బీజాపూర్ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మృతి

ఫొటో సోర్స్, UGC
- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
మావోయిస్ట్ పార్టీలో కీలక నేత, కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందారు.
కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న సుధాకర్‌పై కోటి రూపాయల రివార్డు ఉంది. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం.
గురువారం (జూన్ 5) మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు వెల్లడించారు.
ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నట్లు అందిన సమాచారం మేరకు సైనిక దళాలు, ఆపరేషన్ చేపట్టాయని ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.
మావోయిస్టులు, ఉమ్మడి దళాల మధ్య ఉదయం నుంచి ఎదురుకాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
ఈ కాల్పుల్లోనే తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మృతిచెందారని ఛత్తీస్‌గఢ్ పోలీసులు చెప్పారు.
గత 40 ఏళ్లకు పైగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్న సుధాకర్ 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో పాల్గొన్నారు.


ఫొటో సోర్స్, AFP via Getty Images
ఏం జరిగిందంటే...
చత్తీస్‌గఢ్ బీజాపూర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో జూన్ 5న గురువారం డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించాయని ఛత్తీస్‌గఢ్ పోలీస్ వర్గాలు చెప్పాయి.
ఉమ్మడి దళాలు, నక్సల్స్ మధ్య ఈ తెల్లవారుజామునుంచి కాల్పులు జరిగాయి. భద్రతా దళాల కాల్పుల్లో మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు సుధాకర్ మరణించారు. ఈ సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది.
మిలటరీ పోరాట వ్యూహాల్లో పేరు పొందిన సుధాకర్‌కు గౌతమ్, టీఎల్ఎన్ చలం, సింహాచలం, ఆనంద్, చంటి బాలకృష్ణ రామరాజు, సోమన్న అనే మారు పేర్లు ఉన్నాయి.
"మావోయిస్ట్ పార్టీ ఛీఫ్ నంబాల కేశవరావు మరణం తర్వాత సుధాకర్ ఆ స్థానానికి చేరుతారని అనుకున్నారు. ఎందుకంటే ఆయన మిలటరీ వ్యూహాల్లో దిట్ట. కానీ కేశవరావు మరణంచిన కొద్ది రోజులకే సుధాకర్ కూడా మరణించారు" అని సామాజికవేత్త ఉషా ఎజ్ డానీ బీబీసీతో అన్నారు.
మెడిసిన్ సీటు రాకపోవడంతో ఆయుర్వేదంలోకి
ఇంటర్ పూర్తయిన తర్వాత 1979లో మెడిసన్ సీటు రాకపోవడంతో విజయవాడ ఆయుర్వేద డిగ్రీ కళాశాలలో జాయిన్ అయ్యారు సుధాకర్.
ఆ సమయంలో ఆయన స్టూడెంట్ యూనియన్‌కు నాయకత్వం వహించేవారని డానీ చెప్పారు. సుధాకర్‌కు కళాశాలలో డానీ సీనియర్.
1979-80 మధ్యకాలంలో విజయవాడలో ఆయుర్వేద కళాశాలలో చదువుకునే రోజుల్లో తెంటు లక్ష్మీనరసింహాచలం అలియాస్ సుధాకర్ విద్యార్థి సంఘానికి నాయకత్వం వహించారు. విజయవాడలోని ఎస్ఆర్ఆర్, శాతావాహన, సయ్యద్ అప్పలస్వామి, కేబీఎన్, లయోలా కళాశాలల స్టూడెంట్ వింగ్‌లకు నాయకుడిగా ఉండేవారని డానీ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
‘‘జమీందార్ బిల్డింగే మా హాస్టల్’’
‘‘ఆ సమయంలోనే మావోయిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులైన సుధాకర్, 1981 నుంచి పార్టీలో ఫుల్ టైమర్‌గా మారిపోయారు. ఆ తర్వాత ఒకటి, రెండు సార్లు ఊర్లో పండగలు, చావులు, శుభకార్యాల సమయంలో వచ్చినట్లు గుర్తు’’ అని డానీ చెప్పారు.
1983లో తండ్రి రామకృష్ణుడు చనిపోయినప్పుడు ఆయన వచ్చారని డానీ తెలిపారు.
సుధాకర్ ప్రగడవరంలో పుట్టినప్పటికీ, సత్యవోలులో పెరిగారు.
కృష్ణా జిల్లాలోని హనుమాన్ జంక్షన్ వద్ద ఉండే సత్యవోలు అతని తల్లి బంధువులు ఉండే ప్రాంతమని డానీ బీబీసీతో మాట్లాడుతూ తెలిపారు.
సుమారు 45 ఏళ్లుగా
మావోయిస్టు పార్టీకి పూర్తి స్థాయిలో 1981 నుంచి పని చేయడం ప్రారంభించిన సుధాకర్‌కు పార్టీలో 45 ఏళ్ల అనుభవం ఉంది.
2004లో మావోయిస్ట్ సెంట్రల్ కమిటీలో పని చేసే సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో... రాష్ట్ర ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య జరిగిన శాంతి చర్చల్లో పాల్గొన్న వారిలో సుధాకర్ కూడా ఉన్నారు" అని డానీ తెలిపారు.
హైదరాబాదులో జరిగిన ఈ చర్చల్లో ముఖ్యంగా గిరిజనుల సమస్యలు, అటవీ హక్కులు, భూ పంపిణీపై చర్చించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














