వీసా రూల్స్: ట్రంప్ కొత్త నిబంధనలతో భారతీయ విద్యార్థులకు మరిన్ని ఇబ్బందులు తప్పవా?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో చదువుతున్న, అక్కడికి వెళ్లాలనుకుంటున్న భారతీయ విద్యార్థులకు ఇబ్బందులు మరింత పెరిగే అవకాశం ఉంది.
ఎఫ్1 విద్యార్థి వీసాల నిబంధనలలో యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ మార్పులను ప్రతిపాదించడమే దీనికి కారణం.
ఇంతకీ, ప్రతిపాదిత మార్పులు ఏమిటి? అవి భారతీయ విద్యార్థులను ఎలా ప్రభావితం చేస్తాయి?


ఫొటో సోర్స్, Getty Images
కొత్త మార్పులు ఎలా ఉంటాయి?
ఇతర దేశాల విద్యార్థుల వీసా దుర్వినియోగాన్ని నియంత్రించడానికి డోనల్డ్ ట్రంప్ ప్రభుత్వం కొత్త నిబంధనలను ప్రతిపాదించిందని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తెలిపింది.
సాధారణంగా, చదువుకోవడానికి అమెరికా వెళ్లే విద్యార్థులకు ఎఫ్1 వీసా ఇస్తుంటారు. అంతేకాకుండా ఎక్స్ఛేంజ్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్లే విద్యార్థులకు జే1 వీసా ఇస్తారు.
ఇప్పటివరకు, ఈ విద్యార్థి వీసాల కోసం 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్' అనే పద్దతి ఉండేది. అంటే, ఒక విద్యార్థి అమెరికాలో కోర్సును అభ్యసిస్తున్నంత కాలం, వారి స్టేటస్ 'స్టూడెంట్' గా ఉంటుంది. వారు అన్ని వీసా నియమాలను పాటిస్తే అమెరికాలోనే ఉండగలరు.
ఈ 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్' వ్యవస్థను తొలగించాలనే ప్రతిపాదన ఇప్పుడు తీసుకొచ్చారు. విద్యార్థి వీసాల వ్యవధిని 4 సంవత్సరాలకు పరిమితం చేయాలని ప్రతిపాదించారు.

ఫొటో సోర్స్, Getty Images
దీని తర్వాత కూడా, విద్యార్థి అమెరికాలో ఉండాలనుకుంటే, ఆ వ్యక్తి 'డ్యురేషన్ ఆఫ్ స్టేటస్' పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోవాలి. లేకపోతే, ఈ విద్యార్థులు యునైటెడ్ స్టేట్స్ వదిలి వెళ్లి, మళ్లీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. అంటే బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించి, ఆపై మాస్టర్స్ లేదా పీహెచ్‌డీ చేయాలనుకునే వారు తమ కోర్సులకు ముందే కొత్త వీసా ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది.
అమెరికాలో చదువుతున్న విద్యార్థులకు మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు ఇకపై ఒక విశ్వవిద్యాలయంలో ప్రవేశం పొందిన వెంటనే మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ కాలేరు. ఎఫ్-1 వీసాలపై ఉన్న విద్యార్థులు తమ మొదటి సంవత్సరం పూర్తి చేసిన తర్వాత మాత్రమే మరొక విశ్వవిద్యాలయానికి బదిలీ కాగలరు.
గ్రాడ్యుయేట్ విద్యార్థులు అమెరికాలోకి ప్రవేశించిన తర్వాత వారి ప్రోగ్రామ్ లేదా విశ్వవిద్యాలయాన్ని వెంటనే మార్చుకోలేరు. వీసా జారీ చేసేటప్పుడు వారు వారి ఐ-20 ఫారమ్‌లో సూచించిన ప్రదేశానికి వెళ్లాలి.

ఫొటో సోర్స్, Getty Images
అంతేకాకుండా, ఒకే స్థాయి బహుళ డిగ్రీలను పొందడం ఇకపై సులభం కాదు. అంటే, అమెరికాను విడిచిపెట్టి కొత్త వీసా కోసం దరఖాస్తు చేసుకోకుండా, ఒక సబ్జెక్టులో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను, తర్వాత మరొకదానిలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌ను ఒకదాని తర్వాత ఒకటి చేయడం సాధ్యం కాదు.
అంతేకాదు, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్(ఓపీటీ) తర్వాత విద్యార్థులు తీసుకునే కాల వ్యవధినీ తగ్గించారు. గతంలో ఓపీటీ పూర్తి చేసిన తర్వాత కూడా విద్యార్థులు అమెరికాలో 60 రోజులు ఉండడానికి అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ వ్యవధిని 30 రోజులకు తగ్గించాలని ప్రతిపాదించారు. కాబట్టి, లాంగ్వేజ్ స్టడీస్ కోర్సులకు మీరు 24 నెలలు మాత్రమే అనుమతులు పొందుతారు.

ఫొటో సోర్స్, Getty Images
భారతీయ విద్యార్థులపై పడే ప్రభావమేంటి?
ఓపెన్ డోర్స్ డేటా ప్రకారం, ప్రస్తుతం అమెరికాలో 11 లక్షలకు పైగా అంతర్జాతీయ విద్యార్థులు ఉన్నారు. వారిలో 3,30,000 మందికి పైగా భారతీయులే. ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన మార్పులను ఆమోదించి, అమలు చేసే వరకు ఎలాంటి సమస్యా ఉండదు.
అయితే, నియమాలు అమలైన తర్వాత, వారి వీసా వ్యవధి పరిమితం కావొచ్చు. ఇక, విశ్వవిద్యాలయాలను మార్చుకోలేకపోవడం అనే నిబంధన, ఈ ఆగస్ట్ నెలలో అడ్మిషన్(ఫాల్ అడ్మిషన్) తీసుకునే విద్యార్థులకూ వర్తించే అవకాశం ఉంది.
అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం లేదా హెచ్-1బీ వీసా పొందని చాలామంది విద్యార్థులు 'సెకండ్ మాస్టర్స్' చేస్తారు. అంటే, వారు రెండో మాస్టర్స్ కోర్సు పూర్తి చేస్తూ అమెరికాలోనే ఉండేవారు. ఆ ఆప్షన్ ఇప్పుడు తొలగిస్తున్నారు.
అంతేకాకుండా, మొదట 5-6 సంవత్సరాలు పట్టే పీహెచ్డీ వంటి ప్రోగ్రామ్‌ల కోసం, ఎఫ్-1 వీసాలపై ఉన్న విద్యార్థులు ఇప్పుడు 4 సంవత్సరాల తర్వాత మళ్లీ వీసా ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది. అంటే, వీసా రుసుము చెల్లించడం, బయోమెట్రిక్స్ తీసుకోవడం, ఆర్థిక సహాయాన్ని చూపించే పత్రాలను సమర్పించడం వంటి అన్ని ప్రక్రియలు ఉంటాయి.
ఈ మార్పులు మొదట 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ప్రతిపాదించారు. కానీ, బైడెన్ ప్రభుత్వం 2021లో ఈ ప్రతిపాదనను ఉపసంహరించుకుంది. ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం మళ్లీ తీసుకొస్తోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














