మణిపుర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. 28 నెలలుగా అక్కడ ఏం జరుగుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మణిపుర్‌లో పర్యటిస్తున్నారు. చురాచాంద్‌పుర్‌లో రూ. 8,500 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు.
మణిపుర్‌లో హింసాకాండతో తీవ్రంగా ప్రభావితమైన జిల్లా చురాచాంద్‌పుర్. 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
2023 మేలో జాతుల హింస చెలరేగిన తర్వాత ప్రధాని మోదీ మణిపుర్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.
మోదీ మణిపుర్‌లో ఎందుకు పర్యటించడంలేదని ప్రతిపక్షాలు చాలా కాలంగా ప్రశ్నిస్తున్నాయి.
28 నెలలుగా మణిపుర్‌లో గందరగోళం, రాజకీయ ప్రతిష్టంభన ఏర్పడ్డాయి. అసలు 2023 నుంచి ఇప్పటివరకు మణిపుర్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం.


ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images
మే 2023 : మణిపుర్‌లో చెలరేగిన హింస
మైతేయి కమ్యూనిటీని షెడ్యూల్డ్ తెగల జాబితాలో చేర్చే ప్రక్రియను వేగవంతం చేయాలని మార్చి 27, 2023న మణిపుర్ హైకోర్టు, అక్కడి ప్రభుత్వాన్ని ఆదేశించింది.
కొన్ని రోజుల తర్వాత, 2023 మే 3న, కుకీ, మైతేయి వర్గాల మధ్య హింస చెలరేగింది.
ఈ హింసలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆల్ ట్రైబల్ స్టూడెంట్స్ యూనియన్ మణిపుర్‌లో నిర్వహించిన ర్యాలీ హింసాత్మకంగా మారింది. పరిస్థితి అదుపుతప్పడంతో కనిపిస్తే కాల్చివేతకు ఆదేశాలిచ్చింది అధికార యంత్రాంగం.
దాంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో కర్ఫ్యూ విధించారు. సైన్యం, అస్సాం రైఫిల్స్‌ను మోహరించాల్సి వచ్చింది. ఈ సంఘర్షణకు మూల కారణం మైతేయి కమ్యూనిటీకి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్. దీనిని కుకీ కమ్యూనిటీ వ్యతిరేకించింది.
ఫిబ్రవరి 2024లో, మైతేయీలకు ఎస్టీ హోదా నిబంధనను హైకోర్టు తొలగించింది.
ఈ హింసలో ప్రజల ఆస్తులకు నష్టం కలిగింది. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.
ఇప్పటికీ చాలా మంది ప్రజలు సహాయ శిబిరాల్లో లేదా మిజోరం వంటి పొరుగు రాష్ట్రాలలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం, ఈ ఘర్షణల్లో 250 మందికి పైగా మరణించారు.

ఫొటో సోర్స్, Getty Images
మే 2023 : అమిత్ షా పర్యటన
హింస జరిగిన కొన్ని వారాల తర్వాత, మే నెల చివరిలో హోంమంత్రి అమిత్ షా మణిపుర్‌లో పర్యటించారు.
పరిస్థితి అదుపులో ఉందని, దాదాపు 20 వేల మందిని సురక్షిత శిబిరాలకు తరలించామని అప్పటి ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ చెప్పారు.
వివిధ సంఘాలు, రాజకీయ పార్టీలతో అమిత్ షా చర్చలు జరిపారు. "శాంతిని పునరుద్ధరించడం ప్రభుత్వ మొదటి ప్రాధాన్యం" అని చెప్పారు.
హింసను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
జులై 2023: ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియో వెలుగులోకి
జూలై 19, 2023న, ఒక వీడియో దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కుకీ కమ్యూనిటీకి చెందిన ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి హింసిస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది.
ఈ సంఘటన మే 4న థోబల్ జిల్లాలో జరిగిందని పోలీసులు నిర్ధారించారు.
మణిపుర్‌లో జరిగిన సంఘటనలపై మొదటిసారి స్పందించిన ప్రధానమంత్రి మోదీ తన హృదయం బాధతో నిండిపోయిందని, దోషులను వదిలిపెట్టబోమమని అన్నారు.
ఈ సంఘటన తర్వాత, రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. శాంతిభద్రతలపై అనేక ప్రశ్నలు వినిపించాయి.
మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే కూడా దీనిపై ఆందోళన వ్యక్తం చేశారు.
"మణిపుర్‌లో జరుగుతున్న దానిలో విదేశీ సంస్థల ప్రమేయాన్ని తోసిపుచ్చలేం. సరిహద్దు రాష్ట్రాల్లో అస్థిరత జాతీయ భద్రతకు మంచిది కాదు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జనవరి 2024: మళ్లీ హింస, రాహుల్ గాంధీ పర్యటన
2024 జనవరిలో, 48 గంటల వ్యవధిలో జరిగిన వేర్వేరు హింసాత్మక సంఘటనల్లో ఐదుగురు పౌరులు, ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మణిపుర్ నుంచి 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించారు.
"మణిపుర్ ఎదుర్కొన్న బాధను మేం అర్థం చేసుకున్నాం" అని ఇంఫాల్ సమీపంలోని థోబాల్‌లో జరిగిన ర్యాలీలో ఆయన అన్నారు.
"ఈ రాష్ట్రంలో ఎప్పుడూ శాంతి, ప్రేమ, ఐక్యత ఉంటాయి. వాటిని తిరిగి తీసుకువస్తామని మేము హామీ ఇస్తున్నాం" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఏప్రిల్ 2024: మణిపుర్ విషయం మాట్లాడిన ప్రధాని మోదీ
2024 లోక్‌సభ ఎన్నికలు ప్రకటించిన తర్వాత, ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి మణిపుర్ సమస్య గురించి మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం సకాలంలో జోక్యం చేసుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం కృషి కారణంగా మణిపుర్‌లో పరిస్థితి మెరుగుపడిందని మోదీ అన్నారు.
ఆ సమయంలో మోదీ "ది అస్సాం ట్రిబ్యూన్"కి ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు.
"పరిస్థితిని సున్నితంగా ఎదుర్కోవడం అందరి సమష్టి బాధ్యత అని మేం భావిస్తున్నాం. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడానికి మెరుగైన పరిపాలనాయంత్రాంగాన్ని ఏర్పాటుచేశాం'' అని ఆ ఇంటర్వ్యూలో మోదీ చెప్పారు.
'మణిపుర్, భారతదేశంలో ప్రస్తుత మత స్వేచ్ఛ స్థితి' అనే అంశం ఏప్రిల్ 2024లో బ్రిటిష్ పార్లమెంట్‌లో ప్రస్తావనకు వచ్చింది.
వించెస్టర్ లార్డ్ బిషప్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా, అప్పటి బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి డేవిడ్ కామెరూన్, హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, తన రాజ్యాంగం ద్వారా మత స్వేచ్ఛ విశ్వాసాలకు భారత్ కట్టుబడి ఉందని అన్నారు.

