కోనసీమ కొబ్బరికి ఉప్పు నీటి ముప్పు.. తలలు వాల్చేస్తున్న వేల కొబ్బరి చెట్లు

- రచయిత, అల్లు సూరిబాబు
- హోదా, బీబీసీ ప్రతినిధి
వైనతేయ, వశిష్ట నదుల మధ్య పచ్చని కొబ్బరి చెట్లతో, ఎటుచూసినా వాణిజ్య పంటలతో కళకళలాడే సెంట్రల్ గోదావరి (రాజోలు) డెల్టా ఏరియా చిత్రం ఇప్పుడు మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం, మామిడికుదురు, సఖినేటిపల్లి మండలాల పరిధిలోని 13 గ్రామాల్లో గత కొన్ని సంవత్సరాలలో సుమారు లక్ష కొబ్బరి చెట్లు చనిపోయాయని రైతులు చెప్తున్నారు.
ఒకప్పుడు ఒక్కో గ్రామం నుంచి వారానికి లక్ష నుంచి రెండు లక్షల వరకు కొబ్బరికాయలు ఎగుమతి అయ్యేవి. ఇప్పుడు నెల రోజులైనా లక్ష కొబ్బరి కాయలు కూడట్లేదని రైతులు చెబుతున్నారు.
మరోవైపు జీడిమామిడి, మామిడి, సపోటా చెట్లు దెబ్బతింటున్నాయి. వరి, కూరగాయల సాగు తగ్గిపోయిందన్నటి రైతుల మాట.
రబీలో వరి విస్తీర్ణం ఐదేళ్ల క్రితం 30 వేల ఎకరాలు ఉంటే ఇప్పుడు ఆరు వేల ఎకరాలకు పడిపోయిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు.
ఈ పరిస్థితికి కారణం ప్రకృతి విపత్తులు కాదని.. ప్రభుత్వాల నిర్ణయాలలో లోపాలు, ఆలస్యాలేనని రైతులు ఆరోపిస్తున్నారు.
కోనసీమకు మకుటంలాంటి రాజోలు డెల్టాలో నిన్నటివరకూ నిశ్చింతగా బతుకుతూ, మరో పది మందికి ఉపాధి కల్పించిన తాము ఇప్పుడు సర్వస్వం వదిలేసి పొట్టచేత పట్టుకొని వలసపోవాల్సిన ముప్పు ముంచుకొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్వరూపం మారిపోయిన మంచినీటి కాలువ...
రక్తతుల్య నది (శంకరగుప్తం మంచినీటి డ్రెయిన్) సఖినేటిపల్లి మండలంలోని చింతలమూరి నుంచి ప్రారంభమై, మలికిపురం మండలంలోంచి ప్రవహించి మామిడికుదురు మండలం కరవాక వద్ద గోదావరి పాయ వైనతేయలో కలుస్తుంది.
పంట పొలాల నుంచి పిల్లకాలువల ద్వారా వచ్చే మిగులు నీరు, గోదావరి వరద నీరు ప్రవహించడానికి 22.7 కిలోమీటర్ల పొడవైన శంకరగుప్తం డ్రెయిన్ ఇక్కడ కీలకం.
ఈ డ్రెయిన్ బంగాళాఖాతంలో పోటు (హై టైడ్) కారణంగా వైనతేయలోకి పోటెత్తే సముద్ర జలాలను సమతుల్యం చేస్తూ ఈ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తోంది.
కానీ కొన్నేళ్లుగా కొంతమంది రైతులు తమ కొబ్బరితోటల్లోకి నీటి కోసం కాలువలు తవ్వేయడం, డ్రెయిన్ గట్లు క్రమేపీ బలహీనమవడం, చాలాచోట్ల గట్లు కనుమరుగవడంతో పూడిక పేరుకుపోయింది.

