ప్రస్తుతం నేపాల్‌ను నడిపిస్తోంది ఎవరు? అధ్యక్షుడితో సహా నాయకులు ఏమయ్యారు?

నేపాల్, రామచంద్ర పౌడెల్, కేపీ శర్మ ఓలీ

ఫొటో సోర్స్, Nepal Army

ఫొటో క్యాప్షన్, నేపాల్ ఆపద్ధర్మ ప్రధాన మంత్రి కేపీ ఓలీ, అధ్యక్షుడు పౌడెల్ (ఫైల్ ఫోటో)
    • రచయిత, అశోక్ దహాల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి, నేపాల్

రెండు రోజుల నిరసనల నడుమ నేపాల్‌ ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా అనంతరం.. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్, నేపాల్ ఆర్మీ నిరసనకారులను చర్చలకు ఆహ్వానించారు.

కానీ, అధ్యక్షుడు రామచంద్ర పౌడెల్ ఎక్కడున్నారు? ప్రధాన మంత్రి ఓలీ రాజీనామాతో ఏర్పడిన రాజకీయ అస్థిర పరిస్థితుల్లో పరిపాలనా పగ్గాలు ఆయన చేతుల్లోనే ఉన్నాయని భావిస్తున్నారు.

అధ్యక్షుడి సచివాలయ వర్గాల సమాచారం ప్రకారం, మహారాజ్‌గంజ్‌లోని శీతల్ నివాస్‌లోకి నిరసనకారులు చొరబడడంతో, భద్రతాకారణాల రీత్యా అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఆయనకు(అధ్యక్షుడికి) నేపాల్ ఆర్మీ సూచించింది.

ఆర్మీ హెలికాప్టర్‌లో అధ్యక్షుడు పౌడెల్‌ను సురక్షితంగా వేరేచోటకు తరలించారు.

అది జరిగిన కొద్దిసేపటికే, నిరసనకారులు అధ్యక్షుడి కార్యాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేసి, ఆ భవనానికి నిప్పుపెట్టారు.

నేపాల్ ఆర్మీ రక్షణలో అధ్యక్షుడు ఉన్నారు. గుర్తుతెలియని ప్రదేశం నుంచి ఆయన 'జెన్ జడ్' (Gen Z) ఉద్యమకారుల ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించారు.

అధ్యక్షుడిని ఎక్కడకు తీసుకెళ్లింది, ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారనే దాని గురించి నేపాల్ ఆర్మీ ఎలాంటి సమాచారమూ వెల్లడించలేదు.

అధ్యక్షుడు సహా అగ్రనేతలు ఎక్కడున్నారనేదీ తమకు తెలియదని నేపాల్ ఆర్మీ ప్రతినిధి రాజారామ్ బాస్నెత్ బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

మాజీ ప్రధాన కార్యదర్శి లీలామణి పౌడ్యాల్ బీబీసీతో మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశాన్ని అధ్యక్షుడు నడుపుతున్నారని, రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడే సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ కూడా అని భావిస్తున్నామన్నారు.

''సాయుధ దళాలు చురుగ్గా వ్యవహరించేంత వరకూ ప్రస్తుత పరిస్థితి సాధారణ స్థితికి రాదు. ప్రస్తుతం ఆర్మీ చురుగ్గా పనిచేస్తోంది. అధ్యక్షుడే ఆర్మీ సుప్రీం కమాండర్'' అని లీలామణి పౌడ్యాల్ అన్నారు.

నిరసనకారుల ప్రతినిధులను ఆహ్వానించి, వారితో చర్చలకు అధ్యక్షుడు నేతృత్వం వహించాలని లీలామణి అంటున్నారు.

నేపాల్, రామచంద్ర పౌడెల్, కేపీ శర్మ ఓలీ

ఫొటో సోర్స్, KP Oli Secretariat

ఫొటో క్యాప్షన్, ప్రధాన మంత్రి పదవికి కేపీ ఓలీ మంగళవారం రాజీనామా చేశారు

ఆపద్ధర్మ ప్రధాని కేపీ శర్మ ఓలీ ఎక్కడున్నారు?

