నేపాల్ ‘జెన్ జడ్’ ఉద్యమ ప్రభావం ఇండియా, చైనాపై ఉంటుందా?

ఫొటో సోర్స్, Reuters
ఈ వారం ప్రారంభంలో నేపాల్ ప్రభుత్వం కూలిపోయింది.
ఈ నిరసనలకు 'జెన్ జెడ్ ఉద్యమం' అని పేరు పెట్టారు.
జెన్ జడ్ అంటే, 1990 నుంచి 2010 మధ్య జన్మించిన వారిని ఇంగ్లిష్‌లో జనరేషన్ జెడ్ (Generation Z లేదా Gen Z)గా చెబుతారు. వీరినే జెన్ జడ్‌గా పిలుస్తారు.
ఇంటర్‌నెట్ ప్రభావం గణనీయంగా పెరిగిన సమయంలో ఈ తరం పుట్టింది.
పెద్దయ్యాక వారు సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఉంటున్నారు.
నేపాల్ ప్రభుత్వం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై నిషేధం విధించినప్పుడు, యువత నిరసనలు ప్రారంభించింది. తర్వాత ఇది హింసాత్మకంగా మారింది.
చాలా మంది మరణించారు. ప్రభుత్వ భవనాలకు నిప్పు పెట్టారు. ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సి వచ్చింది.
- పరిస్థితి ఇంత త్వరగా ఎలా దిగజారింది?
- అక్కడి నాయకత్వం దాన్ని సరిగ్గా ఎందుకు అంచనా వేయలేకపోయింది?
- నేపాల్‌లో రాజకీయ అస్థిరతకు కారణమేంటి?
- ఇప్పుడు అక్కడ ఎలాంటి నాయకత్వం ఏర్పడుతుంది?
- నేపాల్ పరిణామాలు భారత్, చైనా వంటి పొరుగు దేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
ఈ అంశాలన్నింటినీ ది లెన్స్‌లో చర్చించారు.
ఈ చర్చలో, కలెక్టివ్ న్యూస్‌రూమ్ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముఖేష్ శర్మతో పాటు బీబీసీ నేపాలీ సర్వీస్ ఎడిటర్ జితేంద్ర రౌత్, బీబీసీ హిందీ ప్రతినిధి రజనీష్ కుమార్, భారత మాజీ దౌత్యవేత్త మీరా శంకర్ పాల్గొన్నారు.


ఫొటో సోర్స్, PEDRO PARDO/AFP via Getty Images
పరిస్థితి అంత త్వరగా ఎలా దిగజారింది?
‘‘జెన్ జెడ్ నిరసనల వల్ల అకస్మాత్తుగా అధికారం పతనం జరిగిందని బయటి నుంచి చూసేవారికి అనిపించవచ్చు. కానీ దీనికి కారణం యువత మనస్సులో చాలా కాలంగా అవినీతిపై ఉన్న కోపం. సోషల్ మీడియా నిషేధానికి వ్యతిరేకంగా నిరసనలతో ఇదంతా ప్రారంభమైనట్టు వార్తలు చూస్తే అనిపించవచ్చు కానీ అది ఒక ట్రిగ్గర్ పాయింట్ మాత్రమే" అని బీబీసీ నేపాలీ ఎడిటర్ జితేంద్ర రౌత్ అన్నారు.
నేపాల్ ప్రజలు సోషల్ మీడియాలో చాలా కాలంగా రాజకీయ అవినీతికి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారని ఆయన చెప్పారు.
ప్రజల మనస్సుల్లో ఇప్పటికే ఉన్న కోపం ఓ విస్ఫోటనంలా మారడంలా దీన్ని చూడాలని ఆయన అన్నారు.
"దీనికి ముందు కూడా, ప్రజలు నెపో కిడ్స్ ప్రచారంలో తమ కోపాన్ని వ్యక్తం చేశారు. ఆ కోపం వీధుల్లోకి వచ్చింది. అంతా మారిపోయింది" అని జితేంద్ర రౌత్ అభిప్రాయపడ్డారు.