ఫొటో సోర్స్, Manipur Police
సెప్టెంబర్ 2024: డ్రోన్ దాడులు, ఘర్షణలు
2024 సెప్టెంబర్ 1న, ఇంఫాల్ జిల్లాలో మళ్లీ హింస చెలరేగింది. ఈ హింసలో ఒక మహిళ సహా ఇద్దరు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారు.
డ్రోన్ ఉపయోగించి ఈ దాడి చేశారని పోలీసులు తెలిపారు.
అప్పటికి నాలుగు నెలలుగా రాష్ట్రంలో అప్పుడప్పుడు మాత్రమే హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయి.
ఈ సంఘటన జరిగిన వారం తరువాత, జిరీబామ్ జిల్లాలో ఘర్షణలు చెలరేగాయి, ఇందులో నలుగురు అనుమానిత కుకీ మిలిటెంట్లు, ఒక పౌరుడు మరణించారు. మైతేయి కమ్యూనిటీకి చెందిన ఒకరి హత్య తర్వాత ఈ హింస చెలరేగింది.

ఫొటో సోర్స్, SangmaConrad/X
నవంబరు 2024: మద్దతు ఉపసంహరించుకున్న ఎన్‌పీపీ
నవంబరు 2024లో పరిస్థితి మరింత దిగజారింది. నవంబర్ 11న భద్రతా దళాలు, సాయుధ అనుమానితుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో 10 మంది మరణించారు.
ఈ సంఘటన తర్వాత, మిజోరంలో నివసిస్తున్న మైతేయి కమ్యూనిటీకి జో రీయూనిఫికేషన్ ఆర్గనైజేషన్ (ZORO) అనే సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది.
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పీపీ) బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబరు 2024: గవర్నర్‌గా అజయ్ కుమార్ భల్లా
మణిపుర్ కొత్త గవర్నర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ కుమార్ భల్లాను డిసెంబరు 2024లో కేంద్రం నియమించింది.
అంతవరకు అస్సాం గవర్నర్ లక్ష్మణ్ ఆచార్య తాత్కాలిక గవర్నర్‌గా ఉన్నారు.
తర్వాత కొన్ని నెలల్లో ఇంఫాల్ తూర్పు జిల్లా సరిహద్దులో ఉన్న సైబోల్ గ్రామంతో పాటు పలుచోట్ల కేంద్ర భద్రతాదళాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు జరిగాయని పీటీఐ తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
9 ఫిబ్రవరి 2025: ముఖ్యమంత్రి రాజీనామా
దాదాపు 21 నెలల ఘర్షణల తర్వాత, ముఖ్యమంత్రి ఎన్.బిరేన్ సింగ్ 9 ఫిబ్రవరి 2025న రాజీనామా చేశారు.
అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే ఆయన రాజీనామా చేశారు.
శాంతిభద్రతలు మెరుగుపడుతున్నాయని, ప్రభుత్వం శాంతిని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తోందని రాజీనామాకు ముందు ఆయన చెప్పేవారు.

ఫొటో సోర్స్, Getty Images
2025 ఫిబ్రవరి 13: రాష్ట్రపతి పాలన
బిరేన్ సింగ్ రాజీనామా తర్వాత మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. కొత్త ముఖ్యమంత్రిపై ఏకాభిప్రాయం లేకపోవడంతో ఈ చర్య తీసుకున్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ ఆగస్టు 5, 2025న, మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించాలని రాజ్యసభలో ప్రతిపాదించారు.
దీనిపై గందరగోళం ఉన్నప్పటికీ, సభ తీర్మానాన్ని ఆమోదించింది.
ఆగస్టు 13, 2025 నుంచి మరో ఆరు నెలలకు రాష్ట్రపతి పాలన పొడిగించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














