నిజాం ఆస్తులు: లండన్, కరాచీలకు చేరిన సొమ్ము 10 లక్షలు కాదు, 35 లక్షల పౌండ్లు -ప్రెస్ రివ్యూ

ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్

బ్రిటన్‌లో దశాబ్దాలుగా మూలుగుతున్న హైదరాబాద్ నిజాం నవాబు నిధులపై లండన్ హైకోర్టు త్వరలో తీర్పు ఇవ్వనుందని 'నమస్తే తెలంగాణ' రాసింది. భారత్, పాకిస్తాన్ మధ్య దశాబ్దాలుగా న్యాయపోరాటం కొనసాగుతోంది. ఈ కేసులో నిజాం వారసులు భారత ప్రభుత్వంతో చేతులు కలిపారు.

1948 సెప్టెంబర్‌లో సైనిక చర్యతో హైదరాబాద్ సంస్థానం భారత్‌లో విలీనమైంది.

అంతకు కొద్ది రోజుల ముందు నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ లండన్‌లోని నాటి పాకిస్థాన్ హైకమిషర్ హబిబ్ ఇబ్రహీంకు చెందిన నాట్‌వెస్ట్ బ్యాంకు ఖాతాలో ఒక పది లక్షల (మిలియన్) పౌండ్లు జమ చేశారు.

ఈ నిధుల కోసమే ప్రస్తుతం భారత్, పాక్ మధ్య వివాదం నడుస్తోంది.

లండన్, కరాచీ చేరింది 3.5 మిలియన్ పౌండ్లు

నాడు నిజాం నవాబు పంపింది మిలియన్ పౌండ్లు మాత్రమే కాదని పాత రికార్డులు వెల్లడిస్తున్నాయి. 35 లక్షల (3.5 మిలియన్) పౌండ్లు లండన్, కరాచీకి చేరినట్లు వాటిల్లో తేలింది.

రహమతుల్లా ఖాతాలో ఒక మిలియన్ పౌండ్లు జమకాగా, మిగిలిన మొత్తం ఆయుధ డీలర్లు, ఇతరులకు చేరినట్లు వెల్లడైంది.

తన అనుమతి లేకుండా తన ఆర్థిక మంత్రి, లండన్‌లోని ఏజెంట్ జనరల్ నవాబ్ మొయిన్ నవాబ్ జంగ్ ఈ నిధులను దుర్వినియోగం చేయడంతో ఆగ్రహం వ్యక్తంచేసిన నిజాం నవాబు విచారణకు ఆదేశించి, నగదును వెనక్కు ఇచ్చేయాలని హుకుం జారీచేశారు.

వివాదం నేపథ్యంలో నాట్ వెస్ట్ బ్యాంకు ఆ నిధులను స్తంభింపజేసింది.

3.5 మిలియన్ పౌండ్లతోపాటు మరో రూ.6 కోట్ల్లు కూడా లండన్, కరాచీకి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ఆ సొమ్ము తమకే చెందాలని నిజాం వారసులు పేర్కొంటుండగా, వాటిపై హక్కు తమకే ఉందని పాకిస్తాన్ వాదిస్తోంది.

నాటి హైదరాబాద్ సంస్థానంపై భారత్ దండెత్తినప్పుడు, నవాబుకు తాము ఆయుధాలు అందజేశామని, అందుకు ప్రతిగా ఆయన తమకు ఆ నిధులు చెల్లించారని పాక్ చెబుతోంది.

ఈ వాదనను నిజాం వారసులు తోసిపుచ్చుతున్నారు.

1967లో ఏడో నిజాం మృతిచెందారని, ఆ నగదు భారత్‌కే చెందాలంటూ 1965లోనే ఆయన వీలునామా రాశారని భారత్ తరపు న్యాయవాది పాల్ హెవిట్ చెప్పారు.

తెలంగాణ: ఐదేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువ వర్షపాతం

గత ఐదేళ్లలో ఎన్నడూ లేనంతస్థాయిలో తెలంగాణలో జూన్‌ నెల సగటు వర్షపాతం లోటు 35 శాతంగా నమోదైందని ఈనాడు తెలిపింది.

ఇంతకుముందు 2014 జూన్‌లో అతి తక్కువగా 54.2 మిల్లీమీటర్లు(మి.మీ.) కురిసింది. తిరిగి ఈ ఏడాది జూన్‌ సాధారణ వర్షపాతం 132 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 86.2 మి.మీ.లే రాష్ట్రంలో కురిసింది.

కమ్ముకున్న మేఘాలు, వర్షపాతం

ఫొటో సోర్స్, Getty Images

రాష్ట్రస్థాయి వర్షపాతం లోటు 35 శాతమే కనిపిస్తున్నా... జిల్లాల వారీగా చూస్తే 16 జిల్లాల్లో 35 శాతం కన్నా ఎక్కువ లోటు ఏర్పడింది.

రాష్ట్రంలోకెల్లా అత్యధిక వర్షపాతం లోటు ఖమ్మం జిల్లాలో 73 శాతముంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సీజన్‌లో ఇంత ఎక్కువ లోటు ఉన్న జిల్లా ఇదే కావడం గమనార్హం.

