తెలంగాణ: ‘భూములు కొని తెల్ల కాగితాలపై రాసుకున్నారా?’.. జీవో 106పై 7 ప్రశ్నలు, సమాధానాలు

సాదాబైనామా భూములు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

తెలంగాణలో భూములు కొనుగోలు చేసినవారు తెల్ల కాగితాలపై ఒప్పందాలు రాసుకున్నారా? ఇలాంటి సాదా బైనామాల క్రమబద్దీకరణకు 2020లో దరఖాస్తు చేసుకున్న వారిలో మీరూ ఉన్నారా?

ఏళ్ల తరబడి పెండింగులో ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.

కొన్నేళ్లుగా పెండింగులో ఉన్న సాదా బైనామా లేదా అన్‌రిజిస్టర్డ్ ట్రాన్సాక్షన్స్ దరఖాస్తుల క్రమబద్దీకరణకు జీవో నం.106ను జారీ చేసింది.

అయితే, దీనికి అఫిడవిట్ కోరడంపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

అసలు ఏమిటీ సాదా బైనామాల సమస్య? క్రమబద్దీకరణ ఎందుకు? ఏళ్ల తరబడిగా పెండింగులో ఎందుకున్నాయి? ఈ వివరాలు కథనంలో చూద్దాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

1) సాదా బైనామాలు అంటే ఏమిటి?

సాదా బైనామాలు అనే మాట తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వింటుంటాం.

చిన్న, సన్నకారు రైతులు వ్యవసాయ భూముల క్రయవిక్రయాలు చేసినప్పుడు రిజిస్టర్డ్ డాక్యుమెంట్‌పై కాకుండా తెల్ల కాగితాలపై లావాదేవీల ఒప్పందం రాసుకుంటారు.

దాని ఆధారంగానే భూముల క్రయవిక్రయాలు జరిగిపోతుంటాయి.

కొన్ని దశాబ్దాలుగా తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని క్రయవిక్రయాలలో ఇలా జరుగుతోంది.

ఇలా తెల్లకాగితాలపై ఒప్పందం రాసుకోవడాన్నే సాదా బైనామాగా పిలుస్తుంటారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ‘ధరణి’ స్థానంలో ‘భూ భారతి’ తీసుకువచ్చింది

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కాంగ్రెస్ ప్రభుత్వం 'ధరణి' స్థానంలో 'భూ భారతి' తీసుకువచ్చింది

2) గతంలో రిజిస్ట్రేషన్లు చేయలేదా?

సాధారణంగా ఎవరైనా వ్యవసాయ భూమిని కొనగానే రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ, రిజిస్ట్రేషన్ లేకుండా కొనుగోలు చేసినా సరే తెలంగాణలో ఏటా జమాబందీ జరిగినప్పుడు తహసీల్దారు అలాంటి కొనుగోళ్లకు సంబంధించి పట్టా మార్పిడి చేసి రిజిస్టర్‌లో ఎక్కించేవారు.

1989లో అమల్లోకి వచ్చిన రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్వోఆర్)-1971 చట్టం ప్రకారం రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటేనే పాసు పుస్తకం ఇవ్వడానికి వీలవుతుంది.

1989లో ఈ చట్టానికి సవరణ చేసి సెక్షన్ 5 తీసుకురావడంతో సాదాబైనామాల ద్వారా కొంటే, తహసీల్దారుకు దరఖాస్తు చేస్తే పట్టాలు ఇచ్చే అధికారం కల్పించింది అప్పటి ప్రభుత్వం.

ఆ తర్వాత కూడా అనేక విడతలలో దరఖాస్తులు తీసుకుని పట్టాలు ఇచ్చిన సందర్భాలున్నాయి.

చివరిసారిగా 2016లో సాదాబైనామాల కింద పట్టాలు ఇచ్చారు.

3) ఎన్ని దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి?