డ్రెడ్జింగ్ నిలిచిపోవడంతో సమస్య
సాధారణంగా బంగాళాఖాతంలో రోజూ ఆటు(లో టైడ్), పోటు(హై టైడ్) వస్తాయి.
పోటు సమయంలో సముద్రం నీరు వైనతేయ పాయలోకి వస్తుంది.
ఆ ఉప్పునీరు అక్కడి నుంచి శంకరగుప్తం డ్రెయిన్‌లోకి చేరుతుంది. ఆటు సమయంలో మళ్లీ ఆ నీరు సముద్రంలోకి వెళ్లిపోతుంది.
సహజసిద్ధంగా జరగాల్సిన ఈ ప్రక్రియకు డ్రెయిన్‌లో పూడిక అడ్డుపడుతోంది.
దీంతో, ఈ పూడికను తొలగించేందుకు 2017లో ప్రభుత్వం టెండర్లు పిలిచింది.
నదీముఖద్వారం నుంచి కేశనపల్లి వంతెన వరకు సుమారు 8.5 కిలోమీటర్ల పొడవున డ్రెడ్జింగ్ చేశారు. అంతకుముందు 2013లో కాలువ ప్రారంభ స్థానం నుంచి 6.3 కిలోమీటర్ల వరకు డ్రెడ్జింగ్ చేశారు.
మధ్యలో 7.9 కిలోమీటర్ల మేర పూడిక తీయకుండా వదిలేశారు.
2019 నుంచి ఈ పనులు నిలిచిపోయాయి.
దీంతో పోటు సమయంలో సముద్రం నీరు కేశనపల్లి వరకు పెద్ద ఎత్తున వచ్చేస్తోంది.
తర్వాత కాలువ ఇరుకైపోవడంతో ఆ ఉప్పునీరు గ్రామాల్లోకి, కొబ్బరితోటల్లోకి, పంట పొలాల్లోకి పోటెత్తుతోంది. ఫలితంగా డ్రెయిన్‌లో నీరు ఉప్పునీటిగా మారిపోయింది.

'ఉప్పునీటి'తో జనజీవనం అస్తవ్యస్తం...
డ్రెయిన్‌లో ఉప్పునీరు కొబ్బరితోటలను ముంచెత్తుతుండటంతో రైతులు ఈ సమస్యను మొదట్లోనే అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో అంబాజీపేటలోని హార్టికల్చర్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఐసీఏఆర్-హెచ్ఆర్ఎస్), ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, భూగర్భ జలవనరుల శాఖకు చెందిన ఎనిమిది మంది నిపుణుల బృందం 2022లో ఈ ప్రాంతాన్ని పరిశీలించింది.
నిపుణుల బృందం తీసుకెళ్లిన నీరు, మట్టి నమూనాలను పరిశీలిస్తే, క్లోరైడ్లు, ఫ్లోరైడ్లు, సల్ఫేట్లు అత్యధిక శాతం ఉన్నట్లు తేలింది.
బ్యాక్ వాటర్‌లో కేంద్రీకృతమైన అత్యధిక లవణ శాతం వల్లే కొబ్బరి చెట్లు చనిపోతున్నాయని నిపుణులు అప్పట్లోనే తేల్చిచెప్పారు.
ప్రస్తుతం ఈ సమస్యతో కరవాక, గొల్లపాలెం, కేశనపల్లి, కె.తూర్పుపాలెం, కె.పడమటి పాలెం, శంకరగుప్తం, చింతలమూరు, గోగన్నమఠం, కాట్రేనిపాడులంక, జి.పల్లిపాలెం, గూడపల్లి, జి.గుబ్బలపాలెం, అడవిపాలెం.. మొత్తం 13 గ్రామాల ప్రజలు సతమతమవుతున్నారు.
కొద్దిరోజుల్లోనే పొరుగునున్న బట్టేలంక, మోరిపోడు, కేశవదాసుపాలెం(మెండుపాలెం) గ్రామాలకు విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయని ఆ గ్రామాల ప్రజలు చెప్తున్నారు.
''శంకరగుప్తం డ్రెయిన్ వల్ల ఉప్పునీరు నిలిచిపోతుండటంతో కొబ్బరి చెట్లు దెబ్బతింటున్నాయి. 2022-23లో శాఖాపరంగా నిర్వహించిన పరిశీలనలో దాదాపు 250 హెక్టార్లలో కొబ్బరితోటలు దెబ్బతిన్నాయని తేలింది. వేళ్ల వ్యవస్థ పాడైపోవడం వల్ల క్రమక్రమంగా కొబ్బరి చెట్లు చనిపోతుంటాయి. రెండేళ్ల క్రితం పాడైన కొబ్బరి చెట్లు సుమారు 45,000 నుంచి 50,000 వరకూ ఉంటాయని అంచనా వేశాం. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి ఉండవచ్చు. వాస్తవానికి, రైతులు ఆ దెబ్బతిన్న కొబ్బరిచెట్లను ఎలాగూ తొలగించాలి, ఆ నీటిలో కొత్త మొక్కలు వేసినా పెరగవు. అందుకే రైతులు ఆ కొబ్బరి చెట్లకు నష్టపరిహారం కన్నా ముందు డ్రెయిన్ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు'' అని ఉద్యానశాఖ అధికారి దిలీప్ బీబీసీకి చెప్పారు.
ఈ సమస్యపై పరిశీలించిన నిపుణుల బృందంలో సభ్యుడైన ఆయన ఇటీవలివరకు రాజోలు డివిజన్‌లో పనిచేసి ప్రస్తుతం అమలాపురం డివిజన్‌కు బదిలీ అయ్యారు.