ఈ జిల్లాలో జూన్‌ నెల సాధారణ వర్షపాతం 130.5 మి.మీ.లకు గాను 35.2 మి.మీ.లే కురిసింది.

వాతావరణ శాఖ లెక్కల ప్రకారం వర్షపాతం లోటు 20 శాతానికి మించితే అక్కడ వర్షాభావం తీవ్రంగా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఇలా 20 జిల్లాల్లో 20 శాతానికి మించి లోటు ఉంది.

మొత్తం 385 మండలాల్లో 20 శాతానికి పైగా వర్షపాతం లోటు ఏర్పడింది. ఈ లోటు 60 శాతానికి మించితే అక్కడ కరవు పరిస్థితులున్నట్లు నిబంధనలున్నాయి.

మొత్తం 115 మండలాల్లో వర్షపాతం లోటు 60 నుంచి 99 శాతం వరకూ ఉంది.

కొన్ని జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు మందకొడిగా సాగుతున్నాయి.

వరి నార్లు ఇంకా చాలా మంది రైతులు పోయలేదు. జూన్‌ దాటినా చెరువులు, కుంటలు, బోర్లలో నీటి మట్టాలు పెరగలేదు.

కొణిదెల కార్యాలయం ఎదుట 'ఉయ్యాలవాడ' కుటుంబ సభ్యుల ఆందోళన

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబసభ్యులు హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని కొణిదెల ప్రొడక్షన్స్‌ కార్యాలయం ముందు ఆదివారం ఆందోళనకు దిగారని ఈనాడు తెలిపింది.

సైరా పోస్టర్

ఫొటో సోర్స్, FB/Sye Raa Narasimha Reddy

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథాంశం మూలంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో 'సైరా నరసింహారెడ్డి' చిత్రాన్ని రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆందోళనలో ఉయ్యాలవాడకు చెందిన దాదాపు ఏడు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు.

తమకు న్యాయం చేస్తానని రామ్‌చరణ్‌ చెప్పారని, అయితే శనివారం రాత్రి ఆయన మేనేజర్‌ అభిలాష్‌ ఫోన్‌ చేసి కథపై మీకు ఎలాంటి హక్కులు లేవని, కార్యాలయానికి రావద్దని చెప్పారని వారు తెలిపారు. రామ్‌చరణ్‌ న్యాయం చేస్తామని చెప్పినా..మధ్యలో వ్యక్తులు అందుకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.

జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలకృష్ణారెడ్డి అక్కడికి చేరుకొని వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రొడక్షన్స్‌ సిబ్బంది తమకు కొంత సమయం కావాలంటూ కోరడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ విషయంలో ఉయ్యాలవాడ కుటుంబసభ్యులు ఇప్పటికే రెండుసార్లు కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఆదేశాల ప్రకారం తాము నడుచుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ’సైరా’ వర్గాలు స్పష్టం చేశాయి.

ఆంధ్రప్రదేశ్: కానిస్టేబులే చైన్‌స్నాచర్

ఆంధ్రప్రదేశ్‌లో పోలీసే చోరీ చేస్తూ దొరికిపోయారని 'ఆంధ్రజ్యోతి' తెలిపింది.

విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన మనక సూర్యకుమార్‌ 2013లో పోలీసు ఉద్యోగంలో చేరారు.

సూర్యకుమార్ మొదట్లో బాగానే ఉన్నా గత మూడేళ్లుగా దొంగతనాలు ప్రవృత్తిగా చేసుకున్నారని విజయనగరం ఎస్‌ఐ ఉపేంద్ర చెప్పారు.

ఆయన విజయనగరం పట్టణ పరిధిలో రెండు, రైల్వేస్టేషన్‌ అవరణలో ఒకటి, పార్వతీపురం బెలగాం రైల్వేస్టేషన్‌ పరిధిలో రెండు దొంగతనాలు చేశారని, ఒంటరి మహిళలను టార్గెట్‌ చేసుకుని చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారని ఎస్‌ఐ తెలిపారు.

రైలులో బ్యాగుల చోరీ ఘటనలోనూ సూర్యకుమార్‌ నిందితుడు.

శనివారం రాత్రి విజయనగరం రైల్వేస్టేషన్‌లో రైల్వే పోలీసులు తనిఖీలు చేస్తుండగా సూర్యకుమార్‌ పారిపోయేందుకు ప్రయత్నించడంతో వెంబడించి పట్టుకున్నారు.

ఆయన నుంచి 70 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. మరో 80గ్రాముల బంగారం ఓ ప్రైవేటు బ్యాంకులో తనఖా పెట్టారని, వాటిని కూడా స్వాధీనం చేసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.

సూర్యకుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌ నిమిత్తం ఆదివారం విశాఖపట్నం రైల్వేకోర్టుకు తరలించారు.

2016లో సూర్యకుమార్‌ ఒకసారి జైలుకు కూడా వెళ్లారు. 2017లో తిరిగి విధుల్లో చేరి 2018 డిసెంబరు నుంచి చైన్‌స్నాచింగ్‌లకు పాల్పడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)