భారత్ నుంచి స్వదేశానికి తిరిగి వెళ్తున్న నేపాలీలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, సౌతిక్ బిశ్వాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
లఖ్‌నవూలోని ఒక బస్‌స్టాండ్‌లో ఉన్నవారి ముఖాలు ఆందోళనతో నిండి ఉన్నాయి. ఈ ఆందోళన వెనక మనిషికో కథ ఉంది.
ఒకప్పుడు పని వెతుక్కుంటూ భారత్‌కు వచ్చిన నేపాలీలు ఇప్పుడు తమ దేశానికి తిరిగి వెళ్లే తొందరలో ఉన్నారు. ఇప్పుడు నేపాల్‌లో దారుణమైన అశాంతి నెలకొంది.
"మేం మా మాతృభూమికి తిరిగి వెళ్తున్నాం. మాకు చాలా గందరగోళంగా ఉంది. మమ్మల్ని తిరిగి రమ్మని మా వాళ్లు కోరుతున్నారు'' అని ఒక వ్యక్తి చెప్పారు.
దేశంలో సోషల్ మీడియాపై నిషేధం కారణంగా చెలరేగిన ఘర్షణల్లో 30 మంది మరణించడంతో ఈ వారంలో నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ తన పదవికి రాజీనామా చేశారు.
సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేసినప్పటికీ నిరసనలు కొనసాగాయి.
దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించారు. వీధుల్లో సైనికులు గస్తీ కాస్తున్నారు. పార్లమెంట్, రాజకీయ నాయకుల ఇళ్లకు నిరసనకారులు నిప్పు పెట్టారు.
అయితే, నేపాల్‌కు తిరిగి వెళ్లడం అనేది కొంతమంది వలసదారులకు చాలా కఠినమైన నిర్ణయం.
''మా దేశంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి నేను తిరిగి వెళ్ళాలి. మా అమ్మానాన్న అక్కడే ఉన్నారు. అక్కడ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది'' అని బీబీసీతో సరోజ్ నెవర్బానీ అనే వలస కార్మికుడు చెప్పారు.


భారత్‌లో మూడు వర్గాలుగా నేపాలీలు
పెసల్, లక్ష్మణ్ భట్ అనే మరో ఇద్దరు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. "మాకు ఏమీ తెలియదు. కానీ, అక్కడున్న మా వాళ్లు మమ్మల్ని రమ్మని అంటున్నారు'' అని వారు చెప్పారు.
వెనక్కి వెళ్తున్న నేపాలీలు ఇప్పుడు తమ పని, వేతనం గురించి మాత్రమే కాదు నేపాల్‌లో ఉన్న తమ కుటుంబాలు, అభద్రత గురించి ఆలోచిస్తున్నారు.
భారత్‌లో నేపాలీలు ప్రధానంగా మూడు విభాగాలుగా ఉన్నారు.
మొదటి వర్గం వలస కార్మికులు. వీరు తమ కుటుంబాలను వదిలి భారత్‌లోని నగరాల్లో వంట పని, ఇంటి పని, సెక్యూరిటీ గార్డులుగా లేదా తక్కువ వేతనాలకు మరికొన్ని ఉద్యోగాల్లో పని చేస్తారు. వీళ్లు నేపాల్ పౌరులుగానే ఉంటారు. అప్పుడప్పుడు తమ దేశానికి వెళ్లి వస్తుంటారు. వీరికి ఆధార్ కార్డు ఉండదు. భారత్‌లోని ప్రాథమిక సేవలు కూడా లభించవు. అందుకే వీళ్లను సీజనల్ మైగ్రెంట్స్ అని పిలుస్తుంటారు.
రెండవ వర్గం.. కుటుంబాలతో వచ్చి భారత్‌లో స్థిరపడ్డారు. వీళ్లు భారత గుర్తింపుకార్డును కూడా పొందుతారు. కానీ, నేపాల్ పౌరసత్వాన్ని, తమ దేశంతో సంబంధాలను కొనసాగిస్తారు. అక్కడ ఓటు వేయడానికి వెళ్తుంటారు.
మూడవ వర్గం, నేపాలీ మూలాలు ఉన్న భారతీయ పౌరులు. 18వ శతాబ్దం నుంచి 20వ శతాబ్దం వరకు భారత్‌కు వలస వచ్చినవారి వారసులు వీళ్లు. భారత్‌లో స్థిరపడినా, నేపాల్‌తో సాంస్కృతిక సంబంధాలను కలిగి ఉంటారు.
