కేజీ బియ్యం రూ.350, గోధుమ పిండి రూ.125.. పాకిస్తాన్‌లో ద్రవ్యోల్బణం అమాంతం ఎందుకు పెరిగింది?

పాకిస్తాన్, ద్రవ్యోల్బణం, బియ్యం, గోధుమలు, గోధుమపిండి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సారా హసన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

గత కొద్ది వారాలు పాకిస్తాన్‌లో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. లక్షలాది మంది వరదల బారినపడ్డారు. జనజీవనం అస్తవ్యస్తమైంది.

ఆహార పదార్థాల ధరలు కూడా బాగా పెరిగాయి. రెండు వారాల్లోనే పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో 20 కిలోల గోధుమ పిండి బస్తా ధర 2,500 రూపాయలకి చేరింది.

బియ్యం ధరల్లో కూడా భారీగా పెరుగుదల కనిపించింది.

25 కిలోల బియ్యం సంచి ఇప్పుడు 9 వేల నుంచి 9,500 రూపాయలకు అమ్ముడవుతోంది, ఇంతకుముందు రూ.8 వేలు ఉండేదని కమిషన్ ఏజెంట్లు చెబుతున్నారు.

25 కిలోల బియ్యం బస్తా ధర గతంలో కంటే 1,000 రూపాయలకు పైగా పెరిగింది. ఒక్కో కేజీకి 40 రూపాయల వరకూ పెరిగింది.

వరదల తర్వాత, మార్కెట్‌కు గోధుమల సరఫరా తగ్గిందని, గోడౌన్లలో నిల్వ చేసిన ధాన్యం కూడా పాడైపోయిందని పిండి మిల్లుల యజమానులు చెబుతున్నారు. ధరలు పెరగడానికి ఇదే కారణమని వారంటున్నారు.

అయితే, ఆహార పదార్థాల కొరత కంటే నిల్వలు దాచిపెట్టుకోవడం, లాభార్జన కోసం చూడడం వల్లే ధరలు పెరుగుతున్నాయని నిపుణులంటున్నారు.

వరదల వల్ల కొరత ఏర్పడిందా? లేదంటే నిల్వలు దాచుకుంటున్నారా? ఈ సమస్యను అర్థం చేసుకోవడానికి, పిండి మిల్లుల యజమానులు, ధాన్యం మార్కెట్‌కు చెందిన వ్యాపారులు, నిపుణులతో బీబీసీ మాట్లాడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్, ద్రవ్యోల్బణం, బియ్యం, గోధుమలు, గోధుమపిండి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పాకిస్తాన్‌లో ఏటా సెప్టెంబర్ తర్వాత గోధుమ ధరలు పెరుగుతాయి.

పెరుగుతున్న గోధుమ ధరలు

పాకిస్తాన్‌లో గోధుమలు, పిండి ధరలు సాధారణంగా ఏటా సెప్టెంబర్ తర్వాత పెరుగుతాయి.

ఈ సమయంలో, కొత్త పంట వచ్చినప్పుడు, ప్రజలు తమ అవసరాల కోసం గోధుమలు కొంటారు. అవి అయిపోతే మార్కెట్‌లో పిండి కొనడం ప్రారంభిస్తారు. పిండి మిల్లులు కూడా మార్కెట్ నుంచి గోధుమలను కొని పిండిగా మార్చి అమ్ముతాయి.

దీనివల్ల డిమాండ్ పెరిగినప్పుడు.. పిండి, గోధుమల ధరలు కూడా పెరుగుతాయి. దీనిని 'సీజనల్ సైకిల్' అంటారు. దీనిని నియంత్రించడానికి ప్రభుత్వం తన గిడ్డంగులలోని గోధుమలను మార్కెట్లో విక్రయిస్తుంది. స్టాక్ తక్కువగా ఉంటే దిగుమతులు చేసుకుంటారు. దీంతో ధరలు మామూలుగా ఉంటాయి.

ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ సంవత్సరం పాకిస్తాన్‌లో మొత్తం గోధుమ ఉత్పత్తి 29.6 మిలియన్ టన్నులు. 32 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరగాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే, ప్రభుత్వం వద్ద అదనపు గోధుమ నిల్వలున్నాయి.

ఐఎంఎఫ్ ఒత్తిడి, ప్రభుత్వ గిడ్డంగులలో అదనపు గోధుమలు ఉండటం వల్ల, ప్రభుత్వం రైతుల నుంచి గోధుమలు కొనలేదు. దీంతో, మార్కెట్లో ధరలు తగ్గడం మొదలైంది.

గత ఏడాది మాండ్(సుమారుగా 40 కిలోలు) గోధుమల ధర 3,900 రూపాయలుంటే.. ఇప్పుడు 1,800 నుంచి 2,000 రూపాయలకు తగ్గింది. అందుకే రైతులు నిరసనలు ప్రారంభించారు.