ప్రధాన పరిపాలనా కేంద్రం సింఘా దర్బార్, పార్లమెంట్‌తో పాటు ప్రధాన మంత్రి, అధ్యక్షుడి నివాసాల్లోకి నిరసనకారులు చొచ్చుకురావడంతో, స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 2:24 గంటలకు ప్రధాన మంత్రి కేపీ ఓలీ తన సచివాలయం ద్వారా రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు.

ఓలీ రాజీనామాను అధ్యక్షుడు పౌడెల్ ఆమోదించినట్లు అధ్యక్షుడి కార్యాలయం వెల్లడించింది. రాజ్యాంగం ప్రకారం తదుపరి ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకూ తాత్కాలిక ప్రభుత్వ బాధ్యతలను ఓలీకి అప్పగించినట్లు ప్రకటించింది.

కానీ, ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా నియమించిన తర్వాత కూడా ఓలీ ఎక్కడా కనిపించలేదు.

''ఆపద్ధర్మ ప్రధాన మంత్రిగా ఓలీ వ్యవహరిస్తారని అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించినప్పటికీ, ఆయన పాత్ర ఎక్కడా కనిపించడం లేదు. ఆయన పనిచేస్తుంటే, ప్రధాన కార్యదర్శి, నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీసు, సాయుధ పోలీసు బలగాలు, దర్యాప్తు విభాగ అధిపతుల నిర్ణయాలు బహిరంగంగా ప్రకటించేవారు కాదు. కాబట్టి నా ఉద్దేశం ఏమిటంటే, రాజకీయ నాయకత్వం క్రియాశీలకంగా లేదు'' అని మాజీ ప్రధాన కార్యదర్శి లీలామణి అన్నారు.

ఓలీ దేశం విడిచివెళ్లారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. అయితే, 'ఓలీ నేపాల్‌లోనే ఉన్నారని, భద్రతా సంస్థలు రక్షణ కల్పిస్తున్నాయి' అని ఓలీ సన్నిహితుల్లో ఒకరు పేర్కొన్నారు.

మంగళవారం మధ్యాహ్నం, నేపాల్ ఆర్మీ ఓలీని ప్రధాన మంత్రి నివాసం నుంచి హెలికాప్టర్‌లో తరలించింది.

ఆపద్ధర్మ ప్రధాన మంత్రి రాజకీయ కార్యకలాపాలు స్పష్టంగా కనిపించకపోయినప్పటికీ, నేపాల్ ప్రభుత్వంలో కార్యదర్శుల సమావేశాన్ని ప్రధాన కార్యదర్శి ఏర్పాటు చేశారు.

మంగళవారం, భద్రతా సంస్థలతో కలిసి ప్రధాన కార్యదర్శి సంయుక్త ప్రకటన విడుదల చేశారు. రాజకీయ చర్చల ద్వారా శాంతియుత పరిష్కారం కోసం ఆయన విజ్ఞప్తి చేశారు.

నేపాల్, రామచంద్ర పౌడెల్, కేపీ శర్మ ఓలీ

ఫొటో సోర్స్, President's Office

ఫొటో క్యాప్షన్, ప్రధాన మంత్రి పదవికి కేపీ ఓలీ రాజీనామాను ఆమోదించిన తర్వాత కూడా అధ్యక్షుడు పౌడెల్ బహిరంగంగా కనిపించలేదు

నాయకులంతా ఎక్కడున్నారు?

దేశంలో ప్రధానమైన శాసన వ్యవస్థ, న్యాయ వ్యవస్థల ఉనికి కూడా అధికార యంత్రాంగం స్థాయిలో మాత్రమే కనిపిస్తోంది.

ప్రజాప్రతినిధుల సభ (దిగువ సభ) సమావేశం వాయిదా గురించి తెలియజేస్తూ పార్లమెంట్ జనరల్ సెక్రటరీ పద్మా ప్రసాద్ పాండే ప్రకటన జారీ చేశారు.

