సుశీలా కార్కి: ‘‘అలాంటి వారిని నేపాలీలు అని ఎలా అనగలం?’’

ఫొటో సోర్స్, Reuters
- రచయిత, ఇయన్ కేసే
నేపాల్‌కు కొత్తగా నియమితులైన తాత్కాలిక ప్రధానమంత్రి సుశీలా కార్కి ఆరు నెలలకు మించి తాను ఈ పదవిలో ఉండనని చెప్పారు.
''ఈ పదవిని నేను కోరుకోలేదు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనల తర్వాత, నేను దీన్ని అంగీకరించాల్సి వచ్చింది'' అని సుశీలా కార్కి తెలిపారు.
శుక్రవారం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆమె మాట్లాడారు.
వచ్చే ఏడాది మార్చి 5న జరిగే ఎన్నికల తర్వాత గెలుపొందే కొత్త ప్రభుత్వానికి తాను ఈ బాధ్యతలను అప్పజెప్పనున్నట్లు తెలిపారు.

నేపాల్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చిన అవినీతి వ్యతిరేక ఆందోళనల్లో 70 మందికి పైగా మరణించిన తర్వాత సుశీలా కార్కి ఆ దేశ తాత్కాలిక ప్రధానిగా నియమితులయ్యారు.
'జెన్ జడ్' నిరసనకారులు, నాయకులు, అధ్యక్షుడు పౌడెల్, ఇతర న్యాయ నిపుణులతో అనేక చర్చల తర్వాత సుశీలా కార్కి ఈ బాధ్యతలను చేపట్టారు.
''జెన్ జడ్ జనరేషన్ ఆలోచనలకు అనుగుణంగా మనం పనిచేయాలి'' అని సుశీలా కార్కి చెప్పారు.
అవినీతికి ముగింపు పలకాలని, సుపరిపాలనను, ఆర్థిక సమానత్వాన్ని సాధించాలని జెన్ జడ్ డిమాండ్ చేస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించడంతో నేపాల్‌లో సెప్టెంబర్ 8న పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
కేవలం రెండు రోజుల్లోనే ఈ నిరసనలు నేపాల్‌లో హింసాత్మకంగా మారాయి.
పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించిన నిరసనకారులు పార్లమెంట్ భవనానికి నిప్పంటించడంతో పాటు రాజకీయ నేతల ఇళ్లను ధ్వంసం చేశారు.
ఈ ఆందోళనల్లో ముగ్గురు పోలీసులతో పాటు 72 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు.
'' దీన్ని సిగ్గుచేటుగా భావిస్తున్నా. ఈ అత్యవసరమైన భవనాలను ధ్వంసం చేసిన వారు నేపాలీలు అయితే, వారినెలా నేపాలీలుగా పిలుస్తాం'' అని తాత్కాలిక ప్రధానమంత్రి అన్నారు.

ఫొటో సోర్స్, PRABIN RANABHAT/AFP via Getty Images
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఎన్నికైన తర్వాత సుశీలా కార్కి మాట్లాడిన ఇతర ముఖ్యమైన విషయాలు..
- ''ఈ హింసాత్మక ఘటనల్లో తెరాయ్ ప్రాంతంలోని అన్ని జిల్లా కోర్టులు, హైకోర్టు ధ్వంసమైంది. సింఘా దర్బార్, సుప్రీంకోర్టు మంటల్లో కాలి బూడిదయ్యాయి. వీటిల్లో ఉన్న అన్ని ఫైళ్లు దెబ్బతిన్నాయి'' అని కార్కి చెప్పినట్లు బీబీసీ నేపాలీ రిపోర్టు చేసింది.
- దెబ్బతిన్న భవనాలను తిరిగి నిర్మించగలమని, కానీ, కాలిపోయిన పత్రాలను మాత్రం తిరిగి తీసుకురాలేమని చెప్పారు. ''రికార్డులు, పాత ఫైళ్లు, వివరాలు అన్నీ నాశనమయ్యాయి. ఇప్పుడు మేం జీరో'' అని సుశీలా కార్కి అన్నారు.
- జెడ్ జడ్ ఉద్యమంలో చనిపోయిన వారిని అమరవీరులుగా ప్రకటించనున్నట్లు ప్రధానమంత్రి సుశీలా కార్కి చెప్పారు. బాధిత కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన పరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. మృతుల కుటుంబానికి ప్రభుత్వం రూ.10 లక్షల పరిహారం ఇవ్వనుంది.

ఫొటో సోర్స్, Reuters
కార్కి ముందున్న సవాళ్లేంటి?
నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయిన సుశీలా కార్కికు క్లీన్ ఇమేజ్ ఉంది.
అయితే, వివాదాల నుంచి ఆమె కూడా తప్పించుకోలేకపోయారు. ఆమె కఠిన వైఖరి కారణంగా, రాజకీయాల్లో వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రధాన న్యాయమూర్తిగా సుమారు 11 నెలల తన పదవీ కాలంలో అభిశంసన తీర్మానాన్ని కూడా ఎదుర్కొన్నారు.
ప్రస్తుతం కార్కి, ఆమె కేబినెట్ సభ్యులు పలు సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంది. శాంతిభద్రతలను పునరుద్ధరించాలి. నిరసనకారులు దాడి చేసి ధ్వంసం చేసిన పార్లమెంట్‌ను, ఇతర భవంతులను తిరిగి నిర్మించాలి. మార్పును కోరుకుంటోన్న జెన్ జడ్ ఆందోళనకారులకు భరోసా ఇవ్వాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














