హైదరాబాద్ విలీనం: నిజాం చివరి ప్రధాని లాయక్ అలీ గృహనిర్బంధం నుంచి తప్పించుకుని పాకిస్తాన్ ఎలా చేరారు?

లాయక్ అలీ, నిజాం, హైదరాబాద్ సంస్థానం, సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రవీణ్ శుభం
    • హోదా, బీబీసీ కోసం

అది 1950 , మార్చి.

'రేడియో పాకిస్తాన్' వార్తలు ముగిసిన వెంటనే కరాచీలోని భారత దౌత్యకార్యాలయం నుంచి దిల్లీకి ఫోన్ వెళ్లింది.

హోంమంత్రి సర్దార్ పటేల్‌తో అర్జంటుగా ఒక విషయం నిర్ధరించుకునేందుకు భారత హైకమిషనర్ శ్రీ ప్రకాశ లైన్‌లో వేచిచూస్తున్నారు.

'లాయక్ అలీ విడుదలయ్యారా?' అని శ్రీ ప్రకాశ ఆశ్చర్యంగా వాకబు చేశారు. పటేల్ దానికి 'లేదు' అని జవాబు చెప్పారు.

లాయక్ అలీ కరాచీలో జరిగిన ఒక అధికారిక విందులో పాల్గొన్నారని రేడియో పాకిస్తాన్ తెలిపింది అని శ్రీ ప్రకాశ చెప్పారు.

అప్పుడుగానీ భారత ప్రభుత్వానికి జరిగిన వ్యవహారం అర్థం కాలేదు.

మీర్ లాయక్ అలీ నిజాం రాజ్యానికి చివరి ప్రధానిగా పనిచేశారు. 'ఆపరేషన్ పోలో' ముగిసిన తర్వాత భారత బలగాలు ఆయన్ను హైదరాబాద్ బేగంపేటలో గృహనిర్బంధంలో ఉంచాయి. ఏడాదిన్నర తర్వాత, భద్రాతాసిబ్బంది కళ్లు గప్పి ఆయన దేశ సరిహద్దులు దాటి కుటుంబంతో సహా పాకిస్తాన్ చేరారు.

‘‘ఆయన తప్పించుకున్న విధానం భారత ప్రభుత్వానికి తలవంపులు తీసుకురాగా, తక్కిన ప్రపంచానికి అదొక వినోదాంశంగా మారిపోయింది’’ అని హైదరాబాద్ చరిత్రకారుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన నరేంద్ర లూథర్ తన పుస్తకం 'హైదరాబాద్ జీవిత చరిత్ర'లో రాశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
లాయక్ అలీ, నిజాం, హైదరాబాద్ సంస్థానం, సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

వ్యాపారవేత్త నుంచి ప్రధానమంత్రిగా

ఇంజనీరింగ్ పట్టభద్రుడిగా, తర్వాత విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగిన మీర్ లాయక్ అలీకి రాజకీయాలపై కొంత ఆసక్తి ఉన్నా, పూర్తి స్థాయి రాజకీయ జీవితం ఆయనకు ఇష్టం లేదు.

నిజాం ప్రభుత్వంలో, పాకిస్తాన్ క్యాబినెట్‌లో చేరాలని...గతంలో తనకు అందిన ఆహ్వానాలు తిరస్కరించానని తన పుస్తకం ‘హైద్రాబాద్ విషాదం’లో లాయక్ అలీ రాసుకున్నారు.

చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఒత్తిడితో నవంబర్ 30, 1947న నిజాం రాజ్య ప్రధానమంత్రిగా , మీర్ లాయక్ అలీ బాధ్యతలు స్వీకరించారు. ‘ఆపరేషన్ పోలో’ ముగింపు వరకు అంటే సెప్టెంబర్ 17, 1948 వరకు, ఆయన దాదాపు పది నెలలు పదవిలో కొనసాగారు.

సంక్లిష్ట పరిస్థితుల్లో, నిజాం రాజ్యం పతనం అంచుల్లో ఉన్న కాలంలో ఆయన ప్రధానిగా పనిచేశారు.

భారత్‌లో ఎట్టి పరిస్థితుల్లో కలవరాదని, వారితో మంచి స్నేహసంబంధాల కోసం ప్రయత్నించాలని లాయక్ అలీ భావించారు. ఈ విషయంలో తనకూ, నిజాంకు ఏకాభిప్రాయం ఉండేదని లాయక్ అలీ తెలిపారు.

మరోవైపు పాకిస్తాన్ జాతిపిత మహమ్మద్ అలీ జిన్నాతో మంచి సంబంధాలు కొనసాగించారు.

హైదరాబాద్ స్వతంత్ర దేశంగా కొనసాగడంలో పాకిస్తాన్ తమకు సహాయం చేస్తుందని నిజాంతో పాటు లాయక్ అలీ ఆశించారు.

