దినేశ్, రాము, అర్జున్ : హైదరాబాద్ నాలాల్లో కొట్టుకుపోయిన ఈ ముగ్గురి కుటుంబాలు ఏం చెబుతున్నాయి?

ఫొటో సోర్స్, ugc
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''ఆదివారం సాయంత్రంవేళ బయటకు వెళ్లాడు. అనుకోని ఘోరం జరిగింది.. ఇలా అవుతుందని అసలు ఊహించలేదు'' అని కన్నీళ్లు పెట్టుకున్నారు రాజమణి. తనకు, తన కుటుంబానికి దిక్కెవరని విలపిస్తున్నారామె.
హైదరాబాద్ పార్శిగుట్ట పరిధిలోని వినోభానగర్‌లో రాజమణి అత్త దేవి ఇంటి వద్ద బంధువులు, కుటుంటసభ్యుల ఏడుపులతో విషాద వాతావరణం ఏర్పడింది.
ఆదివారం రాత్రి రాజమణి భర్త జెర్రిపోతుల దినేశ్ కుమార్ అలియాస్ సన్నీ నాలాలో కొట్టుకుపోయారు.


ఒక్కసారిగా ముంచెత్తిన వరద
సోమవారం ఉదయం నుంచి బంధువులు వచ్చి పరామర్శిస్తున్నారు. రాత్రి నుంచి దినేశ్ ఆచూకీ కోసం గాలిస్తున్న హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎలాంటి ఆచూకీ లభించలేదు.
ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి వినోభానగర్‌ను వరద ముంచెత్తింది. నాలాకు చెందిన రిటైనింగ్ వాల్(ప్రహరీ) కూలిపోయింది. ఒక్కసారిగా వరదనీరు వీధుల్లోకి పోటెత్తింది.
ఆ సమయంలో దినేశ్ తన స్నేహితుడు ఇంటికి వెళ్తున్నారు. వరద ఉధృతికి బైకుతో సహా గల్లంతయ్యారు.
ఘటనా స్థలం నుంచి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉన్న డ్రైనేజీ మ్యాన్ హోల్ లో బైకు లభించింది. దాన్ని బయటకు తీసేందుకు వీల్లేక తాడుతో సమీపంలో విద్యుత్తు స్తంభానికి కట్టి ఉంచారు.
దినేశ్ డెలీవరీ బాయ్(ఇన్‌స్టామార్ట్)గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రాజమణి, మూడేళ్ల కొడుకు ఉన్నాడు.
రాత్రి సుమారు ఎనిమిది గంటల సమయంలో ఘటన జరిగినట్టు చెబుతున్నారు కుటుంబసభ్యులు.
''దినేశ్ నంబరుకు రాత్రి ఫోన్ చేశాను రింగ్ అయింది. కానీఎటువంటి సమాధానం రాలేదు. అంతే.. . దినేశ్ మిస్సింగ్ వార్త ఉదయం చెప్పారు. నాకు ఆరోగ్యం సరిగా ఉండటం లేదు’’ అని బీబీసీతో చెప్పారు రాజమణి.

ఆదివారం సాయంత్రం 3.30 గంటలకు తనను డ్యూటీ నుంచి తీసుకువచ్చి ఇంటి వద్ద దించారని దినేశ్ తల్లి దేవి బీబీసీతో చెప్పారు.
''నాకీ విషయం సోమవారం తెల్లవారుజామునే తెలిసింది'' అన్నారామె.
సోమవారం ఉదయం సరుకుల డెలీవరీ డ్యూటీకి వెళ్లాల్సి ఉందని, బైకులో పెట్రోల్ కోసం తల్లి నుంచి డబ్బులు అడిగి తెచ్చుకుంటానంటూ దినేశ్ వెళ్లారని రాజమణి తెలిపారు.
ఆయన ఆచూకీ తెలియకపోవడంతో.. కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళనతో ఉన్నారు.
మరోవైపు హైడ్రా, జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వినోభానగర్‌లో రిటైనింగ్ వాల్ కూలిన ప్రదేశంలో రాళ్లను ఎత్తిపోసే పనులు చేస్తున్నారు.
ఘటనాస్థలాన్ని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ పరిశీలించారు. సహాయక చర్యలను సమీక్షించారు.

