ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్: పాకిస్తాన్ ఏర్పాటును సమర్థించిన ఈ హిందూ ప్రొఫెసర్‌ను లాహోర్‌లో అల్లరి మూకలు ఎందుకు హత్య చేశాయి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, పరిశోధకుడు
ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ పాకిస్తాన్‌కు గట్టి మద్దతుదారు. అందుకే ఆయన దేశ విభజన తర్వత పాకిస్తాన్‌లోనే ఉండిపోయారు.
1947లో దేశ విభజన తర్వాత అల్లర్లు చెలరేగినప్పుడు ఈ ఆర్థికవేత్త లాహోర్‌లోని నికల్సన్ రోడ్‌లో ఉన్న తన ఇంట్లో నుంచి వీధుల్లోకి వచ్చారు.
"ఇది ఇప్పుడు పాకిస్తాన్ ఆస్తి. కాబట్టి దుకాణాలు, ఇళ్లకు నిప్పు పెట్టవద్దు’’ అని ఆయన అల్లరి మూకలను ఒప్పించే ప్రయత్నం చేశారు.
లాహోర్‌కు చెందిన బ్రిజ్ నారాయణ్ వలస పాలనలో ఉన్న పంజాబ్ వ్యవసాయ ఆర్థిక వ్యవస్థపై అధ్యయనంతో గుర్తింపు పొందారు.
1888లో జన్మించిన ఆయన భారతదేశ విభజనకు ముందు లాహోర్‌లో సనాతన ధర్మ కళాశాలలో (తర్వాత ముహమ్మదన్ ఆంగ్లో ఓరియంటల్ కాలేజ్) ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేశారు. పంజాబ్ యూనివర్సిటీ ఆయనను గౌరవ ప్రొఫెసర్‌గా నియమించింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో సోర్స్, Govt M.A.O College Lahore/FACEBOOK
భారతదేశ విభజనకు ముందు ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ "20వ శతాబ్ధపు ఆర్థికవేత్తల్లో ఒకరిగా గుర్తింపు పొందారు" అని డాక్టర్ జీఆర్ మదన్ తన పుస్తకం 'ఎకనామిక్ థింకింగ్ ఆఫ్ ఇండియా'లో రాశారు.
ఆయన అప్పట్లో ఆర్థిక సమస్యల గురించి పశ్చిమ దేశాలకు చెందిన యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇచ్చేవారు.
ఆర్థిక సమస్యల గురించి 15కి పైగా పుస్తకాలు రాశారు. ఆయన రాసిన ఆర్టికల్స్ అనేక పత్రికలు, మ్యాగజీన్లలో ప్రచురితమయ్యాయి.
జిన్నా ‘‘ద్విజాతి సిద్ధాంతానికి’’ అనుకూలంగా, గాంధీజీని వ్యతిరేకించడం కూడా ఆయనకు గుర్తింపు తెచ్చింది.
గాంధీజీ 'చరఖా ఆర్థిక వ్యవస్థ'ను ప్రొఫెసర్ నారాయణ్ బహిరంగంగా వ్యతిరేకించారని డాక్టర్ జీఆర్ మదన్ రాశారు.
చరఖా ఆర్థిక విధానం మహాత్మా గాంధీ సిద్ధాంతం. ఇది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, స్వదేశీ తయారీ, స్వయం సమృద్ధి కోసం గాంధీజీ దీన్ని ప్రచారం చేశారు.
పాకిస్తాన్ ఏర్పాటుకు ‘బలమైన మద్దతుదారు’
పాకిస్తాన్ ఆర్థికంగా ఎప్పటికీ స్థిరంగా ఉండదని, ఎందుకంటే దాని ఉనికి అస్థిరంగా ఉందని అనేక మంది ఆర్థిక వేత్తలు చెప్పారు.
అయితే బ్రిజ్ నారాయణ్ మాత్రం పాకిస్తాన్ ఆర్థిక స్వావలంబన సాధించగలదని చెబుతూ అనేక వ్యాసాలు రాశారని జర్నలిస్ట్ గోపాల్ మిత్తల్ తన 'లాహోర్ కా జో జిక్ర్ కియా' అనే పుస్తకంలో రాశారు.
"ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ పాకిస్తాన్ ఏర్పాటు డిమాండ్‌ను సమర్థించారు. పాకిస్తాన్ ఆచరణాత్మక దేశంగా ఉంటుందని సమగ్రంగా, నమ్మదగిన రీతిలో వాదించారు" అన్న సోమ్ ఆనంద్ వ్యాఖ్యల్ని పాకిస్తాన్‌లో జన్మించిన స్వీడిష్ పరిశోధకుడు ఇష్తియాక్ అహ్మద్ తన పుస్తకంలో ప్రస్తావించారు.
పాకిస్తాన్ అనే ఆలోచనకు బ్రిజ్ నారాయణ్ 'తీవ్రమైన మద్దతుదారు' అని పాకిస్తాన్ ఏర్పడటానికి ముందు లాహోర్‌లోని మోడల్ టౌన్‌లో తన తల్లిదండ్రులతో నివసించిన సోమ్ ఆనంద్ చెప్పారు.
ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ వార్తాపత్రికల్లో రాసిన కథనాల్లో పాకిస్తాన్ విజయవంతమైన, స్థిరమైన దేశంగా ఉంటుందని నిరూపించడానికి తనకున్న ఆర్థిక శాస్త్రంలోని జ్ఞానాన్ని ఉపయోగించారు.
పాకిస్తాన్‌లోనే ఉండాలని ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్‌ను మొహమ్మద్ అలీ జిన్నా కోరారు. దీంతో తన జీవితాన్ని పాకిస్తాన్ కోసం అంకితం చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.
పాకిస్తాన్‌ను ముస్లిమేతరులకు కూడా సమాన హక్కులు ఉండే ప్రజాస్వామ్య దేశంగా ఏర్పాటు చేయాలని జిన్నా గట్టిగా కోరుకున్నారని ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ నమ్మారు
"1947 మే నుంచి పెద్ద సంఖ్యలో హిందువులు వలస వెళ్లారు. ఆగస్టు 15 నాటికి కేవలం 10 వేల మంది మాత్రమే మిగిలారు. పరిస్థితులు మెరుగుపడతాయని, వారి మూలాలు పాకిస్తాన్‌లో ఉన్నందున తిరిగి వస్తారని వాళ్లు నమ్మారు" అని సోమ్ ఆనంద్ చెప్పారు.
‘అయితే రాడ్‌క్లిఫ్ ఒప్పందం కుదిరిన వెంటనే దోచుకోవడాలు, హత్యలు ప్రారంభమయ్యాయి. ఇది జిన్నా లౌకికవాదాన్ని విశ్వసించిన వారి ఆశలను దెబ్బతీసింది’ అని ఆయన అన్నారు.
పాకిస్తాన్ తన మాతృభూమి అని నమ్మిన ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్, ఆ దేశం విడిచి వెళ్లడానికి తనకు ఎలాంటి కారణం కనిపించడం లేదని చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ అల్లర్లు: 'అతను ద్రోహి...చంపేయండి'
సిక్కు నాయకుడు మాస్టర్ తారాసింగ్, పంజాబ్ అసెంబ్లీ భవనం ఎదురుగా నిల్చుని తన బెల్ట్ నుంచి కత్తి తీసి "పాకిస్తాన్ ముర్దాబాద్" అని అరవడంతో లాహోర్‌లో అల్లర్లు చెలరేగాయని ఖుష్వంత్ సింగ్ తన ఆత్మకథ "ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మాలిస్: యాన్ ఆటోబయోగ్రఫీ’’ లో రాశారు.
"తారాసింగ్ చర్య పెట్రోల్ ఉన్న గదిలోకి మండుతున్న అగ్గిపుల్లను విసిరినట్లుగా మారింది. రాష్ట్రమంతటా అల్లర్లు చెలరేగాయి" అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
అల్లర్లు ప్లాన్ ప్రకారం జరిగాయా లేక వాటంతట అవే విస్తరించాయా అనే దానిపై రకరకాల ఊహాగానాలు ఉన్నాయనేది జర్నలిస్ట్ గోపాల్ మిత్తల్ అభిప్రాయం.
"అల్లర్లు ప్లాన్ ప్రకారం జరిగితే పాకిస్తాన్‌కు చెందిన వారి దుకాణాలు, ఇళ్లు ఎందుకు తగలబెట్టారో అర్థం కాలేదు. ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ నివసిస్తున్న కాలనీపై అల్లరి మూక దాడి చేసినప్పుడు వారిని ఆయన ఆపడానికి ప్రయత్నించారు" అని మిత్తల్ తన "లాహోర్ కా జో జిక్ర్ కియా' పుస్తకంలో రాశారు.