స్పీకర్ నిర్ణయాన్ని ఉటంకిస్తూ, ''ప్రత్యేక కారణాల రీత్యా, తదుపరి నోటీసు వెలువడేంతవరకూ ప్రతినిధుల సభ సమావేశం వాయిదా పడింది'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

దిగువ సభ స్పీకర్ దేవ్‌రాజ్ ఘిమిరే బీబీసీతో మాట్లాడుతూ, తాను బలగాల భద్రతలో ఉన్నట్లు చెప్పారు.

మధ్యాహ్నం వరకూ స్పీకర్ నివాసంలోనే ఉన్నారని, ఆందోళనలు తీవ్రమైన తర్వాత నేపాల్ ఆర్మీ తనను సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తోందని సచివాలయానికి సమాచారం అందించారని సచివాలయ సభ్యుడొకరు తెలిపారు.

సచివాలయ సమాచారం ప్రకారం, నేషనల్ అసెంబ్లీ (ఎగువ సభ) స్పీకర్ నారాయణ్ దహాల్ కూడా భద్రతా సంస్థల రక్షణలోనే ఉన్నారు.

సుప్రీంకోర్టు భవనం కూడా పూర్తిగా కాలిపోయిందని, పెండింగ్ కేసుల విచారణను తదుపరి నోటీసు వచ్చే వరకూ వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు చీఫ్ రిజిస్ట్రార్ తెలిపారు.

నేపాల్, రామచంద్ర పౌడెల్, కేపీ శర్మ ఓలీ

ఫొటో సోర్స్, Prachanda Secretariat

ఫొటో క్యాప్షన్, నేపాల్ మాజీ ప్రధాన మంత్రులు ప్రచండ, మాధవ్ నేపాల్, నారాయణ్ కాజి

మాజీ ప్రధానులు ఎక్కడున్నారు?

మంగళవారం, మాజీ ప్రధాన మంత్రి షేర్ బహదూర్ దేవుబా, ఆయన భార్య అర్జూ రాణా దేవుబా తమ నివాసంలో ఉన్నప్పుడే నిరసనకారులు చొరబడి వారి ఇంటిని ధ్వంసం చేసి, నిప్పంటించారు.

దేవుబా తలకు గాయాలయ్యాయని, భద్రతా దళాలు ఆయన్ను సురక్షిత ప్రదేశానికి తరలిస్తున్నాయంటూ పలు వీడియోలు సోషల్ మీడియాలో షేర్ అయ్యాయి. వెనుక ద్వారం నుంచి ఆయన్ను తీసుకెళ్లి, హెలికాప్టర్‌లో తరలించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆ వీడియోల్లో ఉంది.

ఈ వీడియోలను బీబీసీ సొంతంగా నిర్ధరించలేదు. కానీ, దేవుబాను ఆసుపత్రికి తరలించారని, భద్రతా దళాల రక్షణలోనే చికిత్స పొందుతున్నారని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి.

మాజీ ప్రధాన మంత్రులు పుష్ప కమాల్ దహాల్, మాధవ్ నేపాల్ సహా పలువురు ప్రతిపక్ష నాయకులు పార్లమెంట్ సచివాలయంలో మంగళవారం జరిగిన సమావేశానికి హాజరయ్యారు. అదే సమయంలో నిరసనకారులు సింఘా దర్బార్‌పై దాడి చేశారు. అక్కడ ధ్వంసం చేసి, ప్రవేశ ద్వారానికి నిప్పటించారు.

అక్కడి నుంచి బయటకు రాలేకపోయిన ఆ నాయకులను నేపాల్ ఆర్మీ రక్షించి, వారి స్వస్థలాలకు తీసుకెళ్లిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

మాజీ ఉప ప్రధాని, నేషనల్ ఇండిపెండెంట్ పార్టీ అధ్యక్షుడు రవి లామిచానే మంగళవారం జైలు నుంచి విడుదలయ్యారు.

తనకు కూడా భద్రత అవసరం కావొచ్చని, భద్రతా సంస్థలకు తెలియజేసినట్లు రవి మంగళవారం సాయంత్రం ఒక వీడియో విడుదల చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)