భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్: లోక్‌సభలో వాదోపవాదాలు ఏంటి ?

ఫొటో సోర్స్, Getty Images
ఆపరేషన్ సిందూర్‌పై చర్చ సమయంలో భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ గురించి లోక్‌సభలో చర్చకు వచ్చింది.
పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం ‘‘నీళ్ళు, రక్తం కలిసి ప్రవహించలేవు" అని చెప్పి పాకిస్తాన్‌పై అనేక ఆంక్షలు విధించిందని, మరి సెప్టెంబర్ 14న జరిగే టీ 20 ఆసియా కప్‌లో భారత క్రికెట్ జట్టు పాకిస్తాన్‌తో ఎలా ఆడుతుందని ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు.
''బైసరన్ లోయలో అమాయకులు కాల్పుల్లో మరణించారు. పాకిస్తాన్‌తో వాణిజ్యం నిలిపివేశారు. అక్కడి నుంచి విమానాలు ఇక్కడికి రాలేవు. ఓడలు కూడా రావు. మీ మనస్సాక్షిని ఎందుకు ప్రశ్నించడం లేదు. ఏ పరిస్థితుల్లో మీరు పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడతారు?'' అని ఆయన అన్నారు.


ఫొటో సోర్స్, ANI
‘ఆ మ్యాచ్ నేను చూడలేను’
భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ చూడటానికి తన మనస్సాక్షి తనను అనుమతించదని ఓవైసీ అన్నారు.
''నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని చెప్పి 80 శాతం పాకిస్తాన్ నీటిని ఆపేస్తున్నాం. మీరు క్రికెట్ మ్యాచ్ ఆడతారు. కానీ నా మనస్సాక్షి నన్ను ఆ మ్యాచ్ చూడటానికి అనుమతించదు" అని ఒవైసీ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మ్యాచ్ చూడమని వారికి చెప్పగలరా’
పహల్గాం దాడిలో మరణించిన వారి కుటుంబాలకు ఫోన్ చేసి, ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రతీకారం తీర్చుకున్నామని, ఇప్పుడు మీరు భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ చూడొచ్చని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం ఉందా అని ఒవైసీ ప్రశ్నించారు.
"ఈ ఉగ్రవాద దాడికి ఎవరు బాధ్యులో ప్రభుత్వం చెప్పాలి? జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌ది (ఎల్జీ) బాధ్యతయితే ఆయనను తొలగించాలి. నిఘా సంస్థ లేదా పోలీసుల నిర్లక్ష్యం ఉంటే, వారిపై చర్యలు తీసుకోవాలి. దీనికి ఎవరిది బాధ్యతో తేల్చాలి'' అని ఒవైసీ అన్నారు.
అంతకుముందు ఆపరేషన్ సిందూర్‌పై చర్చను ప్రారంభించిన రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ 2006 పార్లమెంటు దాడి నుంచి 2008 ముంబై దాడి వరకు భారతదేశం అనేక దాడులను చూసిందని అన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఇప్పుడు బలమైన, దృఢమైన చర్యలు తీసుకుంటోందని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
భారత్ శాంతిని కోరుకుంటుందని, కానీ అశాంతిని వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని రక్షణ మంత్రి అన్నారు.
"పాకిస్తాన్ ద్వంద్వ ప్రమాణాలు, అబద్ధాలపై ఆధారపడిన దేశం. ఇప్పుడు అది విఫలమైన దేశంగా కనిపిస్తోంది. ఆపరేషన్ సిందూర్ ద్వారా, ఉగ్రవాదాన్ని నిర్మూలించాలనే మన సంకల్పం దృఢంగా ఉందని భారతదేశం మొత్తం ప్రపంచానికి చూపించింది" అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై వాడీవేడీ చర్చ జరిగింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన కాల్పుల్లో 26మంది చనిపోయారు.
పహల్గాం దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. భారత్, పాకిస్తాన్ క్షిపణులు, డ్రోన్లతో నాలుగు రోజుల పాటు ఒకదానిపై ఒకటి దాడి చేసుకున్నాయి. యుద్ధం అంచుల్లోకి వెళ్లిన రెండు దేశాలు తర్వాత కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
సెప్టెంబరు 9న టీ 20 ఆసియా కప్ మొదలవుతుంది. సెప్టెంబరు 28న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత్ ఈ మ్యాచ్‌లు నిర్వహిస్తోంది.
భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. సెప్టెంబరు 14న భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ఉంది. రెండూ ఫైనల్‌కు చేరితో మరో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది.
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్, పాకిస్తాన్ క్రికెట్ జట్లు మొదటిసారి తలపడబోతోంది ఆసియా టీ 20కప్‌లోనే.
మ్యాచ్ షెడ్యూల్ ప్రకటించిన వెంటనే సోషల్ మీడియాలో అనేకమంది దీనిపై ప్రశ్నించారు.
''ఆసియా కప్‌లో భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ ప్రకటించారు. మరి పహల్గాం దాడిలో చనిపోయిన వారి సంగతేంటి?'' అని యూత్ కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్టు చేసింది.
ఆసియా కప్ 2025కు భారత్ ఆతిథ్యం వహించాల్సింది. మేలో భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణ చెలరేగిన తర్వాత ఈ టోర్నమెంట్ నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. ఇటీవలే ఆసియా క్రికెట్ కౌన్సిల్ 2025 ఆసియా కప్ షెడ్యూల్ విడుదల చేసింది.
ఈ ఏడాది ప్రారంభంలో పాకిస్తాన్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరిగింది. కానీ భారత్ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌లో జరిగాయి.
ఆ సమయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య ఓ ఒప్పందం కుదిరింది.
ఈ ఒప్పందం ప్రకారం వచ్చే మూడేళ్లలో భారత్, పాకిస్తాన్ పాల్గొనే టోర్నెమెంట్ ఏదన్నా రెండు దేశాల్లో జరిగితే, తటస్థ వేదికలో ఆ మ్యాచ్‌లు ఆడాలన్నది ఆ ఒప్పందం సారాంశం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














