కమీ రీటా: ఏడాదికోసారి ఎవరెస్ట్ అధిరోహిస్తారు.. 55 ఏళ్ల వయసులో 31వ సారి అధిరోహించడంతో రికార్డ్

నేపాలీ షెర్పా కమీ రీటా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేపాలీ షెర్పా కమీ రీటా
    • రచయిత, కెల్లీ ఎన్జీ
    • హోదా, బీబీసీ న్యూస్

‘ఎవరెస్ట్ మ్యాన్‌’గా పేరున్న నేపాలీ షెర్పా కమీ రీటా.. 31వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు.

ప్రపంచంలో అత్యంత ఎత్తైన శిఖరాన్ని ఎక్కువ సార్లు అధిరోహించిన వ్యక్తిగా తన రికార్డును తానే బద్దలుకొట్టారు.

ఈ పర్వతం ఎక్కేందుకు భారత సైనిక అధికారుల బృందానికి మార్గదర్శకుడిగా వ్యవహరించిన 55 ఏళ్ల షెర్పా (గైడ్) కమీ రీటా.. మంగళవారం స్థానిక సమయం ప్రకారం ఉదయం 4.00 గంటలకు 8,849 మీటర్ల ఎత్తుకు చేరుకున్నారు.

''షెర్పా కమీ రీటాను ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. ఈయన నేషనల్ క్లైంబింగ్ హీరో (జాతీయ పర్వతారోహక హీరో) మాత్రమే కాదు, ఎవరెస్ట్‌కే ప్రపంచ చిహ్నంగా మారారు'' అని ఈ పర్వత యాత్రను నిర్వహించిన ‘సెవెన్ సమిట్ ట్రెక్స్’ తన ప్రకటనలో తెలిపింది.

వాణిజ్య యాత్రకు మార్గదర్శిగా 1994లో తొలిసారి కమీ రీటా ఎవరెస్ట్‌ను అధిరోహించారు. అప్పటి నుంచి ఏటా ఆయన ఈ పర్వతాన్ని ఎక్కుతున్నారు.

2023, 2024 ఏళ్లలో రెండేసి సార్లు ఈ శిఖరాన్ని ఎక్కారు.

ఎవరెస్ట్ ఎక్కడంలో కమీ రికార్డును అధిగమించేందుకు మరో నేపాలీ షెర్పా పసంగ్ దావా కూడా పోటీలో ఉన్నారు.

ఆయన 29 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించారు. గత వారం కూడా ఆయన ఎవరెస్ట్‌ను ఎక్కేందుకు ప్రయత్నించారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తన పర్వతరోహణలు కేవలం పని కోసమేనని కమీ రీటా గతంలో మీడియాకు చెప్పారు.

''ఈ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉంది'' అని గత ఏడాది మే నెలలో ఏఎఫ్‌పీకి తెలిపారు.

''ప్రపంచంలో నేపాల్‌కు గుర్తింపు తెచ్చిపెట్టడంలో నా పర్వతారోహణలు సాయపడటం చాలా సంతోషాన్ని ఇస్తుంది'' అని కమీ రీటా అన్నారు.

ఎవరెస్ట్‌పై జీవితం ఎలా ఉంటుందో చెప్తూ.. కమీ రీటా గత నెలలో ఒక పోస్ట్ చేశారు.

అందులో ఎవరెస్ట్ యాత్రలకు ప్రారంభానికి ముందు ఈ యాత్ర సురక్షితంగా, విజయవంతంగా సాగాలని ప్రార్థిస్తూ నిర్వహించే టిబెట్ బుద్ధుడి పూజ కార్యక్రమం కూడా ఉంది.

బ్రిటిష్ పర్వతారోహకుడు కెంటన్ కూల్‌ 19వ సారి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన ఒక వారంలోనే కమీ రీటా ఈ ఘనతను సాధించారు.

షెర్పా కాని వారిలో అత్యధికసార్లు ఈ శిఖరాన్ని ఎక్కింది కెంటన్ కూల్.

Kami Rita

ఫొటో సోర్స్, Getty Images

ప్రస్తుత పర్వతారోహణ సీజన్‌లో ఇప్పటివరకు 500 మందికి పైగా ఎవరెస్ట్‌ శిఖరాన్ని ఎక్కారు.

ఈ సీజన్‌లో 1000కి పైగా క్లైంబింగ్‌లకు నేపాల్ అనుమతులు జారీ చేసింది. దానిలో ఎవరెస్ట్, ఇతర శిఖరాలు ఉన్నట్లు నేపాల్ పర్యటక విభాగం వివరాల్లో ఉంది.

ఇటీవల కాలంలో ఎవరెస్ట్‌ను అధిరోహించేందుకు ప్రయత్నిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీనివల్ల జనం తాకిడి, పర్యావరణ ప్రభావం పడుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించే పర్వతారోహకులు ఇకపై తమ మలాన్ని తిరిగి బేస్‌ క్యాంప్‌కి తీసుకొచ్చి, పారవేయాలని గత ఏడాదినే అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)