జితేంద్ర చెప్పిన 'నెపో కిడ్స్' అంటే సోషల్ మీడియాలో కనిపిస్తున్న నేపాల్ రాజకీయ నాయకుల పిల్లల ఫోటోలు, వీడియోలు.
ఆ 'నెపో కిడ్స్' ఎంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారో ప్రజలు చూశారు. దేశంలోని మిగిలిన యువత తమ జీవితాలను వారి జీవితాలతో పోల్చుకుంటున్నారు.
ఇప్పుడు నేపాల్‌లో అధికార మార్పు తర్వాత, కొంత స్థిరత్వం వస్తోందని చెబుతున్నారు, జెన్ జెడ్ ప్రజలు దీన్ని ఇలాగే చూస్తున్నారు.
ప్రజలతో మాట్లాడినప్పుడు వారు కొంచెం గందరగోళంగా ఉన్నట్టు అనిపించిందని ప్రస్తుతం కాఠ్‌మాండూలో ఉన్న బీబీసీ ప్రతినిధి రజనీష్ కుమార్ అన్నారు.
"వాస్తవానికి ఈ ఉద్యమంలో సమస్య ఏమిటంటే, జెన్ జెడ్‌ను ముందుకు నడిపించే నాయకుడు లేరు. వారికి కొన్ని డిమాండ్లు ఉన్నాయి. ఈ డిమాండ్లు ఒకేలా లేవు. ప్రజలు వేర్వేరు డిమాండ్లు చేస్తున్నారు. నాయకుడు లేనప్పుడు, ఉద్యమం చెల్లాచెదురవుతుంది''
"అవినీతి ఆగిపోవాలని వారు చెబుతున్నారు. అయితే అవినీతి అనేది అందరి దృష్టిలో ఒకేలా లేదు. అది వేరువేరు దృష్టికోణాలు కలిగి ఉన్న అంశం.కొత్త ప్రభుత్వం వచ్చినంత మాత్రాన అవినీతి ఆగిపోదు. నిరుద్యోగ సమస్యకు పరిష్కారం లభించాలి, అవినీతిని ఆపాలి అనేవి ప్రధాన డిమాండ్లు".

ఫొటో సోర్స్, MONEY SHARMA/AFP via Getty Images
నేపాల్ పరిణామాలు పొరుగుదేశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి?
- నేపాల్ ప్రస్తుత పరిస్థితి భారత్, ఇతర పొరుగుదేశాలపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతుంది?
"ఈ అస్థిరత భారతదేశానికి ఆందోళన కలిగించే విషయం. మన చుట్టూ శాంతియుత వాతావరణం, ఆర్థిక పురోగతి ఉండాలని కోరుకుంటాం. ప్రతి దేశంలోనూ కాస్త తేడా ఉంటుంది. పరిస్థితులు ఒకేలా ఉండవు'' అని భారత మాజీ దౌత్యవేత్త మీరా శంకర్ అన్నారు.
"తర్వాత ఏం జరుగుతుందనే దానిపై స్పష్టమైన ఒప్పందమేమీ లేదు. తాత్కాలిక ప్రభుత్వం ఆరేడునెలలు ఉన్న తర్వాత ఎన్నికలు నిర్వహించేందుకు చర్చలు జరుగుతున్నాయి" అని ఆమె అన్నారు.
ఏదో ఒక విధంగా తమ గొంతును ప్రభుత్వం వినాలని యువతరం కోరుకుంటున్నట్టు ఆమె చెప్పారు. బంగ్లాదేశ్ తరహా ప్రభుత్వాన్ని నడపాలని నేపాల్‌లో అనుకోవడం లేదు.
నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి ఇప్పుడు నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు. అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్ ఆమెతో పదవీ ప్రమాణం చేయించారు.

ఫొటో సోర్స్, Sanjit Pariyar/NurPhoto via Getty Images
పరిస్థితిని అంచనా వేయలేకపోయారా?
నేపాల్‌లో జరిగిన ఉద్యమం వ్యవస్థీకృతంకాదు, ప్రజలు నెమ్మదిగా వీధుల్లోకి రావడం మొదలయిన తర్వాత అది ఒక ఉద్యమంగా మారింది.
