నేపాల్‌లో సార్వత్రిక ఎన్నికలు.. తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కి బాధ్యతలు చేపట్టిన కొద్ది గంటల్లోనే అధ్యక్షుడి ప్రకటన

ఫొటో సోర్స్, Reuters
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీలా కార్కితో ప్రమాణ స్వీకారం చేయించిన కొన్నిగంటల్లోనే, ఆ దేశ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ సార్వత్రిక ఎన్నికలకు తేదీని కూడా ప్రకటించారు.
నేపాల్ మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీలా కార్కి, శుక్రవారం రాత్రి తాత్కాలిక ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేపాల్ అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం కొన్ని గంటల్లోనే సార్వత్రిక ఎన్నికల తేదీనీ ప్రకటించారు. 2026 మార్చి 5న నేపాల్‌లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ మేరకు అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ప్రకటన విడుదల చేశారు.
కొత్తగా నియమితులైన ప్రధాన మంత్రి సుశీలా కార్కి సిఫార్సు మేరకు అధ్యక్షుడు ఎన్నికల తేదీని ప్రకటించారని పౌడెల్ ప్రెస్ అడ్వైజర్ కిరణ్ పోఖ్రెల్ బీబీసీకి తెలిపారు.
కార్కి తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టడంతో నిబంధనల ప్రకారం, ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.

నేపాల్ తాత్కాలిక ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన సుశీలా కార్కికి భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
"నేపాల్ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సుశీలా కార్కికి అభినందనలు తెలియజేస్తున్నా" అని మోదీ ఎక్స్(ట్విటర్) పోస్టులో తెలిపారు.
"నేపాల్ ప్రజల పురోగతి, శాంతి, శ్రేయస్సుకు భారత్ కట్టుబడి ఉంది" అని మోదీ రాశారు.

ఫొటో సోర్స్, PRABIN RANABHAT/AFP via Getty Images
సుశీల పేరును ప్రతిపాదించిన నిరసనకారులు
'జెన్ జడ్' నిరసనకారులు, నాయకులు, అధ్యక్షుడు పౌడెల్, ఇతర న్యాయ నిపుణులతో అనేక చర్చల తర్వాత, శుక్రవారం సాయంత్రం సుశీలా కార్కి పేరుపై ఏకాభిప్రాయం కుదిరింది.
అవినీతి ఆరోపణలు, సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా యువత భారీ నిరసనల మధ్య మంగళవారం రాజీనామా చేసిన కేపీ శర్మ ఓలి స్థానంలో సుశీలా కార్కి నియమితులయ్యారు.
పోలీసుల కథనం ప్రకారం, నిరసనలు దానికి సంబంధించిన వివిధ సంఘటనలలో ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు.
జెన్ జడ్ఉద్యమంలో యువత ఆదరణ పొందిన ప్రముఖ ర్యాపర్, కాఠ్‌మాండూ మేయరు బాలెన్ షా కూడా సుశీల కార్కి పేరును సమర్థించారు.
''తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించడానికి మీరు (యువత) ప్రతిపాదించిన మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి పేరును నేను పూర్తిగా సమర్థిస్తున్నాను'' అని బాలెన్ షా తన 'ఎక్స్' పోస్టులో పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనపై భారతీయ టీవీ చానల్ సీఎన్ఎన్-న్యూస్ 18తో సుశీల కార్కి మాట్లాడుతూ, ''వారు (యువత) నన్ను అభ్యర్థించారు, నేను అంగీకరించాను'' అని చెప్పారు.
యువత తనపై నమ్మకం ఉంచారని కార్కి అన్నారు. ఎన్నికలు జరగాలని, దేశాన్ని అరాచకం నుంచి బయటపడేయాలని వారు కోరుకుంటున్నారని ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, PRABIN RANABHAT/AFP via Getty Images
ఎవరీ సుశీల కార్కి?
నేపాల్ సుప్రీంకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీల కార్కి 2016 జులై 11 నుంచి 2017 జూన్ 6 వరకూ బాధ్యతలు నిర్వర్తించారు.
ఆమె కఠిన వైఖరి కారణంగా, రాజకీయాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
విధుల్లో పక్షపాతంతో వ్యవహరించారని, ప్రభుత్వ కార్యకలాపాల్లో జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలతో 2017 ఏప్రిల్‌లో, అప్పటి ప్రభుత్వం సుశీల కార్కిపై పార్లమెంటులో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టింది.
దర్యాప్తు పూర్తయ్యే వరకూ ప్రధాన న్యాయమూర్తి బాధ్యతల నుంచి ఆమెను సస్పెన్షన్‌లో ఉంచారు.
ఈ సమయంలో, న్యాయవ్యవస్థ స్వతంత్రతకు మద్దతుగా నేపాల్ ప్రజలు గళమెత్తారు. ఆమెపై పార్లమెంటు తదుపరి చర్య తీసుకోకుండా సుప్రీంకోర్టు నిలుపుదల చేసింది.
ఇలా ఒత్తిడి పెరగడంతో, కొన్నివారాల్లోనే సుశీల కార్కిపై అభిశంసన తీర్మానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
ఈ సంఘటనతో, అధికార ఒత్తిళ్లకు తలొగ్గని న్యాయమూర్తిగా సుశీల కార్కి ప్రజల్లో గుర్తింపు పొందారు.

