‘మిరాయ్’ మూవీ రివ్యూ : హీరోగా తేజ సజ్జా, విలన్‌గా మంచు మనోజ్ హిట్ కొట్టారా?

తేజ సజ్జా, మనోజ్

ఫొటో సోర్స్, X/Manoj Manchu

    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం

హ‌నుమాన్‌తో హిట్ కొట్టిన తేజ స‌జ్జా, ఈగిల్‌తో డిజాస్ట‌ర్ అందుకున్న ద‌ర్శ‌కుడు కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని కాంబినేష‌న్‌లో మిరాయ్ సినిమా వ‌చ్చింది.

భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది?

కాంతారా త‌ర్వాత మైథాల‌జీని మిక్స్ చేయ‌డం ఒక స‌క్సెస్ ఫార్ములాగా మారింది.

ఈ ఫార్మాట్‌లో అనేక సినిమాలు వ‌చ్చాయి.

క‌ల్కి త‌ర్వాత మిరాయ్ మూవీ ప్రేక్షకుల ముందుకు వ‌చ్చింది.

మిరాయ్ అంటే శ్రీ‌రాముడి ఆయుధం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కథేంటి..?

క‌థ ఏమిటంటే అశోకుడు 9 దివ్య గ్రంథాల‌ని తొమ్మిది మంది యోధుల‌కు అప్ప‌గిస్తాడు.

వివిధ దేశాల్లో వున్న ఆ గ్రంథాలు దుష్టుల చేతిలో ప‌డ‌కుండా ప‌రిర‌క్షించ‌డం వాళ్ల బాధ్య‌త‌.

ఈ తొమ్మిదీ దొరికిన వాడికి ఎదురుండ‌దు.

విల‌న్ మ‌హావీర్ (మంచు మ‌నోజ్‌) వాటిని చేజిక్కించుకునే ప‌నిలో ఉంటాడు.

8 గ్రంథాలు దక్కించుకుని 9వ గ్రంథం కోసం వెతుకుతుంటాడు.

ఆ గ్రంథాన్ని కాపాడే ప‌ని శ్రీ‌య‌ది. ఆమె కొడుకు హీరో.

అగ‌స్త్య‌ముని స‌ల‌హా మేర‌కు చిన్నప్పుడే అత‌న్ని అనాథ‌గా వ‌దిలేస్తుంది.

తేజ సజ్జా

ఫొటో సోర్స్, X/Teja Sajja

హైద‌రాబాద్‌లో ఆవారాగా పెరుగుతున్న వేదని (తేజ‌) హీరోయిన్ విభా (రితికా) స‌రైన మార్గంలో పెట్టి దిశా నిర్దేశం చేస్తుంది.

ఆమె ఈ ప‌ని కోస‌మే హిమాల‌యాల నుంచి వ‌స్తుంది.

తేజ తానెవ‌రో తెలుసుకుని మిరాయ్‌ని సాధించి, విల‌న్‌ని ఎలా అంతం చేశాడ‌న్న‌దే మిగ‌తా క‌థ‌.

క‌ల్కికి దీనికి పోలిక‌లున్నాయి. అది భ‌విష్య‌త్‌లో జ‌రుగుతుంది. ఇది వ‌ర్త‌మాన క‌థ‌. అక్క‌డ ప‌రుశురాముడు, ఇక్క‌డ అగ‌స్త్యుడు.

తేజ సజ్జా

ఫొటో సోర్స్, X/Teja Sajja

దాదాపు 2 గంట‌ల 50 నిమిషాల సినిమాను బోర్ కొట్ట‌కుండా తీయ‌డం చాలా క‌ష్టం.

సెకండాఫ్ కొంత న‌త్త‌న‌డ‌క న‌డిచినా, ద‌ర్శ‌కుడు నిరాశ‌ప‌ర‌చ‌కుండా ప్రేక్ష‌కుడిని బ‌య‌టికు పంపాడు.

కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని స్వ‌యంగా కెమెరామెన్.

అత‌ని గ‌త సినిమాల్లో ఫొటోగ్ర‌ఫీ సూప‌ర్‌గా వుండి, క‌థ తిక‌మ‌క‌గా ఉండేది.

ఈసారి ఆ పొర‌పాటు చేయ‌కుండా రెండూ బ్యాలెన్స్ చేశాడు.

ప్రేక్ష‌కుడు క‌థలోనే లీనమయ్యేలా జాగ్ర‌త్త ప‌డ్డాడు.

మిరాయ్ మూవీ

ఫొటో సోర్స్, X/Teja Sajja

అశోకుడు దివ్య గ్రంథాలు ఇవ్వ‌డం, సంప‌తి గండ‌భేరుండ ప‌క్షి, మిరాయ్ అంటే సాక్షాత్తూ శ్రీ‌రాముడి కోదండం ఇదంతా క‌ల్పిత‌మే అయినా క‌థ‌ని గ్రిప్పింగ్‌గా చెప్పాడు. దీనికి కెమెరా ప‌నితనం, సంగీతం, గ్రాఫిక్స్‌, ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ తోడుగా నిలిచాయి.