- నేపాల్ రాజకీయ నాయకత్వం పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేకపోయిందా, దాని ఫలితంగా ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేయాల్సివచ్చిందా?
"వారికి నాయకుడు లేరు, స్పష్టమైన డిమాండ్లు లేవు. ఇది ఒక్కసారిగా జరిగింది. ఇది వ్యవస్థీకృత నిరసన కాదు. ఈ జెన్ జెడ్ కేవలం పేరుకు మాత్రమే కాదు, ఆచరిస్తారు కూడా'' అని జితేంద్ర రౌత్ అన్నారు.
"ఈ జెన్ జెడ్ వ్యక్తులు ఏం చెబుతున్నారో దాన్ని వారు దానిని సోషల్ మీడియాలో చేస్తున్నారు. బయట ప్రదర్శించిన కోపాన్ని సోషల్ మీడియాలోనూ చూపించారు. ఇది పెద్దవాళ్లు కూడా ఉపయోగించే సోషల్ మీడియా ద్వారా జరగలేదు. ఈ ఉద్యమం డిస్కార్డ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో జరిగింది" అని ఆయన వివరించారు.
ఈ తరం భిన్నంగా ఉందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలని ఆయన అంటున్నారు. వారు దేశంలో ఉండి ఏదైనా చేయాలని కోరుకుంటున్నారు. కానీ రాజకీయ అవినీతి కారణంగా తమ అవకాశం పోయిందని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, SUJAN GURUNG/AFP via Getty Images
నేపాల్ రాజకీయ అస్థిరతను ఎలా అర్థం చేసుకోవాలి?
"ఈ మార్పు ఒక బ్రేకింగ్ పాయింట్. దీనికి ముందు, తర్వాత అన్నట్టుగా జరిగిన సంఘటనలను మనం చూడాలి" అని జితేంద్ర రౌత్ అన్నారు.
భవిష్యత్తు గురించి చెప్పాలంటే రాజకీయ పరిణితి లోపించిందని, ఇంకా పోరాడాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే సామాన్యుల జీవితాల్లో మార్పు తీసుకురావడంలోనూ పరిణితి లేదన్నారు.
"పార్టీలు తమ సొంత ఎజెండాతో ఎన్నికల్లో పోటీ చేస్తాయి. మెజారిటీ రాకపోతే, అవ్వన్నీ కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. తర్వాత ఎజెండా మారుతుంది. ఇది అస్థిరతకు దారితీస్తుంది. ఇది కూడా కోపానికి కారణమైంది. నా అభిప్రాయం ప్రకారం, ఈ పరిణామాలు చాలా విషయాలని మళ్లీ మొదటికి తెచ్చాయి'' అని జితేంద్ర రౌత్ విశ్లేషించారు.

ఫొటో సోర్స్, PRABIN RANABHAT/AFP via Getty Images
ప్రస్తుతం నేపాల్ ఎలా ఉంది?
- ఇటీవలి ఆందోళనల తర్వాత నేపాల్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయి?వాటి ప్రభావమేంటి?
" యువత కోపం, వారి ఆగ్రహమే ఈ ఉద్యమం అంటున్నారు. అయితే ఇది చాలా సందేహాలను కూడా లేవనెత్తుతోంది. యువత డిమాండ్లు చేస్తున్నారు కానీ వారు ప్రజాస్వామ్య మార్గంలో వస్తారా లేదా మరేదైనా కోరుకుంటున్నారా అనేది స్పష్టంగా లేదు" అని రజనీష్ వివరించారు
నేపాల్ 2008లో గణతంత్ర దేశంగా అవతరించింది. ఇది జరిగి కేవలం 17 సంవత్సరాలు మాత్రమే అయింది. దీనిని చాలా కాలం అన్న కోణంలో చూడలేం.
"నేను చాలా మంది నాయకులను, ఎంపీలను కలిశాను. కొత్త ప్రభుత్వం ఎలా పనిచేస్తుందనేదానిపై వారు సందేహాలు వ్యక్తంచేస్తున్నారు? రాజ్యాంగం మునుపటిలానే ఉంటుందా? బహుళ పార్టీ ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుంది?" అని ఆయన ప్రశ్నించారు.