తాజా అధికారిక గణాంకాల ప్రకారం, భారత్‌లో చదువుకుంటున్న విదేశీ విద్యార్థుల్లో నేపాలీలు ఎక్కువ మంది ఉన్నారు. సుమారు 47,000 మంది విదేశీ విద్యార్థులు ఉండగా 13,000 కంటే ఎక్కువ మంది నేపాలీలు ఉన్నారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రెమిటెన్స్‌పై ఆధారపడిన నేపాల్
నేపాల్ నుంచి భారత లేబర్ మార్కెట్‌లోకి ప్రవేశించే కొత్త వలస కార్మికులు మామూలుగా 15-20 ఏళ్ల వారై ఉంటారని కాఠ్‌మాండూలోని త్రిభువన్ విశ్వవిద్యాలయానికి చెందిన కేశవ్ బశ్యాల్ తెలిపారు. అయితే, మొత్తంగా చూసుకుంటే నేపాల్ నుంచి భారత్ వచ్చే కార్మికుల సగటు వయసు 35 అని బశ్యాల్ చెప్పారు.
ఈ వలసలకు ప్రధాన కారణం ఆ దేశంలోని నిరుద్యోగం, అసమానతలు.
''చాలామంది పేద కుటుంబాల నుంచి వస్తారు. వీరంతా ఉత్తరాఖండ్‌లో నిర్మాణ రంగం, ఆధ్యాత్మిక కేంద్రాల్లో, పంజాబ్‌లోని వ్యవసాయ క్షేత్రాల్లో, గుజరాత్‌లో కర్మాగారాలు, దిల్లీతో పాటు ఇతర నగరాల్లోని హోటళ్లలో పని చేస్తుంటారు'' అని డాక్టర్ కేశవ్ బశ్యాల్ చెప్పారు.
''సరిహద్దులు తెరచి ఉండటం వల్ల భారత్‌లో నివసిస్తున్న, పని చేస్తున్న నేపాలీల కచ్చితమైన సంఖ్యను తెలుసుకోవడం కష్టం. కానీ, 10 నుంచి 15 లక్షల మంది వరకు ఉండొచ్చని అంచనా'' అని ఎడిన్‌బర్గ్ విశ్వవిద్యాలయంలోని దక్షిణాసియా పొలిటికల్ ఆంత్రొపాలజిస్ట్ జీవన్ శర్మ చెప్పారు.
2016-17లో నేపాల్ జీడీపీలో నాలుగో వంతు కంటే ఎక్కువగా విదేశాల నుంచి డబ్బు (రెమిటెన్స్) అందుకుంది. 2024 నాటికి ఇలా విదేశాల నుంచి వచ్చే డబ్బు 27–30%కి పెరిగింది. దేశంలో 70% కంటే ఎక్కువ గృహాలు ఈ డబ్బును అందుకుంటున్నాయి. ఇప్పుడు రెమిటెన్స్ రూపంలో వచ్చే డబ్బు కుటుంబ ఆదాయంలో మూడింట ఒక వంతుగా ఉంది. మూడు దశాబ్దాల క్రితం ఇది 27% మాత్రమే. ఈ డబ్బులో ఎక్కువ భాగం గల్ఫ్, మలేసియాలో పని చేస్తున్న నేపాల్ పౌరుల నుంచి అందుతుంది. నేపాల్‌కు అందే రెమిటెన్స్‌లో భారత్ వాటా దాదాపు 5 శాతం. ఇవన్నీ కలిసి ప్రపంచంలో అత్యధికంగా రెమిటెన్స్‌పై ఆధారపడిన నాలుగో దేశంగా నేపాల్‌ను మార్చాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌లో నేపాలీలు వివక్షకు గురవుతున్నారా?
''భారత్ నుంచి రెమిటెన్స్ రూపంలో వచ్చే డబ్బు నేపాల్‌లోని అత్యంత పేద కుటుంబాలకు చేరుతుంది.
అయితే భారత్ వచ్చే నేపాల్ వలసదారులు సంపాదించే డబ్బు, గల్ఫ్ లేదా ఆగ్నేయాసియాకు వెళ్లిన వలసదారుల నుంచి వచ్చే దానికంటే చాలా తక్కువ. కానీ, ఈ డబ్బు లేకపోతే నేపాల్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా దెబ్బతింటుంది'' అని ప్రొఫెసర్ శర్మ వివరించారు.
నేపాలీ వలసదారులపై 2017లో మహారాష్ట్రలో ఒక అధ్యయనం చేశారు.
