సుప్రీంకోర్టు "మెన్స్ క్లబ్‌"గా ఎందుకు మిగిలింది?

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, కొలీజియం, మహిళా న్యాయమూర్తులు, మహిళల ప్రాతినిధ్యం

ఫొటో సోర్స్, PTI

ఫొటో క్యాప్షన్, 2018లో సుప్రీంకోర్టు‌ మహిళా న్యాయమూర్తులతో అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ ప్రతినిధి

భారత సుప్రీంకోర్టు, కొన్ని హైకోర్టులలో ఇటీవల న్యాయమూర్తులను నియమించారు. కానీ ఈ జాబితాలో మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు.

సెప్టెంబర్‌ 2021లో అప్పటి భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి. రమణ తన నలుగురు సహచర మహిళా న్యాయమూర్తులతో కలిసి ఉన్న ఫోటో వైరల్ అయింది.

34 మంది న్యాయమూర్తులు ఉండే సుప్రీంకోర్టులో అత్యధిక మహిళా న్యాయమూర్తుల సంఖ్య ఇదే. దీనిని "చారిత్రక క్షణం"గా ప్రస్తుతించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, కొలీజియం, మహిళా న్యాయమూర్తులు, మహిళల ప్రాతినిధ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత న్యాయవ్యవస్థను " ఓల్డ్ బాయ్స్ క్లబ్‌" గా అభివర్ణిస్తున్నారు.

చాలామంది భారత అత్యున్నత న్యాయ వ్యవస్థలో దీన్నొక మేలిమలుపుగా చూశారు. సుప్రీంకోర్టులో స్త్రీ పురుషుల సంఖ్య మధ్య ఉన్న అంతరం తొలగడం మొదలవుతుందని ఆశించారు.

కానీ, నాలుగేళ్ల తర్వాత ఆ ఆశ చెదిరిపోయింది. సుప్రీంకోర్టు తన పూర్వస్థితికి చేరుకుంది. న్యాయవాది స్నేహ కలిత దీనిని "ఏ మెన్స్ క్లబ్" అని అభివర్ణించారు.

జస్టిస్ ఎన్.వి. రమణతో ఉన్న నలుగురు న్యాయమూర్తుల్లో జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ హిమ కోహ్లీ, జస్టిస్ బేలా ఎం త్రివేది పదవీ విరమణ చేశారు.

అప్పటి నుంచి వారి స్థానంలో మహిళా న్యాయమూర్తులెవరినీ నియమించలేదు.

ప్రస్తుతం సుప్రీంకోర్టులో జస్టిస్ నాగరత్న ఒక్కరే మహిళా న్యాయమూర్తి.

"ఇది ఆందోళన కలిగించే అంశం. ఇది విపత్తుకు తక్కువేమీ కాదు" అని కలిత చెప్పారు.

సుప్రీంకోర్టులో మహిళలకు న్యాయమైన ప్రాతినిధ్యం ఉండాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసినట్లు ఫిమేల్ అడ్వకేట్స్‌ సంఘంలో సభ్యురాలిగా ఉన్న స్నేహ కలిత బీబీసీకి చెప్పారు.

చారిత్రకంగా భారత న్యాయ వ్యవస్థలో పురుషుల ఆధిపత్యం ఎక్కువ. 1950లో సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత తొలి మహిళా న్యాయమూర్తిని నియమించడానికి 39 ఏళ్లు పట్టింది. 1989లో జస్టిస్ ఫాతిమా బీవి తొలి మహిళా న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

"నేను మూసి ఉన్న తలుపు తెరిచాను" అని 2018లో ఆమె స్క్రోల్ అనే వెబ్‌సైట్‌కు చెప్పారు. కానీ, 75 ఏళ్లలో సుప్రీంకోర్టు చాలా కొద్ది మంది మహిళలను మాత్రమే న్యాయమూర్తులుగా నియమించింది.

ఇప్పటి వరకు నియమితులైన 287 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులలో 11 మంది మాత్రమే మహిళలు. ఇది 3.8 శాతంతో సమానం. ఇది అత్యల్పం.

"కేవలం ఒక మహిళా న్యాయమూర్తితో మనం మళ్లీ వెనక్కి వెళుతున్నాం. అత్యున్నత న్యాయస్థానంలో ఇది దాదాపు సున్నా ప్రాతినిధ్యంతో సమానం. ఇది పురుషుల క్లబ్‌గా మారిపోయింది" అని కలిత చెప్పారు.

