లండన్ వీధుల్లోకి లక్షన్నర మంది ప్రజలు.. ఎందుకీ ఆందోళన, దేనికోసం?

వెస్ట్‌మిన్‌స్టర్ బ్రిడ్జ్ వద్ద గుమికూడిన ఆందోళనకారులు

ఫొటో సోర్స్, Christopher Furlong/Getty Images

ఫొటో క్యాప్షన్, వెస్ట్‌మినిస్టర్ బ్రిడ్జ్ వద్ద గుమికూడిన ఆందోళనకారులు
    • రచయిత, థామస్ మెకిన్టాస్
    • హోదా, బీబీసీ న్యూస్

లండన్‌లో జాతీయవాద ఉద్యమకారుడు టామీ రాబిన్సన్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో 26 మంది పోలీసులు గాయపడ్డారు.

ఈ ఆందోళనలో లక్ష న్నర మంది ప్రజలు పాల్గొన్నారు.

సెంట్రల్ లండన్‌లో ఈ ఆందోళన ప్రశాంతంగా కొనసాగేలా చూస్తున్న పోలీసులపై ఆందోళనకారులు బాటిళ్లను, ఇతర వస్తువులను విసిరివేయడంతో ‘యునైట్ ది కింగ్‌డమ్' ర్యాలీలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఈ ఘటనలో నలుగురు పోలీసులు తీవ్రంగా గాయపడ్డట్లు మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.

టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కూడా వీడియోకాల్ ద్వారా ఆందోళనకారులతో మాట్లాడారు.

‘‘ఈ హింస ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అంటూ మెట్రోపాలిటన్ పోలీసులు వివిధ నేరాల కింద పాతికమందిని అరెస్ట్ చేశామని ప్రకటించారు. అయితే ఆదివారం నాడు ఆ సంఖ్యను 24గా పేర్కొన్నారు.

ర్యాలీ నేపథ్యంలో వెయ్యి మంది పోలీసులను సెంట్రల్ లండన్‌లో మోహరించారు.

లీసెస్టర్‌షైర్, నాట్టింగమ్‌షైర్, డేవాన్, కార్న్‌వాల్ నుంచి అదనంగా వచ్చిన 500 మంది పోలీసులను కూడా మోహరించారు.

ఈ పరిస్థితి సవాలుతో కూడుకున్నదని తెలిసినప్పటికీ, పోలీసులు నిర్భయంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు అసిస్టెంట్ కమిషనర్ మ్యాట్ ట్విస్ట్ చెప్పారు.

''చాలామంది ప్రజలు ఇక్కడికి తమ ఆందోళనను వ్యక్తం చేయడానికి వచ్చారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, హింసను వ్యాప్తి చేయాలనే ఉద్దేశం కూడా చాలామందికి ఉంది'' అని తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
‘యూనైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీ

ఫొటో సోర్స్, Rasid Necati Aslim/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, ర్యాలీ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను సెంట్రల్ లండన్‌లో మోహరించారు.

ఈ ర్యాలీని నిరసిస్తూ సమీపంలోనే మరో ప్రదర్శన జరిగింది.

'స్టాండ్ అప్ టూ రేసిజం' సంస్థ నిర్వహించిన ఈ నిరసనలో ఐదు వేల మంది పాల్గొన్నారు.

ఇటీవల కాలంలో బ్రిటన్‌లో వలసదారులకు వ్యతిరేకంగా ఆందోళనలు పెరుగుతున్నాయి.

శరణార్థులకు ఆశ్రయమిస్తున్న హోటళ్ల ఎదుట 'యునైట్ ది కింగ్‌డమ్' పేరుతో ఇటీవల నిరసనలు జరిగాయి.

వలసదారులకు వ్యతిరేకంగా ఈ ఆందోళనలు జరగగా.. ఈ ఆందోళనలను వ్యతిరేకిస్తూ 'స్టాండ్ అప్ టు రేసిజం' మద్దతుదారులు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

'స్టాండ్ అప్ టు రేసిజం' మద్దతుదారులు వలసదారుల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలు అబద్ధాలను నమ్ముతున్నాయని వీరు అంటున్నారు.

వీధుల్లో గుర్రాలు

ఫొటో సోర్స్, Rasid Necati Aslim/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, లండన్ వీధుల్లో గుర్రాలపై పోలీసులు

పోలీసులు ఏం చెబుతున్నారు?

ఈ ఆందోళనల్లో హింస వల్ల కొందరు పోలీసులకు పళ్లు విరిగాయని, కొందరికి తలపై, మరికొందరికీ వెన్నెముకపై గాయాలైనట్లు, కొందరికీ ముఖంపైనా, ముక్కుపైనా తీవ్ర గాయాలయ్యాయని, అసిస్టెంట్ కమిషనర్ మ్యాట్ ట్విస్ట్ తెలిపారు.

అరెస్టులు ‘‘కేవలం ఆరంభం’’ మాత్రమేనంటూ ఇందుకు కారణమైనవారందరినీ అరెస్ట్ చేస్తామని ఆయన చెప్పారు.

హింసకు కారకులైన వారిని పోలీసులు గుర్తిస్తున్నారని ఆయన చెప్పారు.

పోలీసులపై దాడి చేసి, గాయాలు పాలు చేసిన వారిపై హోమ్ మంత్రి షబానా మహమూద్ తీవ్రంగా మండిపడ్డారు.

నేర కార్యకలాపాల్లో భాగమయ్యే వారు తప్పనిసరిగా శిక్షను ఎదుర్కోవాల్సిందేనన్నారు.

