నేపాల్ నుంచి విశాఖ చేరుకున్న తెలుగువారు, ప్రత్యక్షంగా చూసిన అక్కడి పరిస్థితుల గురించి ఏం చెబుతున్నారు?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
నేపాల్‌లో చిక్కుకున్న తెలుగువారిలో 144 మంది సురక్షితంగా గురువారం రాత్రి (సెప్టెంబర్ 11) విశాఖ ఎయిర్ పోర్టుకి చేరుకున్నారు. వీరిలో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు రాయలసీమకు చెందిన వారు ఉన్నారు. విశాఖ చేరుకున్న వీరికి అధికార కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వాగతం పలికారు.
నేపాల్ నుంచి వచ్చిన వారిని విశాఖ ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక వాహనాలలో వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది.
"మేం ఉండే హోటల్‌కి నిప్పుపెట్టారు. మా సామాన్లు, డబ్బులు అన్నీ కాలిపోయాయి. మేం ఎలా బయటపడతామా అని అందోళన పడ్డాం" అని నేపాల్ అల్లర్లలో చిక్కుకుని సురక్షితంగా విశాఖ చేరుకున్న రాధాకృష్ణ బీబీసీతో చెప్పారు.


'అల్లర్లంటే ఈ స్థాయిలో ఉంటాయని ఊహించలేదు'
"ప్లెజర్ ట్రిప్ అనుకుని వెళ్లాం. నేపాల్‌లో మేం ఎదుర్కొన్న పరిస్థితులతో అది అడ్వెంచర్ ట్రిప్‌గా మారింది" అని విశాఖకు చెందిన ఎల్ఐసీ ఉద్యోగి సూర్యప్రభ బీబీసీతో అన్నారు.
"నాతో పాటు మరో 10 మంది ఎల్ఐసీ ఉద్యోగులం నేపాల్ టూర్ ప్లాన్ చేసుకుని వెళ్లాం. ప్రశాంతమైన నేపాల్ వాతావరణం ఎంజాయ్ చేస్తూ ఎవరెస్ట్ శిఖరం అన్నీ చూద్దామని అనుకున్నాం. మేం వెళ్లిన తర్వాత లుంబిని, ముక్తినాథ్ తదితర ప్రదేశాలకు వెళ్లాం.
ముక్తినాథ్ నుంచి తిరిగొస్తుంటే, ముందు రోజు మాతో తిరిగిన డ్రైవర్ ఫోన్ చేశారు. మీరు హోటల్ చుట్టుపక్కలకి రావొద్దు, మీ హోటల్‌ని తగలబెట్టేశారు అని చెప్పారు. మాకు ఏం చేయాలో తెలియలేదు. అల్లర్లంటే ఈ స్థాయిలో ఉంటాయని ఊహించలేదు. మరో హోటల్ తీసుకుని అందులో ఉన్నాం.
ఆ హోటల్‌లోనూ గది దాటి మమ్మల్ని బయటకు రానివ్వలేదు. మా సమీపంలో తుపాకులు, బాంబు మోతల్లా ఏవో పెద్ద పెద్ద శబ్దాలు వినిపించేవి. మొత్తానికి ఏపీ ప్రభుత్వ సహకారంలో సురక్షితంగా తిరిగిచేరుకోగలిగాం" అని సూర్యప్రభ నేపాల్‌లో తన అనుభవాలను బీబీసీకి వివరించారు.

'హోటల్ మొత్తం తగలబెట్టేశారు...'
''నేపాల్ విహారయాత్రకి వెళ్లాం. తొలి రెండు రోజులు బాగానే గడిచింది. మూడో రోజు నేపాల్‌లో ఎక్కడ చూసినా అల్లర్లే. మేము బస చేసిన పోఖ్రా అనే ఏరియాలోనూ తీవ్ర స్థాయిలో అల్లర్లు చెలరేగాయి'' అని విశాఖకు చెందిన రాధాకృష్ణ బీబీసీతో చెప్పారు.
"ఉదయం మేం పోఖ్రా నుంచి ముక్తినాథ్ వెళ్లాం. అక్కడికి వెళ్లి సాయంత్రం పోఖ్రా తిరిగొచ్చేసరికి సీన్ మొత్తం మారిపోయింది. మేం ఉన్న హోటల్‌ని తగలబెట్టేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ నేతల ఇళ్లనూ ధ్వంసం చేశారు. నా కళ్లతో చూశాను. ప్రతి వీధిలో అల్లర్లే.
మేం కూడా ముక్తినాథ్ నుంచి వెనక్కి వస్తున్నప్పుడు మా వాహనాన్ని ఎక్కడికక్కడ ఆపేసేవారు. మా డ్రైవర్ నేపాలీ భాషలో నిరసనకారులతో మాట్లాడి, మేము పర్యటకులమని, భారత్ నుంచి వచ్చామని చెప్పేవారు. నిరసనకారులను ఎంతో బతిమిలాడితే వదిలేవారు. అలా చాలా గండాల నుంచి బయటపడ్డాం. చిన్న చిన్న సందుల్లో నుంచి తిరుగుతూ, తిరుగుతూ ఎలాగో హోటల్‌కి చేరుకుంటే, అది అప్పటికే తగలబడుతోంది. మొత్తం మా సామాన్లు, కొంత డబ్బు అంతా మంటల్లో కాలిపోయాయి'' అని తన అనుభవాలను వివరించారు.
''అందోళనకారులంతా యువతే. ద్విచక్ర వాహనాలపై ఇద్దరు, ముగ్గురేసి వచ్చేశారు. రకరకాలుగా విన్యాసాలు చేస్తూ నిరసనలు తెలిపేవారు. ప్రభుత్వ ఆస్తులు, నేతల ఇళ్లు, కార్యాలయాలను టార్గెట్ చేసుకున్నారే తప్ప విదేశీయులకు హాని చేయలేదు. అంత అల్లరల్లోనూ నిరసనకారులు ఈ విషయంలో మాత్రం సంయమనం పాటించినట్లు కనిపించింది" అని రాధాకృష్ణ అన్నారు.