కోర్టు

ఫొటో సోర్స్, Getty Images

దిగువ కోర్టుల్లో 40 శాతం మహిళా న్యాయమూర్తులు

భారతదేశపు హైకోర్టుల్లో 670 మంది పురుష న్యాయమూర్తులు ఉన్నారు.

మహిళలు 103 మంది మాత్రమే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

నాలుగు హైకోర్టుల్లో ఒక్క మహిళా న్యాయమూర్తి కూడా లేరు.

సుప్రీంకోర్టు ఇటీవల న్యాయమూర్తులను నియమించినప్పుడు మహిళలకు తక్కువ ప్రాతినిధ్యం ఉండటం వెలుగులోకి వచ్చింది.

సుప్రీంకోర్టులో ప్రస్తుతం రెండు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది.

ఈ రెండు పోస్టుల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సహా నలుగురు సీనియర్ న్యాయమూర్తులు ఉండే సుప్రీంకోర్టు కొలీజియం, లింగ సమానత్వాన్ని కాపాడే దిశగా ప్రభుత్వానికి పేర్లను సిఫార్సు చేస్తుందని భావించారు.

అయితే ఆగస్టు చివరి నాటికి హైకోర్టుల నుంచి ఇద్దరు పురుష న్యాయమూర్తులను ఈ పదవుల్లో నియమించారు. దేశంలోని హైకోర్టుల్లో ముగ్గురు మహిళా న్యాయమూర్తులు వీరిలో ఒకరి కంటే సీనియరని మీడియా కథనాలు చెబుతున్నాయి.

కొలీజియం ఇటీవలి నియామకాల్లోనూ మహిళలను పట్టించుకోలేదు.

గత వారంలో బాంబే హైకోర్టులో 14మంది కొత్త న్యాయమూర్తులు వచ్చారు.

అందులో మహిళా న్యాయమూర్తి ఒక్కరే ఉన్నారు.

అలహాబాద్ హైకోర్టులో ప్రతిపాదిత 26 మంది న్యాయమూర్తుల జాబితాలో మహిళలు ఐదుగురే ఉన్నారు.

సుప్రీంకోర్టు, దేశవ్యాప్తంగా ఉన్న హైకోర్టుల్లో మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండటం "తీవ్ర నిరాశ" కలిగించడంతో పాటు ఆందోళన కలిగించే అంశమంటూ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బలమైన ప్రకటన చేసింది.

"దిగువ న్యాయవ్యవస్థలో అంటే జిల్లా కోర్టులు, కింది కోర్టుల్లో మొత్తం న్యాయమూర్తులలో 40% మంది మహిళలు ఉన్నారు. ఈ కోర్టుల్లో న్యాయమూర్తులను పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ద్వారా ఎంపిక చేస్తారు" అని సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ బీబీసీతో చెప్పారు.

"కానీ, కొలీజియం ఎంపిక చేసే ఉన్నత న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య 10శాతం కంటే తక్కువ. దీనిపై త్వరగా ఏదో ఒకటి చేయాలి. మరింతమంది మహిళల్ని నియమించేందుకు ప్రయత్నించాలి" అని ఆయన అన్నారు.

బీబీసీతో మాట్లాడిన అనేక మంది మహిళా న్యాయవాదులు సుప్రీంకోర్ట్ బార్ అసోసియేషన్ జోక్యాన్ని స్వాగతించారు.

"బార్ అసోసియేషన్ ఈ అంశాన్ని లేవనెత్తినందుకు సంతోషంగా ఉంది. ఇది మహిళల సమస్య కాదు. మన సమాజానికి ప్రతిబింబం" అని సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ చెప్పారు.

సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, కొలీజియం, మహిళా న్యాయమూర్తులు, మహిళల ప్రాతినిధ్యం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్టిస్ లీలా సేథ్. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎంపికైన తొలి మహిళ. కానీ ఆమెను దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఎన్నుకోలేదు.

సమాన ప్రాతినిధ్యం ఎక్కడ?

మహిళా న్యాయమూర్తులందరు లింగ వివక్ష విషయంలో సున్నితంగా ఉంటారని కాదు. గతంలో పురుష,మహిళా న్యాయమూర్తులు స్త్రీల పట్ల విద్వేషపూరితంగా ఇచ్చిన తీర్పులను బీబీసీ సమానంగా రిపోర్ట్ చేసింది.

