లైంగిక దాడికి యత్నించిన వ్యక్తి నాలుక కొరికిన మహిళకు జైలుశిక్ష వేశారు, 61 ఏళ్ల తర్వాత మళ్లీ ఏం చెప్పారంటే...

ఫొటో సోర్స్, EPA
- రచయిత, కెల్లీ ఎన్జీ, యుజిన్ చోయ్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
లైంగిక దాడి సమయంలో ఆత్మ రక్షణ కోసం ఆ వ్యక్తి నాలుకను కొరికినందుకు ఓ మహిళకు జైలు శిక్ష పడింది. దశాబ్దాల నాటి ఈ కేసును కోర్టు తిరిగి విచారించడంతో దక్షిణ కొరియాకు చెందిన ఆ మహిళను నిర్దోషిగా ప్రకటించారు.
శిక్ష పడినప్పుడు చోయ్ మాల్-జాకు 18 ఏళ్లు. ఓ వ్యక్తికి తీవ్రమైన హాని కలిగించినందుకు ఆమెకు 10 నెలల పాటు జైలు శిక్ష విధించింది అప్పట్లో ఓ కోర్టు.
ఆమెపై లైంగిక దాడికి యత్నించిన 21 ఏళ్ల వ్యక్తికి కేవలం ఆరు నెలల శిక్షే వేసింది.
తనపై పడిన ముద్రను తొలగించుకునేందుకు ఎన్నో ఏళ్లుగా చోయ్ మాల్-జా పోరాటం చేస్తూ వచ్చారు. ఈ ఏడాది జులైలో బుసాన్‌లోని కోర్టు ఈ కేసును తిరిగి విచారించింది.

మొదటి విచారణలోనే ప్రాసిక్యూటర్లు ఆమెకు క్షమాపణ చెప్పారు. అంతేకాక, అసాధారణ రీతిలో శిక్షను కూడా కొట్టివేయాలని కోర్టును కోరారు.
''సమాధానం లేకుండా ఈ కేసును వదిలేయాలని నేను అనుకోలేదు. నాలాంటి సమస్యను ఎదుర్కొంటోన్న ఇతర బాధితుల తరఫున నిలబడాలనుకున్నా'' అని నిర్దోషిగా ప్రకటించిన తర్వాత చోయ్ అన్నారు.
తాను టీనేజర్‌గా ఉన్నప్పుడు ఈ సంఘటన ఆమె జీవితాన్ని మార్చేసింది. బాధితురాలి నుంచి నిందితురాలుగా మార్చింది.
''ఈ కేసుపై పోరాడటమంటే ఒక బండరాయిపై రాళ్లను విసిరిన మాదిరి అని ప్రజలు నన్ను హెచ్చరించారు. అయినప్పటికీ, ఇలా ఈ కేసును వదిలేయాలని అనుకోలేదు'' అని చోయ్ అన్నారు. ప్రస్తుతం చోయ్‌కు 79 ఏళ్లు.

ఫొటో సోర్స్, News1
తన మద్దతుదారులకు చోయ్ థ్యాంక్స్ చెప్పారు. బలహీనులను అణగదొక్కేందుకు, చట్టాన్ని తారుమారు చేసేందుకు అప్పట్లో పవర్‌లో ఉన్నవారు తమ అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఆమె అన్నారు.
లైంగిక వేధింపుల సమయంలో ఆత్మ రక్షణ ఏంటో గుర్తించడంలో కోర్టు విఫలమైందని దక్షిణ కొరియా లా పుస్తకాల్లో చోయ్ కేసును ఒక ఉదాహరణగా పేర్కొన్నారు.
కోర్టు రికార్డుల ప్రకారం.. దక్షిణాది పట్టణమైన గిమ్హేలో ఒక దగ్గర చోయ్‌ను దుండగుడు దాడి చేసిన నేలకేసి కొట్టాడు. ఆయన చేతుల్లోంచి బయటపడేందుకు ఆ వ్యక్తి నాలుకను 1.5 సెంటీమీటర్లు కొరికి అక్కడి నుంచి ఆమె తప్పించుకున్నారు.
ఆమె కొరకడంతో అయిన గాయానికి ఆ వ్యక్తి పరిహారం డిమాండ్ చేశారు. ఒక సందర్భంలో కత్తితో చోయ్ ఇంట్లోకి చొరబడి బెదిరించినట్లు కూడా దక్షిణ కొరియా మీడియా రిపోర్టు చేసింది.
దక్షిణ కొరియాలో లైంగిక హింస కేసు తీర్పుల్లో ఇది తీవ్ర వివాదాస్పదమైంది.
అనుమతి లేకుండా ఆమె ఇంట్లోకి చొరబడి, బెదిరింపులకు పాల్పడినందుకు ఆ వ్యక్తికి కేవలం ఆరు నెలలు మాత్రమే జైలు శిక్ష విధించింది. ఆ శిక్షను కూడా రెండేళ్ల పాటు సస్పెండ్ చేశారు.
అత్యాచారానికి యత్నించినందుకు ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదు.
అయితే, ఆయన శరీర భాగానికి తీవ్రమైన హాని కలిగించినందుకు చోయ్‌కు మాత్రం కఠిన శిక్ష పడింది. ఆత్మరక్షణలో అవసరమైన దానికి మించి ఆమె చర్యలు ఉన్నాయని అప్పట్లో కోర్టు తెలిపింది.
విచారణ సమయంలో ఆరు నెలల పాటు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత 10 నెలల జైలు శిక్షను విధించారు. ఈ జైలు శిక్షను కూడా రెండేళ్ల పాటు నిలిపివేశారు.