లాయక్ అలీ, నిజాం, హైదరాబాద్ సంస్థానం, సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్

1948 సెప్టెంబర్ 19నుంచి గృహ నిర్బంధంలో

హైదరాబాద్ సమస్యను ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలోకి తీసుకెళ్లి, ఒక ప్రాంతీయ వివాదాన్ని అంతర్జాతీయ వేదికపై నిలిపారు లాయక్ అలీ.

కానీ భద్రతా మండలిలో చర్చలు మొదలయ్యేలోపే ‘ఆపరేషన్ పోలో’ ముగిసింది. దీంతో హైదరాబాద్‌ను స్వతంత్ర దేశంగా మార్చాలన్న ఆయన ఆశ నెరవేరలేదు.

మిలటరీ గవర్నర్ ఆదేశాలతో 1948 సెప్టెంబర్ 19న లాయక్ అలీని గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ నిర్బంధం దాదాపు ఏడాదిన్నర కొనసాగింది. ఆ తర్వాత ఒకరోజు కాపలా సిబ్బంది కళ్లుగప్పి కుటుంబంతో సహా సరిహద్దులు దాటి పాకిస్తాన్ చేరుకున్నారు.

"ఆరోజు సాయంకాలం నా దగ్గరకు వచ్చిన ఆర్మీ అధికారి ఒకరు రేపొద్దున నన్ను తీసుకుని వెళ్లిపోతామని చెప్పారు. 'కాల్పులకు దళాలు సిద్దంగా ఉన్నాయా? అని నేను చిరునవ్వుతో అడిగాను.

మరుసటి రోజు ఉదయాన్నే మిలిటరీ వాహనాల కాన్వాయ్ నా ఇంటిని చుట్టుముట్టింది. అయితే రోజంతా ఎవరూ ఇంట్లోకి రాలేదు. ఆ తర్వాత కాన్వాయ్ వెళ్లిపోయింది. బహుశా భద్రతా మండలి సమావేశానికి, దీనికి ఏదైనా సంబంధం ఉండొచ్చు. సంవత్సరాలు గడిచాయి. నాకేమీ కాలేదు. చివరకు ఒకరోజు అదృష్టవశాత్తు తప్పించుకోగలిగాను" అని ట్రాజెడీ ఆఫ్ హైద్రాబాద్ పుస్తకంలో లాయక్ అలీ రాసుకున్నారు.

లాయక్ అలీ, నిజాం, హైదరాబాద్ సంస్థానం, సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, https://liberationhyderabad.org/gallery/operation-polo

ఫొటో క్యాప్షన్, భారత ఆర్మీ వాహనాలు

కరాచీలో ప్రత్యక్షమైన లాయక్ అలీ

లాయక్ అలీ సరిహద్దులు దాటిన క్రమాన్ని హైదరాబాద్ చరిత్రపై విస్తృత పరిశోధన, రచనలు చేసిన నరేంద్ర లూథర్ తన రచన ‘హైదరాబాద్ జీవిత చరిత్ర’ లో వివరించారు.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత తనను విడుదల చేస్తారని లాయక్ అలీ భావించారు. కానీ అలా జరగలేదు. గతంతో పోలిస్తే ఇంటికి వచ్చిపోయేవారి సెక్యూరిటీ తనిఖీలు తగ్గాయి. దీంతో ఆయన్ను తప్పించేందుకు కుటుంబ సభ్యులు, మిత్రులు కలిసి ఏర్పాట్లు చేశారు.

విదేశాలకు వెళ్లే వారి పత్రాలను విమానాశ్రయాల్లో పరిశీలిస్తున్న విధానం అధ్యయనం చేసి పాకిస్తాన్‌కు వెళ్లేందుకు అవసరమైన పత్రాలను తయారు చేసారు.

ఆ తర్వాత కొన్ని రోజులకు లాయక్ అలీ జబ్బు పడ్డారని ప్రకటించారు. ఆయనకు వైద్యం, మందుల కోసం ఆయన భార్య తరచూ కిటికీలకు పరదాలున్న కారులో బయటకు వెళ్లివస్తున్నారు. ఇదంతా లాయక్ అలీని కొద్దిరోజుల్లో తప్పించేందుకు చేసిన ఏర్పాటు.

కుటుంబ సభ్యులను తప్పించడంలో భాగంగా, త్వరలో దగ్గరి బంధువుల వివాహం ఉందన్న పేరుతో కొన్ని రోజుల పాటు గానాభజానా సాగింది.