"నేపాల్ ఇప్పుడు సమాధానాలు కనుక్కోవాల్సిన ప్రశ్నలు చాలా ఉన్నాయి. 17 సంవత్సరాలలో అన్ని రకాల పరిణతిని ఆశించలేం. భారతదేశ ప్రజాస్వామ్యం 79 సంవత్సరాల తర్వాత కూడా మార్పులు చెందుతోంది. ఇది ఒక ప్రక్రియ" అని రజనీష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
నేపాల్‌లో రాచరికం మళ్లీ వస్తుందా?
నేపాల్‌లో రాచరికం తిరిగి రావాలని తాము డిమాండ్ చేయడం లేదని నిరసనకారులు చెప్పినప్పటికీ, నేపాల్‌లో నిరసనల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని లక్ష్యంగా చేసుకున్నట్టు అనేక సంకేతాలు కనిపిస్తున్నాయి.
- నేపాల్‌లో రాచరికం తిరిగి వచ్చే అవకాశం ఉందా? దానికేమన్నా మార్గం ఏర్పడుతుందా?
"ఒక జర్నలిస్ట్ కోణం నుంచి గమనిస్తే ఈ మొత్తం పరిణామాల్లో రాచరికానికి చోటు లేదు. జరిగిన నష్టాన్ని చూస్తుంటే, నిరసన తెలుపుతున్న వారే అలా చేశారని చెప్పలేం" అని జితేంద్ర అన్నారు.
"ప్రజాస్వామ్యంలోని మూడు స్తంభాలను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా ఈ దాడి జరిగిందని చెప్పడం కొంచెం తొందరపాటు అవుతుంది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Lintao Zhang/Pool/Getty Images
నేపాల్ పరిణామాలపై ఆందోళన ఎవరికి?
- నేపాల్‌లో జరిగిన సంఘటనకు భారత్, చైనా, అమెరికాల్లో అంతర్జాతీయ దౌత్యం, రాజకీయాల పరంగా చాలా ప్రాముఖ్యం ఉంది. దీనిపై ఎవరు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు?
"నేపాల్‌లో అస్థిరత లేదా హింస ఉండాలని ఏ దేశమూ భావించదు. కాబట్టి ఇది మూడు దేశాలకీ ఆందోళన కలిగించే విషయం" అని మీరా శంకర్ అన్నారు. ‘‘ప్రధాని కేపీశర్మ ఓలీ చైనాకు చాలా దగ్గర. కాబట్టి ఆయన రాజీనామా చైనాకు పెద్ద విషయం’’
"నా అభిప్రాయం ప్రకారం, ఏ పరిష్కారం వచ్చినా, అది ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగ పరిధిలో ఉండాలి. రాజ్యాంగాన్ని దాటి హింస ద్వారా మార్పు తీసుకురావడానికి ప్రయత్నించడం మూడు దేశాలకూ ఆందోళన కలిగించే విషయం" అని విశ్లేషించారు.
"నేపాల్‌లో ఏం జరిగిందంటే, భవిష్యత్తులో ఈ పరిస్థితి నియంత్రించకపోతే, ఎలాంటి ఒప్పందం కుదరకపోతే, బయటి వ్యక్తులు లాభం పొందడానికి ప్రయత్నించవచ్చు" అని ఆమె అంచనా వేస్తున్నారు.
"తాత్కాలిక ప్రభుత్వం, పార్లమెంట్, లేదా 6-7 నెలల తర్వాత ఎన్నికలు అనే ఈ అంశాలన్నింటిపై రాజీ పడటం ముఖ్యం. సైన్యం ప్రభుత్వాన్ని నడుపుతుంటే ప్రజలు కూడా ఇష్టపడరు" అని మీరా శంకర్ అంటున్నారు.
"రాజకీయ అస్థిరత ఉంది, కానీ ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత నేపాల్‌లో జరిగిన ఆర్థిక పురోగతి, సామాజిక అభివృద్ధి రాచరికం కాలంలో కంటే చాలా ఎక్కువ. రాచరికంలో స్థిరత్వం ఉంది కానీ స్వేచ్ఛ లేదు" అని తెలిపారు.