'అసలేం జరుగుతుందో తెలియలేదు'
''మేం తీసుకున్న హోటల్ కాస్త మారుమూలగా ఉండటంతో, ఆందోళనకారులు అక్కడికి రాలేదు. అయినా సరే హోటల్ యాజమాన్యం మమ్మల్ని బయటకు అడుగుపెట్టనివ్వలేదు. రెండు రోజుల పాటు అసలు బయట ఏం జరుగుతుందో తెలియలేదు. హోటల్ గదులకే పరిమితమైపోయాం'' అని స్వర్ణకుమారి అనే పర్యటకురాలు బీబీసీకి చెప్పారు.
ఫోన్, టీవీ చూసైనా తెలుసుకుందామంటే, ఇంటర్నెట్ సౌకర్యం నిలిచిపోయిందని ఆమె అక్కడి పరిస్థితి గురించి వివరించారు.

‘ఎటు చూసినా సైన్యమే’
''వీధుల్లో ఎటు చూసినా సైన్యమే కనిపించింది. బయటకు రావొద్దని హోటల్ సిబ్బంది మాకు ముందే చెప్పారు. మమ్మల్ని క్షేమంగా నేపాల్ నుంచి సరిహద్దు దాటించాలని కూడా చాలా ప్రయత్నించారు. కానీ, అల్లర్లు తారస్థాయికి చేరడంతో ఏమీ చేయలేకపోయారు" అన్నారు.
"కానీ, అల్లర్లు సద్దుమణిగి సాధారణ పరిస్థితి వచ్చేవరకూ ఎన్నిరోజులైనా సరే హోటల్లోనే ఉండండి. డబ్బులు ఏమీ చెల్లించనవసరం లేదని హోటల్ సిబ్బంది చెప్పారు" అని సూర్యకుమారి వివరించారు.

అందరినీ సురక్షితంగా ఇళ్లకు చేర్చుతాం: పల్లా శ్రీనివాసరావు
నేపాల్ నుంచి విశాఖపట్నం చేరుకున్న వారందరినీ సురక్షితంగా ప్రత్యేక వాహనాల్లో వారి ఇళ్లకు చేర్చుతున్నట్లు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చెప్పారు.
విశాఖకి చేరుకున్న 144 మందిలో విశాఖకు చెందినవారు 42 మంది ఉన్నారు. మరో 34 మంది విజయనగరం, 28 మంది శ్రీకాకుళానికి, 40 మంది రాయలసీమ ప్రాంతానికి చెందినవారు ఉన్నారని ఎమ్మెల్యే పల్లా బీబీసీతో చెప్పారు.
సమష్టి కృషికి అభినందనలు: సీఎం చంద్రబాబు
ప్రభుత్వ యంత్రాంగం సమష్టిగా పనిచేసి, నేపాల్ నుంచి తెలుగువారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
విమానంలో వచ్చినవారు కాకుండా మరికొందరు తెలుగువారు అక్కడే ఉన్నారని, వారిని బస్సుల్లో తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేష్ తెలిపారు.
"బస్సుల్లో 22 మంది బిహార్ సరిహద్దు ద్వారా మన దేశంలోకి ప్రవేశించారు. నేపాల్ సిమికోట్ నుంచి ప్రత్యేక విమానంలో 12 మందిని భారత సరిహద్దులోని నేపాల్ గంజ్‌కు తీసుకొచ్చారు. అక్కడి నుంచి వారిని వాహనాల్లో లఖ్‌నవూకు చేర్చారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రానికి చేరుకోనున్నారు. నేపాల్‌లో చిక్కుకున్న ప్రతి తెలుగువ్యక్తినీ సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత ప్రభుత్వానిదే. తగిన ఏర్పాట్లు చేసేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చాం" అని మంత్రి లోకేష్ చెప్పారు.
ఆఖరు వ్యక్తినీ రాష్ట్రానికి తీసుకొచ్చే వరకు ఏపీ భవన్, ఆర్టీజీఎస్ కేంద్రంలో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ కొనసాగుతుందని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














