మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన, కేంద్రం నోటిఫికేషన్ జారీ

ఫొటో సోర్స్, EPA
మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కిందటి ఆదివారం మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు.
మణిపుర్ దీర్ఘకాలంగా జాతుల మధ్య ఘర్షణలను చవిచూస్తోంది. ఈ హింసను అరికట్టడంలో ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ విఫలమయ్యారనే విమర్శలు బలంగా వినిపించాయి.

ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్‌ను తొలగించాలని కోరుతూ 19 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు.
లేఖపై సంతకాలు చేసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ సత్యబ్రత సింగ్, మంత్రులు తొంగమ్ బిశ్వజిత్ సింగ్, యుమ్నామ్ ఖేమ్ చంద్ సింగ్ తదితరులు ఉన్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీరేన్ సింగ్ నాలుగురోజుల కిందట దిల్లీకి వచ్చి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు.
తరువాత మణిపుర్‌కు చేరుకున్న బీరేన్ సింగ్ సాయంత్రం తన ఎమ్మెల్యేలతో రాజ్‌భవన్‌కు చేరుకుని గవర్నర్‌కు రాజీనామా సమర్పించారు.
త్వరలోనే కొత్త ముఖ్యమంత్రిని ప్రకటిస్తారని భావిస్తుండగా కేంద్రం రాష్ట్రపతి పాలన విధిస్తూ నోటిఫికేషన్ జారీచేసింది.
చిన్న రాష్ట్రమైన మణిపుర్‌లో రెండు గ్రూపులైన మెజార్టీ మెయితెయ్, మైనార్టీ కుకీ తెగల మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య హింసకు దారితీసి ఆ రాష్ట్రాన్ని తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది. 2023 మే3న మైతేయీ, కుకీ తెగల మధ్య హింస మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
మణిపుర్ ఎక్కడుంది? అక్కడెవరు నివసిస్తున్నారు?
బంగ్లాదేశ్ తూర్పున, మియన్మార్ సరిహద్దుల్లో ఉన్న ఈశాన్య భారత రాష్ట్రం మణిపుర్. పర్వతాలతో, లోయలతో, కొండలతో ఈ ప్రాంతం ఉంటుంది.
ఈ ప్రాంత జనాభా 33 లక్షలు.
ఈ రాష్ట్రంలో సగానికి పైగా మెయితెయ్ వర్గం వారు ఉన్నారు. సుమారు 43 శాతం మంది కుకీలు, నాగాలు మైనార్టీ తెగలుగా ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు.
మణిపుర్‌లోని మెయితెయ్ తెగ ప్రజలు తమను షెడ్యూల్డ్ తెగలలో చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే ఇక్కడ వివాదానికి దారితీసింది.
ఇప్పటికే ప్రభుత్వంలో, సమాజంలో బాగా పలుకబడి ఉన్న వీరి ప్రాబల్యాన్ని మరింత బలోపేతం చేస్తే, కుకీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో భూములు కొనేందుకు లేదా స్థిరపడేందుకు వారికి అనుమతిస్తున్నట్లు అవుతుందని వాదిస్తూ నిరసనలకు దిగారు.
అంతేకాక, వారి నిరసనలకు అనేక కారణాలు కూడా ఉన్నాయి. మెయితెయ్‌కి చెందిన ప్రభుత్వం డ్రగ్స్‌పై చేపట్టిన యుద్ధంతో, తమ కమ్యూనిటీలను సమూలంగా నాశనం చేయాలని చూస్తుందని కుకీలు ఆరోపిస్తున్నారు.
మియన్మార్ నుంచి ఈ రాష్ట్రంలో వస్తోన్న అక్రమ వలసలు కూడా ఈ ఉద్రిక్తలను మరింత పెంచాయి.
పెరుగుతోన్న జనాభాతో ఆ రాష్ట్రంలో భూ వినియోగంపై ఒత్తిడి పెరిగింది. యువతలో నిరుద్యోగం వారిని మిలటెంట్ల వైపుకి ఆకర్షితమయ్యేలా చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