భారత్‌తో సుశీలకు అనుబంధం
టీవీ చానల్ సీఎన్ఎన్-న్యూస్ 18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశంతో అనుబంధంపై అడిగిన ప్రశ్నకు సుశీల కార్కి స్పందిస్తూ, ‘‘ నేను బీహెచ్‌యూలో చదువుకున్నాను. ఆ ప్రాంతంతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి. నా గురువులు, స్నేహితులు ఇప్పటికీ నాకు గుర్తున్నారు. గంగానది, దాని ఒడ్డునే ఉన్న హాస్టల్, వేసవి రాత్రుళ్లలో హాస్టల్ రూఫ్‌పై కూర్చొని గంగానది పరవళ్లను చూడటం ఇంకా గుర్తున్నాయి'' అని చెప్పారు.
తన స్వస్థలం బిరాట్‌నగర్ భారతదేశ సరిహద్దుకు చాలా సమీపంలో ఉండటాన్ని సుశీల ప్రస్తావించారు. ''భారతదేశ సరిహద్దు మా ఇంటి నుంచి దాదాపు 25 మైళ్ల దూరంలోనే ఉంది. సరిహద్దు వద్దనున్న మార్కెట్‌కు తరుచుగా వెళ్లేదాన్ని. నేను హిందీ మాట్లాడతాను. బాగా కాకపోయినా, మాట్లాడగలను'' అని సుశీల అన్నారు.
భారతదేశం నుంచి అంచనాలపై ఆమె స్పందిస్తూ, ''భారత్, నేపాల్ మధ్య సంబంధాలు పూర్వం నుంచి ఉన్నాయి. ప్రభుత్వాలు భిన్నమైనవే అయినా, ఇరుదేశాల్లోని ప్రజల మధ్య సంబంధాలు చాలా పటిష్టంగా ఉన్నాయి. నా బంధువులు, పరిచయస్తుల్లో చాలామంది భారత్‌లో ఉన్నారు. వారికి ఏదైనా జరిగితే మేము కూడా కన్నీళ్లు పెట్టుకుంటాం. మేము చాలా సన్నిహితులం. చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఉండవచ్చు, కానీ అనుబంధం బలంగా ఉంటుంది'' అని వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, FACEBOOK/Balen Shah
బాలెన్ షా పేరు కూడా వార్తల్లో ప్రముఖంగా...
జెన్ జడ్ఉద్యమంలో సుశీల కార్కితో పాటు కాఠ్‌మాండూ మేయరు బాలెన్ షా పేరు కూడా వార్తల్లో ప్రధానాంశమైంది.
నేపాల్ రాజధాని నగరం కాఠ్‌మాండూ మేయరుగా 2022 మేలో బాలెన్ పదవీ బాధ్యతలు చేపట్టడం, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.
నేపాలీ కాంగ్రెస్ అభ్యర్థి సృజన సింగ్‌పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన బాలెన్, భారీ మెజారిటీతో గెలుపొందారు.
జెన్ జడ్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు, మేయరు పదవికి రాజీనామా చేసి, ఉద్యమానికి నాయకత్వం వహించాలని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆయన్ను అభ్యర్థించారు.
కానీ, ఉద్యమానికి మద్దతుగా నిలిచారు తప్ప ఆయన వీధుల్లోకి మాత్రం రాలేదు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