ఫొటో సోర్స్, News1
2018లో దక్షిణ కొరియాలో కూడా సాగిన మీటూ (Me too) ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని, చోయ్ పలు అడ్వకసీ గ్రూప్‌లను సంప్రదించారు. తన కేసును తిరిగి విచారించాలంటూ పిటిషన్ వేశారు. దీనికి ముందు రెండేళ్ల పాటు ఈ కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను సేకరించారు.
కింది కోర్టులు ఆమె పిటిషన్‌ను తిరస్కరించాయి. ఆత్మ రక్షణకు సపోర్టు ఇచ్చేలా ఎలాంటి ఆధారాలు లేవని కింద కోర్టులు చెప్పాయి.
అయినప్పటికీ, చోయ్ తన పోరాటం ఆపలేదు. ఆమె ఎదుర్కొన్న మాదిరి సమస్యలు ఇతర లైంగిక వేధింపు బాధితులు ఎదుర్కోరాదని ఆమె కోరుకున్నారు.
‘‘వారు ఒంటరిగా ఈ బాధను మోయాల్సిన అవసరం లేదు’’ అని అంతకుముందు 'ది కొరియా హెరాల్డ్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.
చివరికి 2024 డిసెంబర్‌లో చోయ్ కేసును తిరిగి తెరిచేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.
బుధవారం కోర్టు బయట చోయ్, ఆమె మద్దతుదారులు చాలా సంతోషంగా ''చోయ్ మాల్-జా చేసి చూపించారు!'', ''చోయ్ మాల్-జా గెలుపొందారు'' అంటూ ప్లకార్డులు పట్టుకుని కనిపించారు.
లింగ పక్షపాతం, సమాజంలో ఉన్న పోకడలతో అంతకుముందుకు ఆమెకు శిక్ష విధిస్తూ తప్పుడు తీర్పు ఇచ్చారని చోయ్ న్యాయవాది కిమ్ సూ-జంగ్ అన్నారు.
‘‘ఎక్కడా వెనకడుగు వేయకుండా చోయ్ మాల్-జా చేసిన అలుపెరగని పోరాటానికి ధన్యవాదాలు. ప్రాసిక్యూషన్‌కు, జ్యూడిషరీకి తమ తప్పును దిద్దుకునేందుకు ఇవాళ అవకాశం వచ్చింది'' అని కిమ్ తెలిపారు.
పరిహారం కోరుతూ ప్రభుత్వంపై సివిల్ దావా వేయాలని చోయ్ ప్లాన్ చేస్తున్నట్లు కిమ్ చెప్పారు.
లైంగిక వేధింపు బాధితులకు న్యాయం జరిగేందుకు బుధవారం వెలువడిన తీర్పు ఒక మార్గం కానుందని చోయ్ పోరాటానికి మద్దతు ఇచ్చిన సంస్థలలో ఒకటైన కొరియా ఉమెన్ హాట్‌లైన్ సంస్థ తెలిపింది.
లైంగిక వేధింపుదారుల నాలుకలను కొరికిన కేసులు దక్షిణ కొరియాలో మరో రెండు ఉన్నాయి. ఒకటి యాన్‌డాంగ్ నగరంలో 1988లో జరగ్గా, మరొకటి 2020 బుసాన్‌లో జరిగింది.
ఈ రెండు కేసుల్లో కూడా మహిళలు చేసిన పనిని ఆత్మరక్షణకు చెందిన చట్టబద్దమైన చర్యలుగా గుర్తించి, వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చాయి కోర్టులు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














