డెంగీ: ఈ జ్వరం రెండోసారి వస్తే ప్రమాదమా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

జ్వరం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, డాక్టర్ దేశం పీఆర్
    • హోదా, బీబీసీ కోసం

భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాదు, ఇతర నగరాల్లో డెంగీ జ్వరాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి.

ప్రజల జీవన విధానంలో మార్పులు, నీటి సమస్య, వర్షాలు, ఇళ్ల చుట్టూ ఉండే పాత్రల్లో నీళ్లు నిల్వ ఉండడం దీనికి ముఖ్య కారణాలు.

వర్షాకాలంలో డెంగీ జ్వరాలు వ్యాపించడం ఎప్పటినుంచో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో ఏటా రెండు లక్షల కేసులు దాకా నమోదవుతున్నాయి.

కానీ ప్రైవేటు ఆస్పత్రుల్లో, ఆర్ఎంపీల దగ్గర చికిత్స చేయించుకునే వారి సంఖ్య కూడా కలిపితే ఈ సంఖ్య ఇంతకంటే చాలా ఎక్కువగా ఉంటుంది. రోగి రక్తం లో ఎన్ఎస్ వన్ (ఎలిసా) ద్వారా డెంగీ వైరస్‌ను గుర్తిస్తే లేదా ఐజీఎం యాంటీ బాడీ ఉంటే డెంగీ వచ్చినట్టు భావించాలి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వర్షపు నీరు నిల్వ ఉండే చోట డెంగీ దోమలు పెరుగుతాయి

డెంగీ దేని వల్ల వస్తుంది?

డెంగీ వైరస్ వల్ల డెంగీ జ్వరం వస్తుంది. ఈ వైరస్ లో నాలుగు రకాలు ఉంటాయి.

అవి:

  • డెన్.వి 1
  • డెన్.వి 2
  • డెన్.వి 3
  • డెన్.వి 4

ఎవరికైనా ఈ నాలుగు రకాల్లో, ఏదో ఒక రకం డెంగీ వస్తే, ఆ రకానికి వాళ్లు జీవితాంతం రోగ నిరోధక శక్తి కలిగి ఉంటారు. అంటే ఇంకొకసారి అదే రకమైన వైరస్ వల్ల వారికి డెంగీ రాదు. కానీ మిగిలిన మూడు రకాలకి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి, ఒకసారి డెంగీ వచ్చి తగ్గినా మళ్లీ వేరే మూడు రకాల వైరస్లతో ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది.

అంతేకాదు ఇలా మొదటిసారి వచ్చి తగ్గాక, (కొన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే) రెండోసారి డెంగీ వస్తే, మొదటి దాని కన్నా కొన్ని వందల రెట్లు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది.

డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఎలా వ్యాపిస్తుంది?

ఏడిస్ ఈజిప్టీ , ఏడిస్ ఆల్బో పిక్టస్ అనే రెండు రకాల దోమల వల్ల ఈ డెంగీ జ్వరం వ్యాపిస్తుంది.

దీని కాళ్ళ పైన తెల్లని చారలు ఉండటం వల్ల దీనిని టైగర్ దోమ అని కూడా పిలుస్తారు.

ఈ ఏడీస్ దోమ డెంగీ వచ్చిన వ్యక్తులను కుట్టినపుడు, డెంగీ వ్యక్తి నుంచి ఆ దోమకు వైరస్ ఎక్కుతుంది.

తరువాత ఆ దోమ పూర్తి డెంగీ దోమగా మారడానికి పది రోజులు పడుతుంది. (అంటే వైరస్ దానిలో పెరిగి అభివృద్ధి చెంది మళ్ళీ ఇంకొకళ్ళకి ఆ వైరస్‌ను వ్యాప్తి చేయాలంటే పది రోజులు పడుతుంది.)

ఈ పది రోజుల తర్వాత ఆ దోమ ఎవరిని కుట్టినా కూడా వారికి డెంగీ వైరస్ సోకుతుంది. ఈ డెంగీ దోమలకు పుట్టే పిల్ల దోమలకు కూడా ఈ వైరస్ వ్యాపిస్తుంది.

ఏడిస్ దోమలకి వర్షాకాలం అంటే చాలా ఇష్టం.

తేమ ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నెల రోజుల దాకా బతుకుతాయి.

ఈ దోమలు ఇంటి లోపల ఉండటానికి ఇష్టపడతాయి.