పోలీసు అధికారులు

ఫొటో సోర్స్, Guy Smallman/Getty Images

ఫొటో క్యాప్షన్, ‘యునైట్ ది కింగ్‌డమ్’ ర్యాలీకి వ్యతిరేకంగా ‘స్టాండ్ అప్ టు రేసిజం’ ర్యాలీ

రెండు గ్రూపుల ఆందోళనకారులు గుమికూడినప్పుడు..

మధ్యాహ్నం సమయానికి వైట్‌హాల్‌ ప్రాంతంలో రెండు గ్రూపులు కలవకుండా పోలీసు అధికారులు వరుసగా నిలబడ్డారు.

ర్యాలీ శాంతియుతంగా ప్రారంభమైందని, కానీ, రెండు గ్రూపుల ఆందోళనకారులను వేరుగా ఉంచాలని పోలీసులు ప్రయత్నించినప్పుడు కొందరు పోలీసులపై దాడి చేసినట్లు మెట్రోపాలిటన్ పోలీసులు చెప్పారు.

‘యునైట్ ది కింగ్‌డమ్' ర్యాలీలో నిర్వాహకులు అంచనా వేసిన దానికంటే ఎక్కువగా ప్రజలు పాల్గొనట్లు పోలీసులు తెలిపారు. ఇంతమందికి సరిపడా స్థలం వైట్‌హాల్, పార్లమెంట్ స్క్వేర్ వద్ద లేదని అన్నారు.

జనం పోలీసుల సూచనలను పట్టించుకోలేదు. అప్పటికే 'స్టాండ్ అప్ టు రేసిజం' ఆందోళనకారులు ఉన్న ప్రాంతాల్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు.

'' పోలీసు అధికారులు వారు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడు, పోలీసులపై దాడి జరిగింది'' అని మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.

తొలి గ్రూప్ ఆందోళనకారుల నుంచి రెండవ గ్రూప్ ఆందోళనకారులను దూరంగా ఉంచేందుకు పోలీసులను, గుర్రాలను, శునకాలను మోహరించినట్లు చెప్పారు.

వైట్‌హాల్, ట్రాఫల్గర్ స్క్వేర్‌లో టామీ రాబిన్సన్ మద్దతుదారులను వెనక్కి పంపించేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

టామీ రాబిన్సన్

ఫొటో సోర్స్, Christopher Furlong/Getty Images

ఎవరీ రాబిన్సన్?

టామీ రాబిన్సన్ అసలు పేరు స్టీవెన్ యాక్ల్సీ లెన్నాన్. ఆందోళనకారులనుద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో రాజకీయ నేతల తన ఆలోచనలను, సిద్ధాంతాలను కాపీ చేస్తున్నారని విమర్శించారు.

బ్రిటన్ న్యాయస్థానాలు అక్రమ వలసదారులకు ప్రాధాన్యం ఇస్తున్నాయి, అది స్థానికుల హక్కులకు నష్టం కలిగిస్తోంది అని ఆరోపించారు.

గత నెలలో ఎస్సెక్స్‌, ఎప్పింగ్‌లోని బెల్ హోటల్ వద్ద శరణార్థులకు ఆశ్రయం కల్పించడంపై ఉన్న నిషేధాన్ని అప్పీల్ కోర్టు ఎత్తివేసింది.

శనివారం జరిగిన నిరసనల్లో ఎలాన్ మస్క్ వీడియో లింక్ ద్వారా ప్రత్యక్షమై ఆశ్చరపరిచారు. ‘‘ఎలాంటి నియంత్రణ లేకుండా భారీ ఎత్తున సాగుతున్న వలసలపై’’ ఆయన కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘బ్రిటన్‌లో ప్రభుత్వం మారాలని’’ పిలుపునిచ్చారు.

''ఏదోకటి చేయాలి. పార్లమెంట్‌ను రద్దు చేసి, తాజాగా ఎన్నికలు నిర్వహించాలి'' అని మస్క్ కోరారు.

'యునైట్ ది కింగ్‌డమ్' ర్యాలీ ప్రాంగణానికి సమీపంలో నిర్వహించిన 'స్టాండ్ అప్ టు రేసిజం' ఆందోళనకారులనుద్దేశించి స్వతంత్ర పార్టీ ఎంపీ డయాన్ అబాట్ ప్రసంగించారు.

'జాత్యాహంకారం, హింస, ఫాసిజం కొత్తేమీ కాదని మనకు తెలుసు. కానీ, ఈ జాత్యాహంకారం, హింసను మనం నిత్యం ఓడిస్తున్నట్లు మీకు తెలుసా?' అన్నారు.

టామీ రాబిన్సన్ తమ కార్యక్రమాన్ని సాయంత్రం ఆరున్నర గంటలకు ముగించారు. ఇలాంటి కార్యక్రమాన్నే మళ్లీ నిర్వహిస్తానని చెప్పారు.

42 ఏళ్ల రాబిన్సన్ ఈ ఏడాదే జైలు నుంచి విడుదల అయ్యారు.

ఆయనపై పరువు నష్టం కేసులో గెలుపొందిన సిరియన్ శరణార్థిపై తప్పుడు ప్రకటనలు చేయకుండా అడ్డుకునేందుకు జారీ చేసిన ఉత్తర్వులను రాబిన్సన్ ఉల్లంఘించడంతో అక్టోబర్‌లో జైలు పాలయ్యారు.

అదనపు రిపోర్టింగ్ : డానియల్ శాండ్‌ఫోర్డ్, నిక్ జాన్సన్, మాయా డేవిస్

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)