హీరోయిన్‌తో రొటిన్ టెంప్లెట్‌లో ల‌వ్ ట్రాక్‌, పాట లేక‌పోవ‌డం ఊర‌ట‌.

ఫైట్స్ కూడా కొత్త‌గా, వేగంగా ఉండ‌టం ప్ల‌స్ అయింది.

మంచు మనోజ్

ఫొటో సోర్స్, X/Manoj Manchu

ముఖ్యంగా సెకండాఫ్‌లో సినిమా డౌన్ అవుతున్న‌పుడు ఏదో ఒక యాక్ష‌న్ సీన్ వ‌చ్చి నిల‌బెట్టింది.

మంచు మ‌నోజ్ రొటీన్ విల‌న్‌లా పెద్ద‌పెద్ద కేక‌లు పెట్ట‌కుండా నింపాదిగా చేయ‌డం బాగుంది.

క‌మెడియ‌న్ సునీల్ త‌న ట్రాక్‌ని మార్చుకుని స‌క్సెస్ సాధించిన‌ట్టు, మ‌నోజ్ కూడా ఢిప‌రెంట్ క్యారెక్ట‌ర్స్ ప్ర‌య‌త్నిస్తే మంచి ప్యూచ‌ర్ క‌నిపిస్తోంది.

శ్రీయ

ఫొటో సోర్స్, X/Teja Sajja

శ్రీయ‌, జ‌గ‌ప‌తిబాబు, జ‌య‌రామ్ కాసేపే క‌నిపించినా.. క‌థ‌లో వీరు కీల‌క‌మైన పాత్ర‌లు.

గెట‌ప్ శీను అక్క‌డ‌క్క‌డ న‌వ్వించాడు. పోలీసుల కామెడీ ట్రాక్ శుద్ధ దండగ.

పిల్ల‌లకు సినిమా బాగా న‌చ్చే అవ‌కాశ‌ముంది.

గండ‌భేరుండ ప‌క్షి, శ్రీ‌రాముడు క‌నిపించడం, చిత్ర‌విచిత్ర గ్రాఫిక్స్ మాయ‌లు ఆక‌ట్టుకుంటాయి.

ఇవ‌న్నీ హిందీ ప్రేక్ష‌కుల‌కి కూడా న‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌.

దుష్టుడికి దివ్య‌శ‌క్తులు దొరికితే ప్ర‌పంచ వినాశ‌నం కాబ‌ట్టి, ఒక సాహ‌సి అత‌న్ని అంతం చేయ‌డానికి చేసే ప్ర‌య‌త్నం మూల క‌థ‌గా అన్ని భాష‌ల్లోనూ ఇప్పటికే వంద‌ల సినిమాలు వ‌చ్చాయి.

ఫార్ములా రొటీన్ అయినా, ద‌ర్శ‌కుడు కార్తీక్ ప్ర‌జెంటేష‌న్ కొత్త‌గా చేశాడు. ఆ మేర‌కి స‌క్సెస్ అయ్యాడు.

అంచ‌నాలకు త‌గిన‌ట్టుగా ఈ సినిమా రేంజ్ తెలియ‌డానికి ఇంకా రెండు మూడు రోజులు ప‌డుతుంది. అయితే, నిరాశ‌ప‌ర‌చ‌లేదు. అంత వ‌ర‌కూ గ్యారెంటీ.

ఓవ‌ర్ హీరో ఎలివేష‌న్ లేకుండా తేజ స‌రిగ్గానే న‌టించాడు.

పాత్ర రూప‌క‌ల్ప‌న‌లో కూడా సూప‌ర్‌ హీరో బిల్డ‌ప్ లేక‌పోవ‌డం స‌రిపోయింది.

బాల‌న‌టుడిగా రావ‌డం వ‌ల్ల ఇంకా ఆయ‌న చిన్న‌పిల్లాడిగానే క‌నిపిస్తే ఆశ్చ‌ర్యం ఏమీలేదు.

మిరాయ్

ఫొటో సోర్స్, X/Teja Sajja

ప్ల‌స్ పాయింట్స్

1.ఫ‌స్టాఫ్‌

2.సంగీతం

3.గ్రాఫిక్స్‌

4.కెమెరా

మైన‌స్ పాయింట్స్

1.సెకండాఫ్ స్లోగా ఉండ‌టం

2.అన‌వ‌స‌ర‌మైన కామెడీ ట్రాక్‌

3.హీరోయిన్‌కి ప్రాధాన్యం లేక‌పోవ‌డం

పురాణం, చ‌రిత్ర క‌ల‌గలిపిన కొత్త ఆయుధం మిరాయ్. ఇది హిట్ కొడితే ఇంకా ర‌క‌ర‌కాల ఆయుధాలు మ‌న ద‌ర్శ‌కులు బ‌య‌టికి తీస్తారు.

(అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)