తెల్లవారుతుండగా, మధ్యాహ్నం వేళ, సాయంత్రం పూట కుట్టేందుకు ఇష్టపడతాయి.

డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వర్షం నీళ్లు నిల్వ ఉంటే డెంగీ దోమ పెరుగుతుంది.

డెంగీ దోమలు ఎక్కడ పెరుగుతాయి?

ఇంటి చుట్టుపక్కల గాని అపార్ట్‌మెంట్‌లోగానీ, ఆ ప్రాంతంలోగానీ ఎవరికైనా డెంగీ వచ్చింది అని తెలిస్తే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

ముందుగా

ఇంటి చుట్టూ, పని చేసే ప్రాంతం చుట్టూ లేదా, స్కూలు/కాలేజీల వద్ద (కనీసం 200మీటర్ల నుంచి 500 మీటర్ల మేరకు) వర్షపు నీరు నిలువ ఉన్న గిన్నెలు, పాత్రలు, కొబ్బరి చిప్పలు, టైర్లు, బాటిళ్లను, కూల్‌డ్రింక్ డబ్బాలను ఖాళీ చేసి బోర్లించి ఉంచాలి.

అలాగే వాడకుండా వదిలేసిన నీళ్ల డ్రమ్మలు, బకెట్లు ఖాళీ చేసి బోర్లించాలి.

డెంగీ దోమలు మిగిలిన దోమల లాగా మురికి నీళ్లలో పెరగవు. మన ఇంటి లోపల లేదంటే ఇంటి చుట్టూ చేరే వర్షం నీటిలోనే (మంచి నీళ్ళు) పెరుగుతాయి.

కొన్ని సార్లు మన ఇళ్లలో ఉండే ఫ్లవర్ వాజ్ లేదా వాటర్ ప్లాంట్స్, వాడకుండా వదిలేసిన అక్వేరియంలలోనే ఈ దోమలు పెరుగుతాయి. కాబట్టి వాటిని కూడా జాగ్రత్తగా గమనించి నీరుంటే తీసేసి బోర్లించాలి.

వీటితోపాటు దోమల నిర్మూలనకు కొన్ని చర్యలూ తీసుకోవాలి.

  • మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పి దోమల మందు చల్లించాలి.
  • ఇంటి లోపల కూడా గోడల పైన దోమల మందు చల్లించుకోవాలి.
  • బయటకి వెళ్లేటపుడు పొడవు చేతులున్న వదులు చొక్కాలు, ప్యాంట్లు తొడుక్కోవాలి.
  • చిన్న పిల్లల విషయంలో కచ్చితంగాపై జాగ్రత్తలు పాటించాలి.
డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒకసారి సోకిన వాళ్లు డెంగీ విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

ఎవరెవరు జాగ్రత్తగా ఉండాలి?

ఇదివరకే ఒకసారి డెంగీ వచ్చిన వాళ్లకి మళ్లీ ఈ ఇన్ఫెక్షన్ సోకితే వారు తీవ్ర జ్వరాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. అందుకే అలాంటివారు అప్రమత్తంగా ఉండాలి. వీరిలో ముఖ్యంగా..

  • డయాబెటిస్ సరిగ్గా కంట్రోల్ లో లేని వాళ్లు
  • చిన్నపిల్లలు
  • గర్భిణులు
  • లావుగా ఉండేవాళ్లు
  • వృద్ధులు
  • కడుపు/పేగులో అల్సర్లు ఉన్నవాళ్లు
  • నెలసరి ఎక్కువగా అయ్యే మహిళలు
  • తలసీమియా వంటి జబ్బులు ఉన్నవారు
  • ఉబ్బసం (ఆస్తమా) ఉన్న వాళ్లు
  • బీపీ ఎక్కువ ఉన్నవాళ్లు
  • గుండె జబ్బులు ఉన్నవాళ్లు
  • కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్లు
  • లివర్ జబ్బులు ఉన్నవాళ్లు
  • స్టెరాయిడ్లు తీసుకునేవాళ్లు
  • రోజూ ఆస్పిరిన్ తీసుకునే వాళ్లు
  • మైగ్రేన్‌కి మందులు వాడేవాళ్లు
  • వీళ్లందరిలో తీవ్రమైన డెంగీ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

మనం కోవిడ్ లో చూసినట్టే డెంగీ జ్వరం కూడా 80% మందికి వచ్చినట్టు తెలియదు. 20 శాతం మందిలో మాత్రమే డెంగీ లక్షణాలు కనబడతాయి. అందులో కూడా ఒకటి నుంచి రెండు శాతం మందికి మాత్రమే చాలా తీవ్రమైన డెంగీ జ్వరం వస్తుంది.

డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెంగీ బారిన పడ్డ వాళ్లల్లో కొందరికి మాత్రమే ప్లేట్‌లెట్లు పడిపోతాయి.

డెంగీ జ్వరం వచ్చినట్టు తెలుసుకోవడం ఎలా?

జ్వరం ఎక్కువగా ఉండడం, మొహం వేడిగా అనిపించడం, బద్ధకం, నీరసం కళ్ళు తిప్పినప్పుడు లేదా కళ్ళ పైన చేతులు పెట్టినప్పుడు కనుగుడ్డు వెనకాల తీవ్రమైన నొప్పి రావడం, వెలుతురు చూడలేకపోవడం, కడుపు నొప్పి, ఒంటి నొప్పులు, కీళ్ల నొప్పులు, ఒంటిపైన దద్దుర్లు కనబడతాయి. మరికొంతమందికి గొంతు నొప్పి కూడా ఉంటుంది. కనుగుడ్డు ఎర్రగా అయిపోతుంది.

జ్వరం వచ్చిన రెండో రోజు లేదా మూడో రోజుకి శరీరంపైన దద్దర్లు వస్తాయి. మొదట ఛాతీ మీద, ఆ తర్వాత కాళ్ళకి చేతులకి వస్తాయి. ఇది రోజుల్లో తగ్గిపోతుంది. 80 శాతం మంది పేషెంట్లు వారం రోజుల్లో కోలుకుంటారు.

చాలా కొద్ది మంది పేషెంట్లు అది కూడా పైన చెప్పిన లక్షణాలు ఉన్నవాళ్ళు డెంగీ జ్వరం వచ్చిన మూడో రోజు నుంచి చాలా అప్రమత్తంగా ఉండాలి.

డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెంగీ లక్షణాలు కనిపిస్తే ఆస్పత్రిలో చేరాలి.

తీవ్ర లక్షణాలు

  • కొందరిలో రక్తనాళాల గోడలు బలహీనపడటం వల్ల రక్తంలో ఉండే ప్లాస్మా రక్తనాళాలు బయటకి లీక్ అవుతాయి.
  • కొందరికి రక్తంలో ప్లేట్లెట్లు తగ్గిపోతాయి.
  • ఈ రెండు లక్షణాలు జ్వరం వచ్చిన మూడో రోజు నుంచి ప్రారంభమవుతాయి.
  • ఈ లక్షణాలున్నవారికి డెంగీ హేమోరాజిక్ ఫీవర్, లేదా డెంగీ షాక్ సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.
డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జ్వరం వచ్చిన తర్వాత దద్దుర్లు వస్తాయి.

తీవ్రతను ఎలా గుర్తించాలి?

  • విపరీతమైన కడుపు నొప్పి లేదా కడుపును ముట్టుకుంటే చాలా నొప్పిగా ఉండడం
  • కాళ్ళు చేతులు చల్లగా అయిపోవడం
  • కాళ్ళలో, కళ్ళ చుట్టూ, చేతుల్లో నీళ్లు చేరి వాపు రావడం
  • వాంతులు అవడం (గంటలో మూడు సార్లు లేదా అంతకంటే ఎక్కువ సార్లు అవ్వడం)
  • చిగుళ్ల నుంచి లేదా నోట్లో, ముక్కులో నుంచి రక్తం కారడం లేదా రక్త వాంతులు, విరేచనాలు అవ్వడం
  • నెలసరి లో ఉన్న మహిళలకి రక్తస్రావం ఎక్కువుండడం
  • చాలా నీరసంగా ఉండడం, అటూ ఇటూ కదల లేకపోవడం
  • 8 గంటలు గడిచినా మూత్రం రాకపోవడం
  • బీపీ తగ్గిపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం (పెద్దవాళ్ళలో సిస్టోలిక్ బీపీ 90 కంటే తక్కువగా, గుండె వేగం 100 కంటే ఎక్కువగా ఉండటం)
  • ఆయాసంగా, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా ఉండటం

వీటిని వార్నింగ్ సిగ్నల్స్ గా భావించి వీటిలో ఏవి కనిపించినా వెంటనే ఆసుపత్రిలో చేరాలి.