ఫొటో సోర్స్, ugc

ఫొటో సోర్స్, ugc
పాతబస్తీకి చెందిన ఇద్దరు గల్లంతు
హైదరాబాద్ నగరవ్యాప్తంగా ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. నగరంలోని చాలా ప్రాంతాల్లో రహదారులు, కాలనీలు జలమయం అయ్యాయి.
ఆదివారం సాయంత్రం నుంచి చిన్నగా మొదలైన వాన.. రాత్రి 8 గంటల సమయానికి ఒక్కసారిగా పెరిగిపోయింది.
భారీ వర్షాలకు నాలాలు పొంగిపొర్లాయి. నాలాల్లో కొట్టుకుపోయి వేర్వేరు చోట్ల ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. వారిలో దినేశ్ ఒకరు. మరో ఇద్దరు పాతబస్తీ ప్రాంతానికి చెందిన అర్జున్, రాముగా హైడ్రా అధికారులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, ugc
వస్తువుల కోసం వెళ్లి...
అర్జున్, రాము ఉండేది హబీబ్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలోని మాంగార్ బస్తీ.
వీరు వరసకు మామా అల్లుళ్లు అవుతారని బంధువులు చెప్పారు.
''రాము ఇంటి పక్కనే అఫ్జల్ నగర్ నాలా ఉంది. అందులో పడిపోయి ఒకరి తర్వాత ఒకరు కొట్టుకుపోయి కనిపించలేదు'' అని అదే బస్తీలో ఉండే వెంకటేశ్ అనే వ్యక్తి చెప్పారు.
వీరి కోసం గాలిస్తున్నట్లుగా జీహెచ్ఎంసీ, హైడ్రా చెబుతున్నాయి. వారి ఆచూకీ ఇంకా లభించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీడియాతో చెప్పారు.
''ఇంటి బయట వస్తువులు తడిసిపోతున్నాయని తీసుకువద్దామని బయటకు వెళ్లారు. ఒక్కసారిగా జారిపోయి రాము ముందుగా నాలాలో పడిపోయారు. ఆయన్ను కాపాడేందుకు అర్జున్ కూడా వెళ్లి నాలాలో పడిపోయి గల్లంతయ్యారు'' అని వారి కుటుంబసభ్యులు చెబుతున్నారు.
వర్షానికి నాలా ప్రవాహం భారీగా ఉండటంతో వారి ఆచూకీ లభించలేదని పోలీసులు చెబుతున్నారు.
ఘటనా ప్రదేశాన్ని నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన సందర్శించారు.

ఫొటో సోర్స్, ugc
ప్రహరీ కూలి ఒకరు మృతి
హైదరాబాద్ శివారులో గుండ్ల పోచంపల్లి పరిధిలోని సోమవారం తెల్లవారుజామున ఓ కన్వెన్షన్ హాలు ప్రహరీ కూలి ఒకరు చనిపోయినట్టు పోలీసులు చెప్పారు.
ప్రహరీగోడ పక్కనే ఉన్న కూలీల నివాసాలపై పడటంతో ఒడిశాకు చెందిన గగన్ అనే వ్యక్తి చనిపోయినట్టు పేట్ బషీరాబాద్ పోలీసులు చెప్పారు.
గాయపడిన మరో ఐదుగురిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

అర్థరాత్రి వేళకు జోరు తగ్గిన వాన
సెప్టెంబర్ 14వ తేదీ ఉదయం 8.30 గంటల నుంచి 15వ తేదీ ఉదయం 7 గంటల మధ్య అత్యధికంగా సిద్దిపేట జిల్లా నారాయణరావు పేటలో 24.5 సెంటీమీటర్ల(సెం.మీ.) వర్షం కురిసింది.
హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్ మెట్(తట్టి అన్నారం)లో 12.8 సెం.మీ., ముషీరాబాద్ పరిధిలోని బౌద్ధనగర్‌లో 12.4 సెం.మీ, ఎంసీహెచ్ కాలనీ వద్ద 11.9 సెం.మీ., జవహర్ నగర్ పరిధిలో 11.4 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల కారణంగా అమీర్‌పేట, ముషీరాబాద్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, హయత్ నగర్, బోడుప్పల్, పీర్జాదిగూడ, షేక్ పేట, కవాడిగూడ సహా పలు ప్రాంతాల్లో వరదనీరు పోటెత్తినట్లుగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి.
ఎంసీహెచ్ కాలనీలో బైకులు కొట్టుకుపోయినట్లుగా స్థానికులు చెబుతున్నారు.
అర్ధరాత్రి సమయానికి వర్షం తెరిపినివ్వడంతో వరద ఉధృతి కాస్త తగ్గుముఖం పట్టింది.

ఫొటో సోర్స్, IMD
మళ్లీ వర్ష సూచన
బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ప్రభావంతో సోమ, మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పింది.
హైదరాబాద్ తోపాటు ఉత్తర తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
మరోవైపు దేశం నుంచి నైరుతి రుతుపవనాలు వెనక్కి వెళుతున్నట్లుగా భారత వాతావరణ శాఖ సెప్టెంబరు 14న ప్రకటించింది.
ఈ ప్రభావంతో దేశంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని చెబుతోంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














