పాక్ టీమ్‌కు భారత జట్టు 'షేక్ హ్యాండ్' ఇవ్వకపోవడంపై వివాదం ఏంటి?

భారత్, పాకిస్తాన్, ఆసియా కప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మాథ్యూ హెన్రీ
    • హోదా, బీబీసీ స్పోర్ట్స్ జర్నలిస్టు

భారత్-పాకిస్తాన్ మధ్య ఈ ఏడాది ప్రారంభంలో తలెత్తిన పహల్గాం వివాదం తర్వాత తొలిసారిగా క్రికెట్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది.

అయితే, సంప్రదాయానికి భిన్నంగా, మ్యాచ్ తర్వాత భారత ఆటగాళ్లు పాకిస్తాన్ ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికీ నిరాకరించారు.

ఈ విషయంలో పాకిస్తాన్ కోచ్ మైక్ హెస్సన్ అసంతృప్తి వ్యక్తం చేయగా, తన చర్యను భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సమర్ధించుకున్నారు.

ఆదివారంనాడు దుబయిలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

సాధారణంగా, మ్యాచ్ ముగిసిన తర్వాత బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు వెళ్లే ముందు గ్రౌండ్‌లో ప్రత్యర్థి టీమ్ సభ్యులకు షేక్ హ్యాండ్ ఇస్తుంటారు.

అయితే, ఈ సంప్రదాయాన్ని పక్కనబెట్టి, మ్యాచ్ ముగిసిన వెంటనే భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, తన తోటి బ్యాట్స్‌మన్ శివం దూబేతో కలిసి గ్రౌండ్ నుంచి పెవిలియన్‌కు వెళ్లిపోయారు.

పాకిస్తాన్ ఆటగాళ్లు మైదానం నుంచి బయటకు వెళ్లేప్పుడు భారత డగౌట్ (ఆటగాళ్లు కూర్చునే వేదిక) దిశగా వెళ్తున్నట్లు అనిపించినా, అప్పటికే భారత్ ప్లేయర్లు డ్రెస్సింగ్ రూమ్‌కి చేరుకుని తలుపులు వేసుకుంటున్నట్లు వీడియోలో కనిపించింది.

అంతకుముందు, టాస్ వేసిన సందర్భంలోనూ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు సూర్యకుమార్ షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఇండియా, పాకిస్తాన్, ఆసియ కప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్

‘‘ఆట చివరిలో మేము (పాకిస్తాన్ ప్లేయర్లు) షేక్ హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రత్యర్థి టీమ్ (భారత్ ఆటగాళ్లు) అలా షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం మాకు నిరాశ కలిగించింది'' అని కోచ్ హెస్సన్ అన్నాడు.

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ పహల్గాం దాడి బాధితులకు సంఘీభావం తెలిపాడు.

పాక్ టీమ్‌పై విజయాన్ని ఆ దేశానికి ఇచ్చిన ‘సరైన సమాధానం’ (ప్రాపర్ రిప్లై)గా అభివర్ణించాడు.

"నేను కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాను. పహల్గాం దాడి బాధితులకు మేము అండగా నిలుస్తాం. మేము వారితో ఉన్నాము. ఈ విజయాన్ని మా సైన్యానికి అంకితం చేస్తున్నాము. వారు మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటారు" అని సూర్యకుమార్ యాదవ్ అన్నారు.

మ్యాచ్ అనంతరం జరిగే ప్రజెంటేషన్‌ కార్యక్రమంలో పాకిస్తాన్ ఆటగాళ్లెవరూ మాట్లాడలేదు.

టాస్ వేసే సందర్భంలో భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వవద్దని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రోఫ్ట్, తమ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘాకు సూచించారని పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్ వెల్లడించినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ఇలా చేయడం క్రీడాస్ఫూర్తికి విరుద్ధమంటూ భారత్‌పై పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్ ఫిర్యాదు చేసినట్లు టైమ్స్ కథనం వెల్లడించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)