లాహోర్‌లో జరుగుతున్న అల్లర్ల సమయంలో ప్రొఫెసర్ నారాయణ్‌ను ఎలా చంపేశారో ఇష్తియాక్ అహ్మద్ తన పుస్తకంలో వివరించారు.
సోమ్ ఆనంద్ చెప్పిన దానిని వివరిస్తూ ‘‘ఒక గుంపు ఆయన నివసించిన ప్రాంతానికి చేరుకుంది. వాళ్లు ఖాళీగా ఉన్న హిందూ, సిక్కుల ఇళ్లు తగలబెట్టడంతో పాటు ఆ ఇళ్లలో వస్తువుల్ని దోచుకుంటున్నారు’’ అని సోమ్ ఆనంద్ చెప్పిన దానిని ఆయన ప్రస్తావించారు.
"అలా చేయవద్దని నారాయణ్ వారి వద్దకు వెళ్లి చెప్పారు. ఇప్పుడిది పాకిస్తాన్ ఆస్తి. దాన్ని నాశనం చేయవద్దని కోరారు. అల్లరి మూకలు మొదట ఆయన మాట విని వెళ్లిపోయాయి. కాసేపటి తర్వాత మరో మూక వచ్చింది. వారితోనూ ఆయన అదే చెప్పారు. కానీ వాళ్లలో ఒకడు 'అతను ద్రోహి, చంపేయండి' అని అరిచారు"
"ఆ గుంపు ప్రొఫెసర్ నారాయణ్‌పై దూసుకెళ్లింది. పాకిస్తాన్ ఏర్పాటుకు బలమైన మద్దతుదారులలో ఒకరిని హత్య చేశారు" అని ఇష్తియాక్ అహ్మద్ తన పుస్తకంలో వివరించారు.
ఇతర చరిత్రకారులు కూడా ఈ సంఘటన గురించి తమ పుస్తకాలలో రాశారు.
‘‘కాంగ్రెస్ వాదనలకు విరుద్ధంగా పాకిస్తాన్ ఆర్థికంగా ఆచరణాత్మక రాజ్యంగా ఉంటుందని అభిప్రాయపడిన ఏకైక హిందూ స్కాలర్ ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్’’ అని చరిత్రకారుడు కేకే అజీజ్ "ది కాఫీ హౌస్ ఆఫ్ లాహోర్: ఎ మెమోయిర్1942-57"లో రాశారు.
‘‘వాళ్లు ఆయనను హత్య చేశారు. ఆయన లైబ్రరీ బూడిదైంది" అని అజీజ్ రాశారు.

ఫొటో సోర్స్, Sanatan Dharma College-Lahore Ambala Cantt/FACEBOOK
కాలేజ్ పేరు మార్పు
లాహోర్‌లోని సనాతన ధర్మ కళాశాలలో పని చేసిన ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్, ఆ కాలేజ్ పాకిస్తాన్‌లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని గోపాల్ మిత్తల్ రాశారు.
గోపాల్ మిత్తల్ తూర్పు పంజాబ్‌కు చెందినవారు. అయితే ఆయన లాహోర్‌లో నివసిస్తూ తన ముస్లిం సహోద్యోగులతో ఎక్కువ సమయం గడిపారు.
"ప్రొఫెసర్ నారాయణ్ హత్యతో నేను నిర్ఘాంతపోయాను. ఆయన నాకు గురువు. నా వ్యక్తిత్వ నిర్మాణంపై గొప్ప ప్రభావాన్ని చూపారు" అని మిత్తల్ రాశారు.
'ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ జీవించి ఉంటే పాకిస్తాన్ ఆర్థిక స్థిరీకరణ పనిని ఆయనకు అప్పగించి ఉండేవారు. అయితే విధి అందుకు సహకరించలేదు" అనేది గోపాల్ మిత్తల్ అభిప్రాయం.
ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ అస్థికలు పాకిస్తాన్ మట్టిలోనే కలిశాయని ఆయన రాశారు.
భారతదేశ విభజన తర్వాత 1916లో లాహోర్‌లో ఏర్పాటైన సనాతన ధర్మ కళాశాలను భారత్‌లోని అంబాలాకు, అమృత్‌సర్‌లో 1933లో స్థాపించిన ముహమ్మదన్ ఆంగ్లో-ఓరియంటల్ కాలేజ్‌ను లాహోర్‌లో ప్రొఫెసర్ బ్రిజ్ నారాయణ్ బోధించిన భవనంలోకి తరలించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














