ఇండియా - పాకిస్తాన్ క్రికెట్: మియాందాద్ లాస్ట్ బాల్ సిక్సర్, నడుంనొప్పితో సచిన్ సెంచరీ, కుంబ్లే 10 వికెట్లు, ముల్తాన్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ.. ఇంకా ఏమేం గుర్తున్నాయి?

కిరణ్ మోరే, మియాందాద్...

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మితిమీరి అప్పీలు చేస్తున్నాడంటూ భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే‌ను వెక్కిరిస్తూ జావెద్ మియాందాద్ కుప్పిగంతులు భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్‌లో వచ్చే భావోద్వేగ ఘట్టాలకు ఓ ఉదాహరణ.
    • రచయిత, సి. వెంకటేష్
    • హోదా, బీబీసీ కోసం

స్పీడును నమ్ముకున్న ఫుట్‌బాల్, హాకీ లాంటి ఆటలతో పోలిస్తే క్రికెట్ చాలా మందకొడిగా కనిపిస్తుంది, ఒక్కోసారి సాగతీత అనిపిస్తుంది. అయినా కూడా నింపాదిగా జరిగే క్రికెట్ పోటీల్లో బోలెడంత డ్రామా ఉంటుంది. చెప్పుకోడానికి బోలెడన్ని కథలుంటాయి.

ఇక ఇండో-పాక్ క్రికెట్ విషయానికొస్తే ఆ డ్రామాకు ఎన్నో ఎమోషన్స్ జతకూడి కథనం మరింతగా రక్తి కడుతుంది. ప్రధాన ఇతివృత్తం చుట్టూ అల్లుకున్న అనేకానేక పిట్ట కథలు కూడా మన కళ్ల ముందు కదలాడతాయి.

కిరణ్ మోరేను వెక్కిరిస్తూ జావేద్ మియాందాద్ వేసిన కుప్పిగంతులు, బ్యాట్ పట్టుకుని ఓ ప్రేక్షకుడిపైకి లంఘించిన ఇంజమాముల్ హక్, ఇంకా అలాంటివి ఎన్నెన్నో...

భారత-పాక్ క్రికెట్ పోటీలను ఎవ్వరూ కేవలం ఒక మ్యాచ్‌లా చూడరు. పత్రికలు ఈ మ్యాచ్ గురించి మహా సంగ్రామం, సంకుల సమరం లాంటి పెద్దపెద్ద పదాలు వాడతాయి.

టీవీ చానల్స్‌లో వేడి వేడి చర్చలు జరుగుతాయి. దేశ విభజన నాటి నుంచి మొన్నటి ‘ఆపరేషన్ సిందూర్’ వరకు రెండు వైపులా ఇప్పటికీ ఎన్నో గాయాలు పచ్చిగా ఉన్నాయి.

తమ జట్టు ‘దాయాదుల’పై క్రికెట్ మైదానంలో నెగ్గితే ఆ గాయాలకు మలాము పూసినట్టయి ఊరట చెందడం అటూ ఇటూ కూడా పరిపాటే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోతారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియా- పాక్ మ్యాచ్ రోజున రెండు దేశాల్లోని ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు.

ఇక ఆ రోజున కర్ఫ్యూ వాతావరణమే

ఇండియా- పాక్ మ్యాచ్ రోజున రెండు దేశాల్లోని ప్రజలు టీవీలకు అతుక్కుపోతారు. రోడ్ల మీద కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తుంది. క్రికెట్ ఇష్టపడని వాళ్లు కూడా ఆరోజున టీవీకి కళ్లప్పగిస్తారు.

ఒక వైపు కార్గిల్ యుద్ధం జరుగుతుండగానే, 1999 ప్రపంచ కప్‌లో భారత పాక్ జట్లు తలపడ్డాయి. కశ్మీర్ సరిహద్దులో ఓ సైనికుడు ఒక చేత్తో రైఫిల్, మరొక చేత్తో ట్రాన్సిస్టర్ పట్టుకుని ఆ మ్యాచ్ కామెంటరీ వింటున్న ఫోటోను లండన్‌కు చెందిన గార్డియన్ పత్రిక ప్రచురించింది.

1996 ప్రపంచ కప్ సమయంలో ఇండియా, పాకిస్తాన్‌లో పర్యటించిన అమెరికన్ రచయిత మైక్ మార్కుసీ ఇలాంటివన్నీ చూసి "వార్ మైనస్ ది షూటింగ్" అనే జార్జ్ ఆర్వెల్ మాటనే టైటిల్‌గా పెట్టి ఓ పుస్తకం రాశాడు.