అన్నివిధాలా నష్టపోతున్నామని రైతుల ఆందోళన...
కాలువల్లో అవసరాన్ని బట్టి పూడిక తీత పనులను జలవనరుల శాఖ నిర్వహించాలి.
శంకరగుప్తం కాలువలో మిగిలిపోయిన డ్రెడ్జింగ్ పనులను పూర్తిచేయాలని రైతులు ప్రభుతాన్ని కోరుతున్నారు.
''నాకు సొంతంగా ఆరు ఎకరాల కొబ్బరితోట ఉంది. 30 ఏళ్ల క్రితం మా నాన్న 600 మొక్కలు నాటారు. 2019 నుంచి డ్రెయిన్‌లో ఉప్పునీరు నిండిపోయింది. ఆరుతడులు ఇవ్వాల్సిన కొబ్బరిచెట్లకు, రోజులో 24 గంటలూ ఉప్పునీరే చుట్టుముట్టేసింది. ఫలితంగా కొత్త వేరు రావట్లేదు. ఉన్న వేర్ల వ్యవస్థ కాస్తా ఉప్పునీటి వల్ల నాశనమైపోతోంది. దాని ఫలితంగా మొవ్వు భాగం ఎండిపోయి తలలు నేలరాలిపోతున్నాయి. మా కేశనపల్లి పంచాయతీ పరిధిలోనే దాదాపు 500 ఎకరాల వరకూ కొబ్బరితోటలు దెబ్బతిన్నాయి. సుమారు 5,000 కొబ్బరి చెట్లు మోడువారిపోయాయి. 150 మంది వరకు రైతులకు ప్రత్యక్షంగా నష్టం కలిగింది. దింపు కార్మికులు, ఒలుపు కార్మికులకు పనిలేకుండా పోయింది'' అని సర్పంచ్, రైతు ఎనుమల నాగు బీబీసీతో చెప్పారు.

పడిపోయిన కొబ్బరి దిగుబడి
సాధారణంగా పొడవు రకం కొబ్బరి చెట్లు జీవితకాలం 80 ఏళ్ల వరకు ఉంటుందని ఉద్యాన శాఖ అధికారులు చెప్పారు. 30 ఏళ్లు పెరిగిన కొబ్బరిచెట్లు ఏటా 200 నుంచి 220 వరకు కాయల చొప్పున దిగుబడి ఇస్తాయన్నారు.
సుమారు 22.7 కిలోమీటర్ల పొడవు ఉండే శంకరగుప్తం డ్రెయిన్‌కు రెండువైపుల ఉన్న తొమ్మిది గ్రామాల పరిధిలో గత కొద్దికాలంలోనే దాదాపు లక్ష కొబ్బరి చెట్లు మోడువారిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
''ఉప్పునీటి కారణంగా కొబ్బరి చెట్లతో పాటు జీడిమామిడి, మామిడి, సపోటా వంటి వాణిజ్య పంటలూ దెబ్బతిన్నాయని చెబుతున్నారు.
పశువులకు పశుగ్రాసం కొరత ఏర్పడింది. ఫలితంగా మూడు మండలాల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో రైతులతో పాటు కొబ్బరితోటలపై ఆధారపడిన దింపు కార్మికులు, ఒలుపు కార్మికుల సహా పది రకాల వృత్తులవారు, చిరు వ్యాపారులకు ఉపాధి తగ్గిపోయింది.
మరోవైపు కాయిర్ పరిశ్రమల్లో పని తగ్గిపోయింది. ఆ గ్రామాల్లో వాతావరణ పరిస్థితుల్లోనూ మార్పు కనిపిస్తోంది. ఉక్కపోత ఎక్కువైంది.
ఉప్పునీటితో నానిపోయి ఇళ్ల పునాదులు దెబ్బతింటున్నాయి. తాగునీటి వనరులూ ఉప్పునీటిమయమయ్యాయి. భూములూ నిస్సారమవుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగి చిత్తడి నేలలుగా మారిపోతే, రానున్న రోజుల్లో ఇక్కడ వ్యవసాయమనేదే ఉండదు'' అని కొబ్బరి రైతు రాపాక కిరణ్ బీబీసీతో అన్నారు.