"గోధుమ ధరలు తక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా గోధుమలను కొనని అనేక రంగాలవారు కూడా వాటిని కొనడం మొదలుపెట్టారు. ఉదాహరణకు పౌల్ట్రీ ఫీడ్, పశుగ్రాస ఫ్యాక్టరీల వంటివారు. ఎందుకంటే, దాణాలో ఉపయోగించే మొక్కజొన్న వంటి ఇతర పదార్థాల కంటే గోధుమలు చౌకగా ఉంటాయి" అని కమోడిటీ నిపుణులు షంసుల్ ఇస్లాం చెప్పారు.

పాకిస్తాన్, ద్రవ్యోల్బణం, బియ్యం, గోధుమలు, గోధుమపిండి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇటీవల పంజాబ్ ప్రభుత్వం లక్ష టన్నులకు పైగా గోధుమలను స్వాధీనం చేసుకుంది.

వరదల ప్రభావమెంత?

ఈ సంవత్సరం పంట కోతల తర్వాత గోధుమ ధర తగ్గడం వల్ల, పిండి కూడా చౌకగా మారిందని ఆయన తెలిపారు.

"పాకిస్తాన్, భారత్ యుద్ధ సమయంలో బియ్యం, గోధుమల నిల్వల్లో అకస్మాత్తుగా పెరుగుదల కనిపించింది. అప్పుడు పిండి మిల్లులు కూడా గోధుమలను నిల్వ చేశాయి. ఇతరులు కూడా రంగంలోకి దిగారు" అని షంసుల్ ఇస్లాం తెలిపారు.

ఆగస్ట్ మధ్య నుంచి భారీ వర్షాల కారణంగా పంజాబ్‌లోని చాలా ప్రాంతాల్లో వరద పరిస్థితి కొనసాగుతోంది.

ఆగస్ట్ చివరిలో కేంద్ర ఆహార భద్రతా మంత్రి రాణా తన్వీర్ అహ్మద్ అధ్యక్షతన గోధుమ బోర్డు సమావేశం జరిగింది. దేశంలో తగినంత గోధుమ నిల్వలు ఉన్నందున, ప్రభుత్వం గోధుమలను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదని నిర్ణయించారు.

"గోధుమలను దిగుమతి చేసుకోబోమని ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత తమ ఇష్టానుసారం మార్కెట్లో ధరలను పెంచొచ్చు, తగ్గించొచ్చు అని నిల్వదారులు గ్రహించారు" అని షంసుల్ ఇస్లాం అన్నారు.

ఒక మాండ్‌ గోధుమలను 2,200 రూపాయలకు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు 4,000 రూపాయల చొప్పున అమ్ముతున్నారని, అందుకే వినియోగదారులకు పిండి రేటు పెరిగిందని ఆయన తెలిపారు.

అయితే, మార్కెట్లో గోధుమల ధరలు పెరగడం వల్లే పిండి ధర పెరుగుతోందని ఫ్లోర్ మిల్ అసోసియేషన్ వాదిస్తోందని షంసుల్ ఇస్లాం అంటున్నారు.

20 కిలోల బ్యాగ్ ధర 1,500 రూపాయలు నుంచి 2,500 రూపాయలకు పెరిగిందని ఆయన అన్నారు.

ఇటీవల, పంజాబ్ ప్రభుత్వం గోధుమ నిల్వలపై చర్య తీసుకుని, పశుగ్రాస మిల్లుల గోడౌన్ల నుంచి లక్ష టన్నులకు పైగా గోధుమలను స్వాధీనం చేసుకుంది.

ఈ గోధుమలను ఒక్కో మాండ్‌కు 3,000 రూపాయల చొప్పున, 20 కిలోల పిండి బస్తాను 1,810 రూపాయల చొప్పున విక్రయించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

పంజాబ్‌లో ధరలను స్థిరీకరించడానికి, ప్రభుత్వం ప్రతి నెలా కనీసం 5 లక్షల టన్నుల గోధుమలను మార్కెట్లోకి విడుదల చేయాల్సి ఉంటుందని పిండి మిల్లుల సంఘం అంటోంది.

పాకిస్తాన్, ద్రవ్యోల్బణం, బియ్యం, గోధుమలు, గోధుమపిండి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పిండి ధరలు కూడా భారీగా పెరిగాయి.

బలూచిస్తాన్‌లో పెరిగిన ధరలు

పాకిస్తాన్‌లో పిండి ధరలు అకస్మాత్తుగా పెరిగిన తర్వాత, ఖైబర్ పఖ్తుంఖ్వాలో 20 కిలోల పిండి బ్యాగ్ 900 నుంచి 1,000 రూపాయలకు అమ్ముడవుతోంది. ఇప్పుడు అదే 20 కిలోల బ్యాగ్ 2,400 రూపాయల నుంచి 2,500 రూపాయలకు అమ్ముడవుతోంది. పిండి ధర పెరగడంతో, బ్రెడ్ ధర కూడా పెరిగింది.

