత్ ప్రస్తుతం కొత్త అడ్మినిస్ట్రేషన్‌ను సంప్రదించాల్సి ఉంటుందని నిపుణులు అన్నారు. అంతేకాక, రాజకీయ వ్యవస్థపై ఆగ్రహంగా ఉన్న యువ నేపాలీలతో కూడా చర్చించాల్సి ఉంటుంది.

''యువతకు నేపాల్‌లో చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయి. నేపాలీ విద్యార్థులకు ఫెలోషిప్‌లను పెంచడంపై, మరిన్ని ఉద్యోగావకాశాలను అందించడంపై భారత్ దృష్టిసారించాలి'' అని ప్రొఫెసర్ థాప్లియాల్ అన్నారు.

దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) అంత క్రియాశీలకంగా లేకపోవడంతో పొరుగు దేశంలో రాజకీయ మార్పులను, అస్థిరతను నిర్వహించడం భారత్‌కు సవాల్‌గా మారనుంది.

పాకిస్తాన్‌తో సంబంధాలు బాగా దెబ్బతిన్న సమయంలో నేపాల్‌లో సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. బంగ్లాదేశ్‌తో కూడా సంబంధాలు ప్రతికూలంగా మారాయి. మియన్మార్ అంతర్యుద్ధంతో మండిపోతోంది.

'' శక్తివంతంగా ఎదగాలన్న ఆకాంక్షల నడుమ భారత్ తన పొరుగుదేశాలపై శీతకన్నేసింది. అయితే, ఆ లక్ష్యాలను చేరుకోవాలంటే స్థిరమైన, సురక్షితమైన పొరుగుదేశాల వాతావరణం అవసరం'' అని మెహతా అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)