నిజంగానే ఇండో-పాక్ క్రికెట్ మ్యాచ్‌లు తుపాకులు, తూటాలు లేని సమరాన్ని తలపిస్తాయి.

ఇండియా మద్ధతుతోనే పాకిస్తాన్‌కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సభ్యత్వం లభించిందంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. అంతే కాదు, టెస్ట్ హోదా లభించాక పాకిస్తాన్ తన మొట్ట మొదటి సిరీస్ ఇండియాతోనే ఆడింది.

మొదట్లో జరిగిన టెస్ట్ సిరీస్‌లలో రెండు దేశాల కెప్టెన్లూ 'సేఫ్టీ ఫస్ట్' సిద్ధాంతాన్ని పాటించేవారు. గెలవకపోయినా పరవాలేదు, ఓడిపోకుండా ఉంటే చాలు అనే ధోరణిలో ఆడుతుండేవారు. అందుకే ఇండో-పాక్ టెస్ట్ సిరీస్‌లలో ఒక్కోసారి అయిదు మ్యాచ్‌లు ఆడితే అన్నీ డ్రా కావడం కనిపిస్తుంది.

అప్పట్లో సోషల్ మీడియా లేకపోయినా ఉత్తరాల రూపంలో ఆటగాళ్లకు వార్నింగులు వచ్చేవి.

1960-61 టెస్ట్ సిరీస్‌కు ముందు అప్పటి భారత కెప్టెన్ నారీ కాంట్రాక్టర్‌కు ఓ అభిమాని ఇలా రాశాడు -" పాకిస్తాన్‌తో సిరీస్ గెలుస్తావని ఆశిస్తున్నా. గెలవక పోతే కనీసం డ్రా చేసుకో. ఓడిపోతే మాత్రం నీ ప్రాణాలు దక్కవు". ఆ సిరీస్‌లోని ఐదు టెస్టులూ డ్రా అయ్యాయి.

ఇరుదేశాల మధ్య భావోద్వేగాలకు కొదవ ఉండదు.

ఫొటో సోర్స్, Getty Images

1987 వరకు నో ఫేస్ టు ఫేస్

ఇప్పుడైతే ప్రతి ప్రపంచ కప్‌లోనూ ఇండియా, పాకిస్తాన్‌లను ఒకే గ్రూప్‌లో ఆడిస్తున్నారు కానీ, 1975 నుంచి 1987 వరకు మొదటి నాలుగు ప్రపంచ కప్ టోర్నమెంటుల్లో రెండు దేశాలు ఒక్కసారి కూడా ముఖాముఖి తలపడలేదు.

1992 నుంచి ఇప్పటివరకు ఇండియా-పాకిస్తాన్ ఎనిమిది వన్‌డే ప్రపంచ కప్ మ్యాచ్‌లు ఆడితే ఆ ఎనిమిది సార్లూ భఆరత జట్టే నెగ్గింది.

భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే శ్రుతిమించి అప్పీల్ చేస్తున్నాడని అతన్ని వెక్కిరిస్తూ పాక్ ఆటగాడు జావేద్ మియాందాద్ కుప్పిగంతులు వేసిన సందర్భం 1992 ప్రపంచ కప్ మ్యాచ్‌లోనే చూశాం.

1996 ప్రపంచ కప్‌లో కూడా బాగా గుర్తుండే ఘట్టం ఒకటుంది. వెంకటేశ్ ప్రసాద్ బౌలింగ్‌లో పాక్ ఓపెనర్ ఆమిర్ సొహైల్ ఒక బౌండరీ కొట్టి, ఎలా కొట్టానో చూశావా అన్నట్టు సైగ చేశాడు. కానీ వెంకటేశ్ ప్రసాద్ ఆ తర్వాతి బంతికి సోహైల్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఈసారి అతనికి పెవిలియన్ దారి ఎటో చూపించాడు.

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

ఇండో పాక్ క్రికెట్‌కు సంబంధించి కొన్ని అవాంఛనీయ సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.