ఖైబర్ పఖ్తుంఖ్వా గోధుమల కోసం పంజాబ్‌పై ఆధారపడి ఉందని ఖైబర్ పఖ్తుంఖ్వా ఆహార మంత్రి జహీర్ షాహ్ టోరో బీబీసీ ప్రతినిధి అజీజుల్లాహ్ ఖాన్‌తో చెప్పారు. బలూచిస్తాన్ రాజధాని క్వెట్టాతో సహా ఇతర ప్రాంతాలలో కూడా పిండి ధర గణనీయంగా పెరిగింది. గతంలో 1600 రూపాయలకి లభించే 20 కిలోల పిండి సంచి ఇప్పుడు 2,000 నుంచి 2,100 రూపాయలకు పెరిగింది.

మార్కెట్లో సరఫరా కొరత కారణంగా పిండి ధర పెరిగిందని స్థానిక వ్యాపారులు అంటుంటే.. వరదలు, పంజాబ్ నుంచి పిండి రవాణాపై నిషేధం దీనికి ప్రధాన కారణమని ఆహార శాఖ అధికారులు చెబుతున్నారు.

గోధుమలు, పిండి ధరలు పెరిగిన తరువాత ప్రావిన్షియల్ ప్రభుత్వం గోధుమలు, పిండి, ఇతర గోధుమ ఉత్పత్తుల అంతర్-ప్రాంతీయ తరలింపును నిషేధించిందని పంజాబ్ ప్రభుత్వం చెబుతోంది.

పాకిస్తాన్, ద్రవ్యోల్బణం, బియ్యం, గోధుమలు, గోధుమపిండి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వరదల ప్రభావంతో బియ్యం ధరలు కూడా పెరిగాయని భావిస్తున్నారు.

బియ్యం ధరలు..

గోధుమల తర్వాత ఎక్కువగా వినియోగించేది బియ్యం. వరదల తర్వాత బియ్యం ధర కూడా కిలోకు 30 నుంచి 40 రూపాయలు పెరిగింది.

"25 కిలోల బియ్యం సంచి ఇప్పుడు 9 వేల నుంచి 9,500 రూపాయలకు అమ్ముడవుతోంది, 8 వేల నుంచి ఇలా పెరిగింది'' అని రావల్పిండి ధాన్యం మార్కెట్లో పనిచేసే కమిషన్ ఏజెంట్ బిలాల్ హఫీజ్ బీబీసీతో అన్నారు.

వరదల కారణంగా సరఫరా ప్రభావితమైందని, అద్దె కూడా పెరిగిందని, ఇప్పుడు బియ్యం పాతబడిపోతున్నాయి కాబట్టి ధర పెరుగుతోందని చెప్పారు.

వరదల కారణంగా వరి పంట దెబ్బతిన్నదన్న వాదనను కమోడిటీ నిపుణులు షామ్స్ ఇస్లాం తోసిపుచ్చారు.

"నదీ తీరాల్లో లేదా పొడి ప్రాంతాలలో పంట దెబ్బతింది, కానీ సియాల్‌కోట్ లేదా నరోవాల్ వంటి ఇతర ప్రాంతాలలో తొలి పంటకు నష్టం జరగలేదు. పెరిగిన ధరలు ఎక్కువ రోజులుండవు, తొందరలోనే తగ్గుతాయి'' అని ఆయన చెప్పారు.

వరదల వల్ల వరి కోత ఒక నెల ఆలస్యం అయిందని, గతంలో బియ్యం నిల్వలు పెద్దగా లేవని రైస్ మిల్లు యజమాని, ఎగుమతిదారు మియాన్ సబిహ్-ఉర్-రెహ్మాన్ అన్నారు.

దీనివల్ల మార్కెట్లో బియ్యం ధర పెరిగిందని ఆయన బీబీసీతో అన్నారు.

వరదలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయని చెప్పేందుకు నిర్దిష్ట కారణం కనిపించడం లేదని, కానీ కొందరు వరదలను ఉపయోగించి వస్తువుల కొరతను సృష్టించవచ్చని ఫైసలాబాద్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్-చాన్సలర్ జుల్ఫికర్ అలీ అన్నారు.

"వరదలు తాత్కాలిక నష్టాన్ని కలిగిస్తాయి కానీ, అవి భూసారాన్ని పెంచుతాయి. వరద ప్రభావిత ప్రాంతాల నుంచి నీరు బయటకు వెళ్లి నవంబరు నాటికి గోధుమ పంట వేయడానికి భూమి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నాం" అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)