ఆసియా కప్: పాకిస్తాన్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచిన భారత్

ఫొటో సోర్స్, Getty Images
ఆసియాకప్‌లో భాగంగా దుబయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్, పాకిస్తాన్ మధ్య ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది.
పాకిస్తాన్ విధించిన 128 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లోనే ఛేదించి భారత్ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టీమిండియాలో కెప్టెన్ సూర్యకుమార్ 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ 31 పరుగుల చొప్పున చేశారు. పాకిస్తాన్ బౌలర్లలో సయీమ్ అయుబ్ మూడు వికెట్లు తీశాడు. భారత్ కోల్పోయిన మూడు వికెట్లు అతని ఖాతాలోకే వెళ్లాయి. మిగిలిన బౌలర్లు ఎవరూ ప్రభావం చూపలేకపోయారు.
అంతకుముందు పాకిస్తాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది.
ఆరంభ ఓవర్లలోనే పాకిస్తాన్ రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓపెనర్ సయీమ్ అయూబ్ మొదటి ఓవర్‌లోనే హార్థిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు.
సయీమ్ తరువాత క్రీజులోకి వచ్చిన మొహమ్మద్ హారీస్ కుదురుకోకముందే బుమ్రా బౌలింగ్‌లో పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పాక్ జట్టు 6 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.
ఇక్కడో విశేషం ఉంది. పాండ్యా బౌలింగ్‌లో బుమ్రా క్యాచ్ పడితే, బుమ్రా బౌలింగ్‌లో పాండ్యా క్యాచ్ పట్టాడు.


ఫొటో సోర్స్, Getty Images
తరువాత మూడు ఫోర్లతో ఊపు మీద కనిపించిన ఫకార్ జమాన్‌ను అక్షర్ పటేల్ వెనక్కు పంపాడు.
రెండు ఓవర్లకు 7 పరుగులతో నిలిచిన పాకిస్తాన్ జట్టు 5 ఓవర్లు ముగిసే సరికి 34 పరుగులతో కాస్త నిలబడేట్టుగా కనిపించింది.

ఫొటో సోర్స్, Getty Images
అయితే 7వ ఓవర్‌లో ఫకర్ జమాన్ (17)ను అక్షర్ పటేల్ ఔట్ చేశాడు.
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సల్మాన్ అఘా 12 బంతులు ఎదుర్కొని కేవలం మూడు పరుగులే చేసి అక్షర్ పటేల్ బౌలింగ్‌లోనే ఔటయ్యాడు.
దీంతో 10 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 49 పరుగులతో నిలిచింది.
సాహిబ్ జాదా ఫర్హాన్ ఒక్కడే కాస్త భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొన్నాడు. సాహిబ్ 44 బంతుల్లో మూడు సిక్సర్లు ఒక ఫోర్ సాయంతో 40 పరుగులు చేశాడు.

ఫొటో సోర్స్, Getty Images
తరువాత కుల్దీప్ యాదవ్ ఒకే ఓవరులో వరుసగా హసన్ నవాజ్, మొహమ్మద్ నవాజ్ వికెట్లను తీయడంతో 13 ఓవర్లు ముగిసే సరికి పాకిస్తాన్ కేవలం 65 పరుగులు చేసి 6 వికెట్లను కోల్పోయింది.
చివర్లో షాహిన్ ఆఫ్రిదీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. 16 బంతుల్లో 4 సిక్సర్లతో 33 పరుగులు చేశాడు.
భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3 వికెట్లు తీశాడు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