అనుకున్నరోజు (మార్చి 3, 1950) వైద్యుని దగ్గర నుంచి మందులు తెచ్చేందుకు వెళ్లే కారులో తన భార్య స్థానంలో లాయక్ అలీ కూర్చుని గృహనిర్బంధం నుంచి బయటపడ్డారు. ఆ తర్వాత మరో టాక్సీలో తన మిత్రునితో గుల్బర్గా రైల్వే స్టేషన్ నుంచి రిజర్వేషన్ కంపార్ట్‌మెంట్‌లో ముంబయి చేరుకున్నారు. అక్కడి నుంచి గులాం అహ్మద్ అన్న మారుపేరుతో ఓ సాధారణ ప్రయాణికుడిలా విమానంలో కరాచీకి చేరారు లాయక్ అలీ.

మరుసటి రోజు లాయక్ అలీ పిల్లలు.. ఉత్తుత్తి పెళ్లికి హాజరయ్యేందుకని బయటపడి నాంపల్లి నుంచి రైలులో ముంబయి వెళ్లారు.

ఈ క్రమంలో లాయక్ అలీ ఇంట్లోనే ఉన్నట్టు ఆయన పరుపుపై తలగడలను దుప్పటితో కప్పి, మందులు ఇస్తున్నట్టుగా, సపర్యలు చేస్తున్నట్టుగా సెక్యూరిటీ వారిని లాయక్ అలీ భార్య నమ్మించారని హైదరాబాద్ జీవిత కథ పుస్తకంలో నరేంద్ర లూథర్ రాశారు.

లాయక్ అలీ, నిజాం, హైదరాబాద్ సంస్థానం, సర్దార్ పటేల్

ఫొటో సోర్స్, https://liberationhyderabad.org/gallery/operation-polo

ఫొటో క్యాప్షన్, రజాకార్లు

కలిసొచ్చిన రాజ్యాంగం నిబంధనలు

మూడో రోజు లాయక్ అలీ భార్య పరదాల కారులో విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, విమానాశ్రయానికి చేరుతుండగా, లాయక్ అలీ భార్య ప్రయాణిస్తున్న పరదాల కారు మొరాయించిందని, డ్రైవర్ ఆ కారును తోస్తుండగా, అదే సమయంలో అటుగా వెళుతున్న అప్పటి డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) జెట్లీ ఈ దృశ్యాన్ని చూసి, ఆ కారును తోయడంలో సహాయం చేయడానికి తన వాహనం దిగారని నరేంద్ర లూథర్ తన పుస్తకంలో రాశారు.

అలా హైదరాబాద్ విమానాశ్రయం చేరుకున్న లాయక్ అలీ భార్య అక్కడి నుంచి ముంబయికి వెళ్లారు. ముంబయిలో పిల్లలను కలుసుకుని ఓడలో సముద్రమార్గం ద్వారా కరాచీకి చేరుకున్నారు.

గృహనిర్బంధం నుంచి తప్పించిన అభియోగాలపై లాయక్ అలీ సోదరి, అరబ్ దేశస్తుడైన ఆయన సేవకునితో పాటు మరో పదిమంది అరెస్ట్ అయ్యారు. వారిపై హైదరాబాద్ రాజ్య చట్టాల ప్రకారం కేసులు పెట్టారు.

అయితే నిజాం ప్రభుత్వం రద్దయిందని, దాని చట్టాలు రద్దయిన నేపథ్యంలో ఈ కేసు నిలవదని కింది కోర్టులో లాయర్లు వాదించారు. హైకోర్టు అప్పీల్‌లో భారత రాజ్యాంగం 22వ అధికరణంలోని సూత్రాల ప్రకారం లాయక్ అలీ నిర్బంధమే చట్టవిరుద్దం కాబట్టి ఆయన్ను తప్పించారన్న అభియోగాలున్న వారు ఎలాంటి నేరమూ చేయలేదని 1950 ఆగస్టు11న తన తీర్పులో పేర్కొంది.

ఇలా కొత్తగా అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలోని నిబంధనలు లాయక్ అలీ, ఆయన సన్నిహితులపై కేసులు కొట్టివేయడానికి కారణమయ్యాయి.

పాకిస్తాన్ చేరుకున్న లాయక్ అలీ, ప్రభుత్వం తరపున వివిధ హోదాల్లో పనిచేశారని, పాకిస్తాన్‌కు వలస వెళ్లిన హైదరాబాద్ ప్రాంతవాసుల సంక్షేమం కోసం చివరి నిజాం నిధులతో కరాచీ కేంద్రంగా ఏర్పాటుచేసిన హైదరాబాద్ ట్రస్ట్ కార్యకలాపాల్లో పాల్గొన్నారని రిపోర్ట్ అయింది.

1971 అక్టోబర్ 24న లాయక్ అలీ న్యూయార్క్‌లో మరణించగా మదీనాలో ఆయన్ను ఖననం చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)