ఫొటో సోర్స్, Reuters
సైన్యం పాత్ర
- నేపాల్ నాయకులు, జెన్ జెడ్ మధ్య సైన్యం పాత్ర గురించి ఏదైనా చర్చ జరుగుతోందా?
"నేపాల్ ఎదుర్కొన్న నష్టాలను చూస్తే, అది కోలుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయడం కష్టం, సైన్యం ముందు వరుసలో ఉన్నట్టు కనిపిస్తోంది'' అని రజనీష్ అన్నారు.
- ఉద్యమం తర్వాత, పరిస్థితిని సైన్యం నియంత్రిస్తున్నందున అది అన్ని అధికారాలను తన దగ్గరే ఉంచుకోగలదు. కానీ నేపాల్‌లో సైన్యం పాత్రను ఏ కోణం నుంచి చూస్తున్నారు?
"నేపాల్ సమస్యలను సైన్యం ప్రస్తుతం లేవనెత్తుతున్న తీరును జెన్ జెడ్ ప్రశంసిస్తోంది. తమ డిమాండ్‌ను రాష్ట్రపతి వద్దకు సైన్యం తీసుకెళ్లిన తీరును అభినందిస్తున్నామని జెన్ జెడ్ యువత సోషల్ మీడియాలో చెబుతోంది" అని జితేంద్ర వివరించారు.
సైన్యం వీధుల్లోకి వచ్చిన తర్వాత ఏర్పడిన పరిస్థితులు శాంతిభద్రతలను మెరుగుపర్చాయి. సామాన్య ప్రజలు పెద్దగా కఠిన పరిస్థితులను ఎదుర్కొనలేదు.
- నేపాల్ రాజకీయ పార్టీల భవిష్యత్తు ఏంటి? ఈ పరిస్థితుల్లో ఎలాంటి నాయకత్వం ఏర్పడుతుంది?
"ప్రస్తుతం అన్ని రాజకీయ పార్టీలు తాత్కాలిక ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడంపై చర్చించాయి. మన గత తప్పిదాల కారణంగా, దేశానికి ఇలాంటి పరిస్థితి వచ్చిందని నాయకులు చెప్పారు" అని జితేంద్ర అన్నారు.
"కానీ ఎన్నికలు జరిగినప్పుడు, మారుతున్న పరిస్థితులలో వారు ప్రజల దగ్గరకు ఎలా వెళ్తారో, వారు ఎలాంటి సమస్యలను లేవనెత్తుతారో చూడాలి, ఎందుకంటే ఈ సంఘటన రాజకీయ దృక్పథాన్ని చాలా మార్చివేసింది" అని ఆయన విశ్లేషించారు.

ఫొటో సోర్స్, MEA INDIA
ఈ పరిస్థితుల నుంచి భారత్ ఏం కోరుకోవాలి?
"నేపాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి భారతదేశం సహకరిస్తుంది. నేపాల్ పురోగతిని కోరుకుంటున్నాం. అక్కడి ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందాలని, అక్కడ రాజకీయ స్థిరత్వం ఉండాలని కోరుకుంటున్నాం" అని మీరా శంకర్ అన్నారు.
"నేపాల్ మనకు చాలా దగ్గరగా ఉంది. అక్కడ ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా భారత్ దానితో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే భారత వ్యతిరేక భావాలను రెచ్చగొట్టడం ద్వారా జాతీయవాద సమస్యను లేవనెత్తకూడదు" అని ఆమె చెప్పారు.
"పొరుగు దేశాల సహకారంతో నేపాల్ ఆర్థిక పురోగతి సాధించవచ్చు. మనం కోరుకునేది కూడా ఇదే. అక్కడి ప్రజలు ఏ ఒప్పందం చేసుకున్నా, దానికి మద్దతు ఇస్తాం, అది ప్రజాస్వామ్య పరిధిలో, రాజ్యాంగ పరిధిలో శాంతియుతంగా జరుగుతుందని ఆశిస్తున్నాం" అని ఆమె స్పష్టం చేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