2020లో అప్పటి ప్రభుత్వం సాదాబైనామాల పరిష్కారానికి దరఖాస్తులు తీసుకుంది. 9.84 లక్షల దరఖాస్తులు వచ్చాయని, ఇవి సుమారుగా 15 లక్షల ఎకరాలకు సంబంధించినవి ఉంటాయని ప్రభుత్వం అంచనా వేసింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి (ఆర్వోఆర్) చట్టంలో ఎక్కడా సాదా బైనామాల ప్రస్తావన లేకపోవడంతో దరఖాస్తుల పరిష్కారానికి వీలు కాలేదని భూ చట్టాల నిపుణుడు, భూభారతి చట్ట రూపకల్పన కమిటీ సభ్యుడు ఎం.సునీల్ కుమార్ బీబీసీతో చెప్పారు.

''చట్టంలోనే సాదాబైనామాల ప్రస్తావన లేనప్పుడు క్రమబద్ధీకరణకు దరఖాస్తులు ఎలా తీసుకుంటారంటూ హైకోర్టులో అప్పట్లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలవడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టంలో సాదా బైనామాల ప్రస్తావన ఉంది. అందుకే వాటి పరిష్కారానికి పచ్చ జెండా ఊపింది హైకోర్టు'' అని చెప్పారాయన.

భూ భారతి (ఆర్వోఆర్) చట్టంలో సెక్షన్-6 సాదాబైనామాల గురించి చెబుతుంది. ఇందులో సెక్షన్ 6(1) గతంలో తీసుకున్న దరఖాస్తులను పరిష్కరించవచ్చని చెబుతోంది.

సాదాబైనామా

ఫొటో సోర్స్, Getty Images

4) ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారం ఏ అర్హతలు ఉండాలి?

2020లో తీసుకున్న దరఖాస్తుల ప్రకారం, 2014 జూన్ 2ను కటాఫ్ డేట్‌గా పెట్టుకున్నారు. ప్రభుత్వ తాజా జీవో కూడా అదే తేదీని కటాఫ్ డేట్‌గా పెట్టుకుంది.

ఆ తేదీ నాటికి వ్యవసాయ భూములు కొన్న చిన్న, సన్నకారు రైతులు 12 ఏళ్లకు మించి పొసెషన్‌లో ఉండాలి.

2020 అక్టోబరు 12 నుంచి 2020 నవంబరు 10 మధ్య దరఖాస్తు చేసుకుని ఉండాలి.

అయితే, ఇప్పుడు కొత్తగా దరఖాస్తులు తీసుకోవడం ఉండదని సునీల్ కుమార్ వివరించారు.

సాదా బైనామా

5) దరఖాస్తులను ఎవరు విచారిస్తారు?

దరఖాస్తులను విచారణ చేసే అధికారాన్ని ప్రభుత్వం ఆర్డీవోలకు కల్పించింది. విచారణ చేసి నోటీసులు జారీ చేయడంతోపాటు సర్టిఫికెట్ ఇస్తారు.

దాని ఆధారంగా రైతులు పాసు పుస్తకం పొందేందుకు వీలవుతుంది.

6) రైతులు ఫీజు చెల్లించాలా?

గతంలో సాదా బైనామాల క్రమబద్దీకరణకు ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండేది కాదు.

భూ భారతి చట్టం ప్రకారం మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని బీబీసీతో చెప్పారు సునీల్ కుమార్.

స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఫీజుతోపాటు రూ.100 చలాన్ చెల్లించాల్సి ఉంటుంది.

7) అఫిడవిట్ ఇప్పుడు ఇవ్వాలా?

దరఖాస్తుదారులు భూములు కొనుగోలు చేసినట్లుగా అఫిడవిట్ ఇవ్వాలని ప్రభుత్వం నిబంధన విధించింది.

ఈ విషయంపై రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

''గతంలో యజమానులకు తెలియకుండా సాదాబైనామాలకు రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. అందుకే అఫిడవిట్ అనే నిబంధన తీసుకువచ్చారు'' అని సునీల్ కుమార్ చెప్పారు.

అయితే, ప్రస్తుతం అభ్యంతరాల నేపథ్యంలో అఫిడవిట్‌ తీసుకోవడంపై ప్రభుత్వం పునరాలోచన చేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు వివరించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)