సిమ్ కార్డుల కథ ముగిసిపోనుందా, ఇకపై ఈ ప్లాస్టిక్ చిప్‌లతో పనిలేదా?

యాపిల్, ఐఫోన్, సిమ్ కార్డ్, ఇ-సిమ్, ఐఫోన్ ఎయిర్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, గ్రాహం ఫ్రేజర్
    • హోదా, టెక్నాలజీ రిపోర్టర్

స్మార్ట్‌ఫోన్ల తయారీలో యాపిల్ ముందంజలో ఉంది. ఇతర మొబైల్ తయారీ కంపెనీలు ఎక్కువగా దీనిని అనుసరిస్తుంటాయి.

ఈ వారం యాపిల్ సంస్థ సిమ్ కార్డ్ లేకుండా విడుదల చేసిన ఐఫోన్‌ సిమ్ కార్డ్ భవిష్యత్తుపై ప్రశ్నలు లేవనెత్తింది.

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఈ ప్లాస్టిక్ కార్డుకు అలవాటుపడ్డారు. ఫోన్‌ను ఆపరేట్ చేయడానికి ఈ కార్డును ఫోన్ లోపల జాగ్రత్తగా చొప్పించాల్సి ఉంటుంది.

కానీ, ఐఫోన్ ఎయిర్ కొనేవారికి, అది ఇప్పుడు గతం కానుంది.

ఈ ఐఫోన్ ఎయిర్ ఇ -సిమ్‌‌తో మాత్రమే పనిచేస్తుంది. వినియోగదారులు సిమ్ కార్డ్ ట్రేని ఓపెన్ చేయకుండానే నెట్‌వర్క్‌, ప్లాన్‌లను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది.

సీసీఎస్ ఇన్‌సైట్‌లో విశ్లేషకులు కెస్టర్ మాన్ బీబీసీ న్యూస్‌తో మాట్లాడుతూ, యాపిల్ ప్రకటన "సిమ్ కార్డ్ ముగింపుకు నాంది" అని అన్నారు.

కానీ, మనమందరం ఈ చిన్న చిప్‌లతో నిండిన ప్లాస్టిక్ ముక్కలను వాడటం ఎప్పుడు మానేస్తాం, అది మన ఫోన్ వినియోగంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
యాపిల్, ఐఫోన్, సిమ్ కార్డ్, ఇ-సిమ్, ఐఫోన్ ఎయిర్

ఫొటో సోర్స్, Getty Images

'ఫోన్ నుంచి సిమ్ ట్రే అదృశ్యం అవుతుంది'

సిమ్ అంటే.. సబ్‌స్క్రైబర్ ఐడెంటిటీ మాడ్యూల్. ఈ చిప్ మీ ఫోన్‌లో ఒక ముఖ్యమైన భాగం, ఇది మీ మొబైల్ నెట్‌వర్క్ కంపెనీకి కనెక్ట్ అవ్వడానికి, కాల్స్, టెక్స్ట్ మెసేజ్‌లు చేసేందుకు, డేటాను ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఇటీవలి సంవత్సరాలలో సంప్రదాయ సిమ్‌లకు బదులుగా ఇ-సిమ్ ఓ ఆప్షన్‌గా మారింది. ఇక కొత్త ఫోన్లలో అయితే వినియోగదారులకు సంప్రదాయ సిమ్ లేదా ఇ-సిమ్ రెండింటినీ ఉపయోగించే అవకాశం కలిగింది.

యాపిల్ మంగళవారం తన అత్యంత సన్నని కొత్త ఐఫోన్ ఎయిర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌లో ఇ-సిమ్ సౌకర్యం మాత్రమే ఉంటుందని తెలిపింది. ఇలాంటి సౌకర్యం ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి.

అయితే, అమెరికాలో 2022 నుంచి ఇలాంటి ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.

కానీ, యాపిల్ సిమ్ కార్డుల వినియోగాన్ని పూర్తిగా ఆపలేదు.

ఈ వారం ఆవిష్కృతమైన ఇతర కొత్త ఐఫోన్‌లు (17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్) కొన్ని మార్కెట్లలో ఇ-సిమ్‌ సౌకర్యంతో మాత్రమే లభిస్తాయన్నది నిజమే అయినప్పటికీ, చాలా దేశాల్లో ఇది సంప్రదాయ సిమ్ కార్డ్ స్లాట్‌తో అందుబాటులో ఉంటుంది.

శామ్‌సంగ్, గూగుల్ వంటి ఇతర ప్రధాన తయారీదారులు ఇ-సిమ్‌‌ను ప్రత్యామ్నాయంగా చూస్తున్నాయి. ఈ కంపెనీలు అనేక చోట్ల సిమ్ కార్డులనూ ఉపయోగిస్తున్నాయి.

అయితే, భవిష్యత్తు గురించి ఎలాంటి సందేహం లేదని నిపుణులు అంటున్నారు.

సీసీఎస్ ఇన్‌సైట్ అంచనా ప్రకారం, ఇ -సిమ్‌ను సపోర్ట్ చేసే మొబైల్స్ సంఖ్య 2024 నాటికి 130 కోట్లు కాగా, అది 2030 నాటికి 301 కోట్లకు చేరుతుంది.

"కాలక్రమేణా, సిమ్ ట్రే పూర్తిగా అదృశ్యమవుతుంది" అని పీపీ ఫోర్‌సైట్‌లో సాంకేతిక విశ్లేషకులు పాలో పెస్కాటోర్ అన్నారు.

యాపిల్, ఐఫోన్, సిమ్ కార్డ్, ఇ-సిమ్, ఐఫోన్ ఎయిర్

ఫొటో సోర్స్, Getty Images

ఇ-సిమ్‌తో ఉపయోగాలేంటి?

ఇ-సిమ్‌కు మారడం వల్ల "చాలా ప్రయోజనాలు" ఉంటాయని పెస్కాటోర్ అన్నారు. మొదటి ప్రయోజనం ఫోన్‌లో స్థలం ఆదా అవుతుంది. దీనివల్ల బ్యాటరీ సైజు పెంచడానికి అవకాశం కలుగుతుంది.

పర్యావరణపరంగా చూస్తే , ప్లాస్టిక్ సిమ్ కార్డుల వినియోగాన్ని మానేయడమే మంచిది.

విదేశాలకు వెళ్లేటప్పుడు ఇ-సిమ్ ఉపయోగించే వ్యక్తులకు మరిన్ని అవకాశాలు ఉంటాయి. పైగా "బిల్లు ఇబ్బందులు" కూడా ఉండవు.

ఇది కస్టమర్ వ్యవహారశైలిని మారుస్తుందని, "మొబైల్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడే విధానాన్ని క్రమంగా మార్చేస్తుంది" అని కెస్టర్ మాన్ అన్నారు.

ఉదాహరణకు, కస్టమర్లు సిమ్ కార్డుల కోసం దుకాణాలకు వెళ్లాల్సిన అవసరం ఉండకపోవచ్చు.

తమ సమయాన్ని ఆదా చేసుకోవాలనుకునే, దుకాణానికి వెళ్లకూడదనుకునే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

కానీ, అన్ని మార్పుల మాదిరిగానే ప్రజలు దీనిని అంత తేలికగా అంగీకరించరని ఆయన అన్నారు.

"ఈ మార్పు.. ముఖ్యంగా వృద్ధులకు లేదా టెక్నాలజీని తక్కువగా ఉపయోగించే వారి విషయంలో ఇది కీలకం. కంపెనీలు ఇ-సిమ్‌ను ఎలా ఉపయోగించాలో వివరించడంపై పనిచేయాలి" అని మాన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)