ప్లేట్లెట్లు, ఫ్లూయిడ్ కరెక్షన్ చేయకపోతే రోగి చాలా తీవ్రమైన షాక్ లోకి వెళ్లిపోయి చనిపోయే ప్రమాదం ఉంటుంది.

డెంగీ, దోమలు, జ్వరం, వర్షం నీళ్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.

ఆస్పత్రి అందుబాటులో లేని చోట్ల తీవ్ర డెంగీని ముందే గుర్తించవచ్చా?

ఒక చిన్న పరీక్ష ద్వారా మనకి ప్లేట్లెట్లు తగ్గుతున్నాయా లేదా అనేది తెలుసుకోవచ్చు. దీనిని టార్నికే టెస్ట్ అని అంటారు.

ముందు వ్యక్తికి బీపీ ఎంతుందో చూడాలి. ఇంట్లో ఉండే బ్లడ్ ప్రెషర్ (బిపి చూసే) కఫ్ చేతికి కట్టి ఐదు నిమిషాల పాటు సిస్టోలిక్, డయాస్టోలిక్ ప్రెషర్ మధ్య ఉంచాలి.

అంటే 120/80 ఉన్న వ్యక్తికి 100 వద్ద ప్రెషర్ పెట్టి ఐదు నిమిషాలు ప్రెషర్ దించకుండా ఉంచాలి. అప్పుడు ముంజేతి పైన ఒక స్క్వేర్ ఇంచు చర్మం పైన ఏమైనా దద్దుర్లు కనబడుతున్నాయేమో చూడాలి (చర్మ కింద సన్నని రక్తం చుక్కలు).

ఈ ఎర్రటి చుక్కలు 15- 20 కంటే ఎక్కువ ఉంటే కచ్చితంగా వారు ప్రమాదంలో పడతారని చెప్పవచ్చు. వెంటనే ఆసుపత్రి కి తీసుకెళ్లాలి.

ప్లాస్మా లీకేజ్ ఉన్న పేషంట్లకి రక్తనాళాల్లో నుంచి ప్లాస్మా బయటికి వెళ్లి ఊపిరితిత్తుల్లో లేదా కడుపులో లేదా పాదాలలో చేరుతుంది.

కాళ్లు చేతులు చల్లబడి కళ్ళ చుట్టూతా వాపు వచ్చినా, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నా, విపరీతమైన కడుపునొప్పి లేదా పైన చెప్పిన లక్షణాలు ఉన్నా ప్లాస్మా లీకవుతోందని అర్థం. అలాంటివారిని వెంటనే ఆసుపత్రికి తరలించి వైద్యం అందించాలి.

సిస్టోలిక్, డయాస్టోలిక్ బీపీల మధ్య అంతరం (పల్స్ ప్రెషర్) తగ్గుతుంది.

మామూలుగా అది 30 నుంచి 40 మధ్యలో ఉండాలి. నార్మల్ బీపీ 120/80 అనుకుంటే, అంతరం 40. ఇది గనక 20 లేదా అంతకంటే తక్కువగా ఉంది అంటే కచ్చితంగా ఆస్పత్రిలో చేరాలి. ఉదాహరణకు (100/80 mmHg ఉన్నా, 120/100 mmHg ఉన్నా, 90/70 mmHg ఉన్నా)

భారతదేశంలో ప్రస్తుతం డెంగీకి వ్యాక్సిన్ అందుబాటులో లేదు.

అమెరికా వంటి దేశాల్లో ఇది అందుబాటులో ఉన్నా కూడా దీనికి పూర్తి సామర్థ్యం లేదు. డెంగీ వచ్చాక ఆసుపత్రిలో అడ్మిషన్ తీసుకొని చికిత్స పొందడం కంటే రాకముందే దోమలను అదుపు చేసి, నివారించుకోవడం ఉత్తమమైన మార్గం.

మన ఇల్లు, పని చేసే ఆఫీసుల చుట్టూ పరిశుభ్రంగా ఉంచుకొని, నీళ్లు నిల్వ లేకుండా చూసుకుంటే డెంగీ జ్వరాన్ని అంతం చేయచ్చు.

(గమనిక: రచయిత డాక్టర్. వైద్యపరమైన విషయాలను సులభంగా వివరించి అవగాహన కల్పించడానికి రాసిన కథనం మాత్రమే ఇది)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)