అయితే భారతదేశం భిన్నత్వం ఉన్న దేశమని, న్యాయ వ్యవస్థలోనూ ఆ భిన్నత్వం కనిపించాలని సీనియర్ న్యాయవాది జయన కొఠారి చెప్పారు.

"సుప్రీంకోర్టు దేశానికంతటికీ చెందినది. దేశంలోని అన్ని ప్రాంతాలకు సమ ప్రాతినిధ్యం కల్పించేందుకు దేశంలోని అన్ని హైకోర్టుల నుంచి న్యాయమూర్తులను ఎంపిక చేస్తున్నప్పుడు లింగవైవిధ్యానికి కూడా చోటివ్వాలి కదా. దేశ జనాభాలో మహిళలు 50 శాతం ఉన్నారు. కాబట్టి న్యాయవ్యవస్థలోనూ మహిళలకు సమాన ప్రాతినిధ్యం ఉండాలి" అని జయన కొఠారి చెప్పారు.

ఒక కేసులో భిన్నంగా స్పందించేందుకు విభిన్న జీవిత అనుభవాలు వీలు కల్పిస్తాయని, వివిధ నేపథ్యాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉండటం మెరుగైన ఫలితాలు రావడానికి దారితీయడం ద్వారా చక్కని తీర్పులు వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు.

బెంచ్ మీద మహిళా న్యాయమూర్తులు ఉంటే ఇతర న్యాయమూర్తులు, న్యాయవాదులు లింగ వివక్ష వ్యాఖ్యలు చేయకుండా నిలువరించినట్లు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయని జయన కొఠారి చెప్పారు.

అయితే మరింత మంది మహిళా న్యాయమూర్తుల్ని నియమించడం ఎలా అనే ప్రశ్న ఇంకా మిగిలే ఉంది.

కొంతమంది మహిళలకు ప్రత్యేకించి సీట్లు రిజర్వ్ చేసే కోటా విధానాన్ని సూచించారు.

దీని వల్ల న్యాయవ్యవస్థలో పరిస్థితులు చక్కబడతాయని చెబుతున్నారు.

అయితే రిజర్వేషన్లు, ప్రతిభ విరుద్ధమైనవని, రిజర్వేషన్ల వల్ల ప్రమాణాలు దిగజారతాయని విమర్శకులు చెబుతున్నారు.

కానీ, కలిత ఈ వాదనతో ఏకీభవించడం లేదు. మహిళా న్యాయమూర్తులు, న్యాయవాదులు మిగిలిన మహిళల్లాగే కష్టపడి పని చేస్తారు. వాళ్లంతా ఇంట్లో పని, పిల్లల పెంపకం, కెరీర్ అన్నింటినీ సమతుల్యం చేస్తున్నారని ఆమె అన్నారు.

"పురుష సహచరుల కంటే అనేక మంది మహిళలు చాలా ప్రతిభావంతులు. మేం కేవలం మహిళలనే ముద్ర వేసి మీరు మమ్మల్ని పక్కన పెట్టలేరు. ఇది వివక్ష" అని ఆమె చెప్పారు.

" ఇది కేవలం మహిళల సమస్యలా కాకుండా, దీన్నో ప్రాముఖ్యం ఉన్న ప్రజా సమస్యగా చూడాలి. మనం 50 శాతం లక్ష్యంగా పెట్టుకోవాలి. అయితే వచ్చే 5ఏళ్లలో 30 శాతం అనే వాస్తవిక లక్ష్యంతో ప్రారంభించవచ్చు " అని జయన కొఠారి చెప్పారు.

"ఉన్నత న్యాయవ్యవస్థలో మహిళలను నియమించడం గర్వకారణం. సుప్రీంకోర్టు, హైకోర్టులలో మహిళలను ఎక్కువగా నియమించడం వల్ల మరింతమంది మహిళలు న్యాయవాద వృత్తిని చేపడతారు" అని కొఠారి అభిప్రాయపడ్డారు.

లేదంటే "ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశం లేనప్పుడు కష్టపడి పని చేయడం వల్ల ప్రయోజనం ఏంటని మహిళలు ఆలోచించరా?" అని ఆమె ప్రశ్నించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)