అప్పులు ఎలా తీర్చాలని రైతుల ఆందోళన
ఏటా ఫలసాయం నష్టపోతున్న రైతులు ఇప్పుడు అప్పులపై ఆందోళన చెందుతున్నారు.
''ఒక్క కేశనపల్లి పీఏసీఎస్ నుంచే రూ.20 కోట్ల మేర వ్యవసాయ రుణాలను రైతులు తీసుకున్నారు. ఆ లెక్కన ప్రభావిత గ్రామాల్లో రైతులకు రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకూ రుణాలు ఉంటాయి. ఇప్పటికైనా డ్రెయిన్ సమస్య తీరితే మళ్లీ వ్యవసాయం చేసుకొని, ఆ రుణాలు తీర్చేస్తారు. లేదంటే, రుణాలు తీర్చడానికి పని వెతుక్కుంటూ వేరే ప్రాంతానికి వలస పోవాలి'' అని రాపాక కిరణ్ చెప్పారు.
ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్...
''మిగిలిపోయిన డ్రెడ్జింగ్ పనులు పూర్తిచేసేందుకు దాదాపు రూ.9.52 కోట్ల అంచనా వ్యయంతో ఇటీవల కొత్త ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాం. ప్రస్తుతం ఆర్థిక శాఖ పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఆమోదం రాగానే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి, డ్రెడ్జింగ్ సత్వరమే పూర్తి చేస్తాం'' అని ధవళేశ్వరం ఇరిగేషన్ సిస్టమ్ (రాజోలు డ్రైనేజ్ సబ్ డివిజన్) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ నాగార్జున బీబీసీతో చెప్పారు.

సమస్య తీవ్రత అర్థమవుతోంది: సానా సతీశ్
''ప్రభావిత గ్రామాల నుంచి అనేక విజ్ఞాపనలు వస్తున్నాయి. సమస్య తీవ్రత అర్థమవుతోంది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషిచేస్తాం. డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడానికి రూ.9.52 కోట్లు, గట్లను కట్టుదిట్టం చేయడానికి మరో రూ.58.48 లక్షలతో ప్రతిపాదనలను సాగునీటి శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. గట్లు వేయడానికి ఉన్న ఇబ్బందులను సాల్వ్ చేయడానికి స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులతో చర్చించాల్సి ఉంది'' అని ఎంపీ సానా సతీష్ బీబీసీతో చెప్పారు.
తెగుళ్లు కాదు నీరు నిలిచిపోవడం వల్లే చెట్లు చనిపోతున్నాయి: కలెక్టర్
డ్రెయిన్ సమస్యపై బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టరు డాక్టర్ రావిరాల మహేష్ కుమార్‌తో బీబీసీ మాట్లాడింది.
''ఉద్యాన విభాగంతో పాటు డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నిపుణుల బృందం శంకరగుప్తం, మలికిపురం ప్రాంతాల్లో దెబ్బతిన్న కొబ్బరిచెట్లను పరిశీలించారు. శంకరగుప్తం డ్రెయినేజీ కెనాల్ (రక్తతుల్య) నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడం, బ్యాక్ వాటర్‌లో అధిక లవణీయత వల్లే చెట్లు, ఇతర పంటలు దెబ్బతింటున్నాయని, తెగుళ్ల ప్రభావం కాదని నివేదిక ఇచ్చారు. ఈ డ్రెయిన్‌లో పూడిక తొలగించేందుకు 2017లో ప్రారంభించిన డ్రెడ్జింగ్ పనులు 2019లో నిలిచిపోయాయి. ఈ పెండింగ్ పనులను పూర్తిచేస్తే, పోటు సమయంలో బ్యాక్ వాటర్ ప్రవేశించినా కొబ్బరిచెట్లకు నష్టం ఉండదని రైతులతో పాటు ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ దృష్ట్యా కాలువలో మిగిలిపోయిన డ్రెడ్జింగ్ పనులు పూర్తిచేయడానికి ఇరిగేషన్ విభాగం నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే ఆ పనులు పూర్తిచేయడానికి, తదుపరి రైతులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రయత్నిస్తాం'' అని కలెక్టరు మహేష్ కుమార్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