  • 1989 కరాచీ టెస్ట్‌లో ఓ వ్యక్తి గ్రౌండ్‌లోకి ప్రవేశించి, అప్పటి భారత జట్టు కెప్టెన్ కె.శ్రీకాంత్ పైన కత్తితో దాడి చేయబోయాడు. కానీ అదృష్టవశాత్తూ శ్రీకాంత్‌కేమీ గాయాలవ్వలేదు.
  • 1997 సహారా కప్‌లో తనను 'ఆలూ' అని వెక్కిరిస్తున్న ఒక ప్రేక్షకుడిపై పాక్ ఆటగాడు ఇంజమాముల్ హక్ క్రికెట్ బ్యాట్‌తో దాడి చేయబోయాడు.

ఇక ఇండియా పాకిస్తాన్ క్రికెటర్ల మధ్య మ్యాచ్ సమయంలో మాటల యుద్ధం సంఘటనలు కోకొల్లలు.

కానీ ఆ ఘర్షణలన్నీ గ్రౌండ్‌కే పరిమితం. మైదానం బయట మాత్రం రెండు దేశాల ఆటగాళ్లు చక్కగా కలిసిపోయిన సందర్భాలే ఎక్కువ.

సచిన్,

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లో మాటల యుద్ధం కూడా జరుగుతుంటుంది

ఇండియా-పాక్ మధ్య పోటీల్లో ఆటగాళ్ళ మీద విపరీతమైన ఒత్తిడి ఉంటుంది అయినా సరే రెండు దేశాల దిగ్గజ ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనకు ఈ పోటీనే ఎంచుకున్నట్టుగా కనిపిస్తుంది.

  • 1978లో భారత జట్టు పాకిస్తాన్ వెళ్ళినప్పుడు జహీర్ అబ్బాస్ భారత స్పిన్నర్లను ఓ ఆటాడుకున్నాడు.
  • ఆ తరువాత బిషన్ సింగ్ బేడీ, ప్రసన్న, చంద్ర రిటైరయ్యారు. స్పిన్ మాంత్రికుల నిష్క్రమణ, కపిల్ దేవ్ ఎంట్రీ అదే టూర్‌లో జరిగాయి.
  • 1982 నాటి పాక్ పర్యటనలో ఇమ్రాన్ ఖాన్ ఐదు టెస్టుల్లో 40 వికెట్లు తీశాడు.(అందులో కొంత అంపైర్ల సహకారం కూడా ఉందనే విమర్శలున్నాయి).
  • ఇక 1986 ఆస్ట్రలేసియా కప్ ఫైనల్ చివరి బంతికి మియాందాద్ కొట్టిన సిక్స్ గురించి ఇప్పటి తరానికి కూడా తెలుసు.
  • 1987 బెంగళూరు టెస్ట్‌లో గవాస్కర్ 96 పరుగుల ఇన్నింగ్స్
  • 1999 చెన్నై టెస్ట్‌లో నడుం నొప్పి ఓర్చుకుంటూ సచిన్ చేసిన సెంచరీ
  • మళ్లీ 2003 ప్రపంచ కప్‌లో అక్రమ్, వకార్, అఖ్తర్ ల బౌలింగ్ చీల్చి చెండాడుతూ సచిన్ ఆడిన ఇన్నింగ్స్ (98).
  • 1999 దిల్లీ టెస్ట్‌లో కుంబ్లే పదికి పది వికెట్లు తీయడం,
  • 2004 ముల్తాన్ టెస్ట్‌లో సెహ్వాగ్ ట్రిపుల్ సెంచరీ
  • రావల్పిండి టెస్ట్‌లో రాహుల్ ద్రవిడ్ 270, 2022 టీ20 కప్‌లో కోహ్లీ ఆడిన మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ (82 నాటౌట్)
  • ఆ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో అతను కొట్టిన రెండు సిక్స్‌లు, క్రితం ఏడాది టీ20 కప్ న్యూయార్క్ మ్యాచ్‌లో బుమ్రా బౌలింగ్ - ఇవన్నీ భారతీయులకు ఎప్పటికీ గుర్తొస్తూనే ఉంటాయి.

ఇటీవలి కాలంలో పాకిస్తాన్ టీమ్ గతంలో ఉన్నత బలంగా లేదు. ఇండియాదే పైచేయిగా ఉంటోంది. అయినా కూడా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్‌లకు వన్నె తరగలేదు. చూసేవారిలో టెన్షన్ కూడా తగ్గట్లేదు.

(రచయిత క్రికెట్ విశ్లేషకులు, అభిప్రాయాలు వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)