అక్కడ నేపాలీ వలసదారులు శుభ్రత లేని ఇరుకు గదుల్లో ఉంటున్నట్లు, పని చేసే చోట, క్లినిక్‌లలో తరచుగా వివక్షను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు.
ఆల్కహాల్, పొగాకును ఎక్కువగా వాడుతున్నట్లు, లైంగిక ఆరోగ్యంపై వారికి చాలా తక్కువ అవగాహన ఉన్నట్లు అధ్యయనంలో తేలింది.
నేపాలీ వలసదారులు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవడానికి కాకుండా కేవలం ప్రాథమిక మనుగడ కోసం పని చేస్తున్నట్లుగా దిల్లీలో జరిగిన మరో అధ్యయనం తేల్చింది.
''నా దేశంలో ఏం జరుగుతుందో అనే దాని గురించి నేను ఎక్కువగా ఆలోచించలేదు. నేపాల్‌లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. చదువుకున్న వాళ్లకు కూడా పని దొరకడం కష్టం. అందుకే నా లాంటి వాళ్లు దేశం విడిచి బయటకు వెళ్లాల్సి వచ్చింది'' అని ముంబయిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న దన్‌రాజ్ కథాయథ్ చెప్పారు.
ఆయన 1988లో పని వెతుక్కుంటూ భారత్‌కు వచ్చారు. 16 ఏళ్లుగా భవనాలకు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు.
ధన్‌రాజ్ కథాయత్ కుటుంబం నేపాల్‌లోనే ఉంది. ఆయనకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. వారు చదువుకుంటున్నారు. భారత్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ, తాను తినడానికి, కుటుంబానికి కొంత పంపడానికి మాత్రమే సరిపడా సంపాదిస్తున్నారు. సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఆయన తన కుటుంబాన్ని కలుసుకుంటారు.
''ఇన్నేళ్ల తర్వాత కూడా నేను పెద్దగా కూడబెట్టింది లేదు. కొరియా, అమెరికా, మలేసియా వంటి ప్రాంతాలకు వెళ్లిన కొంతమంది వలసదారులు వృద్ధి సాధించారు. మాలాంటి వారు కాదు'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆశాభావంతో విద్యార్థులు
ఆర్థిక ఒత్తిళ్లకు లోనైన చాలామంది వలస కార్మికులకు భిన్నంగా, భారత్‌లోని నేపాలీ విద్యార్థులు భవిష్యత్తుపై ఆశాభావంతో ఉన్నారు.
తాను నేపాల్‌లో ఉండి ఉంటే ఈ ఆందోళనల్లో పాల్గొనే వాడినని బీబీసీతో దిల్లీలో చదువుతున్న అనంత్ మహతో చెప్పారు.
''రాజ్యాంగం అత్యున్నతమైనది. దాని పునర్నిర్మించే సమయం ఇదే'' అని ఆయన అన్నారు.
తన కుటుంబం గురించి ఆందోళన చెందుతున్న మరో విద్యార్థి టెక్రాజ్ కోయిరాలా మాట్లాడుతూ, ''నాకు రేపటిపై ఆశలు ఉన్నాయి'' అని అన్నారు.
''నేపాల్‌లో ఉంటే, నేను నా స్నేహితులతో కలిసి నిరసనల్లో పాల్గొనేవాడిని. అయితే, ఆస్తుల విధ్వంసాన్ని మాత్రం సమర్థించను. ఒక మంచి నాయకుడు వస్తారని ఆశిస్తున్నా'' అని మరో విద్యార్థిని ఆభా పరాజూలి చెప్పారు.
ఈ గందరగోళం మధ్య ప్రస్తుతానికి చాలామంది తిరిగి తమ ఇంటికి వెళ్తున్నారు. కానీ దీర్ఘకాలంలో అస్థిరత పెరిగితే ఎక్కువ మంది మళ్లీ పని వెతుక్కుంటూ నేపాల్‌ను విడిచిపెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే, భారత్‌లోని అసంఘటిత కార్మిక మార్కెట్ మరింత పెరుగుతుంది.
''ఈ రకమైన రాజకీయ సంక్షోభం నేపాల్‌లోని యువత నిరుద్యోగ సమస్యలను మరింత తీవ్రం చేస్తుంది. భారత్‌లో నేపాలీ వలసదారుల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో భారత్‌లో వారికి సరైన ఉపాధి పొందడం అంత సులభం కాదు'' అని ప్రొఫెసర్ బశ్యల్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














